పాత నిబంధన పాఠము: 2 సమూయేలు 7:8-11,16; పత్రిక పాఠము: రోమా 16:25-27; సువార్త పాఠము: లూకా 1:26-38,19-28; కీర్తన 89.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: 2 సమూయేలు 7:8-11,16

మెస్సయ్యకు సంబంధించిన ప్రవచనాలను జ్జ్యపాకం చేసుకొనేటప్పుడు, కీర్తనలు, యెషయా, యిర్మీయా, జెకరయ్య  వంటి వాటిని గుర్తుచేసుకొంటాం తప్ప సమూయేలు గ్రంధాన్ని గూర్చి అసలు ఆలోచించం. కాని మన పాఠములో మెస్సయ్యను గూర్చిన ఒక వాగ్దానముంది,  ఆయన రాజ్యమునకు సంబంధించిన ఒక గొప్ప ప్రవచనముంది. ఈ విషయం మీలో కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఆదరణను కలిగించు ఆ ప్రవచనమేంటో ఆలకిద్దాము. 2 సమూయేలు 7:8-11,16 వచనములను చదువుకుందాం.

ఇది దేవుని కుమారుడైన మెస్సయ్యకు సంబంధించిన గొప్ప వాగ్దానము. చదువుకొన్న వచనాలలో, ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అను మాటలే మెస్సయ్యకు చెందిన ప్రవచనము. ఈ వాగ్దానమును ఆధారము చేసుకొని, మనము చదువుకొన్న వచనాలలోని దేవుని ఉదేశ్యమును అర్ధం చేసుకొనుటకు ప్రయత్నిస్తే_ దేవుడు తన ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తాడో అర్ధమవుతుంది. అది ఎంతో ఆదరణను కలుగజేస్తూవుంది.

దేవుడు మీతో ఎలా వ్యవహరించుచున్నాడో తెలుసుకోండి

  1. ఆయన అపాత్రులకు కనికరయుతుడై ఉన్నాడు. 8
  2. ఆయన స్వంతమని అనుకొనిన మిమల్ని సంరక్షించుచున్నాడు. 9-11
  3. ఆయన నిత్య రాజ్యమును మీకు అనుగ్రహించబోతున్నాడు. 16

1

Background: యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ జేసిన తరువాత, దావీదు రిలాక్స్ అయ్యి, తన అందమైన కొత్త ప్యాలెస్‌ని ఆస్వాదిస్తున్నప్పుడు, అతనికి ఒక విషయము తప్పుగా అనిపించింది. ప్రభువు మందసము గుడారంలో ఉండగా, తాను అందమైన  రాజ భవనంలో ఇంత వైభవంగా జీవించడం అతనికి సరైనదని అనిపించలేదు. 1 దినవృత్తాంతములు 28:2, యెహోవా నిబంధనమందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని. ఈ ఆలోచనలో స్వార్థం ఏమీలేదు; అతను తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించటం లేదు. అతను దేవుణ్ణి మహిమపరచాలని మాత్రమే కోరుకున్నాడు.

వెంటనే దావీదు తనకు మంచి స్నేహితుడు సలహాదారు పాస్టర్ గారిగా ఉన్నటువంటి నాతానును పిలువ నంపించి, తనకు వచ్చిన ఆలోచనను అతనితో పంచుకున్నాడు. దావీదు ప్రతిపాదనకు నాతాను కూడా చాలా ఉత్సాహంగా స్పందిస్తూ,  –యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినట్లు చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు.

2 సమూయేలు 7:4-8 అయితే ఆ రాత్రి యెహోవావాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము–యెహోవా నీకాజ్ఞ ఇచ్చున దేమనగా–నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలీయులతో కూడ నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? దేవుని మందిరము విషయములో దేవుని జవాబు,, 1 రాజులు 8:18,19, ఆ ఆలోచన మంచిదే; అయినను నీవు మందిరమును కట్టించకూడదు; 1 దినవృత్తాంతములు 22:7,8, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఓడ్చితివి. దేవుని మందిరము విషయములో దేవుని జవాబు నో.

దావీదు దేవుని మందిరమును కడదాం అని అన్నప్పుడు దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకోకుండా నాతాను యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినట్లు చెయ్యమని చెప్పటం దుడుకుతనం.

