బైబులు దేవుని వాక్యమైయున్నది అనే సత్యము మనకు ఎటువంటి నిశ్చయతను కలుగజేయు చున్నది?
1. సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మనుష్యులు తమ ఆలోచనలను, ఉద్దేశ్యాలను అమలు చేయలేక, లేదా వారికి ఇంకా మంచి ఆప్షన్ ఉన్నందు న, లేదా వారి మనస్సులు ఏదైనా అనుకోని సంఘటనల ద్వారా లేదా వారి కోరికల ద్వారా మార్చబడినప్పుడు మార్చుకొంటూ వుంటారు. ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి (యున్నాడు). దేవుడు చూసినట్లుగా, మనుష్యులు పూర్తిగా పాప నియంత్రణలో వున్నారు. చెడుతనము – ఇది శరీరానికి సంబంధించినది. మనిషి యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ వుంది. వారి హృదయము యొక్క తలంపుల లోని ఊహ – ఆలోచన అనేది మనస్సు యొక్క వైఖరి; రూపం. హృదయము యొక్క తలంపులలోని ఊహ స్వభావసిద్ధముగా పతనమైన శరీరముచే నియంత్రించబడుతూవుంటుంది. కాబట్టే, రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తూవుంది.
రోమా 3:4, ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనుష్యులందరు పాపదోషమును బట్టి అబద్ధికులై యున్నారు.
భౌతిక లాభం కోసం వారి తపనలో ఆయన చిత్తాన్ని విస్మరించినట్లు నటించే వ్యక్తులు కూడా అబద్ధికులే. సంఖ్యాకాండము 22:19 కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతోనిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. బిలాము సేవలకు ఎక్కువ ప్రతిఫలం ఇవ్వాలనే ప్రతిపాదన అతనిని “ప్రభువు ఆజ్ఞ” ఏమిటో తెలియనట్లు నటించేలా చేసింది (18). బిలాముకు పాఠం నేర్పించడానికి, ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి–ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చాడు. 2 పేతురు 2:16 ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెనని చెప్తూవుంది. భౌతిక లాభం కోసం తపనలో ఆయన చిత్తాన్ని విస్మరించినట్లు నటించిన వ్యక్తులలో ఇతడు ఒక ఉదాహరణ. ఆయన అతడి అపేక్షిత లక్ష్యాన్ని సాధించడానికి అతనిని అనుమతించాడు. అదే టైములో అతడి తిరుగుబాటు స్వీయ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఆయన దీనిని ఒక సాధనంగా వాడుకోవటాన్ని ఈ వృత్తాంతము తెలియజేస్తూవుంది.
ఆపేక్ష సత్యవంతుడైన దేవునిని, దేవుని కార్యములను మరచిపోయేటట్లు విస్మరించేటట్లు నటింపజేయటమే కాకుండా తిరుగుబాటుకు ప్రేరేపిస్తుంది. కీర్తనలు 106:13-15 అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనక పోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారి కిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.
ఎందుకంటే, భౌతిక లాభం (ఆపేక్ష) దేవుని ఉదేశ్యాన్ని అర్ధం చేసుకోనివ్వక మనిషి దానిని చూసి గర్వపడేట ట్లు చేస్తూ తుదకు దేవునిని తృణీకరించేటట్లు దూషించేటట్లు చేస్తుంది, దారితప్పిస్తుంది. హెచ్చింపబడటం మరియు పతనమవ్వ టంతో సహా చరిత్రపై దేవుడు నియంత్రణలో ఉన్నాడు అనే విషయాన్ని మరచిపోయే టట్లు చేస్తుంది. యెషయా 10:12-14 కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. అతడు– నేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానా లను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని. పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనము ల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొను నప్పుడు రెక్కను ఆడించునదియై నను నోరు తెరచునది యైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకము ను ఏరుకొనుచున్నానని అనుకొనును. చరిత్రలో దేవుడు తన ప్రజలకు క్రమశిక్షణను నేర్పించుటకు, వారిని ప్రక్షాళన చేయుటకు ఆయన అష్షూరును సాధనంగా ఎంచుకున్నాడు. అష్షూరు, ప్రభువు లక్ష్యాలను నెరవేర్చింది. నిజమే, కాని దేవుని ఉదేశ్యాన్ని అష్షూరు అర్ధం చేసుకోలేదు. అష్షూరు విజయాలు పెరిగేకొద్దీ, అష్షూరు ప్రభావం పెరిగింది, అష్షూరు భూభాగం విస్తరించింది. ప్రతి విజయంతో, అస్సిరియా గర్వంగా అతిశయపడుతూ దేవునిని ధిక్కరించే స్థాయికి ఎదిగింది. అష్షూరు రాజు తన శత్రువులనే కాకుండా చివరకు యెహోవాను కూడా దూషించాడు. అటువంటి ధిక్కరించే శక్తివంతమైన దేశం కూడా క్రమశిక్షణతో ఉండాలి. దేవుని శిక్షను తన స్వభావమును బట్టి అది చివరకు అనుభవించింది.
