త్రిత్వ దేవునిని గురించి

త్రిత్వ సిధ్ధాంతము దేవుని స్వభావానికి సంబంధించిన ప్రధాన సిద్ధాంతం, ఇది ఒక దేవుణ్ణి మూడు సమరూపాలలో నిర్వచిస్తుంది. తండ్రియైన దేవుడు (యెహోవా) కుమారుడైన దేవుడు (యేసుక్రీస్తు) మరియు పరిశుధ్ధాత్మ దేవుడు మూడు విభిన్న వ్యక్తులు ఒకే సారాంశం/పదార్థం/స్వభావాన్ని పంచుకొనియున్నారని తెలియజేస్తూవుంది. ఇది వారి వ్యత్యాసాన్ని మరియు వారి విడదీయరాని వారి ఐక్యతను ఒకేసారి వ్యక్తపరుస్తూవుంది. ఇందులో ప్రతి వ్యక్తి త్రిత్వంలో వారికున్న ప్రత్యేకమైన లక్షణాలను వ్యక్తపరుస్తూవున్నారు. ఈ సిద్ధాంతాన్ని ట్రినిటేరియనిజం అని పిలుస్తారు మరియు దాని అనుచరులను ట్రినిటేరియన్లు అని పిలుస్తారు. ఈ సిధ్ధాంతాన్ని నమ్మని వారిని యాంటీట్రినిటేరియన్లు లేదా నాన్ట్రినిటేరియన్లు అంటారు.

పరిశుద్ధ లేఖనాల ఆధారముగా పరిశుద్ధ త్రిత్వమును నేను నమ్ముచున్నాను. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అను ద్వితీయోపదేశ కాండము 6:4 లేఖనమును బట్టి; మరియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుమను 1 కొరింథీయులకు 8:4 లేఖనమును బట్టి; ఆయన ఏకైక నిజ దేవుడైయున్నాడు. మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను మత్తయి 28:19 లేఖనమును బట్టి, బైబిలులో దేవుడు తనను తండ్రి కుమారుడు పరిశుద్దాత్మునిగా బయలుపరచుకొని యున్నాడని, ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా, ముగ్గురు ఒక్కరిగా ఒకే ఒక దైవికమైన అంతఃస్తత్వమును కలిగియున్నారని, ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అను కొలొస్సయులకు 2:9 లేఖనమును బట్టి శక్తిలో, నిత్యత్వములో, మహిమలో మిగిలిన గుణలక్షణాలలో వీరు సమానులని, వీరిలో ప్రతి వ్యక్తి ఒకే దైవికమైన అంతఃస్తత్వమును సంపూర్ణముగా కలిగియున్నారని గనుకనే ఆయన త్రిత్వ దేవునిగా పిలువబడుతూ ఉన్నాడని నమ్ముతున్నాను.

పాత నిబంధనలో ఉన్న త్రిత్వ సిధ్ధాంతమును గురించి కొన్ని కొటేషన్స్ చూధ్ధాం. ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను వచనంలో దేవుడు అనే మాటకు అక్కడ హీబ్రూలో “ఎలోహిం” అనే మాట వాడబడింది. ఈ మాట బహువచనం, పులింగము. అట్లే ఆదికాండము సృష్టి కథనంలో, ప్రత్యేకంగా ఆదికాండము 1:26–27 మరియు ఆదికాండము 3:22లోని మొదటి-వ్యక్తి బహువచన సర్వనామాలు వాడబడి ఉండుటను గమనించండి. దానియేలు 7:13,14, రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్టములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు, (పాత నిబంధన పదజాలాన్ని తరచుగా ఉపయోగించే క్రీస్తు, తనను తాను “మనుష్య కుమారునిగా” పేర్కోనియున్నాడని కొత్త నిబంధన నుండి మనకు తెలుసు. “మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను“, మార్కు 14:62. “అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను”, ఫిలిప్పీయులు 2:10, 11). యెహోవా వాక్కు (కీర్తన 33:6), ప్రభువగు యెహోవా ఆత్మ (యెషయా 61:1). క్రొత్త నిబంధనలో, త్రిత్వమును యేసుని బాప్తిస్మములో చూడగలం. ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు–నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను మత్తయి 3:16, 17 లూకా 3:21, 22. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలలో త్రిత్వమునకు సంబందించిన సిద్ధాంతం స్పష్టంగా లేనప్పటికీ, మత్తయి 28:19, 2 కొరింథీయులు 13:14, ఎఫెసీయులు 4:4–6, 1 పేతురు 1: 1,2 సహా అనేక త్రిత్వ సూచనలు ఉన్నాయి. ఈ విభిన్న ప్రస్తావనలు త్రిత్వ భావనను ఏర్పరచాయి- ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు ఒకటిగా. ఇద్దరు లేదా ముగ్గురు దేవుళ్లను ఆరాధించకుండా చర్చిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ట్రినిటీ భావన ఉపయోగించబడింది.

త్రిత్వ సిద్ధాంతంలో, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉంటాడు కానీ ఒకే ఒక దైవిక స్వభావాన్ని కలిగి ఉంటాడు. త్రిత్వములోని సభ్యులు అన్నింటిలో సమానులుగా మరియు సహ-శాశ్వతులుగా, ఒకే పదార్ధముగా, స్వభావంలో, శక్తిలో, క్రియలలో మరియు చిత్తములో ఉన్నారు. అతనేషియస్ విశ్వాస ప్రమాణములో చెప్పబడినట్లుగా, తండ్రి సృష్టించబడలేదు, కుమారుడు సృష్టించబడలేదు, మరియు పరిశుధ్ధాత్ముడు సృష్టించబడలేదు. ముగ్గురూ ప్రారంభం లేకుండా శాశ్వతులుగా ఉన్నారు. “తండ్రి మరియు కుమారుడు మరియు పరిశుధ్ధాత్ముడు” అనేవి దేవుని యొక్క వివిధ భాగాల పేర్లు కాదు, కాని దేవునికున్న ఏకైక పేరు ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తిగా దేవునిలో ఉన్నారు. వారు ఒకరికొకరు వేరుగా ఉండరు. ముగ్గురు వ్యక్తులలో ప్రతి ఒక్కరు వాస్తవం.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను అను యోహాను 3:16-18 లేఖనమును బట్టి మరియు ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అను 1 కొరింథీయులకు 12:3 లేఖనమును బట్టి త్రిత్వ దేవుడు మానవుని పట్ల కనికరము చూపు దేవుడై యున్నాడని మరియు దేవుడే మన సృష్టికర్త, విమోచకుడు, మనలను పరిశుద్ధపరచు వాడునై యున్నాడని నేను నమ్ము చున్నాను.

కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొను వాడు తండ్రిని అంగీకరించు వాడు అను 1 యోహాను 2:23 లేఖనమును బట్టి మరియు యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు అను యోహాను 14:6 లేఖనమును బట్టి వీరిలో ఏఒక్కరిని కాదన్నను లక్ష్యపెట్టక పోయినను ముగ్గురిని తిరస్కరించినట్లే. త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించు వారిని క్రైస్తవ సంఘానికి బయటనున్న వారిగా పరిగణిస్తాను. యునిటేరియనిజంను నేను నమ్మను. ఇది మన దేశములో అనేక శాఖల లోనికి చొచ్చుకెళ్లి ప్రబలంగా వ్యాపిస్తూ అనేకులను ప్రభావితము చేస్తూవుంది.

పతనము మొదలుకొని, దేవుని నిత్య కుమారుని నమ్మితే తప్ప, దేవునిలో ఉన్న”తండ్రియైన దేవుణ్ణి” ఎవరు నమ్మలేడు. ఆ నిత్య దేవుని కుమారుడు శరీరధారియై మనకు ప్రతిగా తండ్రియైన దేవునిని సంపూర్ణముగా సంతృప్తిపరచుట ద్వారా మనలను తండ్రియైన దేవునితో సమాధానపరచియున్నాడు. 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు అని తెలియజేస్తూవుంది. రోమా 15:13, కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణగల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

టెర్టులియన్ (155-200 CE) లాటిన్ పదం ‘ట్రినిటీ’ని ఉపయోగించిన మొదటి వ్యక్తి. ఇది ట్రినిటీ యొక్క కాంపాక్ట్ రేఖాచిత్రం, దీనిని ” షీల్డ్ ఆఫ్ ట్రినిటీ ” అని పిలుస్తారు.

గణితంలో, దీనిని సమబాహు త్రిభుజం అని అంటారు. ఇక్కడ మొత్తం 3 కోణాలు సరిగ్గా 60 డిగ్రీలు ఉంటాయి. ఇది పరిపూర్ణతను సూచిస్తూవుంది.

నాన్ట్రినిటేరియనిజం (లేదా యాంటీ ట్రినిటేరియనిజం) అనేది స్క్రిప్చరల్ మూలాన్ని కలిగి లేదు. క్రీ.శ. 325, 360, మరియు 431లో నైసియా, కాన్స్టాంటినోపుల్ మరియు ఎఫెసస్ కౌన్సిల్స్‌లో ట్రినిటీ సిద్ధాంతం యొక్క అధికారిక నిర్వచనానికి ముందు అడాప్షనిజం , మోనార్కినిజం మరియు అరియనిజం వంటి వివిధ నాన్ట్రినిటేరియన్ అభిప్రాయాలు ఉన్నాయి. క్రీ.శ 381లో కాన్‌స్టాంటినోపుల్‌లో త్రిత్వవాదాన్ని స్వీకరించిన తర్వాత, ఆరియనిజం సామ్రాజ్యం నుండి తరిమివేయబడింది. అరియనిజం మొదటి కౌన్సిల్ ఆఫ్ నైసియా చేత అబద్దపు బోధగా ఖండించబడింది మరియు చివరగా, రెండవ ఎక్యుమెనికల్ కౌన్సిల్ (కాన్స్టాంటినోపుల్, క్రీ.శ 381) ద్వారా ఖండించబడింది. ఆధునిక నాన్ట్రినిటేరియన్ డినామినేషన్స్లో, క్రిస్టాడెల్ఫియన్స్, క్రిస్టియన్ సైన్స్, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్, డాన్ బైబిల్ స్టూడెంట్స్, ఇగ్లేసియా ని క్రిస్టో, యెహోవాసాక్షులు, లివింగ్ చర్చ్ ఆఫ్ గాడ్, మెంబర్స్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇంటర్నేషనల్, వన్‌నెస్ పెంటెకోస్టల్స్, లా లూజ్ డెల్, ముండో, సెవెంత్ డే చర్చ్ ఆఫ్ గాడ్, యూనిటేరియన్ క్రిస్టియన్స్, యునైటెడ్ చర్చ్ ఆఫ్ గాడ్ మరియు ది షెపర్డ్స్ చాపెల్ వంటివి ఎన్నో ఉన్నాయి.

