కీర్తనలు ఉపోధ్ఘాతము
కీర్తనలు 47:6,7 దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.
తనను స్తుతించమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. దేవుని మంచితనం ఆయనను స్తుతించేలా మనల్ని పురికొల్పుతూ వుంది. అందుకనే దేవుని ప్రజలు పాటలతో ఆయనను స్తుతించడానికి ఇష్టపడతారు. సృష్టి ప్రారంభం నుండి, దేవుని దూతలు పరలోకములో దేవునిని స్తుతిస్తూనే ఉన్నారు (యోబు 38:7). చరిత్ర అంతటా దేవుని ప్రజలు భూమిపై ఆయనను స్తుతిస్తూనే ఉన్నారు. అందుకు బైబులులో ఎన్నో ఉదాహరణలు వున్నాయి: యెహోవా ఇశ్రాయేలీయులను ఫరో సైన్యం నుండి విడిపించిన్నప్పుడు, మోషే మరియు ఇశ్రాయేలీయులందరు ఎర్ర సముద్రం ఒడ్డున ఒక విజయగీతం పాడారు (నిర్గమకాండము 15). దేవుడు కనానీయులను వారి చేతుల్లోకి అప్పగించిన తర్వాత దెబోరా, బారాకు విజయగీతాన్ని పాడారు (న్యాయాధిపతులు 5). హన్నా కొడుకునుబట్టి దేవునిని కీర్తించియున్నది (1 సమూయేలు 2). దావీదు తన జీవితంలోని దాదాపు ప్రతి సందర్భానికీ పాటలు వ్రాసాడు. యేసు ఆయన శిష్యులు ఆయన మరణానికి ముందు ఆయన చివరి ఘడియలలో కలిసి కీర్తనలు పాడారు (మత్తయి 26:30). పౌలు మరియు సీలలు ఫిలిప్పీ జైలులో దేవునికి కీర్తనలు పాడారు (అపొస్తలుల కార్యములు 16:25). నిత్యత్వమంతా దేవుని ప్రజలు “ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి” అని పాడుదురు (ప్రకటన 15:3).
సంగీతం దేవుడు తన ప్రజలకు ఇచ్చిన విలువైన బహుమతి. క్రైస్తవులు తమ రక్షకుని పట్ల తమకున్న ప్రేమను వ్యక్తపరచడానికి క్రమం తప్పకుండా కీర్తనలు పాడుతూ వుంటారు. సంతోషకరమైన మన ప్రతిస్పందనే కీర్తనలు. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి అని (కొలస్సీ 3:16) చెప్తూవుంది. కీర్తనల గ్రంధము బైబిల్ యొక్క కీర్తన పుస్తకం, ఇది దేవుని ప్రేరణ ద్వారా మన కొరకు ఇవ్వబడిన కీర్తనల పుస్తకం.
కీర్తనల గ్రంధము బైబిల్లో అతి పెద్దది మరియు అత్యంత విస్తృతంగా ఉపయోగించే పుస్తకం. ఈ గ్రంధములో ఉన్న 150 కీర్తనలలో సృష్టి, పితరులు, దైవపరిపాలన, రాచరికం, చెర మరియు ప్రవాస కాలాలకు సంబందిం చినవి వున్నాయి. కీర్తనలు ఆనందం, యుద్ధం, శాంతి, ఆరాధన, తీర్పు, మెస్సయానిక్ ప్రవచనాలు, స్త్రోత్రములు మరియు విలాపం వంటి విభిన్న అంశాలను కలిగి వున్నాయి. కీర్తనలు తంతి వాద్యముల సహకారంతో సెట్ చేయబడ్డాయి మరియు యూదు ప్రజలకు ఆలయ శ్లోక పుస్తకంగా మరియు భక్తికి మార్గదర్శిగా పనిచేశాయి. కీర్తనల పుస్తకం ఒక ప్రార్థన పుస్తకం కూడా. ఎలా ప్రార్థించాలో తెలియని వారికి తెలుపుట కొరకు ఇది వ్రాయబడింది (రోమా 8:26).
బైబిల్లోని ఇతర పుస్తకాల కంటే చాలా ఎక్కువ అధ్యాయాలను కలిగి ఉన్న గ్రంధము కీర్తనలు, బైబిల్ సిద్ధాంతానికి గొప్ప మూలం. పాపం, పశ్చాత్తాపం మరియు క్షమాపణ (కీర్తన 51), దేవుని గుణాలు (కీర్తన 139), మరియు దేవుని సృష్టి మరియు ప్రొవిడెన్స్ (కీర్తన 104) వంటి విభిన్న అంశాల గురించి ఇది మనకు బోధిస్తూవుంది. కీర్తనలలో అత్యంత ముఖ్యమైన అంశం, మెస్సియానిక్ ప్రవచనాలలో సమర్పించబడిన మన రక్షకుడైన క్రీస్తు. కీర్తనల గ్రంధం ఇతర పుస్తకాల కంటే కొత్త నిబంధనపై ఎక్కువ ప్రభావం చూపుతూవుంది. ఇది కొత్త నిబంధనలో దాదాపు 80 సార్లు కోట్ చెయ్యబడింది. 150 కీర్తనలలో 120 కొత్త నిబంధనలో ఏదో ఒక విధంగా ప్రతిబింబిస్తువున్నాయి. కీర్తనల అధ్యయనం కొత్త నిబంధనను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సహాయపడుతుందని స్పష్టంగా చెప్పొచ్చు.
