మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులలో తండ్రియైన దేవుడు ఒకరని నేను నమ్ముతున్నాను. ఆయన యేసుక్రీస్తుకు మరియు యేసునందు విశ్వాసముంచువారందరికి తండ్రియైయున్నాడు కాబట్టే ఆయన తండ్రి అని పిలవబడుతూ వున్నాడు, (యోహాను 20:17, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టు కొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను మరియు మత్తయి 6:6,9-13, నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, –పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరు చున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థు లను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము.
దేవుడు ఆత్మయై యున్నాడు (యోహాను 4:24 దేవుడు ఆత్మగనుక). అలాగని ఆయన అదృశ్యునిగా ఏదో ఒక స్థలానికి మాత్రమే పరిమితమై ఉంటాడని కాదు. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు (మలాకీ 2:10, మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా?) ఆయన పరిశుధ్ధుడు (లేవీయకాండము 19:2, మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను). ఆయన ప్రేమకలవాడు న్యాయవంతుడై యున్నాడు. ఆయన సమస్త సృష్టిని, మనుష్యులందరిని సంరక్షిస్తూ ఉన్నాడు, (నిర్గమకాండము 34:6,7, అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను).
రోమా 8:32, తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.