తండ్రియైన దేవునిని గురించి

మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులలో తండ్రియైన దేవుడు ఒకరు అని నేను నమ్ముతున్నాను. ఆయన యేసుక్రీస్తుకు మరియు యేసునందు విశ్వాసముంచువారందరికి తండ్రియైయున్నాడు కాబట్టే ఆయన తండ్రి అని పిలవబడుతూ వున్నాడు, (యోహాను 20:17, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టు కొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను మరియు మత్తయి 6:6,9-13, నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, –పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము.

దేవుడు ఆత్మయై యున్నాడు (యోహాను 4:24 దేవుడు ఆత్మగనుక). అలాగని ఆయన అదృశ్యునిగా ఏదో ఒక స్థలానికి మాత్రమే పరిమితమై ఉంటాడని కాదు. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు (మలాకీ 2:10, మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా?) ఆయన పరిశుధ్ధుడు (లేవీయకాండము 19:2, మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను). ఆయన ప్రేమగలవాడు న్యాయవంతుడై యున్నాడు. ఆయన సమస్త సృష్టిని, మనుష్యులందరిని సంరక్షిస్తూ ఉన్నాడు, (నిర్గమకాండము 34:6,7, అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను).

రోమా 8:32, తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?

యేసుక్రీస్తును గురించి

మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులలో యేసుక్రీస్తు ఒకరు అని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నిత్య దేవుని కుమారుడైయున్నాడు. తండ్రితోను పరిశుధ్ధాత్మునితోను సమానుడైయున్నాడు. 1 యోహాను 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతునియందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి రక్షకుడై యున్నాడు, ప్రజలందరిని విమోచించడానికి మనుష్యుడయ్యాడు. ఆయన మనవంటి మానవ స్వభావమును తీసుకొనియున్నను, ఆయన పాపములేనివానిగా ఉన్నాడని, ఆయన తన దైవికతకు మానవ స్వభావాన్ని స్వీకరించియున్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టే యేసుక్రీస్తు “నిజ దేవుడైయున్నాడు, నిత్యత్వమందు తండ్రి కనిన వాడును, మరియు కన్యయైన మరియకు పుట్టిన నిజమానవుడై యున్నాడు”. ఆయన విభజింపబడక విభజింపశక్యముకాక ఒక్కరిలోనే నిజ దేవునిగాను నిజ మానవునిగాను వున్నాడు.

గలతీయులకు 4:4-5 కాలము పరిపూర్ణమై నప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన పరిశుధ్ధాత్ముని వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియయందు పుట్టియున్నాడు (మత్తయి 1:22-23 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము). దేవుని కుమారుడు శరీరధారి అగుటయను అద్భుతము యొక్క ఉద్దేశ్యము, ఆయన దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తిగా ఉండవచ్చుననే, మనము దత్తపుత్రులము (స్వీకృతపుత్రులం) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. ఆయన మానవులందరి స్థానములో దైవికమైన ధర్మశాస్త్రమును నెరవేర్చి పరిపూర్ణ జీవితాన్ని జీవించియున్నాడు, (హెబ్రీయులకు 4:15 సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను). ఆయన ప్రతిఒక్కరి పాపముకొరకు తగినంత మూల్యమును చెల్లించుటకు గాను (హెబ్రీయులకు 2:16 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై), సిలువపై మనకు మారుగా నిర్దోషమైన బలిగా మరణించియున్నాడు (గలతీయులకు 3:13 క్రీస్తు మనకోసము శాపమై (శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను; ఎఫెసీయులకు 1:7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి న్నది). ఆయన శ్రమపడి మరణించియున్నాడు. ఈ విధముగా దేవుడు పాపలోకమంతటిని తనతో సమాధాన పర్చుకొనియున్నాడు, (2 కొరింథీయులకు 5:18-19 ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచు కొని…అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు).

మరణమునుండి తిరిగి లేచి, (రోమా 1:5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింప బడెను). యేసు పరలోకమునకు ఆరోహణమయ్యాడు (అపొస్తలుల కార్యములు 1:9 ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను). అంత్యదినాన్న ఆయన ప్రజలలో ఇంకను సజీవులుగా ఉన్నవారందరికిని, ఆయనచే మృతులలో నుండి లేపబడిన వారందరికిని తీర్పుతీరుస్తాడు (అపొస్తలుల కార్యములు 10:42 ఇదియుగాక దేవుడు సజీవుల కును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే).

దేవుడైన పరిశుధ్ధాత్మను గురించి

మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వము లోని ముగ్గురు వ్యక్తులలో పరిశుధ్ధాత్ముడు ఒకరని నేను నమ్ముతున్నాను.

పరిశుధ్ధాత్ముడు దేవుడై యున్నాడు. అపొస్తలుల కార్యములు 5:3-5 అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.

పరిశుధ్ధాత్ముడు తండ్రితోను కుమారునితోను సమానుడై యున్నాడు. 2 కొరింథీయులకు 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక. పౌలు తన పత్రికలన్నింటినీ ఆశీర్వాదంతో ముగించాడు. అయితే, త్రిత్వానికి చెందిన ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావించిన ఏకైక పత్రిక ఇది. పౌలు ఇక్కడ త్రిత్వానికి చెందిన ప్రతి వ్యక్తి యొక్క పనిని ఒక పదంతో సంక్షిప్తపరచియున్నాడు. యేసు యొక్క పనిని సంక్షిప్తముగా చెప్పడానికి పౌలు ఇక్కడ ఉపయోగించిన పదం “కృప“. ఈ లేఖలో పౌలు యేసు యొక్క కృపను గూర్చి చెప్తూ: “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను” (2 కొరింథీయులకు 8:9) అని తెలియజేస్తూవున్నాడు. తండ్రియైన దేవుని యొక్క పనిని సంక్షిప్తముగా చెప్పడానికి పౌలు ఇక్కడ ఉపయోగించిన పదం “ప్రేమ“. ఈ తండ్రియైన దేవుని యొక్క ప్రేమను గూర్చి పౌలు చెప్తూ: రోమా 5:8లో “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని తెలియజేస్తూవున్నాడు. పరిశుధ్ధాత్ముని యొక్క పనిని సంక్షిప్తముగా చెప్పడానికి పౌలు ఇక్కడ ఉపయోగించిన పదం “సహవాసము“. పరిశుధ్ధాత్ముని యొక్క సహవాసమును గూర్చి పౌలు చెప్తూ: (1 కొరింథీయులకు 12:3 ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను) అను మాటల ద్వారా ఆత్మయే మనలను యేసుతో సహవాసంలోకి మరియు తద్వారా ఒకరితో ఒకరి సహవాసంలోకి తీసుకు వస్తూవుంది. సువార్త ద్వారా పనిచేసే ఆత్మయే కొరింథీయులను అన్యమతం నుండి బయటకు తీసుకువచ్చి, వారిని క్రైస్తవ సహవాసంగా ఏర్పరచింది మరియు  ఆ సహవాసాన్ని కొనసాగించగలిగేది ఆత్మ మాత్రమేనని పౌలు తెలియజేస్తూవున్నాడు.

ఆయన దేవునికి మాత్రమే చెందియున్న పేర్లను గుణలక్షణములను కలిగియున్నాడు. కీర్తనలు 139:7,8 నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమున కెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నరకంలోని ప్రజలు దేవుని దయగల ఉనికిని అనుభవించనప్పటికీ, నరకంలో ఉన్నవారు కూడా నరకానికి యజమాని సాతాను కాదని ప్రభువు అని గుర్తిస్తారు. ఆయన అంతటను వున్నాడు. యోబు 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఆదికాండము 1:1-3; యోహాను 1:1-3లో పరిశుద్ద్ద త్రిత్వము యొక్క ముగ్గురు వ్యక్తులు సృష్టి పనిలో ఆక్టివ్ గా వున్నారని తెలియజేస్తూవున్నాయి. ప్రత్యేకంగా ఈ వచనంలో ఎలీహు పరిశుద్ధాత్మ సృష్టి పనిలో చురుకుగా ఉన్నట్లు వక్కాణిస్తూవున్నాడు. ఈ వచనంలో “శ్వాసము” అనే మాట “ఆత్మ”ని ఉద్దేశించి చెప్పబడింది.

పరిశుధ్ధాత్ముడు సువార్త ద్వారా మన హృదయాలలో విశ్వాసమును కలుగజేస్తాడు. తీతుకు 3:4-7 మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. 5వ వచనంలో పౌలు సువర్తనంతటిని సంక్షిప్తముగా సంగ్రహపరచియున్నాడు. పౌలు ప్రకటిస్తూవున్న సువార్త రక్షణకు సంబంధించిన సందేశం. ఇక్కడ తండ్రిని “మన రక్షకుడు” అని పిలవడం గమనార్హమైనది. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా “మన రక్షకుడు” అని పేర్కొనబడియున్నాడు. మరియు పరిశుద్ధాత్మ “యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెనని పేర్కొనబడి యున్నాడు. సువార్త యొక్క దేవుడు, రక్షించే దేవుడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ – ఏకైక నిజమైన దేవుడై యున్నాడు.