ఈ గ్రంధానికి కీర్తనలు అను పేరు ఎలా వచ్చింది? కీర్తనల పుస్తకం 150 కీర్తనల సమాహారం. కీర్తనలకు సాంప్రదాయ హీబ్రూ టైటిల్ “తెహిల్లిం” అంటే స్త్రోత్రములు అను హీబ్రూ పేరు ఇవ్వబడినది. ప్రార్ధనలు అని అర్ధమిచ్చు “తెఫిల్లత్” అను హెబ్రీయనామము కూడా ఈ పుస్తకానికి ఇవ్వబడినది (145వ కీర్తన శీర్షికను చూడండి). ఆంగ్ల శీర్షిక Psalms అను పేరు పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదం సెప్ట్టుజెంట్ నుండి వచ్చింది. వీణ, పిల్లనగ్రోవితో మరియు తంతివాద్యములతో పాడతగినవి అని అది సూచిస్తూ వుంది. నిజానికి ఈ పుస్తకంలో చేర్చబడిన మొదటి సేకరణలలో ఒకటి యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు అను 72:20 పేరుతో ఉన్నది.
కీర్తనలు సందర్భాలకు ఆరాధనలకు ఒక ఐశ్వర్యవంతమైన ఖజానా. వీటి సబ్జెక్టు మేటర్ అమరికను బట్టి ఇది విశ్వాసులకు విశ్వాసములో శిక్షణను ఇచ్చు ఒక పుస్తకంగా మరియు సంపూర్ణ దైవభక్తిలో విశ్వాస జీవితానికి అనుగుణంగా ధర్మశాస్త్రములో, ప్రవక్తలు మరియు లేఖనాలలో విశ్వాసులను నిర్ధేశించుటకు ఒక గైడ్ గా వుంది. మొదటి శతాబ్దపు AD నాటికి ఇది కీర్తనల పుస్తకంగా సూచించబడింది (లూకా 20:42; అపొస్తలుల కార్యములు 1:20). ఆ సమయంలో కీర్తనలు హీబ్రూ OT కానన్ యొక్క మొత్తం విభాగానికి శీర్షికగా ఉపయోగించ బడినట్లు కనిపిస్తుంది, (అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను), లూకా 24:44).
శీర్షిక: ప్రతి కీర్తన యొక్క శీర్షికలోని విషయాలు మారుతూ, అవి, 1. రచయిత 2. సందర్భము 3. సేకరణ 4. కీర్తన రాగము 5. కీర్తన ఉపయోగము 6. సంగీత సంజ్ఞామానాలు 7. ప్రార్ధనా సంజ్ఞామానాలు 8. కూర్పు కోసం సంక్షిప్త సూచనలను తెలియజేస్తూ వున్నాయి. కీర్తనలలో విభిన్నమైన శీర్షికలలో : కీర్తన (6); వీణనాదసహిత గీతము (7); కావ్యము (16); ప్రార్ధన (17); గీతవాక్యము (18); గృహప్రతిష్టాపనగానము (30); దైవధ్యానము(32); జ్ఞాపకార్థమైన కీర్తన (38); ప్రేమనుగూర్చిన గీతము (45); అనుపద గీతము (56); జ్ఞాపకార్థమైన కీర్తన (70); మోషేచేసిన ప్రార్థన (90); విశ్రాంతిదినమునకు తగిన కీర్తన (92); స్తుత్యర్పణ కీర్తన (100); మొఱ్ఱ (102); యాత్రకీర్తన (121); స్తుతికీర్తనగా (145) పేర్కొనబడి ఉండటం మనం చూడొచ్చు. సుమారు 25 ఎందుకని వర్గీకరించబడలేదో అర్ధం చేసుకోవడంలో మనం విఫలం అవుతూవున్నాం.
కీర్తనలను ఐదు ప్రధాన భాగాలుగా విభజించవచ్చని లూథర్ సూచించాడు: (1) క్రీస్తు గురించి మాట్లాడే మెస్సియానిక్ కీర్తనలు (కీర్తనలు 2, 22, 110); (2) సిద్ధాంతాన్ని వక్కాణించే కీర్తనలు (కీర్తనలు 1, 139); (3) ఓదార్పు కీర్తనలు (కీర్తనలు 4, 37, 91); (4) ప్రార్థన మరియు వినతి కీర్తనలు (కీర్తనలు 3, 137, 143); (5) థాంక్స్ గివింగ్ కీర్తనలు (కీర్తనలు 103, 104, 136).
