ఐదవ భాగం
అంతిమ తీర్పు కోసం మీ సంసిద్ధతను పెంచుకోండి (3:1–18)
2వ అధ్యాయంలో అబద్ధ బోధకులపై కోప్పడిన తర్వాత, పేతురు ప్రవచనాత్మక మరియు అపొస్టోలిక్ సందేశాన్ని గౌరవించడం మరియు విశ్వసించే విధముగా జీవించడం అనే మునుపటి థీమ్‌లకు తిరిగి వస్తూ, మరోసారి ఆధ్యాత్మికముగా నిద్రమత్తులో ఉన్న “ప్రియులను” గద్దిస్తూ, వారికి ఒకప్పుడు బాగా తెలిసిన విషయాలను గుర్తు చేస్తూవున్నాడు.
1ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను 2పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.
క్రైస్తవులను గందరగోళపరచడమే సాతాను లక్ష్యం. మనం దేవుని ప్రేమను అనుమానించాలని, పాపాన్ని చాలా చిన్న విషయముగా తీసుకోవాలని; గర్వించాలని, నిరాశ లేదా ఉదాసీనతలో (వాడి చెడు ప్రయోజనాల కోసం ఏది బాగా పని చేస్తుందో దానిలో) ఉండిపోవాలని; మన దైనందిన జీవితంలో అజాగ్రత్తగా ఉండాలని; ప్రాపంచికతలో ఏపుగా పెరగాలని; చెత్తను ప్రేమించి ఐశ్వర్యమును విస్మరించాలని; ముఖ్యమైన సంబంధాల పట్ల అలక్ష్యముగా ఉండాలని; మన సాక్ష్యములో సిగ్గుపడుతూ నిశ్చలముగా ఉండాలని వాడు కోరుకొంటున్నాడు.
అయితే అందుకు విరుద్ధముగా, క్రైస్తవులను “ఆరోగ్యకరమైన ఆలోచనకు” పునరుద్ధరించడమే క్రీస్తు లక్ష్యం. పేతురు తన పాఠకుల మనస్సులను పునరుద్ధరించుటకు, మీ దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను (పాత నిబంధనను) మరియు ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా (కొత్త నిబంధనను) మీతో మాట్లాడుతుండగా, (ఆ మాటలను (ఆ ఆజ్ఞను) మళ్ళి వినండి జ్ఞాపకము చేసుకోండి అని అతడు వారిని తిరిగి వాక్యానికి నడిపిస్తూ, విశ్వాసుల ఎదుగుదలకు పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు ప్రాముఖ్యమేనని, రెండూ దేవుని ప్రేరేపిత లేఖనాలేనని, వీటి మధ్యన వైరుధ్యం గాని వైవిధ్యము గాని లేదని, రెండింటిలోని ప్రధాన కంటెంట్ రక్షకుడైన యేసుక్రీస్తేనని నొక్కి చెప్తూ వున్నాడు. అపొస్తలుల ఆజ్ఞ క్రైస్తవ సిద్ధాంతం యొక్క మొత్తం కంటెంట్‌ను క్లుప్తంగా వర్ణిస్తూవుంది, 1 యోహాను 3: 23, 24.
ఇక్కడ పేతురు ఉద్దేశ్యం ఏమిటంటే, అతని పాఠకులకు క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక సత్యాలను మరోసారి గుర్తు చేయడం, క్రైస్తవ బాధ్యతల నిర్వహణకు ఆచరణాత్మక సూచనలు ఇవ్వడం, వారి క్రైస్తవ విధులలో వారిని ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం, విశ్వాసులను మేల్కొల్పడం మరియు వారి విశ్వాసాన్ని విస్మరించవద్దని వారిని ఉత్తేజపర్చడం, నిజమైన క్రైస్తవ జీవితంలో నిలిచి ఉండమని చెప్పడం. తద్వారా అతడు వారి నిర్మలమైన క్రైస్తవ మనస్సులను, అంటే దేవుని వాక్య ఉపదేశానికి మరియు గద్ధింపుకు ఎల్లప్పుడూ తెరిచి ఉండే మనస్సులను కదిలించాలని మరియు సత్యానికి ఆయన వాక్యము మాత్రమే నమ్మదగిన ఏకైక మూలమని మరియు అది ఆధ్యాత్మిక శక్తికి అంతమే లేని మూలం అనే విషయాన్ని జ్ఞాపకము చేసి వారిని రేపుచున్నాడు.
3అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, 4–ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను. 5ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. 6ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. 7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నవి.
3వ వచనంలోని “అంత్య దినములు” అనేది కొత్త నిబంధన యొక్క పదబంధాలలో ఒకటి. ఇది క్రీస్తు యొక్క మొదటి రాకడ మరియు ఆయన రెండవ రాకడ మధ్య ఉన్న సమయాన్ని గురించి తెలియజేస్తూవుంది.