పాపి “రక్షణ” అనే దేవుని ఈ అద్భుతమైన బహుమతిని ఎలా పొందుకోగలడు? “అందుకు యేసు నీకొదేముతో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను” (యోహాను 3:3). ఒక వ్యక్తి మళ్లీ ఎలా పుట్టగలడు అని అయోమయంలో ఉన్న నీకొదేముతో, “యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహాను 3:5). పౌలు తీతుకు వ్రాస్తూ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను (తీతుకు 3:5) అని తెలియజేస్తూ వున్నాడు. ఇది పరిశుద్ధ బాప్తిస్మములో జరిగే “వాషింగ్” (స్నానము), దీని ద్వారా మన పాపాలు కడిగివేయబడతాయి, (అపొస్తలుల కార్యములు 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను). మనలను రక్షించే “వాష్”. (1 పేతురు 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే). “క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు” (గలతీ3:27). బాప్తిస్మము మనల్ని క్రీస్తుతో విశ్వాస-సంబంధంలోకి తీసుకువస్తుంది. ఇది పునర్జన్మ, ఆధ్యాత్మిక జీవితాన్ని తెస్తుంది. విశ్వాసం ద్వారా దేవుడు మనలో కలిగించిన పునర్జన్మ “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను” (2 కొరింథీయులు 5:17). ఇదంతా పరిశుద్ధాత్మ యొక్క పని. దేవుడు “మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనపై సమృద్ధి గా కుమ్మరించాడు.” యేసు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను  పంపుతానని వాగ్దానం చేశాడు (యోహాను 15:26; 16:7; అపొస్తలుల కార్యములు 1:5). ఆయన  పెంతెకొస్తు రోజున దీన్ని చేసాడు మరియు బాప్తిస్మములో, ప్రభువు రాత్రి భోజనంలో, నిజానికి, సువార్త ప్రకటింపబడినప్పుడల్లా చేస్తూనే ఉంటాడు. ఎఫెసీయులకు 3:15-19 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

ఆయన మనలను విశ్వాసము నందుంచి సత్క్రియలు చెయ్యడానికి మనలను పురికొల్పుతాడు. గలతీ 5:24-25 ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

సృష్టి

పరిశుద్ధ లేఖనాలలో గ్రంథస్థము చెయ్యబడియున్నట్లుగా, ప్రత్యేకముగా ఆదికాండము 1,2 అధ్యాయాలలో నమోదు చెయ్యబడియున్న రీతిగా, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (ఆదికాండము 1:1). దేవుడు తన శక్తిగల సృజనాత్మకమైన మాటల ద్వారా, ప్రతి దానిని శూన్యము నుండి కలుగజేసియున్నాడని, (కీర్తనలు 33:6,9, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెనని)  ఆరు రోజులలో భూమ్యాకాశములను సృజించియున్నాడని (ఆదికాండము 1:31; నిర్గమకాండము 20:11) నేను నమ్ముతున్నాను. అయితే స్త్రీ పురుషులు మాత్రం ఆయన ప్రత్యేకమైన సృష్టియైయున్నారు (మార్కు 10:6,  సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను).

లేఖనాల్లో భోధింపబడుతున్నట్లుగా సృష్టి సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ లేక తక్కువ చేసి చూపించే ప్రతి సిద్ధాంతాన్ని నేను తిరస్కరిస్తూ వున్నాను. ఈ రోజులలో కొందరు బైబిలులోని సృష్టి క్రమము సైన్స్ తో విభేదిస్తూ వున్నదని సృష్టి అనేది పరిణామ ప్రక్రియ ద్వారా ఉనికిలోనికి వచ్చియున్నదని; అంటే, అది, కొన్ని కోట్ల సంవత్సరాల కాలవ్యవధిలో, తనకు తానుగా వేగముగా పరిణామము చెందియున్నదని లేక నెమ్మదిగా అభివృద్ధి చెందియున్నదని చెప్తూ బైబిలులోని సృష్టి క్రమాన్ని తిరస్కరిస్తూ వున్నారు లేక బైబులును తక్కువ చేసి మాట్లాడుతూవున్నారు. దేవుడు సృష్టిని చేయుటకు ఉబలాటపడ్డప్పుడు ఎవరు లేరు. కాబట్టే దేవుని స్వంత పుస్తకమైన బైబిలులో దేవుడు స్వంతముగా గ్రంథస్థము చేసియున్న విశ్వసనీయమైన సృష్టి వృతాంతాన్ని మనం నమ్మాలి మరియు దానిని సంపూర్ణమైన నమ్మకంతో అంగీకరించాలి, హెబ్రీయులకు 11:6, ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము అని తెలియజేస్తూవుంది. కాబట్టి లూథర్ ప్రశ్నోత్తరిలో చెప్పబడియున్న రీతిగా “దేవుడు నన్నును సమస్త జీవులను కలుగ చేసియున్నాడని” ఒప్పుకొందాం.

మొట్టమొదటి స్త్రీపురుషులు

స్త్రీ పురుషులు దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి. దేవునిచే మొట్టమొదటి పురుషుడు నేల మంటి నుండి సృష్టింపబడ్డాడు, (దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను ఆదికాండము 2:7); ఏ జీవికి లేని ఆత్మను మానవులు కలిగియున్నారు. మొట్టమొదటి స్త్రీ పురుషుని ప్రక్కటెముక నుండి సృష్టింపబడింది (తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను ఆదికాండము 2:22). దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అను ఆదికాండము 1:26,27 లేఖనాలను బట్టి మొట్టమొదటి స్త్రీ పురుషులు దేవుని స్వరూపమందు చేయబడ్డారు, అంటే నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించు కొనవలెను అను ఎఫెసీయులకు 4:24  లేఖనమును బట్టి మరియు జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు అను కొలొస్సయులకు 3:10 లేఖనమును బట్టి వాళ్ళు, దేవుని నిజమైన జ్ఙానములో నిజమైన నీతిలో మరియు పరిశుద్ధతలో మరియు స్వభావము యొక్క సహజ శాస్త్రీయమైన జ్ఙానముతో (ఆదికాండము 2:19-23) పాపము లేనివారిగా దేవునిని గూర్చి పరిపూర్ణ జ్జానము కలవారుగా సృజింపబడి యున్నారని నేను నమ్ముతున్నాను. తప్ప మొట్టమొదటి మానవులు జంతువు నుండి అభివృద్ధి చెందలేదని నేను నమ్ముతున్నాను. 1 కొరింథీయులకు 2:14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అట్లే దేవుడు తన సర్వ సృష్టిపై మానవులకు అధికారాన్ని ఇచ్చియున్నాడు. మానవులు ఈ జీవితములో చిత్తస్వేచ్ఛను (free will) కలిగియున్నారు.

పాపము

ఆదికాండము 3వ అధ్యాయములో వివరించబడియున్న ప్రకారము, మొట్టమొదటి మానవుల పతనము ద్వారా పాపము ఈ లోకములోనికి వచ్చియున్నదని నేను నమ్ముతున్నాను. ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. 1యోహాను 3:4 పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదాము హవ్వలు మొదటిగా పాపము చేసినపుడు వాళ్ళు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. ఈ పతనము ద్వారా వాళ్ళు మాత్రమే కాకుండా అతని సంతానము కూడా అసలైన జ్ఙానాన్ని నీతిని పరిశుద్ధతను పోగొట్టుకొనియున్నారు. అందువలననే మనుష్యులందరు పుట్టుకతోనే పాపులై యున్నారు, పాపములలో మరణిస్తూవున్నారు, సమస్త దుష్టత్వమునకు మొగ్గు చూపుతూవున్నారు, దేవుని ఉగ్రతకు పాత్రులైయున్నారు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు కారణమయ్యిందని రోమా 5:12,18 మరియు మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, కీర్తనలు 51:5 నేను (ప్రతిఒక్కరు) పాపములో పుట్టినవాడను (సంక్రమింపబడిన పాపముతోనే పుడుతూవున్నామని ఆ సంక్రమింప బడిన) పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెనని కీర్తనకారుడు చెప్తూవున్నాడు. యోహాను 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును రోమా 8:7,8 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

ప్రజలు స్వాభావికమైన పాపమును బట్టి శరీరానుసారులై శరీర కార్యములను చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పునమునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమని ఎఫెసీయులకు 2:1-3 చెప్తూవుంది. కాబట్టే మానవులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా లేక వారి సాంస్కృతిక మరియు విజ్ఙానశాస్త్రము యొక్క సహాయముతో, తమ్మునుతాము దేవునితో సమాధానపరచు కొనలేరని తత్ఫలితంగా మరణమును జయించుటకు మరియు నాశనమును తప్పించుకొనుటకు సామర్ధ్యమును కలిగిలేరని నేను నమ్ముతున్నాను.