రచయిత: చాలా కీర్తనలకు రచయితను గురించి క్లుప్త పరిచయం, కీర్తన ఎవరిని ఉద్దేశించి లేక ఎవరి కోసం వ్రాసినది, ముఖ్యంశాము ఏమిటి అనే దానిని మొదట్లోనే వ్రాయడం జరిగింది. పరిచయ మాటలను బట్టి దావీదు 75 కీర్తనలను (3-9; 11-32; 34-41; 51-65; 68-70; 86; 101; 103; 108-110; 122; 124; 131; 133; 138-145); మరియు అపొస్తలుల కార్యములు 4:25, హెబ్రీయులకు 4:6,7; కీర్తన 2 మరియు 95 కూడా దావీదుచే వ్రాయబడియున్నవని తెలియజేస్తూ వున్నాయి. ఆసాపు 12 కీర్తనలను (50;73-83, ఎజ్య్రా 2:41) సొలొమోను 2 కీర్తనలను (72; 127), మోషే 1 కీర్తనను (90), ఏతానులు (89; 1 రాజులు 4:31; 1 దినవృత్తాంతములు 15:19), ఒక్కొక్క కీర్తనను, కోరహు కుమారులు 10 కీర్తనలను (42; 44-49; 84; 85; 87; (సంఖ్యాకాండము 26:9-11), హేమాను 1 కీర్తనను (88) 1 రాజులు 4:31; 1 దినవృత్తాంతములు 15:19) వ్రాసినట్లు తెలుస్తుంది. మిగిలిన 50 కీర్తనలను ఎవరు వ్రాసినట్లు సూచించలేదు. వీటిని దావీదే వ్రాసియుండొచ్చు. అనామక కీర్తనలు 1, 10, 33, 43, 66, 67, 71, 91-94, 96-100, 102, 104-107, 111-121, 123, 125, 126, 128-130, 132, 134-137, 146-150. కొందరు అనామక కీర్తనలలో కొన్నింటిని ఎజ్రా నెహెమ్యాలకు ఆపాదిస్తూ వుంటారు.
కాలము: కీర్తనలు మోషే (1410 BC) నుండి ఎజ్రా మరియు నెహెమ్యా (430 BC) ఉన్న చెర అనంతర సమాజం వరకు విస్తృత కాల వ్యవధిని కవర్ చేస్తూవున్నాయి. వాటి విస్తృత కాలవ్యవధి మరియు నేపథ్య పరిధి కారణంగా, కీర్తనలు అనేక పరిస్థితులలో విభిన్న ప్రేక్షకులకు వ్రాయబడ్డాయి. అందువల్ల అవి అనేక రకాల మనోభావాలను ప్రతిబింబిస్తూ ప్రతి పాఠకుడికి సంబంధించినవిగా ఉన్నాయి.
విభాగాలు: బైబిల్లో కీర్తనలు ఐదు స్కంధములుగా విభజించబడ్డాయి; 1-41; 42-72; 73-89; 90-106; 107-150. ఈ విభజన పంచకాండాలను అనుకరించినదై ఉండొచ్చు.
ప్రధమ స్కంధము (1-41): ఈ స్కంధములో చేర్చబడడానికి ప్రాథమిక ప్రమాణం దావీదు కీర్తనలై ఉండటం. వీటిలో చాలా కీర్తనలు సంగీత దర్శకుడికి సమర్పించబడినందున, ఈ స్కంధము గుడారం మరియు ఆలయంలో ఉపయోగించడానికి ఉద్దేశించిన దావీదు కీర్తనల సమాహారంగా ఉద్భవించిందని తెలుస్తోంది. ఒడంబడిక టైటిల్ “లార్డ్” ఈ స్కంధములో ప్రత్యేకంగా ఉపయోగించబడియున్నది.
ద్వితీయ స్కంధము (42-72): ఇది “యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనల ముగింపు” అనే పదాలతో ముగుస్తుంది. దావీదు కీర్తనలతో పాటు, ఈ స్కంధములో కోరహు కుమారుల కీర్తనలు, ఆసాఫ్ రాసిన ఒక కీర్తన మరియు సొలొమోను కీర్తన ఉన్నాయి. బహుశా ఈ పుస్తకం దావీదు మరియు అతని సంగీత విద్వాంసుల కీర్తనల సమాహారం, సొలొమోను ఆలయాన్ని నిర్మించడం ద్వారా ప్రేరేపించబడి ఉండవచ్చు. 1, 2 స్కంధములు కీర్తనల గ్రంధానికి ప్రాథమిక మూలము అని తెలుస్తోంది. ఈ స్కంధము యొక్క అమరికను నియంత్రించే సూత్రం ఏదీ లేదు. ఈ స్కంధములో అనేక కీర్తనల సమూహాలు ఉన్నాయి, ఉదాహరణకు, మాస్కిల్ సమూహం (కీర్తన 52–55), మిక్తం సమూహం (కీర్తన 56– 60), మరియు పాటల సమూహం (కీర్తన 66–68). కీర్తనలు 52 నుండి 59 వరకు సౌలు నుండి దావీదు పారిపోయిన సంఘటనలకు ప్రాధాన్యత ఇచ్చిన కీర్తనలు. ఈ స్కంధములో లార్డ్ అనే పేరు కంటే “దేవుడు” అనే పేరు ప్రత్యేకంగా ఉపయోగించబడియున్నది.
మూడవ స్కంధము (73-89): ఈ స్కంధము యొక్క ప్రధాన ప్రమాణం ఆసాఫ్ లేదా కోరహ్ కుమారులు రచయితలై ఉండటం. ఇందులో ఒకేఒక్క దావీదు కీర్తన మాత్రమే కనిపిస్తుంది (కీర్తన 86). ఈ స్కంధములో ఆసాఫ్ సమూహంలో దేవుడు అనే పేరు ప్రబలంగా ఉంది (కీర్తనలు 73-83), కాని కోరహ్ (కీర్తనలు 84-88) కుమారుల కీర్తనలలో లార్డ్ అనే పేరు ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ కీర్తనలలో ఇశ్రాయేలు, యెరూషలేము మరియు దేవాలయం యొక్క సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబడుతూ ఉంటుంది.