చర్చిలో ఎల్లప్పుడూ చొరబాటుదారులు ఉంటూనే ఉంటారు, అంత్య దినములలో వీళ్ళు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు (2 పేతురు 2:10, 2 పేతురు 2:12, 2 పేతురు 2:14, 2 పేతురు 2:18-19), ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని అపహసించుదురని పేతురు చెప్తూవున్నాడు.
ఆయన రాకడను గూర్చిన ఆ వాగ్దానం పూర్తిగా విఫలమైందని, అది నెరవేరుతుందనడానికి కనీస ఆధారాలు లేవని; దీన్ని నమ్మిన వారు పూర్తిగా భ్రమపడుతున్నారని వారు అపహాస్యము చేస్తున్నారు. ప్రారంభ క్రైస్తవులలో కొందరు, అపొస్తలుల కాలంలో కూడా, ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో కాలాన్ని నిర్ణయించడానికి శ్రీకారం చుట్టి ఉండవచ్చు, అప్పటి నుండి చాలా మంది చేసినట్లే; టైం గడిచేకొద్దీ, అంచనాలు పూర్తిగా విఫలమగుటను బట్టి అపహాస్యము చేస్తున్నారు. “రక్షకుని” యొక్క రెండవ రాకడకు సంబంధించిన అంచనాలు, ప్రపంచం అంతం దగ్గరలో ఉందనే టాపిక్ అట్లే దానితో ముడిపడియున్న అనేకమైన విషయాలను బట్టి ఇవి నెరవేరే సూచనలు లేవని ఆరోపించడం సులభం, ఎగతాళి చెయ్యడం తేలిక.
అట్లే, ప్రకృతి నియమాలు ఎప్పటిలాగే ఒకే విధంగా ఉన్నాయని, ప్రపంచంలో జరుగుతున్న అన్ని భౌతిక మరియు రసాయన ప్రక్రియలు ఎల్లప్పుడూ ఒకే విధంగా జరుగుతూ ఉన్నాయని, ఆ ప్రకృతి నియమాలు స్థిరంగా మరియు సుస్థిరంగా ఉన్నాయని, బయటి శక్తులు ఇప్పటివరకు వాటిలో ఎటువంటి జోక్యం చేసుకోలేదని, అటువంటి ప్రకృతి నియమాల స్థిరత్వానికి క్రీస్తు రెండవ రాకడ ఎలాంటి అంతరాయం కలిగించలేదని మరియు వాటిని అడ్డుకోలేదనేది వారి వాదన. ఆ వాదనలో వాళ్ళు, క్రైస్తవులారా, ప్రకృతి నియమాలు మారవు; పదార్థం శాశ్వతమైనది; మరియు ఈ ప్రపంచం శాశ్వతంగా ఉంటుంది. ప్రభువు రాకడను ఆశించిన పాత, క్రొత్త నిబంధన విశ్వాసులు తమ ఆశ నెరవేర్పును చూడకుండానే మరణించారు, సృష్టి ఆరంభం నుండి అన్నీ యథావిధిగానే కొనసాగుతున్నాయి. అందువలన ఇది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది అని అపహాస్యము చేస్తున్నారు. ప్రకృతి నియమాల స్థిరత్వం మరియు సంఘటనల ఏకరూపతపై ఆధారపడి ఇది నిస్సందేహంగా ఒక వాదనగా రూపొందించబడింది- వర్తమానం గతానికి కీలకమని భావించడం. దీనినే ఏకరూపతత్వం Uniformitarianism అని అంటారు.
మరికొందరు దేవుడు లోకముతో ఇంటరాక్ట్ అవుతాడనే వాస్తవాన్ని తిరస్కరిస్తూ, తీర్పు దినమును విశ్వసించడం విజ్ఞాన శాస్త్రానికి, హేతువుకు విరుద్ధమని అపహాస్యము చేస్తున్నారు. యేసు ప్రభువు చాలా కాలంగా తిరిగి రాలేదు కాబట్టి ఇక ఎప్పటికి రాడని వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు. ఈ భయంకరమైన అబద్దానికి డీఇజం (Deism, దేవతత్వం) అనే అబద్దపు బోధే కారణం. డీఇజంను విశ్వసించే వారి దృష్టిలో, సృష్టికర్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఉదాహరణకు ఒక పెద్ద గడియారంలా రూపొందించి తరువాత ఆయన అది తనంతట తానుగా నడిచేటట్లు చేసి అక్కడ పెట్టేసాడు. ఆయన దానిని చూస్తూ ఉన్నాడని దానిలో ఆయన ఇన్వోల్వ్ కాడని, దానితో ఆయన కనెక్ట్ కాడని వాళ్ళు నమ్మటమే అందుకు కారణం.
ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు విశ్వ క్రమం పై తప్పుడు అభిప్రాయాలను కలిగియున్నారు. అట్లే ఆనాటి అవగాహనలో, శరీరాలు మరియు భౌతిక ప్రపంచం, ఒక అధమ జీవిచే సృష్టించ బడ్డాయని కాబట్టి అవి చెడువి. కాబట్టే అన్ని భౌతిక పదార్ధాలు క్షయం, కుళ్ళిపోవడం మరియు మరణానికి లోబడి ఉన్నాయని, భౌతిక సృష్టి ఫలితంగా పతనం సంభవించిందని, వారి ప్రకారం, అసలు విశ్వాన్ని పునరుద్ధరించడానికి దేవుడు క్రీస్తును పంపాడని నమ్మేవాళ్ళు. నేటి క్రైస్తవులలో కొందరు విశ్వ క్రమం పై తప్పుడు అభిప్రాయమైన పరిణామ సిధ్ధాంతంను (Evolution) నమ్ముతున్నారు. దేవునికి the slow process of evolution and the “survival of the fittest” అనే క్రూరమైన పద్ధతి అవసరం లేదు. అంటే జీవులు కాలక్రమేణా జన్యుపరంగా ప్రవర్తనలో మార్పు చెందుతూ పరిస్థితులకు తగ్గట్లుగా రూపాంతరం చెందుతు మరింత సంక్లిష్టంగా అవి పెరిగే కొద్దీ, అవి వనరుల కోసం క్రూరంగా పోటీ పడుతూ, చంపుకొంటూ పర్యావరణ మార్పులకు అనుగుణంగా మనుగడ కొరకు పోరాటం చేస్తూ ఇప్పటి స్థాయికి చేరుకొన్న క్రూరమైన పద్ధతిని దేవుడు ఎన్నుకోలేదు. అదే నిజమైతే మనిషి నెమ్మదిగా మానసికముగా అభివృద్ధి చెందిన ఒక జంతువు మాత్రమే. ఆదాము హవ్వలు నిజం కానప్పుడు మొదటి పాపానికి వారిని మనం నిందించలేము. పరిణామ సిధ్ధాంతము ప్రకారము మనిషి దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్న ఒక జంతువు కాబట్టి నిజముగా మనలో పాపాలు ఉంటే మన పాపాలకు మనం జవాబుదారిగా ఉండనక్కర లేదు, ఎందుకంటే అప్పుడు పాపమనేది జీవులలో ఉన్న ఒక లోపము అవుతుంది. ఆ లోపానికి మనిషి బాధ్యత వహించనక్కర లేదు. అప్పుడు పాపి అనే సమస్యే లేదు. మరణాన్ని నిర్వచించాల్సి వస్తే దేవుని గొప్ప సృష్టి సాధనాలలో ఒకటిగా, మంచిదిగా అవసరమైన విషయంగా నిర్వచించాల్సి ఉంది.
అట్లే ప్రభువు తీర్పుకు తిరిగి వస్తాడనే ఆలోచన కొందరిని కలవరపెడుతుంది కాబట్టి వారు అంత్య దినము అనే ఆలోచనను అపహాస్యం చేయడానికి ప్రయత్నించారు. అపహాస్యానికి కారణం, అవిశ్వాసం యొక్క స్వీయ-భోగం, సృష్టిలో దేవుని పనిని అపహాస్యం చేయడం అనే లక్షణముతో అది ఎల్లప్పుడూ కలిసి ఉండటమే. మనుష్యులను ఆధ్యాత్మికంగా పతనమైన స్థితిలోనే ఉంచడానికి సాతాను ఇలాంటి అబద్ధాలను ఎన్నింటినో ఉపయోగిస్తాడు. కారణం, వారు తమ స్వంత నైతికతను ఏర్పరచుకొని, వాడిలాగే తిరుగుబాటుదారులుగా తమకు కావలసిన విధంగా జీవించొచ్చు అని చెప్పటమే వాడి ఉధ్దేశ్యము. వాడు హవ్వతో “మీరు చావనే చావరు” అని అబద్ధం చెప్పినట్లుగా వాడు ఇంకా ఎన్నో అబద్దాలు చెప్తూనే వున్నాడు.
కాబట్టే ఆదిలో దేవుని సృజనాత్మక మాట ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో పేతురు తన పాఠకులకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. దేవుడు సృష్టికర్తయని సమస్తమును ఆయన తన నోటి మాట ద్వారా శూన్యమునుండి సృజించియున్నాడని, ఆది 1:1-3, దేవుడు మాట పలుకగా (ఆజ్ఞనియ్యగా) ఆ ప్రకారమాయెనని, ఆది 1:9, పేతురు వారికి గుర్తు చేస్తూవున్నాడు. పేతురు చెప్తున్నదేమిటంటే, ఆకాశాలు పాతకాలం నాటివి – ఆకాశాలు పూర్వం చేయబడ్డాయి, ఆది 1:1. నీరు భూ నిర్మాణములో ఒక మూలకంగా ప్రవేశించిందని దాని మూలకములో అది ఉందని, భూమి యొక్క సృష్టి అనేది మూలకాల యొక్క ద్రవ్యరాశిపై పనిచేసే దైవిక ఏజెన్సీ యొక్క ఫలితమని జ్జ్యపాకం చేస్తూవున్నాడు. ఇదే ఆదికాండములో “జలము” అని పిలువబడింది, ఆది 1:2, ఆది 1:6-7, ఆది 1:9. మొదట విస్తారమైన ద్రవం ఉంది, “జలము” అని పిలువబడే అపారమైన అసంపూర్ణ పదార్థాల సేకరణ మరియు దాని నుండి భూమి ఉద్భవించింది. “అవుట్ ది వాటర్” (ἐξ ὕδατος) అనే పదం భూమి యొక్క మూలాన్ని సూచిస్తుంది. ఇది ఆ ద్రవ్యరాశి నుండి ఏర్పడింది. “ఇన్ ది వాటర్” (δἰ ὕδατος) అనే పదం ఆ ద్రవ్యరాశి “ద్వారా” ఏర్పడింది అని చెప్తూవుంది.
