పాఠము 2
తూర్పు ప్రాచ్యములోని ప్రాముఖ్యమైన భూభాగములో ఇశ్రాయేలు ఉంచబడియున్నదని మనం మొదటి పాఠము ద్వారా నేర్చుకొనియున్నాము. ఈ పాఠములో, నియర్ ఈస్ట్ ని గురించి నేర్చుకొందాం. ప్రత్యేకముగా, నియర్ ఈస్ట్ లోని జీవనము మరియు నీటి మధ్యన ఉన్న దగ్గరి సంబంధమును గురించి నేర్చుకొందాం. అట్లే ఇశ్రాయేలులోని ప్రాముఖ్యమైన నీటి వనరులను గురించి కూడా నేర్చుకొందాం.
నియర్ ఈస్ట్ లోని నీటి వనరులు
మొదటి పాఠములో మనం సారవంతమైన చంద్రవంకను గురించి నేర్చుకొనియున్నాము. నియర్ ఈస్ట్ లోని చంద్రవంకలో ఉన్న భూభాగమంతా సమృద్ధిగా నీటి సౌకర్యముతో ఉండటమే కాకుండా చంద్రుని నెలవంక ఆకారములో ఉండటం మూలాన్న దీనిని చంద్రవంక అని పిలిచెడివారు. ఈ సారవంతమైన చంద్రవంకకు నాలుగు ప్రాముఖ్యమైన నదులు మూలాధారముగా ఉన్నాయి. ఈ నదులలో రెండు పెద్ద నదులు మెసపటోమియాలో ఉన్నాయి. మెసపటోమియా అను పేరుకు “నదుల మధ్యన” అని అర్ధం. ఈ ప్రాంతము రెండు ప్రసిద్ధమైన నదుల మధ్యలో ఉండటం మూలాన్న దీనికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాముఖ్యమైన నదులలో ఒకటి “టైగ్రిస్ నది (హిద్దెకెలు)” అని పిలువబడుతూ ఉంది, ఆదికాండము 2:14; దానియేలు 10:4. ఈ నది పై నుండి క్రిందికి ప్రవహిస్తూ ఉంది. నీనెవె, అష్షూరు, బగ్దాద్ వంటి ప్రముఖ పట్టణాలు ఈ నది ఒడ్డున ఉండెడివి. రెండవది యూఫ్రటీసు నది. ఇది గొప్ప నదిగా ఆదికాండము 15:18లో; మహానదిగా ప్రకటన 16:12లో పేర్కొనబడియున్నది. బబులోను, ఊరు వంటి పట్టణాలు ఈ నది ఒడ్డున ఉండెడివి. మూడవ నది ఆఫ్రికాలో ఉంది. ఇది ఆఫ్రికా కొండలలో పుట్టి ఈజిప్ట్ అంతా ప్రవహిస్తూ మెడిటేరియన్ సముద్రములో కలుస్తూ ఉంది. దీని పేరు నైలు నది. దాదాపు ఈజిప్ట్ ప్రజలందరూ నైలు నది ఒడ్డునే నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆఫ్రికా పర్వతాలలో వర్షాకాలం తర్వాత, నైలు నది దాని లోయను సారవంతమైన మట్టితో ముంచెత్తుతుంది, ఆపై నీరు తగ్గిపోతుంది, నేలకు సమృద్ధిని ఇస్తుంది. (యిర్మీయా 46:7; ఆమోసు 8:8). నాల్గవది యొర్దాను నది ఇది మిగిలిన మూడు నదులకంటే చాలా చిన్నది కాని అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ఇశ్రాయేలు దేశము గుండా ప్రవహిస్తూవుంది. దాని వెంట నిర్మించబడిన ముఖ్యమైన నగరాలు ఉన్నాయి.
ఈ నాలుగు నదుల చుట్టూ, నియర్ ఈస్ట్ (మిడిల్ ఈస్ట్) లోని తొలి నాగరికతలు పెరిగాయి. ఎందుకంటే, ప్రజలు జీవించడానికి అవసరమైన వాటిలో ముఖ్యమైనది నీరు. నీరు ఎల్లప్పుడూ జీవితం యొక్క ప్రాథమిక అవసరాలలో ఒకటి. ప్రజలకు తాగడానికి, శుభ్రము చేసుకోవడానికి మరియు పంటలు పండించడానికి నీరు అవసరం. ప్రజల జంతువులకు కూడా నీరు అవసరం. అడవి జంతువులు కూడా నీటి దగ్గరకి వస్తాయి. ఆహారం కోసం అడవి జంతువులను చంపొచ్చు. అలాగే చేపలు కూడా ఒక ముఖ్యమైన ఆహార వనరు. పైన పేర్కొన్న అన్ని కారణాల వల్ల, ప్రజలు సాధారణంగా నీరు పుష్కలంగా ఉన్న చోట స్థిరపడ్డారు.
నియర్ ఈస్ట్ (మిడిల్ ఈస్ట్) లో, సంవత్సరంలో ఎక్కువ భాగం వాతావరణం చాలా వెచ్చగా ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే వర్షం వస్తుంది. కొన్ని ఇరుకైన లోయలు వర్షపు తుఫానుల తర్వాత ప్రవాహాలుగా మారుతాయి, కానీ ఇవి తొందరగానే ఎండిపోతాయి. వీటిని ఎండిపోయిన నీటి కాలువలు అంటారు. ఇతర ప్రదేశాలలో ఏర్పడిన సహజ నీటి గుంటలు కూడా ఉంటాయి. ఎండా కాలంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది, బావులు ఎండిపోతాయి, నీటి నిల్వలు ఖాళీ అవుతాయి. నీరు చాలా విలువైనదిగా మారుతుంది. అయితే సారవంతమైన చంద్రవంకలోని పెద్ద నదులు ఎండిపోవు. అవి చిన్నవిగా మారతాయి కాని వాటిలో ఎల్లప్పుడూ కొంత నీరు మిగిలే ఉంటుంది. నదిలోని నీటిని రైతుల పొలాల్లోకి తీసుకెళ్లేందుకు చిన్న కాలువలు కూడా తవ్వుకోవచ్చు. అందుకే తొలి దేశాలు ఈ పెద్ద నదుల దగ్గర స్థిరపడేందుకు మొగ్గు చూపాయి. నియర్ ఈస్ట్ లో ఒక సామెత ఉంది: నీరే జీవితం. మరో మాటలో చెప్పాలంటే, నీరు లేకపోతే చచ్చిపోతాం.
నీరు తగినంత సమృద్ధిగా దొరికినప్పుడే జీవం ఉంటుంది. నియర్ ఈస్ట్ లోని నాలుగు ప్రధాన నదులు ఏడాది పొడవునా నీటిని అందించాయి. ఈ కారణంగా అవి ఈ ప్రాంతములో జీవనానికి కేంద్రంగా మారాయి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.