ధర్మశాస్త్రము

సృష్టి ప్రారంభములోనే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మానవుల హృదయాలలో లిఖించియున్నాడని నేను నమ్ముతున్నాను. మానవుని మనఃసాక్షి ఆ ధర్మశాస్త్రమును గురించి సాక్ష్యమిస్తూవుంది (దీనిని స్వాభావికమైన ధర్మశాస్త్రము అని అంటారు). దేవుని ధర్మశాస్త్రమునకు సాక్ష్యముగా ప్రతి వానిలో ఒక స్వరముగా ఉండులాగున ప్రతి వ్యక్తికి దేవుడు మనఃసాక్షిని యిచ్చియున్నాడు. రోమా 2:14,15, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని గూర్చిన జ్ఞ్యానము పాపమునుబట్టి మానవుని హృదయములో కలుషితమయ్యింది. జనులు విస్తరించుట ఆరంభమైనప్పుడు ఒకని మనఃసాక్షి పాపమును బట్టి మొద్దుబారుటచే అతడు పాపము చేయునపుడు అది అతనిని ఏ మాత్రమును బాధించకపోవుటను బట్టి (రోమా1;21,22; ఎఫెసీ 4:18,19) అట్లే ఒకని మనఃసాక్షి దేవుని వాక్యము పాపమని చెప్పని దానిని కూడా పాపమని వానికి చెప్తూ వుండుటను బట్టి (రోమా 14:2) ఒకని మనఃసాక్షి సంపూర్ణముగా ఆధారపడ తగినది కాకుండా పోయింది. అలాంటి పరిస్థితులలో ప్రజలందరూ దేవుని చిత్తమేమైయున్నదో పరిపూర్ణముగా  యెరుగునట్లు దేవుడు తన ధర్మశాస్త్రమును బైబులు నందు లిఖియింపజేయుట ద్వారా దానిని రెండవసారి నిర్దిష్టమైన రీతిలో దయచేసాడు (దీనినే లిఖియింపబడిన ధర్మశాస్త్రము అని అంటారు).

ద్వితీ. కాం. 10:4 ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలనుమునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను. మత్తయి 5:48 పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును (ప్రతిఒక్కరును) పరిపూర్ణులుగా (ఉండులాగున) ధర్మశాస్త్రము దయచేయబడింది. దేవుని ధర్మశాస్త్రము మన మాటలలో తలంపులలో క్రియలలో పరిపూర్ణతను కోరుతూ వుంది. పాపము చేయువారందరిని ధర్మశాస్త్రము ఖండిస్తూ వుంది.

రోమా 7:7-24 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని (ఆజ్ఞ ద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము నకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని (ఆజ్ఞ ద్వారా) నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయు చున్నాను. ఇచ్ఛయింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిచేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడు చున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల (తొట్రిల్లిన యెడల), ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. కాబట్టి ఏఒక్కరు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా నెరవేర్చి రక్షింపబడలేరు. రోమా 3:20 ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

దేవుని ధర్మశాస్త్రము మన పాపాల్ని మనకు చూపెట్టడానికి సహాయపడుతూ పాపాన్ని బట్టి వచ్చు దేవుని కోపాన్ని బట్టి మనలను హెచ్చరిస్తూ మన క్రైస్తవ జీవితములో మనలను నడిపిస్తూవుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత తమ నడతలను శుద్దిపరచుకోవలసియున్నారు కీర్తన 119:9.

మోషే యొక్క ధర్మశాస్త్రము

సీనాయి పర్వతము మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మూడు రకములైన ధర్మశాస్త్ర నియమములను యిచ్చి యున్నాడు.

మొదటిగా, ఆయన వారిని ఒక జనాంగముగా పరిపాలించుట కొరకు పౌర సంబంధమైన ఆజ్జ్యలను యిచ్చి యున్నాడు. ఉదాహరణకు: ఒకనిని గాయపర్చినను లేక ఒకనికి నష్టము కలుగజేసినను అట్టి నేరములకు శిక్ష విధించుటకుగాను పౌర సంబంధమైన ధర్మశాస్త్రము నియమింపబడింది (నిర్గమ కాండము 21:22 చూడండి).

రెండవదిగా, దేవుడు ఇశ్రాయేలీయులకు శుద్ధికరణాచార సంబంధమైన ఆజ్జ్యలను కూడా యిచ్చియున్నాడు. ఇందులో ఇశ్రాయేలీయులు తమ దేవునిని ఎప్పుడు, ఎక్కడ, ఏవిధముగా ఆరాధించాలో చెప్పబడింది. యాజకులకు, బలులకు, సబ్బాతు దినములకు, ప్రత్యక్ష గుడారమునకు సంబందించిన నియమాలు ఛాయలుగా, చిత్రములుగా, వాగ్దానము చేయబడిన మెస్సయ్యను సూచించుచు సేవించుటకు ఇవ్వబడింది.

మూడవదిగా, దేవుడు నీతి సంబంధమైన ఆజ్జ్యలను కూడా ఇశ్రాయేలీయులకు యిచ్చియున్నాడు. సృజించి నప్పుడే అన్ని కాలాలలో ప్రజలందరి కొరకైనా దేవుని చిత్తమై ఉండులాగున మానవుని హృదయములో దేవుడు నీతి సంబంధమైన ఆజ్జ్యలను లిఖించాడు. దేవుడు నీతి సంబంధమైన ధర్మశాస్త్రమును ఇశ్రాయేలు ప్రజల కొరకు పది ఆజ్జ్యల రూపములో ఇచ్చాడు. ఈ పది ఆజ్జ్యలలో ప్రజలందరి కొరకైన ఆయన పరిశుద్ధ చిత్తము ప్రత్యేకమైన రీతిలో యెట్లు అన్వయింపబడునను దానిని ఆయన ఎన్నుకొనిన ప్రజలుగా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేశాడు.  

దేవుడు క్రొత్త నిబంధనలో సీనాయి పర్వతము మీద మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఇకను వర్తించదని స్పష్టముగా తెలియచేసాడు (కొలొస్సి 2:16,17; గలఁతి 3:23-25; 5:1 చూడండి). అలాగైతే ఎందుకు మనము పది ఆజ్జ్యలను ఉపయోగిస్తువున్నాం? ఎందుకంటే, పది ఆజ్జ్యలు దేవుని నీతి సంబంధమైన ధర్మశాస్త్రము రూపమును, ప్రజలందరి కొరకైన ఆయన పరిశుద్ధ చిత్తమునై ఉన్నాయి. గుర్తు చేసుకోండి పాతనిబంధనలో పౌర మరియు శుద్ధికరణాచార సంబంధమైన ఆజ్జ్యలు ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే దేవుని చేత ఇవ్వబడి యున్నాయి. ఈ కారణాన్ని బట్టి, పది ఆజ్జ్యలలోని ప్రాముఖ్యమైన సారంశము క్రొత్త నిబంధనలో అవే మాటలలో కాకుండా లేక సీనాయి పర్వతము మీద దేవుడిచ్చిన అదే క్రమములో కాకుండా తిరిగి చెప్పబడి ఉన్నాయి (మత్తయి 19:18; రోమా 13:8-10; గలఁతి 5:19).   

పరిశుద్ధ లేఖనములను గురించి

పరిశుద్ధ లేఖనాలు ప్రపంచములోని అన్ని ఇతర పుస్తకాల కంటే భిన్నమైనవని, అవి దేవుని మాటలని నేను నమ్ముతున్నాను. (దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది అను 2తిమోతి 3:16,17 లేఖనమును బట్టి మరియు ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి అను 2పేతురు 1:21 లేఖనమును బట్టి దేవుని పరిశుద్దులైన గ్రంథకర్తలు పరిశుద్దాత్మ దేవుడు వారిని ప్రేరేపించిన రీతిగా లేఖనములను గ్రంథస్థము చేసియున్నారు కాబట్టే అవి దేవుని మాటలు). పరిశుద్దాత్ముని దైవావేశము అంటే, గ్రంథకర్తలు గ్రంథస్థము చెయ్యవలసిన అంశాల్ని, ఆలోచనల్ని, మాటల్ని దేవుడే వారిలోనికి ఉదియున్నాడని అర్ధము. కాబట్టే ద్వితీ. కాం. 4:2;12:32, నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు; నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు అని చెప్తూవున్నాయి.  

లేఖనాల యొక్క అక్షరానుసరమైన ప్రేరణ అను సిద్ధాంతము “మానవ తర్కము కారణములపై” ఆధారపడి లేదు, అది లేఖనములపై మాత్రమే ఆధారపడియున్నదని నేను నమ్ముతున్నాను. (ఈ విషయాన్ని లేఖనాలు తెలియజేస్తూ, 2తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది; యోహాను 10:35 లేఖనము నిరర్థకము కానేరదు గదా; రోమా 3:2 ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను; 1 కొరింథీ 2:13 మనుష్య జ్ఞానము నేర్పుమాట లతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించు చున్నాము, అని చెప్తూవున్నాయి).

పరిశుద్ధ లేఖనాలు దేవుని మాటలై యున్నవి గనుక, అవి ఎలాంటి తప్పులనుగాని వైరుధ్యాలనుగాని కలిగిలేవని నేను నమ్ముతున్నాను, వాటి లోని ప్రతి భాగము ప్రతి మాట సత్యమని నేను నమ్ముతున్నాను. మత్తయి 5:18, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యోహాను 10:35 లేఖనము నిరర్థకము కానేరదు గదా. యోహాను 17:17 నీ వాక్యమే సత్యము. బైబిలులోని ఒక భాగము మరియొక భాగాన్ని వివరిస్తూవుందని నేను నమ్ముతున్నాను, 1 కొరింథీ 2:13 మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.  

బైబులులోని భాగాలు చరిత్రను భౌగోళికపరమైన అంశాలను మరియు ఇతర లౌకిక సంబంధమైన వాటిని గురించి కూడా తెలియజేస్తూవున్నాయి.

పరిశుద్ధ లేఖనాలు యేసుని గూర్చి సాక్ష్యమిస్తు ఉన్నాయి. యోహాను 5:39, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

క్రైస్తవుల విశ్వాసానికి జీవితానికి ఇది మాత్రమే మార్గదర్శిగా ఉండటమే కాకుండా అందరికి నిత్య రక్షణను పొందే క్రమములో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి అవసరమైన వాటిని భోదిస్తూవుంది, (2 తిమోతికి 3:15 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము; లూకా 11:28, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను).

