2 కొరింథీయులకు 5:18,19వచనాలు సమస్తమును దేవునివలననైనవి; దేవుడు మన అపరాధములను మనమీద మోపక, క్రీస్తునందు మనలను తనతో సమాధానపరచుకొనియున్నాడు, అని చెప్తూవున్నాయి.
ఈ వచనంలో చాల ప్రాముఖ్యమైన మాట “సమాధానపరచుకొనియున్నాడు“, మొదటగా ఈ మాటకు అర్ధాన్ని తెలుసుకొందాం. సమాధానపరచుకొనియున్నాడు అనే పదం యొక్క ప్రాథమిక అర్ధం “మార్చడం.” థాయర్ గ్రీక్-ఇంగ్లీష్ లెక్సికాన్ ఆఫ్ ది న్యూటెస్టమెంట్, ఈ పదం మొదటిసారిగా “మనీఛేంజర్స్ వ్యాపారంలో, సమాన విలువలను మార్పిడి చేసుకోవడం” అనే అర్ధంలో ఉపయోగించబడిందని చెప్తూవుంది. ఈ పదము మన contextలో మనుష్యులకు మరియు దేవునికిగల సంబంధము విషయములో జరిగిన “మార్పిడిని” తెలియజేస్తూవుంది. మనుష్యులకు దేవునికి మధ్యన గల శత్రుత్వము దేవునితో స్నేహానికి మార్చబడియున్న విషయాన్ని ఈ పదము తెలియజేస్తూవుంది.
మార్పిడి జరగాలంటే రెండు పార్టీలు ఉండాలి. దేవుడు మనుష్యుల మధ్య జరిగిన మార్పిడిని గురించి ఈ పదము తెలియజేస్తూవుంది కాబట్టి ఇక్కడ రెండు పార్టీలలో ఒకరు దేవుడు మరొకరు మానవులందరు. ఇక్కడ సమస్య కేవలం రెండు పార్టీలలో ఒకదాని వల్ల మాత్రమే సంభవించిందని స్పష్టమవుతోంది. ఈ విషయాన్నే “దేవుడు మన అపరాధములను మనమీద మోపక” అనే మాటలు తెలియజేస్తూవున్నాయి. దేవుడు చెయ్యకూడదని చెప్పిన దానిని చేసిన ఆదాము హవ్వలు ఆయన ఆజ్జ్యను ఉల్లగించి, పాపమును బట్టి చెడి, నేరస్థులుగా మారి, వారి మీదకు వారి పిల్లల మీదకు దేవుని శిక్షను తెచ్చుకొనియున్నారు. అప్పటి వరకు వారికి దేవునికి మధ్యనున్న సమాధానమైన స్థితి శత్రుత్వముగా మారిపోయింది. అపరాధమును బట్టి శిక్షావిధి క్రింద ఉన్నారు. పాపము వారి ద్వారా వారి పిల్లలకు సంక్రమిస్తూ, మానవులందరిని దోషులుగా మార్చేసింది. ఇప్పుడు రెండు పార్టీల స్టేటస్ ఒకసారి చూద్దాం: ఒకరు పరిశుద్దుడు_మరొకరు అపరిశుద్దులు/అపవిత్రులు. ఒకరు ప్రేమ_ మరొకరు శత్రువులు. ఒకరు అమర్త్యుడు/ అక్షయుడు_మరొకరు మర్త్యులు/క్షయులు. పాపమునుబట్టి చెడిన మానవులు, దేవునితో చెడిన వారి సంబంధమును బాగుచేసుకోలేరు. న్యాయాధిపతి అయిన దేవుడే మనుష్యులను నీతిమంతులుగా ప్రకటిస్తే తప్ప ఏ ఒక్కరు దేవుని శిక్షావిధిని తప్పించుకోలేరు.
అలాంటి పరిస్థితులలో వీరిద్దరి మధ్యలో ఉన్నసంబంధములో మార్పు రావాలంటే, పాపమును బట్టి చెడిన మానవుడు ఈ విషయములో ఏమి చెయ్యలేడు, కాబట్టి న్యాయాధిపతి అయిన దేవుడే మన మీద కనికరపడి ఏదన్నా చెయ్యాలి. ఖఛ్చితంగా ఇదే జరిగింది: స్పష్టముగా చెప్పాలంటే, మన స్థితిని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మార్చి (తనకు తానే చొరవ తీసుకొంటూ) మనలను తన మిత్రులుగా చేసికొనియున్నాడు. ఈ విషయాన్నే సమస్తమును దేవుని వలననైనవి అనే మాటలు తెలియజేస్తూవున్నాయి.
