దేవుడు ఉన్నాడా?ఎలా చెప్పగలం?

అసలు దేవుడనేవాడు ఉన్నాడా? ఉంటే ఆ దేవుడు ఎవరు? ఆ దేవునిని గురించి ఎలా తెలుసుకొంటాం? ఆయన ఉనికికి సాక్ష్యమేమన్న ఉందా? అని ఎప్పుడన్నా ఆలోచించారా?

కొంతసేపు మతవిశ్వాసాలను కులాలు, మతాలు, జాతులు, సమాజాలు అన్నింటిని కాసేపు ప్రక్కన పెట్టండి. వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదండి, వ్యక్తిగతముగా మీరు ఎందుకని దేవుడున్నాడని నమ్ముతున్నారో చెప్పండి. కొందరికి రుజువులు అవసరం. మరి మీరు ఏ కారణాలను బట్టి, రుజువులను బట్టి దేవుడున్నాడని చెప్పగలుగు తున్నారు?

మనుష్యులముగా కొన్ని ప్రశ్నలకు ప్రతి ఒక్కరం జవాబులను తెలుసుకోవలసి ఉన్నాం,

  1. ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు?
  2. మనం ఇక్కడ ఈ భూమిపై ఎందుకని ఉన్నాము?
  3. పుట్టిన ప్రతి ఒక్కరు ఎందుకని మరణిస్తూ ఉన్నారు?
  4. ఎందుకని ప్రతి ఒక్కరు మర్తులుగా (మరణించేవారిగా) ఉన్నారు?
  5. మరణం తరువాత ఏం జరుగుతుంది? మరొక జీవితం ఉందా?
  6. మరణం ఉందంటే దాని అపోజిట్ అయిన నిత్యజీవము కూడా ఉన్నట్లే. ఉంటే ఆ నిత్యజీవము లోనికి ఎలా ప్రవేశించగలం?
  7. ఈ మరణాన్ని తప్పించుకొనే క్రమములో ప్రతి ఒక్కరు మార్గాలను అన్వేషించవలసి ఉంది, మరి ఆ మార్గమేమిటో మీకు మీరుగా కనుకున్నారా?
  8. మనుష్యులందరు స్వాభావికముగా ఒకే నైతికనియమావళి లేనివారైనను ఎందుకని తమకుతామే నైతిక నియమావళిని కలిగినట్టున్నారు?
  9. మనుష్యులందరు ఒకే నైతిక నియమావళి తమ హృదయముల యందు వ్రాయబడియున్నట్లు ఎలా చూపగలుగుతున్నారు?
  10. మనుష్యులందరిలో మనస్సాక్షి ఉండుటకు కారణమేమి?
  11. ఎందుకని చెడు ఈ లోకములో ఉంది. చెడువలన నాకు జరిగిన నష్టమేమిటి?
  12. చెడును బట్టి కలుషితమైన ఈ లోకములో చెడును బట్టి పాడైన మనలను మనం పవిత్రులుగా చేసుకోగలమా?
  13. మన చుట్టూ ఉన్న ప్రతి దాని అస్థిత్వము ఎందుకని టెంపరరిగా ఉంది?
  14. మనలోవున్న మనఃసాక్షిని బట్టి అంతిమ తీర్పు ఉందని అర్ధంఔతుంది. దానిని తప్పించుకొనే మార్గమును అన్వేషించే క్రమములో దేవుని ఉనికిని గుర్తించటం చాలా ప్రాముఖ్యం. ఆయన ఎవరనేది తెలుసుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం. మరి ఆ దేవుని కొరకు యెక్కడని వెదుకుదాం?
  15. మనకున్న ఆప్షన్స్ ఏమిటి?

ఆప్షన్స్ ఏవి లేవండి. మన చుట్టూ ఉన్నది సృష్టి మాత్రమే. అయితే ఈ సృష్టి దేవుని ఉనికిని గురించి  ఏమన్న చెప్తూ ఉందా?

ఇప్పుడు మీ చుట్టూ ఉన్న సృష్టిని గురించి ఆలోచించండి. మొదటిగా ఈ సృష్టిలో ప్రతిది భౌతిక నియమాలకు కట్టుబడి లోబడి ఒక క్రమమైన పద్దతిలో విశిష్టమైన రీతిలో ఆశ్చర్యము గొల్పే విధానములో వ్యవస్థీకృతముగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉండటం గమనించారా? ఒకరి ప్రమేయము లేకుండగానే ఇదంతా ఆక్సిడెంటల్గా జరిగిందంటారా?