ఎవరితోనైనను మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? ఈ మాటలు దేవుడు తన ప్రజల మధ్య గుడారములో ఉండటం ఆయనకు సంతృప్తిగానే ఉందనే విషయాన్ని ప్రస్తుతమైతే మందిరాన్ని కట్టమని నేను అడగటం లేదు కోరుకోవడం లేదనే విషయాన్ని తెలియజేస్తూవున్నాయి. మరైతే దావీదు పట్ల దేవుని ఆలోచన ఏమిటి?

దేవుడు నో చెప్పడానికి కారణాలు_ 1. గొప్ప యుద్ధములు జరిగించి విస్తారముగా రక్తము ఒలికించటం 2. 8కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము–సైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా– గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.

  1. దావీదు సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా_ దేవుని మహా సర్వశక్తివంత మైన సైన్యములకు అధిపతిని + ప్రజలకు కనికరమును చూపుటయందును విడుదల కలుగచేయుట యందును ప్రధానముగా ఆనందించు వాడనైన యెహోవా అను నేను_నీతో చెప్పేదేమిటంటే_
  2. గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.  

మొదటిగా గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డిలో నుండి తీసి_ అనే మాటలు దావీదు మొదటి స్థితిని జ్జ్యపాకం చేస్తున్నాయి (దావీదు గొర్రెల కాపరిగా ఉండటం).

ఇప్పుడు గొర్రెల కాపరియైన దావీదు, దేవుని ప్రజలకు రాజుగా ఉండుట గొప్ప భాగ్యము_ధన్యత. ఆ ధన్యతకు దేవుడే దావీదును ఎన్నుకొనియున్నాడు తప్ప ఈ గౌరవానికి అర్హతకు దావీదు ఏమీ చేయలేదు. దావీదు, గొఱ్ఱెల కాపులో నున్న నీకు సింహాసనం ఇవ్వడం నా నిర్ణయం (ఉద్దేశ్యంతో కూడిన నా నిర్ణయము) ఆ ఉదేశ్యాన్ని నెరవేర్చుకునే క్రమములో చొరవ నాదే. చర్య నాదే. దేవుని కృప మాత్రమే దావీదుకు ఈ ధన్యత నిచ్చెననునది స్పష్టం. దేవుడు ఎన్నుకొనిన ప్రజలను నడుపుటకు ఎన్నుకోబడుట ప్రాముఖ్యమైయున్నది గౌరవముతో కూడిన ధన్యతయైయున్నది.

ఇక్కడ మరొక విషయాన్ని  గమనించవలసి యున్నాము_ అదేంటంటే_ సర్వశక్తిగల సైన్యమునకు అధిపతి అయిన దేవుడు, తన మాటను జవదాటని సైన్యమును, తనను నిత్యము సేవించుచున్న సైన్యమును కాదని దావీదును పట్టించుకోవడం ధన్యతను ఇవ్వడం గొప్ప విషయం కదా. అసలు దావీదును దేవుడు పట్టించుకోవలసిన అవసరం లేదు. కాని తన గొప్ప ప్రేమలో కృపలో దావీదును పైకిలేవనెత్తడం, విలువను కలుగజేయడం గొప్ప విషయం.

దేవుడు దావీదును ప్రేమించుచున్నాడని దావీదు పట్ల కృపను చూపించుచున్నాడనే విషయాన్ని “యెహోవా నీకు తోడుగానున్నాడు” అనే ప్రవక్తమాటలు యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసియున్నాడు (1) అనే మాటలు తెలియజేస్తూవున్నాయి. దేవుని కృప మాత్రమే దావీదుకు సంపూర్ణ విజయము ఇచ్చెననునది స్పష్టము. దేవుని కృప దావీదుపట్ల లేకపోతే దావీదు ఏదో ఒక యుధ్ధములో మరణించి వుండేవాడు.