పరిశుద్ధ లేఖనాలు క్రైస్తవ సంఘ విశ్వాసానికి ఆధారముగా దేవుని ద్వారా ఇవ్వబడివున్నాయి, (క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడి యున్నారు, ఎఫెసీయులకు 2:20). అందుకే క్రైస్తవ సంఘములో ప్రకటింపబడు అన్ని సిద్ధాంతాలకు పరిశుద్ధ లేఖనాలే మూలమై ఉన్నాయి, అందునుండే ప్రతి సిద్ధాంతము తప్పక తీసుకోబడాలి. కాబట్టే క్రైస్తవులందరిని  మరియు ప్రతి సిద్ధాంతాన్ని లేఖనముల ద్వారానే పరీక్షించాలని మరియు తీర్పు తీర్చాలన్నదే ఏకైక ఆజ్జ్య లేక నియమము. దాని ప్రకారమే పరిశుద్ధ లేఖనాలను అవి చెప్తూవున్న సిద్ధాంతములను అర్ధం చేసుకోవలసి యున్నాము.

సైన్సుగా చెప్పబడుతూ వున్న ప్రతి సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ ఉన్నాను. మన కాలములో ఇది సంఘములో చాల ప్రజాదరణను సంపాదించుకొనియున్నది. ఇది పరిశుద్ధ లేఖనాలలోని మాటలన్నీ దేవుని మాటలు కాదని కొన్ని భాగాలు దేవుని మాటలని కొన్ని భాగాలు మనుష్యుల మాటలని చెప్తూవుంది. అలా అంటే లేఖనాలు తప్పును కలిగి ఉన్నట్లే కదా. ఇలాంటి తప్పుడు బోధను ఘోరమైనది గాను దైవదూషణ గాను ఎంచి తిరస్కరిస్తూవున్నాను. ఇది క్రీస్తుకు ఆయన అపోస్తులుల భోధలకు పూర్తి విరోధముగా ఉండటమే కాకుండా దేవుని వాక్యము మీద మనుష్యులను న్యాయ నిర్ణేతలుగా నియమిస్తూ క్రైస్తవ సంఘము యొక్క పునాదిని దాని విశ్వాసాన్ని కూలదోస్తూ ఉంది.

సువార్త గురించి

ప్రజలందరి పాపాల్ని తీసివేయడానికి ప్రేమగల దేవుడు యేసుక్రీస్తును పంపియున్నాడని తెలియజేసే సువర్తమానమే సువార్త. ఈ సువార్త యేసులో దొరికే నీతిని పాపులందరికి ఉచితముగా అందిస్తూవున్నది. దేవుడు సువార్త వాగ్దానాల్ని నమ్మువారందరికి నిత్యజీవాన్ని రక్షణను ప్రకటిస్తూ ఇస్తూ ఉన్నాడు.

యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవుడు తన కృప మరియు సత్యం (క్రీస్తు) యొక్క పూర్తి ప్రత్యక్షత కోసం మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రము అంటే దేవుడు మోషే ద్వారా సీనాయి పర్వతంపై చేసిన పాత ఒడంబడిక. అది దాదాపు పాత నిబంధన అంతటికి పునాది. మోషే ఇచ్చిన ఆ నైతిక ధర్మశాస్త్రము దేవుని చిత్తాన్ని మరియు మన పాపాన్ని వెల్లడి చేస్తూవుంది. అతడు క్రీస్తు యొక్క విమోచన కార్యాన్ని సూచించే శుద్ధికారణాచారా సంబంధమైన ఆజ్ఞలను కూడా ఇచ్చాడు. రక్షకుడు వస్తాడని వాగ్దానం చేసే ప్రవచనాలను అందించాడు. మోషే ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం సంపూర్ణ విధేయతను కోరింది. అట్లే ఆ ధర్మశాస్త్రం సువార్తకు మార్గాన్ని సిద్ధం చేసింది. ఉచిత క్షమాపణను గూర్చిన సంపూర్ణ నిశ్చయతే కృప. ఆ కృప దయను గురించి ప్రకటించే మాటలే సువార్త. ఇప్పుడు రక్షకుడు వచ్చాడు. కృప మరియు సత్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. తన కృపలో ఆయన మన స్థానంలో దేవుని నైతిక ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. సర్వకాలమునకు, సమస్త పాపములకు అవసరమైన ఒకే బలిని ఆయన అర్పించాడు. ఆయన మోషేలోని వాగ్దానాలను వాస్తవికతకు మార్చి దేవుని సత్యాన్ని శాశ్వతంగా స్థాపించాడు.

కాబట్టే, రోమా 1:16 సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది అని పౌలు అంటూవున్నాడు. సువార్త మనుష్యుల పాప విముక్తికి ఏకైక మార్గం అని, మనుష్యులను క్షమించి, వారిని మార్చి, చివరికి వారిని పరలోకం చేర్చే ఏకైక సాధనమైన ఏకైక శక్తి అని పౌలు ఉద్దేశ్యము. పౌలు సువార్తను శక్తిగా పేర్కొన్నప్పుడు, అతడు ఇక్కడ డైనమిస్ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు, ఇది ఆంగ్ల పదమైన డైనమైట్‌కు ఆధారం. సువార్త ఆ రకమైన శక్తిని కలిగి ఉంది. అది దేవుని శక్తి. కాబట్టి ఇది సాధ్యమైనన్ని గొప్ప ఆశీర్వాదాలను, నిత్య రక్షణను తెస్తుంది. ఆ రక్షణ అందరికీ ఉంటుంది. కాబట్టే అతడు ఆ సువార్త యొక్క శక్తినిగాని దాని సార్వత్రిక పరిధినిగాని పరిమితం చేయడం లేదు.

దానియందు (సువార్తలో) “దేవుని నీతి బయలుపరచబడుచున్నది“. దేవుని నీతి అనే మాట రెండు అర్ధాలను అనుమతించ గలదు: దేవుడు పరిశుద్దుడు, ఆయన ప్రతి వ్యక్తి నుండి ఆ పరిశుద్ధతను (నీతిని) కోరుకొంటున్నాడు. రెండవది, అత్యుత్తమ ఏ మానవ ప్రయత్నం కూడా అందించలేని నీతిని ఆయన కోరుకొంటున్నాడు. ఈ రెండవ అర్ధాన్ని బట్టి లూథర్ గారు చాలా ఇబ్బంది పడ్డాడు. “దేవుని నీతి” యొక్క మరొక అర్థాన్ని లూథర్ గారు తెలుసుకున్నప్పుడు మాత్రమే అతని కలత చెందిన ఆత్మ నెమ్మదిని పొందింది. ఆ మరో అర్థం ఏమిటంటే దేవుడు ఇచ్చే నీతి. ప్రతి ఒక్కరికి అవసరమైన నీతిని దేవుడే అందిస్తూవున్నాడు కాబట్టి విశ్వసించే ప్రతిఒక్కరి కొరకు సువార్త రక్షణను తెస్తూవుంది. పాపాత్ములైన మానవులు ఉపయోగకరమైన దేనినీ ఉత్పత్తి చేయలేరు. కాబట్టే క్రీస్తులో దేవుడు అన్నీ చేసాడు. పాపి యొక్క ప్రత్యామ్నాయంగా తన పరిపూర్ణ జీవితం ద్వారా, క్రీస్తు న్యాయవంతుడు పరిశుధ్ధుడైన దేవునికి మనం రుణపడి ఉన్న నీతిని ప్రజలందరి కొరకు సంపాదించాడు. సిలువపై తన నిర్దోష మరణం ద్వారా, క్రీస్తు మనం మరియు పాపుల ప్రపంచం చేసిన అనేక విషయాలకు చెల్లించాడు. సువార్తలో దేవుడు ఇప్పుడు పాపిని క్రీస్తు నీతిని తన నీతిగా అంగీకరించమని ఆహ్వానిస్తున్నాడు. విశ్వాసంతో పాపులు క్రీస్తు యోగ్యతను అంగీకరించినప్పుడు, దేవుడు వారిని పరిశుధ్ధులుగా చూస్తాడు. దేవుడు పాపిని అన్ని తప్పుల నుండి నిర్దోషి అని ప్రకటిస్తాడు. ఇది న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తి దోషిగా తేలిన నేరస్థుడిని క్షమించడం లాంటిది. క్రీస్తు మన పాపాన్ని తనపైకి తీసుకొని తన నీతిని మనకు అందించే ఈ అద్భుతమైన మార్పిడిని నీతిమంతత్వము అని అంటారు. నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారు రోమా 1:17; హబక్కూకు 2:4.

యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ యేసు నీకొదేముకు దేవుని శాశ్వతమైన రక్షణ ప్రణాళికను భోదిస్తూ ఉన్నాడు. మానవులు పతనమై అన్నింటిని పాడుచేసియున్నప్పటికిని దేవుడు తాను సృష్టించిన ప్రపంచాన్ని ప్రేమించాడు. మన పాపాలు దేవుడు మనల్ని ప్రేమించకుండా ఆపలేకపోయాయి. మనపట్ల ఆయన కున్న ప్రేమను నిలువరించలేక పోయాయి. ఆయన అందరిని ప్రేమించాడు, ఎవరినీ మినహాయించలేదు. అలాంటి ప్రేమ మనకు అంత తేలికగా అర్థం కాదు. చాలా మంది క్రైస్తవులు దీని గ్రీకు పేరైన అగాపేతో సూచించడానికి ఇష్టపడతారు. ఈ రకమైన ప్రేమ ఒక అనుభూతి కంటే ఎక్కువ; అది ఒక సంకల్పం. దేవుడు పాపాన్ని ఇష్టపడలేదు. ఆయన దానిని అసహ్యించుకున్నాడు. కాని ఆయన పాపంలో చిక్కుకున్న ప్రపంచాన్ని ప్రేమించాడు మరియు పాపంతో వ్యవహరించాల్సి వచ్చింది. తాను ప్రేమించిన ప్రపంచం కోసం ఆయన త్యాగం చేశాడు, తన ఏకైక కుమారుడిని లోక పాపాలకు అవసరమైన బలిగా ఇచ్చాడు.