ఈ రోజుల్లో కూడా, దేవుడు తన మాట ద్వారా శూన్యము నుండి సృష్టిని సృష్టించి యున్నాడనే వాస్తవాన్ని బుద్ధిపూర్వకముగా విస్మరిస్తూ, “బిగ్ బ్యాంగ్” అనే సిధ్ధాంతాన్ని ముందుకు తెచ్చారు – ఇది బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో భారీ, నిర్దేశించబడని, ఆకృతి లేని యాదృచ్ఛిక పేలుడు జరిగిందని దానినుండే సృష్టి ఆవిర్భవించిందనే ఒక అబద్ధము. ఈ సృష్టి కోఇన్సిడెంట్ గా లేక అదృష్టవశాత్తు అన్ని కలసిరావటం మూలన్న అంటే అదృష్టవశాత్తు లక్షల కోట్ల కాన్ఫిగరేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్కావటం మూలాన్న లేక యాక్సిడెంటల్గా ఉనికిలోనికి వచ్చియున్నది కాబట్టి మన జీవితాలను బట్టి మనం ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదని అనుకొంటూ నిజ దేవుడెవరో తెలుసుకోకుండా నిర్బీతిగా బ్రతికేధ్ధామా? అట్లే నేటి జేమ్స్ వెబ్ బిగ్ బాంగ్ సిధ్ధాంతాన్ని ప్రశ్నార్థకం చేస్తూ, క్రొత్త భౌతిక సూత్రాలకు నాంది పలుకుతూ భౌతికశాస్త్రములో పెను సవాళ్లను విసురుతూ మన పరిమితులను అది జ్ఞాపకం చెయ్యటం లేదా?.
కాబట్టి పేతురు అపహాసకులకును విశ్వాసులకును చెప్పేదేమిటంటే, ఈ సృష్టి అనేది ఒక క్రమపద్ధతిలో ఉనికిలోకి వచ్చిందని, దేవుని మాట వలన ఆరు రోజులలో అది ఆవిర్భవించిందని, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగ లేదని, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెనని (అంటే ఆకాశములు, భూమి దేవుని మాట ద్వారా మాత్రమే భద్రపరచబడి వున్నాయని), ప్రతిదీ దేవుని మాట మీద ఆయన చిత్తము పై ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ, ఆకాశములు భూమి మొదట ఆయన ఆజ్ఞతో సృష్టించబడి నిర్వహింపబడుతున్నట్లుగానే, తిరిగి అదే దేవుని మాటతో (ఆజ్ఞతో) అవి నాశనం చేయబడతాయని వారికీ మనకు పేతురు తెలియజేస్తూ ఉన్నాడు, ఆది 1:3-3; యోహాను 1:3; హెబ్రీ 1:2; కీర్తన 33:9.
ఆ క్రమములోనే ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెనని పేతురు వారికి మహాజల ప్రళయాన్ని మరోసారి గుర్తు చెయ్యాల్సి వచ్చింది. భూమి నాశనమవుతుందన్న అంచనా అసంభవమని చెప్పిన వారు, అలాంటి సంఘటనకు ఎలాంటి సంకేతాలు లేవని ధృవీకరిస్తూ, ప్రకృతి నియమాలు స్థిరంగా, ఏకరీతిగా ఉన్నాయని, ఆ సూత్రాలు విచ్ఛిన్నం కానందున, అలాంటి సంఘటన జరగవచ్చని నమ్మడం అసంబద్ధం అని వాదిస్తున్నారు. వారి అభ్యంతరాలకు సాక్ష్యముగా ప్రపంచం నాశనమైందని చూపించడం అవసరం. కాబట్టే ప్రపంచం ఒకసారి నీటిచే నాశనం అయిందనీ, అందువల్ల అది మళ్లీ అవుతుందని నమ్మడంలో అసంభవం లేదని పేతురు చెప్తూ జలప్రళయాన్ని రుజువుగా చూపించాడు.