ఒకసారి ఆస్తికుడైన ఒక శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో సౌరమండలం యొక్క నమూనాను తాయారుచేసి existence of electromagnetic radiation అనే సిధ్ధాంత ప్రాతిపాదికగా ప్రయోగాలు చేస్తూ ఉండగా నాస్తికుడైన మరొక శాస్త్రవేత్త అక్కడికి రావడం జరిగింది. నాస్తికుడైన ఆ శాస్త్రవేత్త ఆ సౌర మండలము యొక్క నమూనాను చూసి ఇది అద్భుతం దీనిని ఎవరు చేసారని అడిగాడు. దానికి ఆస్తికుడైన శాస్త్రవేత్త నేను ఈ ప్రయోగశాలలో మరొక రూంలో ఉండగా ఒక పెద్ద శబ్దమును విన్నాను. అది ఏమిటో చూద్దామని ఈ రూంలోకి రాగా ఇది ఇక్కడ ఉంది అని జవాబు చెప్పాడు. దానికి నాస్తికుడైన శాస్త్రవేత్త అదెలా సాధ్యము. దీనిని ఒకరు రూపించకపోతే ఇది సాధ్యము కాదు అని అన్నాడు. నిజమే, ఒకరు రూపించనిదే ఈ సృష్టి ఉనికిలోనికి రాలేదనే విషయాన్ని ఈ సృష్టి గుర్తుచేస్తు ఉందండి.    

ఈ అనంత విశ్వము ఆక్సిడెంటల్గా జరుగలేదని, బైబులులో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3:3 లో స్పష్టముగా ప్రతి యిల్లును ఎవడైన ఒకని చేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే అని చెప్తూ ఉంది. ఈ మాటలకు అర్ధం ఈ సృష్టికి ఒక ఫౌండర్, ఎస్టాబ్లిషర్, బిల్డర్, మేకర్ ఉన్నాడని, ఈ సృష్టి తనకుతానుగా ఉనికి లోనికి రాలేదని “singularity” అనేదే లేదని దీని వెనుక ఒక సృష్ఠికర్త ఉన్నాడని, దీని devolopmentని దీని conditionsని నిర్ణయించినవాడు దేవుడేనని ఇందులో వాడినవన్నీ దేవునివేనని ఆయన అన్నింటి సృష్టికర్త కాబట్టి ఆయన అన్నింటిపైగా ఉన్నవాడని ఆయనను గురించి ఈ వచనము తెలియజేస్తూ ఉంది.

మనుష్యులముగా మనం ఆ సృష్టికర్తకు సృష్టికి మధ్యన ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది పడతామని తెలిసే దేవుడు తాను సృజించిన సృష్టిలో ఆసాంతము తన ఉనికిని ఉంచి అది దానిని బహిర్గతపరుస్తూ ఉండేటట్లు ఆయన తన సృష్టిని సృజించియున్నాడు.

ఈ విషయాన్ని గురించి బైబులు మాట్లాడుతూ కీర్తన 19:1-4 వచనాలలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లుచున్నవి అని తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి ఉన్న సాక్ష్యుల గురించి ఈ కీర్తనలో వ్రాసి ఉంది: ఒకటి సృష్టి (1-4).