నాల్గవ స్కంధము (90-106): ఈ స్కంధములో రెండు కీర్తనలు మాత్రమే దావీదుకు నేరుగా ఆపాదించబడ్డాయి (కీర్తనలు 101, 103), కాని మిగతావి కూడా అతనివే కావచ్చు. ఈ కీర్తనలలో ప్రత్యేకంగా లార్డ్ అనే దైవిక నామము ఉపయోగించబడియున్నది. చివరి రెండు స్కంధములు స్త్రోత్తములు మరియు కృతజ్ఞతలు అనే అంశాల చుట్టూ అమర్చబడివున్నాయి. ఈ స్కంధము లోని 94 నుండి 100 వరకు ఉన్న కీర్తనలు, ఇవి ప్రభువు పాలనను నొక్కి చెప్తూవున్నాయి మరియు 103 నుండి 106 వరకు ఉన్న కీర్తనలు, సృష్టికర్త మరియు సంరక్షకునిగా ఆయన పనిని నొక్కి చెప్తూవున్నాయి.
ఐదవ స్కంధము (107-150): ఈ స్కంధములో దావీదుకు చెందిన రెండు బ్లాక్‌ల కీర్తనలు వున్నాయి. అట్లే ఈ స్కంధములో దావీదు కీర్తనలు అక్కడక్కడా వున్నాయి, ఇలా ఉండటానికి కారణం రచయితత్వం కంటే కృతజ్ఞతలు మరియు స్త్రోత్తం అనే ఇతివృత్తాల చుట్టూ కీర్తనలు ఏర్పాటు చేయబడి వుండటమే. ఈ స్కంధములో లార్డ్ అనే పేరుకు బలమైన ప్రాధాన్యత ఉంది. స్తుతి కీర్తనలు (111–118 మరియు 145–150) మరియు యాత్ర కీర్తనలు ( 120–134).
కీర్తనలలో సంగీత డైరెక్షన్స్ : యాభై-ఐదు కీర్తనలు “సంగీత దర్శకుని కొరకు” అనే శీర్షికను కలిగి ఉన్నాయి. ఈ శీర్షిక ప్రత్యక్ష గుడారపు ముఖ్యునికి లేదా ఆలయ సంగీత విద్వాంసులకు ప్రజాసేవలో ఉపయోగించేందుకు అప్పగించబడిన కీర్తనలు ఇవి అని తెలియజేస్తూవుంది. (ఈ అభ్యాసానికి ఉదాహరణను 1దినవృత్తాంతములు 16:7-37లో మనం చూడొచ్చు: ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువుల చేతికిని దానిని (ఈ కీర్తనను) అప్పగించెను. కీర్తనల మొదటి మూడు స్కంధాలలో ఈ శీర్షిక అత్యంత ప్రముఖమైనది.
కొన్ని కీర్తన శీర్షికలు ఆ కీర్తన రాగాన్ని కూడా తెలియజేస్తూవున్నాయి_ అల్ తష్హేతు అను రాగముమీద పాడదగినవి (కీర్తనలు 57–59, 75), యోనతేలెమ్ రెహోకీమ్ అను రాగముమీద పాడదగినది (కీర్తన 56), షోషనీయులను అను రాగముమీద పాడదగినవి (కీర్తనలు 45, 69), షూషనేదూతు అను రాగముమీద పాడదగినవి (కీర్తనలు 60, 80), ముత్లబ్బేను అను రాగముమీద పాడదగినది (కీర్తన 9), అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది (కీర్తన 22). మాహలతు అను రాగముమీద పాడదగినది (కీర్తన 53) మహలతు లయన్నోత్ అను రాగముమీద పాడదగినది (కీర్తన 88), ఈ రాగము దుఃఖకరమైన శ్రావ్యతకు సూచన కావచ్చు. అనారోగ్యం లేదా బాధలలో ఆలపించేవారు. గిత్తీత్ అను రాగముమీద పాడదగినవి (కీర్తనలు 8, 81, 84) మరొక కష్టమైన పదబంధం ఇది. ఇది ఫిలిష్తీన్ నగరం గాత్ లేదా లెవిటికల్ నగరం గాత్ రిమ్మోన్ నుండి తీసుకురాబడిన వాయిద్యం లేదా ఆ నగరాలకు చెందిన ఒక రాగాన్ని ఇది సూచిస్తూవుంది లేదా ఆనాడు ద్రాక్ష కోతలో వాడే ఒక రాగాన్ని సూచిస్తూ ఉండొచ్చు (గాత్ అంటే “వైన్ ప్రెస్”). అలామోతు అను రాగముమీద పాడదగినది (కీర్తన 46). ఇది తరచుగా హై పిచ్ వాయిస్ ని గాని లేదా ఒక ప్రత్యేకమైన వాయిద్యానికి సూచనగా అర్థం చేసుకోబడుతుంది, బహుశా ఒక విధమైన డబుల్ వేణువు. ఇది టేనోర్ వాయిస్‌ని (ఏక పురుషుడు హై పిచ్‌లో పాడటాన్ని) లేదా ఫాల్సెట్టో వాయిస్‌ని (పురుషుల సమూహము హై పిచ్‌లో పాడటాన్ని) సూచిస్తువుండొచ్చు. 1 దినవృత్తాంతములు 15:20లో ఈ పదం నెబెల్ అని పిలువబడే హార్ప్ లాంటి తీగ వాయిద్యాన్ని వాయించడాన్ని లేదా ట్యూన్ చేసే విధానాన్ని సూచిస్తూవుండొచ్చు, (హెచ్చు స్వరముగల స్వరమండలము లను). అలామోతు యొక్క అర్థం అస్పష్టంగానే ఉంది. అష్టమశృతి మీద తంతివాద్యములతో పాడదగినవి (కీర్తనలు 6, 12). ఇది ఎనిమిది అనే హీబ్రూ పదం నుండి ఉద్భవించినట్లు అనిపిస్తుంది. ఇది ఎనిమిది తీగల వాయిద్యం లేదా బహుశా తక్కువ అష్టపది లేదా బేస్ వాయిస్‌ని సూచిస్తూవుండొచ్చు. 1 దినవృత్తాంతములు 15:21లో ఈ పదం కిన్నర్ అనే తీగ వాయిద్యాన్ని ప్లే చేయడాన్ని లేదా ట్యూన్ చేసే విధానాన్ని సూచిస్తూ వుండొచ్చు (సితారా). దీని అర్థం కూడా అస్పష్టంగానే ఉంది. యెదూతూను దావీదు సంగీతకారులలో ఒకడు (1 దినవృత్తాంతములు 16:41). ప్రధానగాయకుడైన యెదూతూనునకు (కీర్తన 39) పాడుట కోసం అతనికి అప్పగింపబడిన పాటను ఇది సూచిస్తూవుంది. యెదూతూను అను రాగముమీద పాడదగినవి (కీర్తనలు 62, 77) అంటే యెదూతూను రాగం లేదా యెదూతూను శైలిలో పాడటం కావొచ్చు.