దేవుడు విశ్వంలోకి ప్రవేశించటమే కాకుండా ఆయన ఖచ్చితంగా దానితో ఇంటరాక్ట్ అయ్యియున్నాడని చెప్పడమే ఇక్కడ పేతురు ఉద్దేశ్యము. నోవహు కాలములో, వాతావరణ ఆవిరిగా, నదులుగా, సరస్సులుగా, మహాసముద్రాలుగా మరియు జలాశయాలుగా చాలా జాగ్రత్తగా అమర్చబడిన జలాలు (దిగువుననున్నవి పైననున్నవి) అకస్మాత్తుగా పకృతి సూత్రాలకు విరోధముగా భూమి ఉపరితలంపై కూలిపోయాయి. ఇది కేవలం విచారకరమైన ప్రకృతి వైపరీత్యం కాదు. ఇది నిజమైన దేవుని నిజమైన కోపం నిజమైన వ్యక్తులపై ప్రత్యక్ష ప్రభావాన్ని గురించి తెలియ జేస్తూవుంది. నోవహు కాలంలోని ప్రజలు దేవునికి జవాబుదారీగా ఉండాలనే ఆలోచనను చూసి నవ్వుకున్నారు. కాని వారి ఊపిరితిత్తులు నీటితో నిండిపోతూ వున్నప్పుడు, వారు నిజంగా వేరొకరి ప్రపంచంలో జీవిస్తున్నారని, వారు విస్మరించిన సృష్టికర్త వాస్తవానికి వారు ఎలా జీవిస్తున్నారనే దాన్ని గురించి పట్టించుకొంటాడనే విషయాన్ని వాళ్ళు చాలా ఆలస్యంగా అర్ధంచేసుకొన్నారు. ఈ సంఘటన దేవుడు సృష్టిలో జోక్యం చేసుకుంటాడని రుజువు చేస్తుంది, హెబ్రీ 11:7, (భక్తిహీనులపై దేవుని తీర్పును మరియు విశ్వాసులకు విమోచనను అందించుటకు). కాబట్టే “వారి తప్పును మీరు మళ్ళి చేయకండి” అని పేతురు తన పాఠకులను హెచ్చరిస్తూ వున్నాడు. అబద్ధ బోధకులు ఈ ముఖ్యమైన సత్యాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పేతురు తన పాఠకులు ఉద్దేశపూర్వకంగా దీనిని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాడు.
అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్నికొరకు నిలువ చేయబడినవై, అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నవి. ఇప్పుడున్న ఆకాశమును భూమియు సార్వత్రికంగా కాలిపోయే విధముగా నిర్మితమై ఉన్నాయని, ప్రకృతి నియమాలకు స్వతంత్రంగా ఎటువంటి స్థిరత్వం లేదని, పూర్తిగా దేవుని చిత్తంపై ఆధారపడి ఉన్నాయని, ఆయన ఆజ్జ్య ఇవ్వగా అన్ని నాశనం చేయబడతాయని, ఆయన ఇష్టానికి అనుగుణంగా అన్ని వస్తువులు తయారు చేయబడినంత తేలికగా తీసివేయబడతాయని, మనం నియంత్రించలేని ఆయన నోటి నుండి వచ్చే ఒక చిన్న మాట, విశ్వవ్యాప్త నాశనాన్ని కలుగజేస్తుందని పేతురు చెప్తూ వున్నాడు. ప్రకృతి నియమాలు ఎలా ఉన్నప్పటికీ, అవి పనిచేసే ఖచ్చితత్వం, ఏకరూపత మరియు అవి పనిచేసేలా చేస్తూవున్న శక్తి, ఈ సృష్టిలోని ప్రతిదీ సృష్టికర్తపై ఆధారపడి నియమాలతో సంబంధం లేకుండా సర్వోన్నతుని యొక్క సంకల్పం ప్రకారం అవన్నీ నిర్వహించ బడుతూ ఉన్నాయి. వాస్తవానికి, ఆ నియమాలకు స్వంత సామర్థ్యం లేదు, కానీ సంభవించే మార్పులను దేవుడు ఉత్పత్తి చేసే విధానం కేవలం ఆయన సర్వశక్తిమంతత్వానికి ప్రకటన మాత్రమే, ఆ పద్ధతుల ద్వారా ఆయన “అన్నింటిని” నిర్వహిస్తూవున్నాడు. ఏ క్షణంలోనైనా ఆయన వాటిని సస్పెండ్ చేయొచ్చు అంటే, ఆయన నిర్వహించడం మానేయొచ్చు లేదా ఆయన తన సామర్థ్యాన్ని ఉపసంహరించుకోవచ్చు అప్పుడు విశ్వం నాశనం అవుతుంది.