దావీదు ఆలయాన్ని నిర్మించడం దేవుని ప్రణాళిక కాదు. అందుకు దేవుడు మరొకరిని ఎన్నుకొనియున్నాడు. దేవుడు దావీదును ఎందుకని ఎన్నుకొనియున్నాడో ఆ ఉద్దేశ్యములో దావీదు చేయవలసిన ఇతర పనులు దేవునికి ఉన్నాయి. దేవుని ప్రత్యేకమైన ప్రజలను పాలించుటకు ఒకనిని  దేవుడు గొర్రెల దొడ్డి నుండి తెచ్చి రాజును చేసియున్నాడు. ఆయనే వానిని విజయవంతునిగా చేసియున్నాడు. ఇది తన ప్రజల పట్ల అప్పటి ప్రస్తుత పరిస్థితులలో/వారి భవిష్యత్తులో వారికీ ఏది ప్రాముఖ్యమో వాటి విషయములో దేవుని ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూవుంది.

అన్వయము: దేవుడు మనలను  ప్రేమించుచున్నాడనేది మన పట్ల కృపను చూపించుచున్నాడనేది బహు స్పష్టం. దేవుడు మన పట్ల  ఎలా వ్యవహరించియున్నాడో ఒక్కసారి జ్జ్యపాకమునకు తెచ్చుకొండి. మనము ఒక్కప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఉండేవారం?

ఆత్మీయమైన విషయములో _ మన అపవిత్రతను బట్టి _ దేవుని సన్నిధానమునుండి వెలివేయబడిన వారముగా ఉన్న మనలను; మన పాపములను బట్టి_ దేవునికి అసహ్యులముగా ఉన్న మనలను; మన అవిధేయతను బట్టి_ దేవుని ఉగ్రతకు పాత్రులముగా ఉన్న మనలను; మన దోషములను బట్టి_ శిక్షార్హులముగా  ఉన్న మనలను; మన అతిక్రమములను బట్టి _ దేవుని దృష్టికి అనర్హులముగా ఉన్న మనలను; మన అపరాధములను బట్టి _ పనికిరానివారముగా ఉన్న మనలను; మన స్వనీతిని బట్టి_ ఆయన దృష్టికి మురికి గుడ్డలు ధరించుకొనియున్న తిరుగుబాటుధారులుముగా ఉన్న మనలను; దేవుడు తన కృపలో ఎన్నుకొనియున్నాడు.

లోకరీతిగా _ఒకప్పుడు మనమేమైయున్నామో ఎలా ఉండేవారేమో_ ఏమి ఉండేదో_ ఏమిలేదో_ మనకు తెలుసు. మరోలా చెప్పాలంటే_ కొన్నిసార్లు_ బంధువులకు దూరముగా, స్నేహితులు లేక, కుటుంబ సభ్యుల చేయూత లేక _ కన్నీటితో ఒంటరిగా బ్రతికిన రోజులు లేవా? విలువలేనివాడవుగా, గుర్తించబడని వాడవుగా ఇతరులు నీ పట్ల వ్యవహరిస్తూ వుంటే నిస్సహాయులుగా బాధతో బ్రతికిన రోజులు లేవా?_ నీ పేదరికాన్ని బట్టి, ప్రజలు నీ పట్ల కఠినముగా వ్యవహరించిన రోజులు లేవా? నిష్ప్రయోజకున్ని అనుకొన్న నిన్ను దేవుడు ప్రేమించుచు కృపలో నిన్ను ఎన్నుకొని యున్నాడనేది స్పష్టం.  అందుకు ఆయన ప్రేమ కృపలే కారణం. 

సర్వశక్తిమంతుడు మరియు ప్రజలకు కనికరమును చూపుటయందును విడుదల కలుగచేయుట యందును ప్రధానముగా ఆనందించు దేవుడు తన కుమారుని ద్వారా తన కుటుంబములోనికి ఈ రోజు నిన్ను చేర్చుకోవాలను కొన్నది నిన్నుతన కుటుంబంలోకి ఆహ్వానించాలనేది ఆయన నిర్ణయం.  అందుకు మనం చేసినది ఏమిలేదు. చొరవ దేవునిదే. చర్య దేవునిదే. ఆయనే మన స్థితిని మార్చి మనకు గొప్ప ధన్యతను కలుగ చేసియున్నాడు. ఈ విషయం ఏమి తెలియజేస్తుందో తెలుసా? ఆయన అపాత్రుల పట్ల కనికరయుతుడైయున్నాడు అని తెలియజేస్తూవుంది.