సెలా అనే పదం మొదటి మూడు స్కంధాలలో 39 వేర్వేరు కీర్తనలలో 71 సార్లు కనిపిస్తుంది. ఇది సంగీత సంజ్ఞామానం. కొన్నిసార్లు ఇది అక్కడ ఉన్న థాట్ ప్రాసెసింగ్ లో పదునైన విరామం ఉన్న చోట కనిపిస్తుంది, కొన్నిసార్లు ఇది థాట్ ప్రాసెసింగ్ మధ్యలో కనిపిస్తుంది. అరుదైన సందర్భాల్లో ఇది కీర్తన చివరిలో కనిపిస్తుంది. స్పష్టంగా ఇది సంగీత సంజ్ఞామానం, కాని దాని అర్థం అస్పష్టంగానే ఉంది. ఇది “ఆరోహణం” లేదా “నిశ్శబ్దంగా ఉండండి” అనే ఒక అర్థం నుండి (హీబ్రూ పదం నుండి) ఉద్భవించిందని కొందరు నమ్ముతారు. చెప్పబడిన వాటిలో (1) కీర్తనలోని స్వర విభాగాల మధ్య వాయిద్య అంతరాయాన్ని తెలియజేయుటకు కావొచ్చు (2) విరామం కావొచ్చు (3) సంగీతం బిగ్గరగా పెంచమని చెప్పడం కావొచ్చు (4) కీర్తనను విభాగాలుగా విభజించే సంకేతం కావొచ్చు (5) “ఆమేన్” అని చెప్పమని చెప్పడం కావొచ్చు (6) పునరావృతాన్ని ఉద్ఘటించమని చెప్పే సంకేతం కావొచ్చు. ఇది క్లుప్తమైన సంగీత విరామానికి సాధారణ సూచన అని చెప్పడం ఆమోదయోగ్యము.
కొన్ని కీర్తన శీర్షికలు ఆ కీర్తన రాగాన్ని పాడుతున్నప్పుడు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలో కూడా తెలియజేస్తూ వున్నాయి_ తంతివాద్యములతో పాడదగినవి (4,6,54,55,61,67,76); పిల్లనగ్రోవితో పాడదగి నవి (5); వీణనాదసహిత గీతము (7).
కీర్తనల సంగీత వాయిద్యాలు: మందిరములో జరిగే బహిరంగ ఆరాధనలో, కీర్తనలు పాడడంతోపాటు సంగీత వాద్యములు కూడా ఉపయోగించ బడెడివి. మందసాన్ని యెరూషలేముకు తీసుకువచ్చినప్పుడు, దావీదు యొక్క ఆర్కెస్ట్రాలో 3 తాళాలు మరియు 14 తీగ వాయిద్యాలు ఉన్నాయి (1 దినవృత్తాంతములు 15:19-21), పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింప బడిరి. జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింప బడిరి. దావీదు ఆలయ సంగీతకారుల సంఖ్య నాలుగు వేలమంది (1 దినవృత్తాంతములు 23:5, నాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి). 1దినవృత్తాంతములు అధ్యాయం 25లో ఒక్కొక్కరు 12 మంది సంగీతకారులతో కూడిన 24 గ్రూపులను దావీదు నియమించడంపై ఈ నియంత్రణ స్పష్టంగా ఆధారపడి ఉంది.