భూనివాసుల దుష్టత్వం కారణంగా మనుష్యులందరిని ఆయన ఒకసారి జలప్రళయముతో నాశనము చేశాడు. అదే కారణంతో మరొకసారి ఆయన అగ్ని ద్వారా ఆకాశములను భూమిని పూర్తిగా నాశనం చెయ్యబోతూ ఉన్నాడని, సృష్టి మరియు జలప్రళయమును తెచ్చిన అదే దేవుని మాట ఇప్పుడు క్రీస్తు తిరిగి వస్తాడని చెప్తూవుంది. అదే మాట ఇప్పుడు ప్రపంచం యొక్క నాశనము కొరకు ముహూర్తం ఖరారైందని, చెడుతో పాడుచేయబడిన ఈ విశ్వం మొత్తం శాశ్వతంగా నాశనమై పోతుందని, అగ్నిచే కాల్చివేయబడుతుందని చెప్తూవుంది. దేవుని మాట సృష్టిని సృష్టించి సంరక్షిస్తూ వుంది. అదే మాట ఆయన సృష్టి వినాశనాన్ని కూడా తెస్తుంది. అగ్ని తరచుగా పాత నిబంధనలో దేవుని శిక్షాత్మక విధ్వంసక కోపానికి మరికొన్నిసార్లు ఆయన తుది తీర్పుకు సంబంధించిన చిహ్నంగా ఉపయోగించబడింది. వారిపై దేవుని హక్కును, అధికారాన్ని తిరస్కరించే వారు తీర్పు రోజున శిక్షలోనికి వెళ్తారు. దేవుని శక్తివంతమైన మాట సృష్టి మరియు జలప్రళయంలో ఎంతటి ప్రభావాన్ని చూపిందో, క్రీస్తు రెండవ రాకడ, తీర్పు అనే మాటలు కూడా ఈ విశ్వంపై నిశ్చయంగా అంతకన్నా గొప్ప ప్రభావాన్ని చూపెడతాయి. ఇవి సృష్టి, జలప్రళయం వలె నిశ్చయమైనవి. అందుకొరకై అవి నిలువ చేయబడి ఉన్నాయి, అట్లే అవి భవిష్యత్ ఉపయోగం కోసం రిజర్వ్ చేయబడినవై ఉన్నాయి.
బైబిలులో అగ్ని ప్రాముఖ్యముగా ఈ క్రింది విధాలుగా కనిపిస్తుంది:
అగ్ని, దేవుని సన్నిధికి సూచన: పాత నిబంధనలో, దేవుడు మోషేతో మండుచున్న పొద నుండి మాట్లాడడం (నిర్గమ 3:2), ఇశ్రాయేలీయుల ప్రయాణములో వారిని నడిపించిన అగ్ని స్థంభం (నిర్గమ 13:21,22), సీనాయి పర్వతముపై దేవుని ప్రత్యక్షత (నిర్గమ 19:18;24:17,18; ద్వితీయోప 4:11,35,36). అగ్నిజ్వాలలతో గద్దించుటకు యెహోవా అగ్నిరూపముగా వచ్చుచుండుట (యెషయా 66:15). ఆయన సింహాసనం అగ్ని జ్వాలల మధ్యలో ఉండటం (దానియేలు 7:9,10). క్రొత్తనిబంధనలో, పెంతెకొస్తు పండుగ నాడు పరిశుధ్ధాత్ముని ప్రత్యక్షత (అపొ. కార్య. 2:1-4), యోహాను దర్శనములో యేసుని ప్రత్యక్షత (ప్రకటన 1:14,15). ఇశ్రాయేలీయుల దేవాలయములో బలిపీఠము మీద నిత్యము మండే అగ్ని దేవుని సన్నిధికి సూచన (లేవి 6:12,13), దహన బలులను అర్పించడానికి ధూపము వేయడానికి అగ్నిని వాడేవారు (లేవి 6:14,15), హెబ్రీ రచయిత అగ్ని జ్వాలలు దేవుని సేవకులని వర్ణించాడు (హెబ్రీ 1:7). దేవుడు దుష్టులను/ దుష్టత్వమును అగ్నితో శిక్షిస్తాడు: అగ్ని దేవుని కోపమునకు సూచన (కీర్తన 79:5, 89:46). పాపాన్ని చెడుతనాన్ని దేవుడు అగ్నితో శిక్షిస్తాడు (ద్వితీ 32:22; యెషయా 50:10 ,11; 66 :15 ,16; ఆమోసు 7:4). సొదొమ గొమొఱ్ఱాల విషయములో (ఆది 19:24,25), యెరికో పట్టణము నాశనమైనప్పుడు కొల్లసొమ్మును దొంగిలించిన కుటుంబం విషయములోను (యెహోషువ 7:15), అంత్య దినమున దుష్టశక్తులకు శిక్ష అగ్నితోనే (దానియేలు 7:11; మలాకి 4:1). భూనివాసులమీదికి రాబోయే తీర్పు కూడా అగ్నితోనే (మత్తయి 3:11,12; 13:37-42; లూకా 17:29,30), పాపమును బట్టి పాడైన లోకానికి తీర్పు అగ్నితోనే (2 పేతురు 3:7; ప్రకటన 8:7; 9:18; 11:5; 14:9,10; 19:20; 20:9-15).
8ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. 9కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
క్రీస్తు తాను తిరిగి వస్తానని వాగ్దానం చేసి ఎంతో కాలం గడిచిపోయింది, ఇప్పటికీ ప్రతిదీ అలాగే ఉంది, ఆయన ఇక రాడు, ఎప్పటికీ తిరిగి రాడని పేతురు కాలంలోని ప్రజలు అనుకున్నట్లైతే, ఈనాటి ప్రజలు “ఏమీ జరగదు” అనే మనస్తత్వంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు సుఖంగా గడుపుతూ ఉండుటను బట్టి ఇంకెంత కఠినంగా ఉదాసీనంగా ఉండి ఉంటారో ఆలోచించండి. మనకు చాలా కాలంగా అనిపించేది దేవునికి క్లుప్త కాలం మాత్రమే. దేవునికైతే అది రెండు రోజుల్లాగా ఉండొచ్చు. మనకులాగా కాలం అనేది ఆయన అనుభవంలో లేదు. మనిషి ఆయుష్కాలము తక్కువ. ఆ ఆయుష్కాలము లోనే అతడు తన లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తాడు. కాని దేవుని విషయంలో అలా కాదు. ఆయన నిత్యుడు, ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉండువాడు. కాబట్టి దేవుని విషయములో మానవ హేతుబద్దత పనికిరాదు. ఆయన ఒక్కరోజులో తన లక్ష్యాన్ని సాధించాలని అనుకొంటే అది మన దృష్టిలో 1000 సంవత్సరాలు అయ్యి వుండొచ్చు. ఈ విషయాన్ని ప్రశ్నించటానికి మనకేమి అధికారముంది, కీర్తన 90:4లో కూడా ఇదే విధమైన ఆలోచన ఉంది చూడండి. అట్లే 1000 సంవత్సరములు ఒక దినముతో సమానమని ఇక్కడ పేతురు చెప్పటం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కొందరు సూచించినట్లుగా, క్రీస్తు తిరిగి వచ్చే రోజును అంచనా వేయడానికి పేతురు ఇక్కడ ఎటువంటి ఫార్ములాని కూడా అందించడం లేదు. దేవుడు శాశ్వతుడు కాబట్టి, మనకు చాలా కాలంగా ఉన్నట్లు అనిపించేది ఆయనకు చాలా కాలం కాదు అని చెప్పడమే ఇక్కడ పేతురు ఉద్దేశ్యము.
ప్రభువు తన వాగ్దానానికి సంబంధించి అలసత్వం వహించడు కాని ఆయన వాగ్దానం చాలా ఆలస్యం అయినట్లు కనిపించటం మూలాన్న అది విఫలమయ్యిందని మానవులు అనుకొంటున్నారు. ఒకడు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఎప్పుడు విఫలమవుతాడు? ఆ విషయములో వాడు తన ప్రణాళికలను మార్చుకున్నప్పుడు గాని లేదా వాడు తన వాగ్దానాన్ని మరచిపోయినప్పుడు గాని లేదా వాటిని అమలు చేయగల సామర్థ్యం వానికి లేకపోయినప్పుడు గాని లేదా ఇచ్చిన మాట పట్ల అతనికి నిబద్ధత లేనప్పుడు గాని లేదా బాధ్యతలలో సంబంధం లేదని వాడు అనుకొనినప్పుడు గాని లేదా పలు కారణాలను బట్టి వాయిదా వెయ్యడం మొదలగునవి అతని విఫలతకు కారణాలుగా ఉండొచ్చు. అయితే దైవిక ప్రయోజనాల నెరవేర్పు విషయాలలో ఈ కారణాలను పరిగణలోనికి తీసుకోగలమా? తీసుకోలేము.
కాబట్టి అంత్యదినాలు ఎందుకని ఇంత సుదీర్ఘముగా ఉన్నాయో మరియు ఆయన ఇంకను ఆలస్యము ఎందుకని చేస్తూ వున్నాడో దేవుని ప్రజలు అర్థం చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యం. దేవుడు మర్చిపోవడాన్ని బట్టి లేదా ఉదాసీనముగా ఉండిపోవడాన్ని బట్టి లేదా వృద్ధాప్యాన్ని బట్టి లేదా శక్తి లేనివాడగుటను బట్టి లేదా నిద్రపోతున్నందున ఇవి సుదీర్ఘముగా కొనసాగడం లేదు. ఆయన రాకడ ఆలస్యమగుటకు ఆయన కోరికే కారణమని, ఆయన దీర్ఘశాంతముగలవాడై ఉండుటను బట్టే అవి కొనసాగుతూవున్నాయని ఇక్కడ తెలుపబడింది. మనలాంటి వాళ్లకు పశ్చాత్తాపపడి బ్రతికే అవకాశం ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక అందరు మారుమనస్సు పొందవలెనని కోరుకొంటున్నాడు. ఎవరును నశించి పోవుటకు ఇష్టపడని ఆయన స్వభావమే, ఆయన హృదయపూర్వక కోరికే అందుకు కారణం. తల్లిదండ్రులు తమ పిల్లలు శిక్షించబడకూడదనే హృదయపూర్వక కోరికను కలిగి ఉంటారు, అయినప్పటికీ వారు వారిని శిక్షించాల్సిన నైతిక అవసరంలో ఉండవచ్చు. ఎవరూ చట్టాలను ఉల్లంఘించకూడదని లేదా శిక్షించబడకూడదని ఒక చట్టాన్ని ఇచ్చే వాళ్ళు హృదయపూర్వక కోరికలోనే అందరి శ్రేయస్సును కోరుకొంటూ ఆ చట్టాన్ని తెస్తారు. ఆ క్రమములో స్వయంగా జైలును నిర్మిస్తారు మరియు ఉరిశిక్షను అమలులోకి తెస్తారు. కారణం చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చెయ్యాలనే వారి ఉద్దేశ్యమే కావచ్చు. న్యాయమూర్తి ఎవరికీ ఉరిశిక్ష వేయకూడదని, తన ముందు హాజరుపరచబడిన ప్రతి ఒక్కరిని నిర్దోషులుగా ప్రకటించాలనే హృదయపూర్వక కోరికను కలిగి ఉండవచ్చు, అయినను అతడు ఆ దయగల హృదయంతో, కన్నీళ్లతో చట్టం యొక్క శిక్షను ఉచ్చరించాల్సి రావొచ్చు, యెహెజ్కేలు 33:11.
