స్త్రీ పురుషులు దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి. దేవునిచే మొట్టమొదటి పురుషుడు నేల మంటి నుండి సృష్టింపబడ్డాడు, (దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను ఆదికాండము 2:7); ఏ జీవికి లేని ఆత్మను మానవులు కలిగియున్నారు. మొట్టమొదటి స్త్రీ పురుషుని ప్రక్కటెముక నుండి సృష్టింపబడింది (తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను ఆదికాండము 2:22). దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అను ఆదికాండము 1:26,27 లేఖనాలను బట్టి మొట్టమొదటి స్త్రీ పురుషులు దేవుని స్వరూపమందు చేయబడ్డారు, అంటే నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించు కొనవలెను అను ఎఫెసీయులకు 4:24 లేఖనమును బట్టి మరియు జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు అను కొలొస్సయులకు 3:10 లేఖనమును బట్టి వాళ్ళు, దేవుని నిజమైన జ్ఙానములో నిజమైన నీతిలో మరియు పరిశుద్ధతలో మరియు స్వభావము యొక్క సహజ శాస్త్రీయమైన జ్జనముతో (ఆదికాండము 2:19-23) పాపము లేనివారిగా దేవునిని గూర్చి పరిపూర్ణ జ్జానము కలవారుగా సృజింపబడి యున్నారని నేను నమ్ముతున్నాను తప్ప మొట్టమొదటి మానవులు జంతువు నుండి అభివృద్ధి చెందలేదని నేను నమ్ముతున్నాను. 1 కొరింథీయులకు 2:14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అట్లే దేవుడు తన సర్వ సృష్టిపై మానవులకు అధికారాన్ని ఇచ్చియున్నాడు. మానవులు ఈ జీవితములో చిత్తస్వేచ్ఛను (free will) కలిగియున్నారు.
ఆదికాండము 3వ అధ్యాయములో వివరించబడియున్న ప్రకారము, మొట్టమొదటి మానవుల పతనము ద్వారా పాపము ఈ లోకములోనికి వచ్చియున్నదని నేను నమ్ముతున్నాను. ఆదాము హవ్వలు మొదటిగా పాపము చేసినపుడు వాళ్ళు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. ఈ పతనము ద్వారా వాళ్ళు మాత్రమే కాకుండా అతని సంతానము కూడా అసలైన జ్ఙానాన్ని నీతిని పరిశుద్ధతను పోగొట్టుకొనియున్నారు. అందువలననే మనుష్యు లందరు పుట్టుకతోనే పాపులై యున్నారు, పాపములలో మరణిస్తూవున్నారు, సమస్త దుష్టత్వమునకు మొగ్గు చూపుతూవున్నారు, దేవుని ఉగ్రతకు పాత్రులైయున్నారు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెనని రోమా 5:12,18 మరియు మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను. మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమని ఎఫెసీయులకు 2:1-3 చెప్తూవుంది. కాబట్టే మానవులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా లేక వారి సాంస్కృతిక మరియు విజ్ఙానశాస్త్రము యొక్క సహాయముతో, తమ్మునుతాము దేవునితో సమాధానపరచు కొనలేరని తత్ఫలితంగా మరణమును జయించుటకు మరియు నాశనమును తప్పించుకొనుటకు సామర్ధ్యమును కలిగిలేరని నేను నమ్ముతున్నాను.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.