2. యోహాను 10: 35 లేఖనము నిరర్థకము కానేరదు గదా, (అని యేసు చెప్పెను). లేఖనాల్లోని ప్రతి పదం దేవుని పదమే, అవి సత్యమే. లేఖనాలు దేవుని యొక్క శాశ్వతమైన సత్యాలు కాబట్టి ఎన్నటికీ రద్దు చేయబడవు, విచ్ఛిన్నం చేయబడవు, పక్కన పెట్టలేము; ఎప్పుడూ సవాలుచేయలేనివి. దేవుని మాటలకున్న అధికారాన్ని, శక్తిని ప్రశ్నించలేము, ఆదికాండము 2:7, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. కీర్తనలు 33:6, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. దేవుని మాట సమస్త సృష్టిని ఉనికిలోకి తెచ్చింది మరియు దానిని సంరక్షిస్తూ పరిపాలిస్తూవుంది. మాటలు నోటి ఊపిరి ద్వారా ఏర్పడతాయి. మరి దేవుని నోటి ఊపిరి (మాట) అనేది జీవానికి పర్యాయపదంగా ఉంది. 2 తిమోతికి 3:16 దైవావేశము వలన ప్రతి లేఖనము కలిగియున్నదని చెప్తూవుంది. బైబిలులోని ప్రతి మాట దేవుని నుండే కలిగియున్నవని ఈ వచనము చెప్తూవుంది. ఆయన మాటలు విశ్వాసులను (నీతిమంతులను) సృష్టిస్తూవున్నాయి మరియు వారిని బలపరుస్తూవున్నాయి మరియు పరిశుద్ధాత్మ ద్వారా రక్షింపబడు విశ్వాసానికై పనిచేస్తూవున్నాయి.
3. యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము. యోహాను 17:15-19 శిష్యులను లోకం నుండి బయటకు తీసుకువెళ్లి వారిని సురక్షితంగా ఉంచమని యేసు దేవుణ్ణి ప్రార్థించలేదు. యేసు నిష్క్రమణ తరువాత వారు దేవుని కొరకు చేయవలసిన పనిని కలిగి ఉన్నారు. దుష్టుని నుండి వాని మార్గాల నుండి దేవుడు వారిని కాపాడాలని ఆయన ప్రార్థించాడు (1 యోహాను 5:19). దేవుని నుండి తమ మిషన్‌ను కొనసాగించడంలో శిష్యులు తీవ్రమైన, నరకప్రాయమైన వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసు ఎదుర్కొన్నదానికంటే తక్కువ వ్యతిరేకతను వారు ఆశించలేరు. వారికి యేసు ప్రార్థన అవసరం.
శిష్యులను తన కోసం వేరు చేసి, తన పని చేయడానికి వారిని అంకితం చేయమని యేసు తండ్రిని కోరాడు. “ప్రతిష్ఠ చేయుము” అనే పదానికి అర్థం అదే. దీనిని “పవిత్రపరచు” అని కూడా అనువదించవచ్చు. వారి పరిచర్య కోసం వారిని ప్రతిష్ఠించమని యేసు దేవుణ్ణి ప్రార్ధించాడు. దేవుని వాక్యమైన దేవుని సత్యంలో శిష్యులు ప్రత్యేకముగా ఉన్నారు (యోహాను 8:31, 32). పరిశుద్ధతకు, శక్తికి, రక్షించే విశ్వాసానికి మూలం దేవుని వాక్యం. దేవుని వాక్యము దేవుని సత్యము.
అలాగే యేసు దేవుని వాక్యమైయున్నాడు సత్యమైయున్నాడు. మన దగ్గర ఉన్న దేవుని వాక్యం మనల్ని యేసుతో సన్నిహితంగా ఉంచుతుంది. వినండి, నమ్మండి మరియు జీవించండి.
యేసు తండ్రికి ఎలా ఉన్నాడో, శిష్యులు యేసుకు కూడా అలానే వున్నారు. తండ్రి కుమారుడిని లోకానికి పంపాడు. ఇప్పుడు కుమారుడు తన శిష్యులను లోకానికి పంపాడు. వారిని తన అపొస్తలులుగా (“పంపబడిన వారు”) చేశాడు. వారు తన సత్యంలో ప్రతిష్టించబడులాగున యేసు వారి రక్షణను గెలవడానికి తనను తాను ప్రతిష్టించుకున్నాడు. ఇది జరిగింది, మరియు అది ఆయన సంఘములో కొనసాగుతూవుంది.