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంటే ఆకాశములు స్పష్టంగా, దృఢంగా, బహిరంగంగా, అధికారికంగా అందరికి దేవుని మహిమను గురించి మరియు వాటి సృష్టికర్త యొక్క గొప్పతనమును గురించి వెల్లడిస్తూ ఉన్నాయని అర్ధం. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది అంటే ప్రతిరోజూ అంతరిక్షము తాను ఎలా అద్భుతఃకరమైన రీతిలో మరియు క్రమపద్ధతిలో వ్యవస్థికరించబడియున్నదో మరియు వాటి ప్రాపర్టీస్, ఫీచర్స్, అండ్ డ్యూటీ’sని మరియు నిత్యుడు, జీవాధిపతి, సర్వశక్తిమంతుడు అయిన తన సృష్టికర్త యొక్క గుణలక్షణాలను గురించి తెలియజేస్తూ ప్రతిరోజు ఆ సృష్టికర్త యొక్క చేతిపనులను పబ్లిష్ చేస్తూ ఉన్నదని అర్ధం. పగటికి పగలు బోధచేయుచున్నది అంటే ఎన్నటికి ఆగిపోని ఒక స్థిరమైన ప్రవాహము వలె పగలు మనలను ఎడ్యుకేట్ చేస్తూ, ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ, ఇల్లుమినేట్ చేస్తూ, దేవుని విషయములో పాఠాలు నేర్పిస్తూ ఉన్నదని అర్ధం. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అను మాటలకు దేవుడు తనను గురించి తాను బయలుపరచిన విషయాలను మరియు ఇంతకు ముందు రహస్యముగా ఉన్న విషయాలను రాత్రి బహిర్గతము చేస్తూ ఉందని అర్ధం. ప్రతి రాత్రి నిశ్శబ్ద కదలికల ద్వారా భగవంతుని గొప్పతనాన్ని మరియు మహిమను గురించి మనిషికి అనేక పాఠాలు తెలుపుతూ ఉంది. దేవుని జ్ఞానం, శక్తి మరియు మంచితనం గురించి ప్రతి రోజు దాని స్వంత పాఠాన్ని కలిగి ఉంది. ఆ విధంగా గొప్ప సృష్టికర్త యొక్క జ్ఞానం మరియు శక్తికి శాశ్వతమైన సాక్ష్యం ఉంది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి అను మాటలకు, దేవునిచే సృష్టించబడి నిర్వహించబడుతున్న ఈ సృష్టి దాని సృష్టికర్త యొక్క శక్తి, జ్ఞానానికి నిశ్శబ్ద సాక్ష్యాన్ని ఇస్తూ ఉందని అర్ధం. నక్షత్రాల గంభీరత వాటి క్రమబద్ధత వాటి సృష్టికర్త యొక్క మహిమను తిరస్కరించే వారందరిని మరియు సృష్టికర్తకు బదులుగా సృష్టికి ప్రాధాన్యతనిచ్చే వారందరిని నిశ్శబ్దంగా మందలిస్తూ మౌనంగా ఖండిస్తు ఉండటమే కాకుండా ఏ ఒక్కరు దేవుని గురించి నాకేమి తెలియదు అని సాకులు చెప్పి తప్పించుకొనే అవకాశము ఎవ్వరికి  ఇవ్వటం లేదు. ఆయన దైవికమైన ఉనికిని తిరస్కరించే వారికి ఎలాంటి కారణము లేదు అని తెలియజేస్తూ ఉన్నాయి. భగవంతుని ఉనికికి విశ్వమే మొదటి రుజువు అని ఆయన సృజించిన వాటిని బట్టి దేవుడున్నాడని మనం ఒప్పుకొని తీరవలసి ఉన్నాం. సృష్టికి మనలా భాష లేదు అవి ఎవరితో మాట్లాడలేవు, కాని అవి దేవుని గొప్పతనాన్ని మరియు మహిమను ప్రకటిస్తాయి. గొప్ప సృష్టికర్త యొక్క పరిపూర్ణతలను ప్రకటించడం ద్వారా అందరూ వాటి భాషను అర్థం చేసుకోగలరు, అవి వ్యక్తిగతముగా భాషతో తమ సృష్టికర్తను గురించి వ్యక్తపరచవలసిన అవసరం లేదు.

మనుష్యుని చుట్టూ ఆవరించి ఉన్న ఈ సృష్టి తన సృష్టికర్తను గురించి స్పష్టముగా తెలియజేస్తూ ఉండగా దేవుడు లేడని చెప్పడం బుద్ధిహీనతే అవుతుంది. కొందరు ఈ సృష్టికి సృష్టికర్త ఎవరు లేరని ఈ అనంత విశ్వములో ప్రతిది మనతో సహా ఒకరి ప్రమేయము లేకుండగానే ఆక్సిడెంటల్గా ఉనికిలోనికి వచ్చిందేనని చెప్తూ ఉంటారు. శాస్త్రవేత్తలేమో దేవుని ఉనికిని prove చెయ్యడానికిగాని disprove చెయ్యడానికిగాని ప్రయత్నించరు, ఎందుకంటే దేవుణ్ణి గుర్తించగల ప్రయోగం ఏదీలేదని వారికి తెలుసు, బైబులు కూడా “దేవుడులేడని బుద్ధిహీనుడు మాత్రమే తన హృదయములో అనుకొనును” అని కీర్తన 14:1 లో తెలియజేస్తూ ఉంది.  