2

9నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను. 10మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయు లను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపట్టకయుండునట్లుగా చేసి 11నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి యున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయున దేమనగా–నేను నీకు సంతానము కలుగ జేయుదును.

యెహోవా నిర్ణయం, చొరవ, చర్య లో యెహోవా దావీదును యెట్లు ఆశీర్వదించియున్నాడో చెప్తూ, 9 నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను.

తోడుగానుండి_ పోవు చోట్లనెల్లను (always/every place)_  ఒక్క చోటుకు, కొన్ని క్షణాలు, లేదా కొన్ని పరిస్థితులకు మాత్రమే పరిమితమని దీని అర్ధం కాదు. రాజైన దావీదు జీవితాన్ని పరిశీలిస్తే, దేవుడు దావీదుకు ఎలా తోడుగా ఉన్నాడో మనం చూడొచ్చు. దావీదు జీవితం నుండి ఒక విషయాన్ని మీకు గుర్తుచేయాలను కొంటున్నాను_ మొదటిగా, దేవుడు నిర్ణయం బట్టి దావీదు రాజుగా అభిషేకింపబడ్డాడు. సౌలు దావీదుకు రాజ్యాన్ని వెంటనే ఇవ్వలేదండి, ఎన్నో సంవత్సరాలు సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు తన ప్రాణం చేతపట్టుకొని పరిగెడుతూనే వున్నాడు. దావీదు ఎప్పుడు దీని విషయమై దేవునికి పిర్యాదు చెయ్యలేదు. నిర్ణయం దేవునిదే, చొరవ దేవునిదే చర్య దేవునిదే అని దావీదు నమ్మాడు. సౌలు దావీదును చంపలేక పోయాడు. దావీదు యెరూషలేమును తన రాజధానిగా చేసుకున్నప్పుడు ఆ ప్రాంతములో నివసించుచున్న బలవంతులైన యెబూసీయులు తమ ప్రాంతమునుండి దావీదును దూరముగా ఉంచడానికి చాలా ప్రయత్నించారు, కానీ దావీదును గెలవలేకపోయారు. దావీదు పాలస్తీనాను పాలిస్తూవున్నప్పుడు, ఫిలిష్తీయులు మాటిమాటికి దావీదు మీద దాడి చేసినప్పటికిని దావీదును గెలవలేకపోయారు.

ఈ రోజు ఆయన నీకు కూడా తోడుగా వున్నాడు. “ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అని అర్ధం”  అను మాటలు మీకు జ్జ్యపాకం ఉన్నాయి కదా.  నీవు పోవు చోటెల్లా నీకు తోడుగా నుండుటకే  ఆయన వచ్చియున్నాడు. అందుకు మనమేమి చెయ్యలేదు. ఆయన ప్రేమ కృపలే అందుకు కారణం.

ఆయన నీతో వున్నాడు. ప్రతివిషయములో నిన్ను భయపెడుతూ ఇబ్బందులకు గురిచేస్తూవున్న నీ శత్రువుల నుండి నిన్ను తప్పించుటకు, నీవు నమ్మదగిన వానిగా, నీకు స్నేహితునిగా,  సన్నిహితునిగా, నీ పక్షమందుండు వానిగా, నీకు ఆలోచనకర్తగా, నిన్ను సరియైన దిశలో నడిపించువానిగా, నీ పక్షమందుండి యుద్ధము చేయువానిగా, నీ మంచి చెడ్డలను పట్టించుకొనువానిగా, ఆఖరికి నీవు మరణం లోనికి దిగిననూ నీకు తోడుగా ఉండుటకు ఆయన నీతో వున్నాడు, నమ్ము.

నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, నిర్మూలము చేయటం అనే మాటకు అర్ధం, ఒక కలుపు మొక్కను తీసివేసి దానిని నశింపజేయటం.