ఆ తర్వాత, దేవుడు ఇచ్చిన బహుమానం ఏమిటో యేసు చెప్తూ: “ఆయనయందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవము పొందును అంటే దేవుని కుమారునిపై విశ్వాసం మాత్రమే కాపాడుతుందని, వారు నశించరని తెలియజేసాడు. చాలా మంది విశ్వాసులు చనిపోవడాన్ని మనం చూసినప్పటికీ, అది కేవలం భౌతిక మరణం మాత్రమే, అది భూమిపై మన సంవత్సరాలు ముగిస్తుంది. విశ్వాసులు యేసుతో ఎప్పటికీ జీవిస్తారు. శాశ్వతంగా నరకంలో నశించిపోవడానికి, దేవునితో శాశ్వత కాలం జీవించడానికి ఉన్న తేడా క్రీస్తులో నమ్మకం ఉంచడంలోనే ఉంది. ఎవరైతే దేవుని కుమారునిలో (బలమైన లేదా బలహీనమైన) విశ్వాసం ఉంచుతారో వాళ్ళు శాశ్వత జీవితాన్ని కలిగి ఉండవచ్చు. యోగ్యత అనేది విశ్వాసం పెద్దదా లేదా చిన్నదా లేక బలమైనదా బలహీనమైనదా అనే దాని మీద ఆధారపడి ఉండదు. బదులుగా అది క్రీస్తు యోగ్యతపై ఆధారపడి ఉంటుంది.

కొలొస్సయులకు 2:13-15 మరియు అపరాధముల వలనను, …… మీరు మృతులై యుండగా, దేవుడు ……మన అపరాధముల నన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను. లూకా 2:10-11 అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యెహెజ్కేలు 33:11 నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును.

విమోచనమును గురించి

కాలము పరిపూర్ణమైనప్పుడు నిత్యుడైన దేవుని కుమారుడు శరీరధారిగా పరిశుద్దాత్మ వలన కన్యయైన మరియ యందు జన్మించి మనవంటి మానవ స్వభావమును ఆయన తీసుకొనియున్నాడు. యేసుక్రీస్తు నిజ దేవుడైయున్నాడు, నిత్యత్వమందు తండ్రి కనిన వాడును, మరియు కన్యయైన మరియకు పుట్టిన నిజ మానవుడైయున్నాడు. దేవుని కుమారుడు శరీరధారిగా అగుట అనుయను అద్భుతము యొక్క ఉద్దేశ్యము ఆయన దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తిగా ఉండవచ్చుననే. ఆయన మానవులందరి స్థానములో దైవికమైన ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా నెరవేర్చి మన పాప దోషమంతటిని తన మీద వేసుకొని శ్రమపడి మరణించియున్నాడు. ఆయన ప్రజలందరినీ పాపము నుండి, మరణము నుండి, సాతాను యొక్క అధికారము నుండి విమోచించడానికే ఇట్లు చేసియున్నాడు. ఆయన తన ప్రాణమును మనకు ప్రతిగా విమోచన క్రయధనముగా సిలువపై పెట్టుట ద్వారా, పరిహారమును చెల్లించి మనలను విడిపించియున్నాడు. మన పాపము కొరకై మనము చావవలసిన స్థానములో క్రీస్తును మనకు బదులుగా దేవుడు అంగీకరించాడు. ఈ విధముగా దేవుడు పాప లోకమంతటిని తనతో సమాధానపర్చుకొని యున్నాడు, గలతీ 4:4,5; 3:13; 2కొరింథీ 5:18,19. సర్వ మానవాళి పాపముల కొరకు యేసు చెల్లించిన దానిని దేవుడు అంగీకరించాడు అనడానికి యేసుని పునరుత్థానమే రుజువై యున్నది.

గలతీ 4:4,5 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. మత్తయి 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. రోమా 5:19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యెషయా 53: 6 యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. మత్తయి 20: 28 ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. 2 కొరింథీ 5:21ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. ఎఫెసీ 1:7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. 2 తిమోతికి 1:10 క్రీస్తు యేసను మన రక్షకుడు …… మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. గలతీ 3:13 క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను. 2 కొరింథీ 5:18,19 సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.

క్రీస్తులో విశ్వాసమును గురించి

ఆయన కుమారుడు మన స్థానములో జీవించి మరణించి దేవునిని సంపూర్ణముగా సంతృప్తి పరచుట ద్వారా దేవుడు లోకమును తనతో సమాధాన పరచుకొనియున్నది మొదలుకొని మరియు క్రీస్తు ద్వారా అమలులోనికి వచ్చిన ఈ సమాధానమును సువార్త ద్వారా మానవులందరికీ అంతము వరకు అందరు దానిని విశ్వసించులాగున ప్రకటిస్తూ ఉండాలని దేవుడు ఆజ్ఞ్యాపించియున్నాడు 2 కొరింథీ 5:18,19; రోమా 1:5, కాబట్టి దేవునితో వ్యక్తిగతముగా సమాధానపడుటకు, మానవులకు ఉన్న ఏకైక మార్గము క్రీస్తునందు విశ్వాసముంచుటే, అంటే పాత క్రొత్త నిబంధనలు ప్రకటిస్తున్న పాపక్షమాపణను పొందుకొనుటకు ఏకైక మార్గము ఇదే, అపొ. కార్య 10:43; యోహాను 3:16-18, 36. క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మానవులు క్షమాపణను పొందుకొంటున్నారు, క్రీస్తు యొక్క మాదిరి తరువాత దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు చేయు ఎలాంటి మానవ ప్రయత్నము ద్వారా పాప క్షమాపణను పొందుకోగలమని దీని అర్ధం కాదు, కాని సువార్తలో విశ్వాసముంచుట అంటే, క్రీస్తు ద్వారా మన కొరకు సంపూర్ణముగా సంపాదించబడి మరియు సువార్త ద్వారా ప్రకటింపబడుతూ ఉన్న పాపక్షమాపణ లేక నీతిమంతత్వము అను వాటి యందు విశ్వాసముంచుట అని అర్ధము. ఈ విశ్వాసము మనలను నీతిమంతులుగా ప్రకటిస్తూ ఉంది, విశ్వాసము కృపను అది ప్రకటిస్తున్న పాప క్షమాపణను ఆధారము చేసుకొని ఉన్నది కాబట్టి విశ్వాసము మానవుని కార్యము కాదు, రోమా 4:16.

పశ్చాత్తాపము

పశ్చాతాపమంటే పాపములను గుర్తెరిగి నిజాయితీగా వాటిని బట్టి దుఃఖపడటమే. పశ్చాత్తప్తుడైన పాపి దేవుడు యేసుని బట్టి పాపమును క్షమిస్తాడని నమ్ముతాడు. పశ్చాత్తాపము హృదయములో కలిగే మార్పు అది లేకుండా రక్షింపబడతామని ఎవ్వరు ఆశించనే లేరు. నిజముగా పశ్చాత్తాపపడు ప్రతి పాపికి దేవుని ఉచితమైన పరిపూర్ణమైన క్షమాపణ యొక్క నిశ్చయత ఇవ్వబడింది. కాబట్టే అతడు/ ఆమె తన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు.

యెషయా 55:6,7 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవునివైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. మార్కు 1:15 –కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. మత్తయి 4:17 అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. 2 కొరింథీ 7:10 దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లూకా 18:13,14 అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొను వాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

కన్వర్షన్ (మార్పు చెందుట గురించి)

మానవుడు, దేవుని ధర్మశాస్త్రమును బట్టి తాను తప్పిపోయి ఉన్నానని మరియు పాపిగా ఖండింపబడియున్నానని నేర్చుకొనటం వలన, అతడు సువార్తనందలి విశ్వాసమునకు తేబడుతున్నాడు, అది క్రీస్తును బట్టి వానికి పాపక్షమాపణను నిత్య రక్షణను ప్రకటిస్తూ ఉన్నది, అపొ. కార్య 11:21; లూకా 24:46, 47; అపొ. కార్య. 26:18.

మానవులందరు, పతనమైనప్పటి నుండి, పాపములను బట్టి చచ్చిన వారిగా ఉంటున్నారు, ఎఫెసీ 2:1-3, మరియు చెడు వైపునకు మాత్రమే మ్రొగ్గియున్నారు, ఆది 6:5; 8:21; రోమా 8:7. ఈ కారణాన్ని బట్టే, ప్రత్యేకముగా లోక పాపముల కొరకు సిలువ వేయబడిన క్రీస్తు యొక్క సువార్త మానవులకు, వెఱ్ఱితనముగా నున్నది, 1 కొరింథీ 2:14, సువార్తలో విశ్వాసముంచటం లేక దేవుని బిడ్డలుగా మారటం, అనే దానిలో మానవుని ప్రమేయము కొంచెమైనను ఏమి లేదు, ఇది పూర్తిగా దేవుని కృపా కార్యమే, ఫిలిప్పీ1:29; ఎఫెసీ 2:8; 1:19; యిర్మీయా 31:18. యేసును రక్షకునిగా హృదయములో విశ్వసించడానికి పరిశుధ్ధాత్ముడే కారణం. అందుకే లేఖనాలు మానవుల యొక్క విశ్వాసాన్ని లేక అతని కన్వర్షన్ ని, మృతుల నుండి లేచుటగా, ఎఫెసీ 1:20; కొలొస్సి 2:12, దేవుని పిల్లలుగా జన్మించుటగా, యోహాను 1:12,13, సువార్త ద్వారా నూతన జన్మముగా, 1 పేతురు 1:23-25, అభివర్ణిస్తూ ఉన్నాయి. లోకము సృష్టింపబడినప్పుడు అంధకారము నుండి సృష్టింపబడిన వెలుగువలె ఇది దేవుని కార్యము, 2 కొరింథీ 4:6.