దేవుని కుమారుడైన క్రీస్తుద్వారా ఈ మార్పిడి జరిగియున్నదని మన పాఠము చెప్తూవుంది. అందుకు దేవుని కుమారుడైన క్రీస్తు ఏం చేసాడు అని మీరు అడగొచ్చు?
ఈ ప్రశ్నకు సంపూర్ణ అర్ధం రోమా 5:10 తెలియజేస్తూ, “దేవుని కుమారుడైన క్రీస్తుని మరణము ద్వారా ఈ మార్పిడి జరిగియున్నదని” అంటే దేవుని కుమారుడైన క్రీస్తుని మధ్యవర్తిత్వము ద్వారా అంటే దేవుని కుమారుడైన క్రీస్తు మన స్థానంలో జీవించి మరణించి మరణము నుండి లేచుట ద్వారా దేవునిని సంపూర్ణముగా సంతృప్తిపరచియున్నాడని తద్వారా దేవుడు లోకమును తనతో సమాధానపరచుకొని మరియు క్రీస్తు ద్వారా అమలు లోనికి వచ్చిన ఈ సమాధానమును అందరికి ఉచితముగా క్రీస్తులో ప్రకటించి ఉన్నాడని చెప్తూవుంది అంటే _ఒకవేళ మనుష్యులు క్రీస్తు మధ్యవర్తిత్వాన్ని వద్దనుకొంటే, దేవుడు మనుష్యులను చూసినప్పుడు, మనుష్యులకు దేవునికి మధ్యన క్రీస్తు ఉండడు కాబట్టి, మనుష్యులందరు ఆయన దృష్టికి పాపులుగా, జన్మ కర్మ పాపములను ధరించుకొనియున్న అసహ్యులుగా, ప్రమాదకరమైన పాపమనే విషముతో ఉన్నవారంగా, ఆ విషాన్ని వ్యాపింపజేసే వారంగా కనబడతాం. ఒకవేళ మనుష్యులు క్రీస్తు మధ్యవర్తిత్వాన్నికావాలనుకొంటే, దేవుడు మనుష్యులను చూసినప్పుడు, మనుష్యులకు దేవునికి మధ్యన క్రీస్తు ఉంటాడు కాబట్టి దేవుడు క్రీస్తు ద్వారా మనలను చూసినప్పుడు, అంటే మనుష్యులందరి పాపములకు ప్రాయచిత్త క్రయధన బలిగా అర్పింపబడియున్న తన కుమారుని ద్వారా దేవుడు మనలను చూసినప్పుడు, మన పాపాలన్ని క్రీస్తును బట్టి క్షమింపబడి తుడిచివేయబడి ఉండటం మూలాన్న సమస్తమును శోధించే ఆయన కన్నులకు పాపము కనబడదు, ఆయన మనలను నీతిమంతులుగా తనతో సమాధానపరచుకొనియున్నాడని దీని అర్ధం.
దేవుడు తన కుమారుని మరణము ద్వారా మనలను తనతో సమాధానపరచుకొనియున్నాడనే మాటలు మరొక విషయాన్ని కూడా బయలుపరుస్తూ, దేవునితో వ్యకిగతముగా సమాధానపడుటకు మానవులకున్న ఏకైక మార్గము క్రీస్తు నందు విశ్వాసముంచుటే అని తెలియజేస్తూవున్నాయి. అంటే పాపక్షమాపణను పొందుకొనుటకు ఏకైక మార్గము క్రీస్తే అని తెలియజేస్తూవున్నాయి. అంటే పాత క్రొత్త నిబంధనలు ప్రకటిస్తున్న దేవుని క్షమాపణను గూర్చి, మాట్లాడుతున్న ప్రతి ప్రవచనము కూడా, యేసును గూర్చి సాక్ష్యమిస్తూ, యేసు దేవుడైయున్నాడు శరీరధారిగా వచ్చాడు, ఆయన ద్వారా పాపక్షమాపణ గెలవబడియున్నది అని తెలియ జేస్తూ, పాపక్షమాపణను పొందుకొనుటకు ఏకైక మార్గము యేసే అని చెప్తూ ఉన్నాయి. ఈ విషయాన్నే అపొస్తలులకార్యములు 10:43 తెలియజేస్తూ, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుదురని చెప్తూ ఉంది.
ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుట అను మాటలలో దేవుని క్షమాపణను గూర్చిన దేవుని నిత్య ప్రణాళికను యోహాను3:16 నందు యేసు సంక్షిప్తీకరించుచు, దేవుని సృష్టికే తలమానికమైన మనుష్యులు పాపమును చేసి నాశనమైనప్పటికి, వారి పాపములు దేవుడు వారిని ప్రేమించలేకుండా ఆపలేకపోయాయని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అని తెలియజేసియున్నాడు.
ఆ ప్రేమ మనుష్యులమైన మనకు సులభముగా అర్ధం కాదు. దేవుడు తాను సృష్టించిన మనుష్యులు మీద తన కున్న ప్రేమను బట్టి మనుష్యులను ప్రేమించుచున్నాడు తప్ప మన విలువను బట్టి యోగ్యతను బట్టి ఆయన మనలను ప్రేమించటం లేదు. దేవుడు పాపమును ఇష్టపడడు, పాపాన్ని ద్వేషిస్తాడు, కాని ఆయన పాపములో చిక్కుకొనియున్న మనుష్యులను ప్రేమించుచున్నాడు కాబట్టే ఆయన పాపముతో వ్యవహరించవలసి వచ్చింది. అందులో భాగముగా ఆయన తాను ప్రేమించిన లోకము కొరకు త్యాగము చేస్తూ తన ఏకైక కుమారుణ్ణి సమస్త మనుష్యుల పాపములను మోసికొనిపోవు దేవునిగొర్రె పిల్లగా అనుగ్రహించియున్నాడు. ఆ దేవుని గొర్రె పిల్లను విశ్వసించేవారు “నశించరు.” లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయనయందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను అని బైబులు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. అలాగే కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును అని కూడా బైబులు చాల స్పష్టముగా తెలియజేస్తూ ఉంది.
ఈ మాటలకు దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే, మానవులు పాపక్షమాపణను ఉచితముగా పొందుకోవచ్చునని, అట్లే క్రీస్తు లేకుండా దేవుని ధర్మశాస్త్రమును అంటే దేవుని న్యాయవిధులను నెరవేర్చుటకు చేసే ఎలాంటి మానవ ప్రయత్నము ద్వారా పాపక్షమాపణను పొందు కోలేమని దీని అర్ధం. క్రీస్తునందు విశ్వాసముంచుట అంటే, క్రీస్తు ద్వారా మానవుల కొరకు సంపూర్ణముగా సంపాదించబడి మరియు సువార్త ద్వారా ప్రకటింపబడుతూ ఉన్న పాపక్షమాపణ, లేక నీతిమత్వము అను వాటిని విశ్వసించుచున్నామని అని అర్ధం.
ఈ విశ్వాసము మనలను నీతిమంతులుగా ప్రకటిస్తూ ఉంది, విశ్వాసము కృపను అది ప్రకటిస్తున్న పాపక్షమాపణను ఆధారము చేసుకొని ఉన్నది కాబట్టి విశ్వాసము మానవుని కార్యము కాదు, ఈ హేతువుచేతను ఆ వాగ్దానము యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగల వారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైన దాయెను.
క్రీస్తు ద్వారా దేవుని సమాధానకార్యమును అంగీకరించుటకు విశ్వాసము ద్వారా నడిపింపబడి యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్న దేవుని మిత్రులారా మార్పు చెయ్యబడియున్న మీ స్థితిని బట్టి సంతోషించండి. క్రీస్తు ద్వారా దేవుని ఈ సమాధానకార్యము కొందరికే పరిమితం కాలేదు, అందరికి వర్తిస్తూ వుంది. అట్లే ఆ సమాధాన శుభవార్తను మానవులందరూ విశ్వసించులాగున అంతం వరకు దానిని ప్రకటిస్తూ ఉండాలని దేవునికి మిత్రులైయున్న ప్రతిఒక్కరికి విశ్వాసమనే బహుమానముతో పాటు దేవుడు ఆజ్జ్యను కూడా యిచ్చియున్నాడు. Amen.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.