ఆయన నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలము చేస్తూవున్నాడు (కలుపు మొక్కను పెరికి పారవేయడం). కాని మన అవిశ్వాసంనుబట్టి  ప్రతిరోజు ఎందరో శత్రువులను మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుని మాటలను విని వాటి ప్రకారము చేస్తూ, జీవించవలసియున్న మనం అవిశ్వాసమును దాని స్వభావమును బట్టి, మనము మన జీవితములో ప్రతి రోజు కలుపు మొక్కలను నాటుకొంటుంటే, నీ దేవుని పని వాటిని పీకి పారవేయడమా? విశ్వాసి అనుకొంటున్న అవిశ్వాసి మారవా? నువ్వు నీ జీవితములోనికి ఆహ్వానించిన నీ శత్రువులైన నీ స్నేహితులు నిన్ను దేవునికి దూరం చేస్తున్నారు, చూసుకొ, సరిచేసుకో. యేసుకు శత్రువు స్నేహితుడు అయిన యూదా ఇస్కరియోతు యేసు జీవితములో కూడా వున్నాడండి. యేసయ్య వానికి స్నేహితునిగా ఉండుటకు పిలిచియున్నాడు. వాడు యేసును మరణానికి అప్పగించి యున్నాడు. నువ్వు స్నేహించి నీ జీవితములోనికి ఆహ్వానించినా నీ శత్రువులు నువ్వు దేవుని దీవెనలో ఉండకుండా తప్పించుటకు ప్రయతిస్తువున్నారు. గుర్తించుచున్నావా?

లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను, దేవుడు దావీదుకు లోకములోని ఘనులైన వారికి కలుగు పేరును కలుగజేసియున్నాడు. దావీదు సంతానమైన మెస్సయ్యా, దేవుని కుమారుడైన క్రీస్తుకు పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు కలుగజేసి యున్నాడు.

నేడు మనకును కలుగజేసియున్నాడు_ కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన  కొట్టివేయబడని నిత్యమైన పేరు మీకు పెట్టియున్నాడు. మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవి, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.

మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా–నేను నీకు సంతానము కలుగజేయుదును.

ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటుదును అను మాటలకూ, ఆనాడు ఇశ్రాయేలీయులు చుట్టూ అనేకమైన జాతులు రాజ్యాలు వున్నాయి, వాళ్ళు తన ప్రజలను నాశనము చేయకుండా కాపాడుదునని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ఎందుకంటె ఇశ్రాయేలీయులను ఎన్నుకొనిన నిర్ణయం దేవునిదే చొరవ దేవునిదే చర్య దేవునిదే. ఇప్పటి వరకు ఆ వాగ్దానాన్ని మనము చూస్తునే వున్నాం.

ఈ వాగ్దానము 3000 సంవత్సరాల క్రిందటిదైనను ఈ వాగ్దానము మనకు కూడా వర్తిస్తుంది. దేవుని కనికరము దావీదుకు గొప్ప స్థితిని కలుగజేసింది. దేవుని ప్రేమకు దావీదు అర్హుడు కానప్పటికిని దేవుడు ఆతని యెడల చూపించిన అపారమైన ప్రేమే దావీదును గొప్ప స్థితిలో నిలిపింది.  ఈ రోజు మీరు కూడా దేవుని కుమారుడైన క్రీస్తును బట్టి దేవునికి అమూల్యమైన వారుగానే వున్నారు. ఎందుకంటె మిమ్మల్ని ఎన్నుకొనిన నిర్ణయం దేవునిదే. చొరవ దేవునిదే చర్య దేవునిదే కాబట్టి. ఆయన ప్రేమ కృపలే ఇందుకు కారణం కాబట్టి ఆయనను బట్టి కాపాడబడుతూనే వున్నారు.

గుర్తిపులేని గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకొని అతని శత్రువులు అతనిని ఎన్నడూ జయించకుండా ఉండేటట్లు దేవుడే చేసాడు. దేవుని చేత ఎన్నుకోబడిన మనమందరం కూడా శత్రువుల చేత జయింపబడకుండునట్లు ఈ వాగ్దానము మనకు కూడా వర్తిస్తుంది. ఈ మాటలు ఏమి తెలియజేస్తున్నాయంటే, ఆయన తన స్వంతమైన వారి పట్ల తాను పిలుచుకొనిన వారి పట్ల కనికరమును చూపుచున్నాడు అని తెలియజేస్తున్నాయి.