పరిశుద్ధ లేఖనములలోని స్పష్టమైన ఈ ప్రకటన ఆధారంగా నేను సినర్జిఇజంను సమర్దించు ప్రతి బోధను తిరస్కరిస్తూ వున్నాను, అంటే కన్వర్షన్ దేవుని కృప మరియు శక్తి ద్వారా కానేకాదని, ఇందులో మానవుని సహకారము కూడా కొంత ఉన్నదని, అంటే, ఇతురులతో పోల్చుకొంటే ఒకని సత్ప్రవర్తన వలనగాని, ఒకని మంచి స్వభావము వలనగాని, ఒకని సరియైన నిర్ణయము వలనగాని, ఒకడు తక్కువగా తప్పులు చేసియున్నాడనిగాని, ఒకడు కొంచెం చెడు ప్రవర్తనను కలిగియున్నాడనిగాని, ఒకని ఉద్దేశ్యపూర్వకమైన నిగ్రహం వలనగాని, ఇంకా దేనివలననైననుగాని మానవుని కన్వర్షన్ ని మరియు రక్షణను కృపగల దేవుని చేతులలో నుండి తీసుకొని మానవుని క్రియలపై ఆధారపడేటట్లుగా చేస్తున్న బోధలను నేను తిరస్కరిస్తున్నాను. ఇష్టపూర్వకంగా నిగ్రహించుకోవడం లేక మరే విధముగానైనను నిగ్రహించుకోవడం అనేది కూడా పూర్తిగా కృపా కార్యమే, ఈ కృపే “మారని వారిని మార్చివేస్తున్నది” యెహెజ్కేలు 36:26; ఫిలిప్పీ 2:13. “కృపా సామర్ధ్యముల” ద్వారా కన్వర్షన్ గురించి నిర్ణయం తీసుకోవడానికి మానవునికి సమర్ధత ఉన్నదని చెప్పే సిధ్ధాంతాన్ని కూడా నేను తిరస్కరిస్తున్నాను. ఈ సిధ్ధాంతము కన్వర్షన్ కి ముందు మానవుడు ఇప్పటికి ఆత్మీయముగా శక్తిని కలిగియున్నాడని చెప్తూ ఆ సమర్ధతను బట్టి “కృపా సామర్ధ్యములను” ఉపయోగించి అతడు సరిగా నిర్ణయము తీసుకోగలడని భావిస్తూవుంది, కాబట్టే నేను దీనిని తిరస్కరిస్తున్నాను.

మరోవైపు, కన్వర్షన్ గురించి కల్వనిస్టుల తప్పుడు బోధను అంటే, వాక్యమును ఆలకించు వారినందరిని మార్చుటకు మరియు రక్షించుటకు దేవుడు కోరుకోవడం లేదని, వారిలో కొందరిని మాత్రమే ఆయన మార్చుటకు మరియు రక్షించుటకు ఆశపడుతున్నాడనే బోధను నేను తిరస్కరిస్తూ వున్నాను. నిజానికి వాక్యమును ఆలకించిన వారిలో అనేకులు మార్పునొందక రక్షింపబడక ఉన్నారు, దేవుడు హృదయపూర్వకముగా వారు మారాలని మరియు రక్షింపబడాలని కోరుకోకపోవడం అందుకు కారణం కానేకాదు, లేఖనాలు భోదించుచున్నట్లుగా, పరిశుధ్ధాత్మ కృపగల కార్యమును వాళ్ళు మొండిగా అడ్డుకోవడం బట్టే వారు మారకున్నారు రక్షింపబడకున్నారు, అపొ. కార్య. 7:51; మత్తయి 23:37; అపొ. కార్య. 13:46.

ఎందుకని అందరూ మారకున్నారు రక్షింపబడకున్నారు అను ప్రశ్నకు, దేవుని కృప సార్వత్రికమైయున్నదని మరియు అందరూ ఏకరీతిగా సంపూర్ణముగా పతనమైయున్నారని గ్రహించవలసియున్నాం, దీనికి జవాబు ఇవ్వలేనని నేను ఒప్పుకొంటున్నాను. లేఖనముల నుండి ఈ విషయము మాత్రమే నాకు తెలుసు: మానవుడు తన కన్వర్షన్ కి మరియు రక్షణకు ఋణపడియున్నాడు, తన ప్రక్క నుండి అతడు చాలా తక్కువగా దోషాలను చేసియుండుటను బట్టి లేక అతని మంచి స్వభావాన్ని బట్టి కాదు, గాని దేవుని కృపను బట్టి మాత్రమే ఋణపడియున్నాడు. అయితే మానవుడు మార్పునొందక పోవడానికి మాత్రం అతడే కారణం: వాళ్ళు మొండిగా పరిశుధ్ధాత్ముని యొక్క కార్యమును అడ్డుకోవడమే వాళ్ళు మార్పునొందక పోవడానికి కారణం, హోషేయ 13:9. సువార్తను తిరస్కరించడం అనేది పూర్తిగా మన తప్పిదమే.

ఈ రెండు లేఖన సత్యాలు బయలుపరుస్తున్న వాటికి మించి వెళ్లాడని నేను తిరస్కరిస్తూవున్నాను. అవి కల్వనిజంని (“క్రిప్టో కల్వనిజంని”) సమర్ధించడం లేదు. అయితే లూథరన్ సంఘము యొక్క సంక్షిప్తమైన లేఖన భోదలు ఫార్ములా ఆఫ్ కాంకార్డ్ నందు వివరణాత్మకంగా వివరించబడివున్నాయి, (ట్రిగ్లోట్ పి. 1081 పేరా 5759 60బి 62 63 యం.పి. 716ఎఫ్) : “ఒకడేమో కఠినునిగా, గ్రుడ్డివానిగా, కరడుగట్టిన పాపిగా ఉంటుంటే, మరొకడు, నిజానికి ఇదే దోషములతో ఉన్నప్పటికినీ, కన్వర్ట్ అవుతున్నాడు ఎలా? ఇలాంటి ప్రశ్నలలో, మనం ఎంత దూరం వెళ్లొచ్చు అనే విషయములో పౌలు మనకు కొంత పరిధిని నిర్దేశించియున్నాడు, అంటే దీని ఒక భాగములో మనం దేవుని తీర్పును గుర్తించవలసియున్నాం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినపుడు ఆయన ఒక భూభాగాన్నిగాని దేశాన్నిగాని శిక్షించినపుడు, వాళ్ళ పాపానికి వాళ్ళు ఆ శిక్షను పొందుకోవడానికి అర్హమై ఉన్నారు, ఆ శిక్ష వాళ్ళ భావి తరాలకు కూడా వర్తిస్తుంది, యూదులలో ఈ విషయాన్ని మనం చూడగలం. తరచుగా మనం దేవుని వాక్యం పట్ల దుర్మార్గముగా ప్రవర్తించడం మూలాన్న మరియు తరచుగా పరిశుధ్ధాత్ముని దుఃఖపెట్టడం మూలాన్న; మన పాపాల్ని బట్టి మనం ఇంతకంటే అధికంగా శ్రమపడుటకు అర్హులమనే విషయాన్ని తన ప్రజలకు తెలియజేసే క్రమములో కొన్నిసార్లు దేవుడు కొన్ని స్థలాల్లో కొందరు వ్యక్తులపై కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు, కాబట్టి మనం దేవుని భయముతో జీవిధ్ధాం దేవుని మంచితనాన్ని గుర్తిధ్ధాం ఆయనను స్తుతిధ్ధాం, అందుకు మినహాయింపుగా, మనలో మరియు మనతోనున్న మన యోగ్యతకు, విరుద్ధంగా, ఆయన ఎవరికైతే తన వాక్యాన్ని ఇచ్చాడో మరియు ఎవరితోనైతే ఆయన దానిని ఉంచాడో మరియు ఎవరినైతే ఆయన కఠినులుగా చేయక తిరస్కరించలేదో వారి ప్రక్కన మనం ఉంచబడినప్పుడు మరియు వారితో పోల్చుకొన్నప్పుడు, (అనగా, అన్నివిధాలా మనం వారిని పోలి ఉన్నప్పుడు) కొన్ని దేశాలలో ప్రజలపై వ్యక్తులపై ప్రదర్శింపబడుతున్న దేవుని న్యాయమైన అర్హమైన తీర్పును బట్టి, మనం జాగురూకతతో దేవుని శుధ్ధమైన అపరిమితమైన కృపను గుర్తిధ్ధాం మరియు ఆయనను స్తుతించుటకు నేర్చుకొందాం. ఈ అంశములో మనం ఇంకా ముందుకు వెళ్లాలనుకొంటే, హోషేయ13:9 లో వ్రాయబడినట్లుగా, ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నువ్వే నిర్ములము చేసికొనుచున్నావు అను మాటలను బట్టి మనం అంతకు మించి ముందుకు వెళ్లకుందాం, అయితే, ఈ వివాదములో ఈ విషయాలకు సంబంధించి ఇంకా పరిమితులు దాటితే, పౌలు వలె మనం కూడా వ్రేలును పెదవులపై పెట్టుకొని , “ఓ మనుష్యుడా దేవుని ఎదురు చెప్పుటకు నీవెవడవు?” రోమా 9:20, అను మాటలను జ్ఞ్యాపకం చేసుకొందాం. ఫార్ములా ఆఫ్ కాంకార్డ్ ఇక్కడ మనకెదురైన రహస్యాన్ని వివరిస్తూ, అది మానవుని హృదయంలోని రహస్యంగా కాకుండా (సైకలాజికల్ మిస్టరీగా కాకుండా), “ఒకడు ఎందుకని కఠినునిగా, గ్రుడ్డివానిగా, కరడుగట్టిన పాపిగా ఉన్నాడనే విషయాన్ని మరొకడు, నిజానికి ఇవే దోషములతో ఉంటున్నప్పటికిని, ఎలా అతడు కన్వర్ట్ అయ్యాడు,” అనే విషయాన్ని అర్ధంచేసుకోవడానికి మనం ప్రయత్నించినపుడు, మనం గ్రహింపశక్యంగాని దేవుని తీర్పులను మరియు ఆయన మార్గాలను పరిశీలించాలని వాటి పరిధిలోనికి ప్రవేశిస్తున్నాం అని తెలియజేస్తూ ఉంది, అయితే ఈ విషయాలు ఆయన వాక్యంలో మనకు బయలుపర్చబడలేదు, కాని నిత్యజీవములో వాటిని మనం తెలుసుకొంటాం, 1 కొరింథీ 13:12.