సొలొమోను ఆలయ ప్రతిష్టలో, 120బూరలు ఉపయోగించబడ్డాయి (2 దినవృత్తాంతములు 5:13), ఇదిచాలా ప్రత్యేకమైన సందర్భం, దీని కోసం పెద్ద సంఖ్యలో సంగీతకారులు ఉపయోగించబడ్డారు. ఆర్కెస్ట్రా యొక్క ఖచ్చితమైన కూర్పు చరిత్ర యొక్క సందర్భం మరియు కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, అయితే తంతి వాయిద్యములు, వీణలు మరియు తాళాలు ఆలయ ఆర్కెస్ట్రా యొక్క ప్రధాన వాయిద్యాలుగా కనిపిస్తాయి. 1 దినవృత్తాంతములు 15:16 అంతట దావీదు–మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండల ములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వనిచేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞఇచ్చెను. 2 దినవృత్తాంతములు 5:12,13 ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైన వారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి; వారితోకూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాటకులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళముల తోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. సగటు ఆర్కెస్ట్రా బహుశా 12 నుండి 36 వాయిద్యాలను కలిగి ఉంటుంది. స్పష్టంగా, ఇతర రకాల వాయిద్యాలు ప్రధానంగా ఆలయ పూజల వెలుపల, ప్రధానంగా పండుగ ఊరేగింపుల కోసం ఉపయోగించబడ్డాయి. కీర్తనలకు తోడుగా ఉపయోగించే వాయిద్యాల గురించి మనకున్న జ్ఞానం పరిమితం అని చెప్పొచ్చు.
కీర్తనలను అన్వయించేటప్పుడు గుర్తుంచుకోవలసిన నాలుగు విషయాలు: (1) కీర్తన శీర్షిక. ఆ కీర్తన యొక్క చారిత్రక సంఘటనను పేర్కొన్నప్పుడు, కీర్తనను ఆ సందర్భములో అర్థం చేసుకొనుటకు ప్రయత్నించాలి. (2) కొన్ని కీర్తనలు ఇజ్రాయెల్ ఆరాధన యొక్క ఖచ్చితమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఆ కీర్తనలను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. (3) అనేక కీర్తనలు ఖచ్చితమైన నిర్మాణం మరియు మూలాంశాలను గురించి మాట్లాడుతూవున్నాయి. అవి మాట్లాడుతూవున్న రీతిగా అందులోని మూలాంశములను అర్ధం చేసుకోవలసి వున్నాము. (4) అనేక కీర్తనలు ఇజ్రాయెల్ మెస్సీయను గురించి మాట్లాడుతూ వున్నాయి, ఆ ప్రవచనాలు క్రీస్తులో నెరవేరుతాయి. అయితే వాటిని ఉపమానం చేయకుండా మరియు వ్యాకరణ చారిత్రక వివరణ పద్ధతిని మరచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మెస్సియానిక్ కీర్తనలు: మెస్సియానిక్ కీర్తనలు క్రీస్తు పని మరియు రాజ్యం గురించిన ముఖ్యమైన వాస్తవాలను తెలియ జేస్తున్నాయి. పాత నిబంధనలో రాబోయే క్రీస్తు గురించి మూడు రకాల ప్రవచనాలు ఉన్నాయి.
అందు మొదటిది Directly messianic ప్రత్యక్ష ప్రవచనాలు అంటే ప్రవక్త క్రీస్తు గురించి మాత్రమే ప్రవచించిన ప్రవచనాలు. ప్రత్యక్ష ప్రవచనానికి ఉదాహరణ యెషయా 7:14: “కన్యక గర్భవతియై కుమారుని కనును”. ఇది క్రీస్తు జీవితంలో మాత్రమే నెరవేరే ఒక ప్రత్యేకమైన సంఘటన. కీర్తనలలోని ప్రత్యక్ష ప్రవచనానికి ఉదాహరణ కీర్తన 16:10: “నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు”. ఇక్కడ దావీదు తన గురించి మాట్లాడటం లేదు, అతడు మరణించాడు, ఖననం చేయబడ్డాడు, ఈ రోజు వరకు సమాధిలో ఉన్నాడు. అతడు క్రీస్తు పునరుత్థానాన్ని గూర్చి ప్రవచించాడు. Indirectly messianic పరోక్షంగా మెస్సియానిక్. కూర్పు సమయంలో కీర్తన సాధారణంగా ఒక రాజు లేదా డేవిడ్ ఇంటిని సూచిస్తుంది, కానీ క్రీస్తులో చివరి నెరవేర్పు కోసం వేచి ఉంది (2,45,72).
రెండవ రకమైన మెస్సియానిక్ ప్రవచనం, Typical messianic టైపికల్ మెస్సియానిక్. కీర్తనలోని సబ్జెక్టు క్రీస్తు కు సంబంధించినదై ఉంటుంది (34:20; 69:4,9). Typical prophecy టైపికల్ ప్రొఫసీ. ఈ విలక్షణమైన ప్రవచనంలో, కీర్తనకర్త తన ప్రస్తుత అనుభవాన్ని గురించి వ్రాస్తాడు కాని అది క్రీస్తులో మాత్రమే చారిత్రాత్మకం గా నిజం అవుతుంది (22). ఉదాహరణకు, దావీదును అహీతోపెలు అనే స్నేహితుడు మోసం చేశాడు, అతడు ఆత్మహత్య చేసుకున్నాడు (2 సమూయేలు 17:23). కీర్తన 41:9లో నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను అని దావీదు వ్రాసినప్పుడు, అతడు తన గురించి మరియు క్రీస్తు అనుభవించిన అలాంటి ద్రోహం గురించి వ్రాస్తూ వున్నాడు (యోహాను 13:18).