3

నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దావీదూ, నీ కుమారుని బట్టి నీ రాజ్యమునకు అంతం ఉండదని నీ రాజ్యము శాశ్వతమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఇశ్రాయేలీయులు ఈ మాటలను ఈ లోకరీతిగా ఈ లోకసంబంధమైన రాజ్యమునకు అన్వయించుకొంటున్నారు. మన పాఠము ఈ లోకసంబంధమైన రాజ్యమును గురించి మాట్లాడటం లేదు. 

ఇక్కడ దావీదు సంతానమైన మెస్సయ్య ద్వారా తాను స్థాపింపబోవుచున్న రాజ్యమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడైన మెస్సయ్య యేసే. ఆయన వచ్చాడు, మహిమయుక్తమైన కృపా రాజ్యమును స్థాపించి యున్నాడు. దేవుడు ప్రేమతో ప్రజల హృదయములను పాలించుచు వున్నాడు. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యముగా విశ్వవ్యాప్తితమై అందరికి సంబందించిన రాజ్యమైయున్నది.

ఇశ్రాయేలు మరొకసారి వారి శత్రువుల చేత నాశనము చెయ్యబడవచ్చు దావీదు తరువాత అసిరియులు బబులోనీయులు నాశనము చేసినట్లుగా, యేసు తరువాత రోమీయులు నాశనము చేసినట్లుగా. కాని దావీదు సంతానము ద్వారా దేవుడు స్థాపించిన ఆయన రాజ్యములో అలా జరగదు.  ప్రపంచము ఉన్నంత కాలము ఆయన రాజ్యము కొనసాగుతూనే ఉంటుంది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ ప్రపంచము ముగిసినప్పుడు ఆ రాజ్యము ఇంకా మహిమయుక్తమైన రాజ్యముగా ఉంటుంది ఆయన రాజ్యములో నివసించేవాళ్ళు శాశ్వత కాలము జీవిస్తారు.

ముగింపు: మన తండ్రియైన దేవుడు మన పట్ల ఎలా వ్యవహరించియున్నాడో జ్జ్యపాకము చేసుకున్నాం. నిష్ప్రయోజకులం అనుకొన్న మనలను దేవుడు ప్రేమించుచు కృపలో ఎన్నుకొని యున్నాడనేది స్పష్టం అని అందుకు ఆయన ప్రేమ కృపలే కారణం అని తెలుసుకున్నాం. సర్వశక్తిమంతుడు మరియు ప్రజలకు కనికరమును చూపుట యందును, విడుదల కలుగచేయుట యందును ప్రధానముగా ఆనందించు దేవుడు తన కుమారుని ద్వారా తన కుటుంబములోనికి ఈ రోజు నిన్ను చేర్చుకోవాలను కొన్నది మనలను తన కుటుంబంలోకి  ఆహ్వానించాలనేది  ఆయన నిర్ణయం అని చొరవ దేవునిదేనని చర్య దేవునిదేనని తెలుసుకున్నాం. అపాత్రులమైన మన స్థితిని మార్చిమనకు గొప్ప ధన్యతను కలుగ చేసియున్న దేవునికి కృతజ్జ్యతను తెలియజేస్తూ జీవిధ్ధాం.

మనలను దేవుని ప్రేమకు కృపకు పాత్రులుగా ఎంచిన మన దేవుడు నిజముగా ప్రజలకు కనికరమును చూపుట యందును విడుదల కలుగచేయుట యందును ప్రధానముగా ఆనందించువాడనే విషయాన్ని మరచిపోకుందాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడని నమ్ముదాం. మనలను మన దేవునికి దూరము చేసే శత్రువులను గుర్తించి దేవుని సహాయమును వేడుకొందాం. దేవుడు మనకిచ్చిన గుర్తిపును పోగొట్టుకొనకుండా వుందాం. మనము దేవుని శాశ్వతమైన రాజ్యములో సభ్యులమని మరచి పొకుందాం. అట్లే మనలను విశ్వాసమునందు బలపరచుట ద్వారా మన హృదయములయందు క్రీస్తూపాలనను ఆయనే వ్యాపింపజేయాలని కోరుకొందాం. క్రీస్తు యొక్క రాజ్యము తన మహిమ నంతటిని కనపరచుచుండగా సాతాను రాజ్యములన్ని ఒక పాతకాలపు జ్జ్యపాకము వలె కనుమరుగగునుగాక. ఆమేన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.