కల్వనిస్టులు సార్వత్రికమైన కృపను తృణీకరించడం ద్వారా దేవుడు తన వాక్యంలో బయలుపరచని ఈ రహస్యాన్ని పరిష్కరించియున్నారు. సీనర్జిస్ట్ లు, కృప ద్వారా మాత్రమే అను విషయాన్ని తృణీకరించడం ద్వారా ఈ రహస్యాన్ని పరిష్కరించియున్నారు. ఈ రెండు పరిష్కారాలు పూర్తిగా దుర్మార్గం, లేఖనాలకు విరుద్ధం. ప్రతి పాపి తను నిరాశతో నశించిపోకుండా అనియంత్రిత సార్వత్రిక కృప మరియు అనియంత్రిత “కృప ద్వారా మాత్రమే” అను రెండింటి అవసరతను కలిగి ఉన్నాడు, వీటిపై విధిగా ఆధారపడవలసి ఉన్నాడు.

కృప ద్వారా రక్షింపబడుట

దేవుడు లోకము సృజింపబడక మునుపే, ఆయా కాలములలో సువార్త ద్వారా తాను మార్చబోయే వ్యక్తులను దేవుడు ఎన్నుకొని నిత్యజీవము కొరకై విశ్వాసము నందు వారిని భద్రపర్చుచున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ ఎన్నికకు దేవుడు తాను ఎన్నుకొనిన ప్రజలలోని వ్యక్తులలో ఆయన ముందుగానే వీక్షించిన వారి యోగ్యత లేక క్రియలు ఏ మాత్రం కారణం కాదు. ఇది దేవుని కృప ద్వారా మాత్రమే రక్షణ యెట్లు సంపూర్ణముగా మనదైయున్నదో తెలియజేస్తూ ఉన్నది. యేసు క్రీస్తు ద్వారా మానవాళి అంతటి పట్ల దేవుడు చూపుచున్న ప్రేమ కనికరాల్నే కృప అంటారు.

ఎఫెసీ 1:4-6 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. రోమా 11:5-6 ఆలాగుననే అప్పటి కాలమందు సయితము కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు. అపొ. కార్య. 15:11 ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. రోమా 5:15 అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.

విశ్వాసము ద్వారా రక్షింపబడుట

పశ్చాత్తప్తుడైన పాపి యేసుక్రీస్తును తన ఏకైక రక్షకునిగా అంగీకరించి, పాప క్షమాపణ కొరకు రక్షణ కొరకు ఆయన యోగ్యత నందు సంపూర్ణ నమ్మికను ఉంచుటే విశ్వాసమైయున్నది. ఇట్టి విశ్వాసము వ్యక్తిగతముగ మానవుడు సంపాదించేది కాదు లేక ఇది మానవుని యోగ్యతకార్యము కాదు. పరిశుధ్ధాత్ముడే విశ్వాసాన్ని కలుగజేస్తాడు. ఎవరైతే జీవితాంతము ఈ విశ్వాసమందు నిలచియుంటారో వారందరు శాశ్వతముగా రక్షింపబడతారు. విశ్వాసము లేకుండా రక్షణ సాధ్యము కాదు.

యోహాను 1:12, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అపొ. కార్య. 10: 43, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయనను గూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను. గలతీ 2:16, మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. అపొ. కార్య. 16:30,31, వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి(రి). యోహాను 3:36, కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు. మత్తయి 24:13, అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.

నీతిమంతత్వమును గురించి

నీతిమంతత్వము అనే అంశానికి సంబంధించిన అన్ని బోధలు పరిశుద్ధ లేఖనాలలో పొందుపరచబడి ఉన్నాయి. యేసుక్రీస్తు సిలువ మీద మనకొరకు చనిపోయినపుడు, క్రీస్తునందు దేవుడు లోకమంతటిని నీతిమంతులుగా ఇప్పటికే ప్రకటించియున్నాడని లేఖనాలు బోధిస్తున్నాయి, రోమా 5:19; 2 కొరింథీ 5:18-21; రోమా 4:25. కాబట్టి ప్రతిఒక్కరు వారి స్వనీతి కార్యములను బట్టి కాక, ధర్మశాస్త్ర క్రియల మూలముగా కాక, కృప ద్వారా, క్రీస్తును బట్టి, ఆయన నీతిమంతులుగా తీర్చియున్నాడు, అంటే, క్రీస్తుని బట్టి వారి పాపములన్నీ క్షమింపబడియున్నాయి అను సత్యముపై ఆధారపడుతూ ఆయనను విశ్వసిస్తున్న వారందరిని, ఆయన నీతిమంతులుగా పరిగణించుచున్నాడు, మరియు అంగీకరించుచున్నాడు, అందువలననే పరిశుధ్ధాత్ముడు పరిశుద్దుడైన పౌలు ద్వారా “అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు” అని రోమా 3:22-24 నందు మరియు మరలా: “కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారనిరోమా 3:28 లో చెప్తూవున్నాడు. పాపులు క్షమాపణ అనెడి ఉచిత బహుమానమును సత్కార్యములు చేయుట ద్వారా కాక విశ్వాసము ద్వారా మాత్రమే పొందుదురు. ఒకరు క్రీస్తునందు, ఆయన విమోచనా కార్యమునందు నమ్మికయుంచినప్పుడు అతడు/ ఆమె నీతిమంతునిగా తీర్చబడుదురు. ఇది దేవుని నుండి ఇవ్వబడిన బహుమానము.

2 కొరింథీ 5:19 అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు కొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. ఎఫెసీ 2:8,9 మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. రోమా 4:5 పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

ఈ సిధ్ధాంతము ద్వారా మాత్రమే క్రీస్తుకు ఇవ్వవలసిన ఘనత ఆయనకు ఇవ్వబడుతూ ఉన్నది, అంటే, ఆయన పరిశుద్ధ జీవితము ద్వారా మరియు తన నిర్దోషమైన శ్రమలు మరణము ద్వారా ఆయన మన రక్షకుడైయున్నాడు. ఈ సిధ్ధాంతము ద్వారా మాత్రమే పాపులు దేవుడు వారి పట్ల నిశ్చయముగా కనికరయుతుడైయున్నాడను స్థిరమైన ఆదరణను కలిగియున్నారు. దేవుని ఎదుట నీతిమంతత్వము అనే అంశములో మానవుని స్వనీతి కార్యములకు మరియు యోగ్యతకు సంబంధించిన అన్ని బోధలు మిళితమై ఉన్నాయి కాబట్టే మానవుని స్వనీతి కార్యములకు మరియు యోగ్యతకు సంబంధించిన అన్ని బోధలను మతభ్రష్టమైన బోధలుగా నేను తిరస్కరిస్తూవున్నాను. క్రైస్తవ మతము విశ్వాసమునకు సంబంధించినది అందు మనం పాపక్షమాపణను మరియు క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా రక్షణను కలిగియున్నాం, అపొ. కార్య. 10:43.

మనుష్యులకు వారి నైతిక ప్రయత్నాల ఆధారంగా దేవుని కృపను వాగ్దానం చేస్తున్న యూనిటేరియన్ల బోధలను; కాథలిక్కులకు సంబంధించిన వర్క్ డాక్ట్రిన్ కు చెందిన బోధలను, అంటే, నీతిమంతత్వమును సంపాదించుకొనుటకు సత్క్రియలు అవసరమని బోధిస్తున్న వారి బోధలను; సినర్జిస్ట్ లకు సంబంధించిన బోధలను, అంటే క్రైస్తవ సంఘము ఉపయోగించే పదాలనే వాడుతూ మానవుడు విశ్వాసము ద్వారా “విశ్వాసము ద్వారా మాత్రమే” నీతిమంతులుగా తీర్చబడతాడు అనే మాటలను చెప్తూ, విశ్వాసమును వెలిగించుట అనే విషయములో దేవునితో సహకరించుటను మానవునికి ఆపాదిస్తూ నీతిమంతత్వము అను అంశానికి మానవ క్రియలను మిళితము చేస్తూ తిరిగి కాథలిక్కుల అబద్దబోధల లోనికి వెళ్తున్న వీరందరి బోధలను తిరస్కరిస్తూవున్నాను.

ఆబ్జెక్టివ్ జస్టిఫికేషన్ సబ్జెక్టివ్ జస్టిఫికేషన్ అంటే ఏమిటి?
అందరి కొరకు క్రీస్తు సంపాదించిన నీతిని విశ్వాసులు అంగీకరించేటట్లు వారిలో విశ్వాసమును సృజిస్తూ అవిశ్వాసము నుండి దేవునియందలి విశ్వాసమునకు తిప్పి మనకు పునర్జన్మనిచ్చి మరణము నుండి జీవమునకు లేపుటకుగాను పరిశుద్దాత్ముడు మనలో జరిగించే పనిని విశ్వాసము యొక్క అద్భుతముగా బైబులు వర్ణిస్తూవుంది దీనినే మారుమనస్సు, క్రొత్తగా జన్మించుట, పునర్జన్మ, జీవింపజేయుట అని అంటువున్నాం.

దేవుడు క్రీస్తులో నిబంధనను పునరుద్ధరించి, దేవుడే ప్రజలందరినీ నీతిమంతులని ప్రకటించడాన్ని ఆబ్జెక్టివ్ జస్టిఫికేషన్ అని అంటారు.

సొంత క్రియలయందు నమ్మిక ఉంచక క్రీస్తునందున్న దేవుని కృప ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న నీతిని నమ్మడాన్ని సబ్జెక్టివ్ జస్టిఫికేషన్ అని అంటారు.