మూడవ రకం మధ్యంతర నెరవేర్పుతో కూడిన మెస్సియానిక్ ప్రవచనాలు prophecy with an intermediate fulfillment or Enthronement. Yahwah రాకడ మరియు ఆయన రాజ్యం యొక్క పరిపూర్ణతను ప్రవచిస్తుంది, ఇది క్రీస్తులో నెరవేరుతుంది. ఈ ప్రవచనాలలో ప్రవచించిన వారు రెండు భవిష్యత్ సంఘటనల గురించి ప్రవచిస్తారు: భవిష్యవాణి యొక్క పాక్షిక, అసంపూర్ణ నెరవేర్పు మరియు క్రీస్తు ద్వారా పూర్తి చేయబడు సంపూర్ణ నెరవేర్పును గురించి ప్రవచిస్తారు. ఉదాహరణకు, 2సమూయేలు 7:1–16లో దేవుడు దావీదుకు తన తర్వాత పరిపాలించే కుమారుడు ఉంటాడని మరియు అతడు దేవుని మందిరాన్ని నిర్మిస్తాడని చెప్పాడు. యెరూషలేములో ఆలయాన్ని నిర్మించిన సొలొమోను ద్వారా ఇది పాక్షికంగా, మధ్యస్థంగా నెరవేరింది. శాశ్వతంగా పరిపాలించే క్రీస్తులో ఈ ప్రవచనం సంపూర్ణముగా నెరవేరింది.
కీర్తనలలోని మెస్సియానిక్ ప్రవచనాలు క్రొత్త నిబంధనలో కోట్ చెయ్యబడి ఉండటం మూలన్న మనం వీటిని సులభముగా మెస్సియానిక్ ప్రవచనాలుగా గుర్తించగలం. కొందరు కొన్ని మెస్సియానిక్ ప్రవచనాలు కొత్త నిబంధనలో కోట్ చేయబడలేదు అలా అని వీటిని మెస్సియానిక్ ప్రవచనాలు కాదందామా అని ప్రశ్నిస్తూ, నిర్దిష్ట పాత నిబంధన భాగాలలో వివరించిన సంఘటనలు మరియు క్రీస్తు జీవితంలోని సంఘటనల మధ్య అనురూప్యతను గమనించి కీర్తనలలో కొన్ని భాగాలను మెస్సియానిక్ ప్రవచనాలుగా వాళ్ళు పేర్కొంటారు. స్క్రిప్చర్ ద్వారా గుర్తించబడని మెస్సియానిక్ ప్రవచనాలను ఎలా గుర్తించగలం? ఒక కీర్తన మానవ శక్తికి మించిన లక్షణాలు మరియు పనులు ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతువున్నట్లయితే, అది మెస్సియానిక్ ప్రవచనం అని చెప్పొచ్చు అనేది వారి ఉదేశ్యము. ఉదాహరణకు, 72వ కీర్తనలోని రాజు సాధించిన విజయాలు ఇశ్రాయేలులోని ఏ మానవ రాజుచే సాధించలేనివి. “అభిషిక్తుడు” వంటి మెస్సీయ అనే బిరుదును పొందడం మెస్సీయ కీర్తనకు సంబంధించిన మరో సూచన. యూదులు ఈ మెస్సియానిక్ కీర్తనలను ఇశ్రాయేలు రాజులను మాత్రమే సూచించే “రాయల్ కీర్తనలుగా’ పరిగణించారు, తప్పుగా అర్ధం చేసుకొన్నారు, కాబట్టే వాళ్ళు క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని నేరుగా వ్యతిరేకిస్తున్నారు అనేది వారి వాదన. అందుకు మద్దతుగా, లూకా 24:44 కోట్ చేస్తారు, (అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను). అట్లే యేసు పాత నిబంధన గురించి మాట్లాడుతూ, లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అను యోహాను 5:39 కోట్ చేస్తారు.
క్రీస్తుకు సాక్ష్యంగా మెస్సియానిక్ కీర్తనలు గొప్ప విలువను కలిగి ఉన్నాయి. కేవలం నాలుగు సువార్తలు మరియు యెషయా మాత్రమే కీర్తనల కంటే ఎక్కువగా, మన రక్షకునిగా తన పనిని పూర్తి చేస్తూ క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ఆయన ఫీలింగ్స్, మాటలు మరియు క్రియల గురించిన సమాచారాన్ని అందిస్తూవున్నాయి. మెస్సియానిక్ కీర్తనలు పాత నిబంధన విశ్వాసులకు బలం మరియు ప్రోత్సాహానికి మూలంగా ఉన్నాయి మరియు అవి నేటికీ మనకు అలాగే ఉన్నాయి.
కీర్తనలలో క్రీస్తు: కీర్తనలు వ్రాయబడక ముందు, పాత నిబంధన విశ్వాసులకు రాబోయే రక్షకుని గురించి కొన్ని వివరాలు అందించబడ్డాయి. ఆదాము హవ్వలు సాతాను తలను నలగగొట్టడానికి స్త్రీ వంశస్థుడు వస్తాడని తెలుసుకున్నారు (ఆదికాండము 3:15, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను). తరువాతి ప్రవచనాలు రక్షకుడు షేము, అబ్రాహాము మరియు యూదా వారసులకు వచ్చింది (ఆదికాండము 9:26; 12:3; 49:8-10). దేవుడు తనలాంటి ప్రత్యేక ప్రవక్తను ఇశ్రాయేలు కొరకు లేపుతాడని మోషే ప్రవచించాడు (ద్వితీయోపదేశకాండము 18:15). ఇశ్రాయేలు శత్రువులను ఓడించడానికి యాకోబు నుండి నక్షత్రంలా ఉదయించే పాలకుడి గురించి బిలాము మాట్లాడాడు (సంఖ్యాకాండము 24:17). ఇశ్రాయేలీయులకు కీర్తనలు వ్రాయడానికి ముందు మెస్సీయ గురించి తెలుసు ఆయన వస్తాడని వాళ్ళు విశ్వసించారు, కాని వారికి ఆయనను గురించి కొన్ని వివరాలు మాత్రమే తెలుసు.
