మార్కు 7:10-13 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు.
మార్క్ 7:1-13 సందర్భంలో, యేసు పరిసయ్యులతో శాస్త్రులతో వాస్తవికత లేని వారి సంప్రదాయాలను గురించి మాట్లాడుతున్నాడు. పెద్దల ఆచార సంప్రదాయాల ప్రకారం శిష్యులు చేతులు ఎందుకు కడుక్కోరని పరిసయ్యులు అడిగారు (మార్కు 7:5). ఈ చేతులు కడుక్కోవడం అనేది ఈ రోజు మనం సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవటం కాదు. ఇది శుభ్రత కోసం కాదు; బదులుగా, ఇది దైవభక్తి యొక్క ప్రదర్శనగా నిర్దేశించబడిన ఒక ఆచారం.
పరిసయ్యులు శాస్త్రులు తాము ఏర్పరుచుకున్న సంప్రదాయాలపై ఎక్కువగా నమ్మకముంచారు. అది వారిని వేషధారులుగా దేవుని స్వంత వాక్యాన్ని పాడుచేసే వారిగా చేసింది. వారు లేఖనాల యొక్క శుద్ధికారణాచార సంబంధమైన ఆజ్ఞల వాస్తవికతను తగ్గించి, వారి స్వంత సంప్రదాయాలను అందరిముందు చేయగలిగే బాహ్యచర్యలకు వాళ్ళు బహుగా ప్రాముఖ్యతను ఇచ్చారు. అందుకే యేసు యెషయా 29:13లోని మాటలను వారికి అన్వయిస్తూ, వేషధారులారా –ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని మత్తయి 15:7-9 వారిని హెచ్చరించాల్సి వచ్చింది.
దేవుని పాతనిబంధన ఆచారనియమాలు క్రీస్తుకు మార్గాన్ని సిద్ధంచేయడానికి ఉద్దేశించబడ్డాయని గుర్తుచేసు కున్నప్పుడు, వాటిని అర్ధం చేసుకోలేని అజ్ఞ్యానాన్ని బట్టి సిగ్గుపడవలసి ఉన్నాం. అధ్వాన్నమైన విషయం ఏమి టంటే, వారి బోధలు కొన్నిసార్లు వారికివ్వబడిన నీతి సంబంధమైన ధర్మశాస్త్రాన్ని కూడా బలహీనపరిచాయి. వారు నాల్గవ ఆజ్ఞను ఎలా ఉల్లంఘించారో క్రీస్తు ఇక్కడ ఎత్తి చూపాడు.
కొర్బాను అనేమాట మార్కు 7:11లో మాత్రమే ఉంది. ఈ మాటకు “దేవునికి బహుమతిగా అంకితం చేయబడింది”. దేవునికి సమర్పించాలని లేదా ఆలయంలోని పవిత్ర ఖజానాకు ఇవ్వమని ప్రజలను ప్రోత్సహించె క్రమములో కొర్బాను అనే ఒక నియమాన్ని పెద్దలు ప్రవేశపెట్టారు. ఏదైనా “కొర్బాను” అయితే, అది దేవుని ఉపయోగం కోసం అంకితం చేయబడింది మరియు ప్రత్యేకించబడింది.
కాని దీనిని వాస్తవికతలో పరిసయ్యులు శాస్త్రులు వారి స్వప్రయోజనాల కోసం ఎలా మార్చుకొన్నారో ఇక్కడ చూడొచ్చు. మార్కు 7:11-13 కాబట్టే మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయ నియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటు వంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.
దేవుడు తన ప్రజలకు “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” అను ఆజ్జ్యను ఇచ్చాడు (నిర్గమకాండము 20:12), వృద్ధాప్య తల్లితండ్రులు వారి అవసరతలలో పిల్లలను డబ్బులు లేదా వేటినైనను అడిగినప్పుడు పిల్లలు తల్లితండ్రులకు డబ్బు/ వాటిని ఇవ్వకుండా వాటిని ఆలయ ఖజానాకు అంకితం చేయవచ్చని బోధించడం ద్వారా పరిసయ్యులు ఆ ఆజ్ఞకు మినహాయింపునిచ్చారు, అది దేవుని ఆజ్జ్యను తిరస్కరించడమే.
ఇది కొర్బాను (దేవార్పితమని) చెప్పడం ఒక వ్యక్తికి అతని తల్లిదండ్రుల పట్ల అతని బాధ్యత నుండి మినహాయించటం కరెక్ట్ కాదు. ఒకడు వాని తల్లితండ్రులను నిర్లక్ష్యము చేసి బాధ్యతల నుండి తప్పించుకొనే వారి కేసు పరిస్థితులు వారు ఎలా ఉండాలో నిర్ణయించి వాడు ఈ తప్పునుండి విడిపించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా కొర్బానును మందిరానికి ఇవ్వొచ్చని చెప్పడం ధర్మము క్రిందికి రాదు. మరో మాటలో చెప్పాలంటే, వారి తల్లిదండ్రులను మోసగించడానికి (మరియు తమను తాము సంపన్నం చేసుకోవడానికి) చట్టవిరుద్ధమైన మరియు మోసపూరితమైన మార్గంలో మందిరానికి అంకితం ఇవ్వబడిన డబ్బును పరిసయ్యులు (చట్టబద్ధమైన కొర్బాను అర్పణను) తీసుకున్నారు, ఉపయోగించు కొన్నారు. ఆ విధంగా, దేవుని వాక్యము నిరర్థకము చేయబడింది. ప్రతి ఒక్కరు వారి తలితండ్రుల పట్ల వారి ధర్మాన్ని నిర్వర్తించమని దేవుడు ఆజ్జ్యను ఇచ్చినప్పుడు, ఒకరి ధర్మాన్ని ఒకరు నిర్వర్తించకుండా చెయ్యడం దేవుని వాక్యమును నిరర్థకము చెయ్యడం కాదా అని యేసు పరిసయ్యులును ప్రశ్నించాడు.
వాస్తవికత లేని ఆచారం అనేది పరిసయ్యుల మతంలాంటిదే. ఇది ధర్మం లేకుండా మరియు సంబంధాలు లేకుండా పాటించే ఆచారాలు మాత్రమే. దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా, ఆచారాల వల్ల ఏమీ లాభం లేదని మనిషి యొక్క సంప్రదాయాలు దేవుని వాక్యం యొక్క అధికారాన్ని ఎన్నటికీ స్వాధీనం చేసుకోకూడదని యేసు భోదిస్తూవున్నాడు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.