దేవుడులేడని కొందరు ఎందుకని అనుకుంటారో తెలుసా? దేవుడు లేడని చెప్పేవాడు వక్రబుద్ధిని చూపిస్తూ తెలిసి తెలిసి దేవుని మోరల్ రూల్ ని తిరస్కరిస్తు ఉన్నాడు. అందుకు అతని అజ్ఞానం లేదా వీక్నెస్ అఫ్ రీజన్ కారణం కాదు. వాడు తన పాపస్వభావమును బట్టి కఠినచిత్తుడై, తన అనైతిక జీవితాన్ని అతడు ఎంతో ఇష్టపడుచు ఉండుటను బట్టి ఆ విషయములో తనను ఎవ్వరు తీర్పు తీర్చకూడదని తాను ఎవ్వరికి లెక్క చెప్పాల్సిన పనిలేదని అనుకొంటూ తనపై న్యాయాధిపతిగాని అధికారిగాని ఎవడులేడని తన వ్యవహారాలపై తీర్పులేదని తననుతాను సంతోషపరచుకొనే క్రమములో సంతృప్తిపరచుకొనే క్రమములో దేవుడులేడని బుద్ధిహీనుడు చెప్తాడని బైబులు చెప్తూ ఉంది.

దేవుడు సృజించినవాటిని బట్టి దేవుడనేవాడు ఒకడున్నాడని అర్ధమవుతూ ఉంది. అంతేనా, దేవుని ఉనికికి ఇంకా ఏవన్నా సాక్ష్యాలు ఉన్నాయా అని ఇంకా మనం పరిశీలిస్తే, ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. పకృతిలో గాని మానవ చరిత్రలోగాని ఆ దేవుని కంటిన్యూస్ ఆపరేషన్స్ దేవుని ఉనికిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు, దేవుని మంచితనానికి నిదర్శనాలలో వర్షం ఒకటి. సరైన సమయములో సరైన పరిమాణంలో వర్షం కురవకుండా నియంత్రించబడితే, భూమి నిర్జనమై పోతుంది. జీవము అంతరించి పోతుంది. వర్షం పడడం అనేది మనం గుర్తించలేని laws ద్వారా నియంత్రించబడుతూ ఉంది. మరి ఈ వర్షాల వెనుకవున్న దేవుని మంచితనము శ్రద్ధ జ్ఞానము ఆయన కంటిన్యూస్ ఆపరేషన్స్ ఆయన ఉనికిని తెలియ జేయటం లేదంటారా. అలాగే ఫలవంతమైన రుతువులు దేవుని మంచితనానికి అద్భుతమైన రుజువులు, అంతేనా సహేతుకంగా ప్రతి ఒక్కరికి ఆహారం ఇవ్వడం ద్వారా ఆనందం కలుగ జేయడం దేవుని దయగల ఏర్పాటును తెలియజేస్తూ ఇది దేవుని యొక్క ఎకానమీని సమృద్ధిని రుజువు చేస్తూ ఆయన మంచితనాన్ని గురించి చెప్పటం లేదా. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఎన్నో రుజువులు ఉన్నాయి. కాబట్టే బైబుల్లో అపొస్తలుల కార్యములు 14:15-17వచనాలల్లో ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును ఫలవంతము లైన రుతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని చెప్తూ ఉంది.

అంతేకాదండి, మనుష్యుల హృదయాలలో వ్రాయబడియున్న దైవికమైన చట్టం దేవుని ఉనికికి మరొక సాక్ష్యము. ఈ చట్టాన్ని బట్టే దేవుని తీర్పును గురించి మనం ఎరిగి ఉన్నాం. ఇది the moral proof of God’s existenceని గురించి చెప్తూ ఉంది. మనుష్యులందరు స్వాభావికముగా ఒకే నైతిక నియమావళి లేనివారైనను ఎందుకని తమకుతామే నైతిక నియమావళిని కలిగినట్టున్నారు? అనే ప్రశ్నకు, “స్వభావరీత్యా” ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని ధర్మశాస్త్రము వ్రాయబడియున్నది కాబట్టే దేవుని ధర్మశాస్త్రములోని ఆజ్జ్యలన్నీ కులమతాలకు అతీతముగా అందరూ ఎరిగియున్నారు. కాబట్టే దేవుని ధర్మశాస్త్రము అడుగుతున్న వాటినన్నిటిని ప్రతి ఒక్కరు దేవుడు మనకు ఇచ్చియున్న సహజ జ్ఞానమును బట్టి ఫాలో అవుతూ ఉన్నారు. దేవుడు మనకిచ్చిన సహజ జ్ఞానం దేవుడు మనలో ఉంచిన నైతిక నియమావళికి పునాదియై యున్నది.