జవాబు: బైబిల్ యొక్క ప్రతి మాట దేవుని మాటే, బైబులు దేవుని వాక్యమైయున్నదను సత్యము బైబిలునందు తప్పులు లేవని మరియు అది చెప్పే ప్రతి విషయము సత్యమైయున్నదను నిశ్చయతను మనకు కలుగజేయుచున్నది.
4. కీర్తనలు 119:114,116 నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను. నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. (కీర్తనలు 9:9 నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును. కీర్తనలు 27:5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును). నాకు మరుగుచోటు నా కేడెము నీవే – దేవుని రక్షణలో అతడు క్షేమంగా ఉంటాడనే ఆలోచన. శత్రువు నుండి దాచబడడం, కాని ఇక్కడ తక్షణ రిఫరెన్స్ పాపం మరియు పాపం యొక్క పరిణామాలు. దేవుని దగ్గరకు పారిపోవడం ద్వారా పాపం మానవులపైకి తెచ్చే అన్ని చెడుల నుండి అతడు సురక్షితంగా ఉంటాడనే ఉదేశ్యము. (నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను – 43 నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము, నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి యున్నాను. దేవుని పక్షముగా మాట్లాడలేని పరిస్థితికి, ఆత్మ సంబంధమైన దుస్థితికి తనను దిగజారనీయ వద్దని రచయిత ఇక్కడ ప్రార్దిస్తూవున్నాడు. కీర్తన 51:12-15 లో రాసిన ప్రకారం ఇది దావీదుకు జరిగింది). 81 నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశపెట్టుకొని యున్నాను. (కీర్తనలు 73: 26 నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము ను స్వాస్థ్యమునై యున్నాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయింది. ఐడియా ఏమిటంటే, అతని బలం క్షీణించి పోయింది; అతడు బలహీనుడు మరియు శక్తిహీనుడయ్యివుండుటనుబట్టి ఆయన రక్షణ కొరకు అతని ప్రాణము సొమ్మసిల్లుచున్నది. ఏదైనా బలమైన భావోద్వేగం మనలను లోపరచుకోవచ్చు. దేవుని మీద ప్రేమ – ఆయన అనుగ్రహంకై ఆశ – పరలోకము కోరకై వాంఛ – ఆయన రక్షణ కొరకు ప్రాణమును సొమ్మసిల్ల చేసేంత తీవ్రమైనదిగా ఉండొచ్చు). 147 తెల్లవారక మునుపే మొఱ్ఱపెట్టితిని, నీ మాటలమీద నేను ఆశపెట్టు కొని యున్నాను. నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను – నేను నీ వాగ్దానాలను విశ్వసిస్తున్నాను, వాటిని బట్టి సంరక్షింపబడుతూవున్నాను, లేకుంటే పూర్తిగా విఫలమయ్యే నా శక్తులు నీ మాటల ద్వారా ఆదరింపబడుతూవున్నాయి. కాబట్టి నీ మాటలమీద నేను ఆశపెట్టు కొని యున్నాను.
5. సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? ఎందుకంటే ఆయన మనస్సులో ఎటువంటి వైవిధ్యం ఉండదు మరియు ఆయన మాట యిచ్చి వెనుకకు పోడు. ఆయన తన మాటను ఎప్పటికీ మరచిపోడు, ఆయన అన్ని సంఘట నలను ముందుగానే చూస్తాడు, ఆయన నిర్వహించగలడు. ఆయన పెదవుల నుండి వచ్చినది ఎప్పటికీ మార్చబడదు కాని అది ఖచ్చితంగా నెరవేరుతుంది, (కీర్తన 89:34 నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను; యెషయా 14:24 సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును).
6. 1 కొరింథీయులకు 2:4,5 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. విశ్వాసం మనుష్యుల జ్ఞానంపై కాదు, దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుంది. మనుష్యుల జ్ఞానం విశ్వాసులను చేయదు; దేవుని జ్ఞానం మరియు శక్తి మాత్రమే చేయగలదు. దేవుని సత్యం బోధకుని మాటలను వినే వారి హృదయాలను ఒప్పిస్తుంది కాబట్టి దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుంది.
జవాబు: బైబులు దేవుని వాక్యమైయున్నదను సత్యము బైబిలులోని సమస్త వాగ్ధానములను దేవుడు నెరవేర్చునని మనము ఎరిగియున్నాము గనుక వాటిని నమ్మగలమను నిశ్చయతను మనకు కలుగజేయు చున్నది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.