కీర్తనలు మెస్సియానిక్ ప్రవచనాల విషయములో ఒక ప్రధాన ముందడుగు. ప్రవక్తయైన నాతాను మెస్సియానిక్ రాజు దావీదు వారసుడని వెల్లడించాడు (2 సమూయేలు 7). కీర్తనలలో దావీదు తన గొప్ప వారసుడి గురించిన అనేక విషయాలను వెల్లడించే ఆధిక్యతను పొందాడు. మెస్సీయ, దావీదు వంశస్థుడు అయినప్పటికి, ఆయన నిజమైన దేవుడే (కీర్తనలు 2:7; 45:6; 110:1). ఆయన పాలన శాశ్వతమైనదని అంతటను ఉంటుందని (కీర్తన 72, 2, 89); నిజమైన మనిషిగా ఆయన పాపం ద్వారా ఆదాము కోల్పోయిన భూమిపై పూర్తి ఆధిపత్యాన్ని తిరిగి సంపాదిస్తాడని (కీర్తన 8) తెలియజేయబడింది; అయితే, మెస్సీయ కూడా పాపం కోసం శ్రమపడాల్సి వుంది. ఈ శ్రమలను గురించి 22, 69 కీర్తనలలో ప్రవచింపబడియున్నది; ఆయన ఇశ్రాయేలు నాయకులచే తిరస్కరించబడతాడని (కీర్తన 118:22); శ్రమలలో ఆయన అపహసింపబడతాడని (22:7); మెస్సీయకు అతని స్నేహితుడు ద్రోహం చేస్తాడని (41:9); ఆయన శ్రమల సమయంలో ఆయన కాళ్ళుచేతులు పొడవబడతాయని (22:16); ఆయనకు త్రాగడానికి చిరక ఇవ్వబడుతుందని (69:21); ఆయన అంగీకొరకు చీట్లు వేయుదురని (22:18); ఆయన దేవునిచే విడిచిపెట్టబడ్డాడనే బాధను అనుభవించినప్పటికి, ఆయన ఉన్నతంగా ఉంటాడని (కీర్తన 22); ఆయన మృతులలో నుండి లేస్తాడని (16:10); ఆయన యాజకుడిగా మరియు రాజుగా శాశ్వతంగా పరిపాలిస్తాడనే (కీర్తన 110) అనేకమైన ప్రవచనాలు ప్రవచింపబడివున్నాయి. మెస్సయ్య యొక్క ప్రాముఖ్యతను కీర్తనలు బయలుపరుస్తూ అందరిని ప్రోత్సహిస్తూ వున్నాయి.
కీర్తనలలో ప్రాముఖ్యమైన మాట ఆరాధన: కీర్తనల పుస్తకం యొక్క ప్రధాన ఇతివృత్తం ఆరాధన – దేవుడు ఎవరు, ఆయన ఏమి చేసాడు, ఆయన ఏమి చేస్తాడు అనే వాటిని జ్జ్యపాకం చేసుకొంటూ ఆయనను స్తుతించడం. ఆయన మంచితనం అన్ని సమయాలలో ఆయన శాశ్వతత్వం ద్వారా విస్తరించి ఉంటుంది. కీర్తనలు వ్యక్తుల వ్యక్తిగత ప్రతిస్పందనలను దేవునికి అందజేస్తూవున్నాయి, అవి ఆయన ప్రజల కోసం ఆయన పనులను ప్రతిబింబిస్తూవున్నాయి. అతని కార్యములు నెరవేరాలని ఆయన పేరు కీర్తించబడాలనే ఆశను కీర్తనలు వ్యక్తీకరిస్తూ ఉండటాన్ని గమనించవచ్చు. అనేక కీర్తనలు ముఖ్యంగా కష్ట సమయాల్లో విశ్వాసులు దేవుని వాక్యాన్ని, దేవుని లక్షణాలను ఉపయోగించేలా వారిని ప్రోత్సహిస్తూవున్నాయి. పరిస్థితులపై కాకుండా ఆయన శక్తిపై విశ్వాసాన్ని ఉంచేటట్లుగా విశ్వాసులను ప్రోత్సహించడమే వీటి ఉధ్దేశ్యము. రెండు దేవాలయాలలో ఈ కీర్తనలన్ని ఉపయోగించబడ్డాయి. కొన్ని ఆరాధనలలో భాగంగా ఉన్నాయి. అవి వ్యక్తిగతముగా సామూహిక భక్తికి మార్గదర్శిగా కూడా పనిచేశాయి.
కీర్తనలలో ప్రాముఖ్యమైన వచనములు, కీర్తనలు 19:14, యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. కీర్తనలు 145:21, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
కీర్తనలలో ప్రాముఖ్యమైన అధ్యాయము 100. బైబిల్లోని చాలా ఇష్టమైన అధ్యాయాలు కీర్తనల పుస్తకంలో ఉన్నాయి, కీర్తనలలో కీలకమైన అధ్యాయాన్ని ఎంచుకోవడం కష్టం (1, 22, 23, 24, 37, 72, 100, 101, 119, 121 మరియు 150). ఆరాధన మరియు స్తుతి యొక్క రెండు ప్రధాన ఇతివృత్తాలు 100వ కీర్తనలో అందంగా చెప్పబడ్డాయి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.