దేవుని నైతిక నియమావళిని పాటించేందుకు అవసరమైన సహజమైన ప్రేరణను కలిగి ఉండేందుకు ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంచిన మనస్సాక్షిని బట్టి ప్రతి ఒక్కరు “తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు“. దేవుని ధర్మశాస్త్రము ప్రతి ఒక్కరి హృదయములపై వ్రాయబడియున్నది అని చెప్పటానికి సాక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉన్న మనఃసాక్షియే. ప్రతి ఒక్కరిలో ఉన్న మనస్సాక్షి కొన్ని సహజ ప్రవర్తనా నియమాలను పాటిస్తూ కొన్ని విషయాలలో కొన్నింటిని చెయ్యమని చెప్తూ ఉంటుంది, మరికొన్నింటిని చెయ్యొద్దని చెప్తూ ఉంటుంది. ఒకడు దేవుని ధర్మశాస్త్రానికి విరోధముగా వెళ్తున్నప్పుడు వానిలో ఉంచబడియున్న మనఃసాక్షి ఒక స్వరము వలె వానిని నిందిస్తుంది. దాని అర్ధం వాడు దేవుని ఎదుట దోషిగా ఉన్నాడని, తెలిసి ఉద్దేశ్యపూర్వకంగా దేవుణ్ణి ధిక్కరించియున్నాడని తద్వారా దేవుని శిక్షావిధిని ఎదుర్కోవలసి ఉన్నాడని చెప్పడమే దాని ఉద్దేశ్యము.

ఈ విషయాలనే బైబులు చెప్తూ, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రములేని వారైనను, తమకుతామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అని రోమీయులకు వ్రాసిన పత్రిక 2:14,15 తెలియజేస్తూ ఉన్నాయి. 

దేవుడు సృజించినవి, పకృతిలోగాని మానవ చరిత్రలోగాని ఆ దేవుని కంటిన్యూస్ ఆపరేషన్స్, మనుష్యుల హృదయాలలో వ్రాయబడిన దైవికమైన చట్టం దేవుని ఉనికిని నిర్ధారిస్తూ ఉన్నాయి. మనుష్యులమైన మనకు దేవునిని గురించి ఏదన్నా తెలిసింది అంటే దేవుడే తన గురించి తానే స్వయముగా తెలియజేస్తే తప్ప మానవుడు దేవునిని గురించి ఎప్పటికి తెలుసుకోలేడు. దేవునిని గురించి తెలుసుకునేలా దేవుని ద్వారా మనకు ఇవ్వబడిన సహజ జ్ఞానము ద్వారా దేవుడనే వాడు ఒకడున్నాడని మనకు అర్ధం అవుతూ ఉంది. 

ఇప్పుడు చెప్పండి దేవుడనేవాడు ఉన్నాడంటారా, లేడంటారా? దేవుడు లేడని నమ్మేవాడికి ఎన్నిరుజువులు చూపినా దేవుడనే వాడు ఉన్నాడని వాడు నమ్మడు. అలాగే దేవుడు ఉన్నాడని నమ్మేవాడికి దేవుడు ఉన్నాడు అనేందుకు ఎలాంటి రుజువులు అక్కర్లేదు. మరి ఇప్పుడు దేవుడున్నాడని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలరా. మిత్రులారా దేవుడున్నాడని కాన్ఫిడెంట్గా తెలుసుకున్నాం. మరి ఈ సృష్టి దేవునిని గురించి చెప్తుందే తప్ప ఆయన పేరును చెప్పటం లేదే మరి ఆ దేవుడెవరో ఆయన పేరేమిటో తెలుసుకోవడం ఎలా?  తరువాతి ఆర్టికల్ లో చూడండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.