అట్లే మారుమనస్సు అంటే పశ్చాత్తాపాన్ని (పాపం పట్ల దుఃఖాన్ని) విశ్వాసాన్ని (క్రీస్తుపై విశ్వాసం ద్వారా క్షమాపణ యొక్క దైవిక వాగ్దానాన్ని విశ్వసించడం) కలిగి ఉండటం. సువార్త ద్వారా మనలను పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. కాబట్టి ఆయన మనలో మంచి పనిని ప్రారంభించినప్పుడు, మనం ఆయన నుండి మరలకుండా, ప్రారంభించిన పనిని చివరి వరకు గట్టిగా పట్టుకున్నట్లయితే, ఆయన దానిని చివరి వరకు భద్రపరుస్తాడు మరియు పరిపూర్ణులుగా చేస్తాడు.
దేవుని సంఘములోనికి చేర్చబడవల్సిన వాళ్ళు ఇంకను అనేకులు ఉండటమే అంత్య దినములు సుదీర్ఘముగా ఉండడానికి ఏకైక కారణం. ఆయన దీర్ఘశాంతము మీలో ఉదాసీనతను కాదు సువార్తను రేకెత్తించ నివ్వండి.
10అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచ భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.
ప్రభువు దినము అంటే, ఆయన తిరిగి అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే రోజు, 1 థెస్స 5:2. ఇది ఆయన రోజు అని పిలువబడుతూ ఉంది, ఎందుకంటే ఆయన ఆ రోజున అందరికీ న్యాయమూర్తిగా వస్తాడు, మత్తయి 25:31-46.
ఈ భూమి, బాహ్యంగా సొదొమలా అందంగా ఉన్నప్పటికీ, నాశనమైపోతుంది. దేవునికి మాత్రమే తెలిసిన సమయంలో, ఆయన విశ్వంలో అకస్మాత్తుగా, భారీగా, విధ్వంసకరంగా జోక్యం చేసుకుంటాడు. పేతురు దీనిని “ప్రభువు దినము” అని పిలుస్తున్నాడు, సంఘటనల గమనాన్ని మార్చడానికి దేవుడు నిజంగా మానవ చరిత్రలోకి ప్రవేశిస్తాడని బోధించడానికి పాత నిబంధన ప్రవక్తలు తరచుగా ఉపయోగించిన పదం ఇది. “ప్రభువు దినము” అనే భావన యోవేలు మరియు జెఫన్యా ప్రవక్తల ప్రధాన సందేశం, యోవేలు 2:1,2,30,31; జెఫన్యా 1:14-18 .
అవిశ్వాసులకు ఆ రోజు దొంగవచ్చినట్లుగా ఊహించని టైములో, భయంకరముగా, దిగ్భ్రాంతికరముగా వస్తుంది. వాళ్ళు కనుగొనే సమయానికి, దానిని నిరోధించటం చాలా ఆలస్యం అవుతుంది. ఇది వారిని నిస్సహాయంగా కోపంగా చేస్తుంది.
పేతురు బహుశా పరిశుద్ధ వారంలోని మంగళవారం నాడు యేసు చెప్పిన మాటలను గుర్తు చేసుకొంటూ ఉండొచ్చు. అక్కడ శిష్యులు నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా, “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి ”అని యేసు చెప్పాడు, (మత్తయి 24:29, 42-44).
అయితే విశ్వాసులకు, ఆ రోజు దొంగ వచ్చినట్లుగా, భయంకరమైనదిగా, దిగ్భ్రాంతికరమైనదిగా ఉండదు. ఇది ప్రియమైన తండ్రి తన సుదీర్ఘమైన పర్యటన ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చినట్లుగా ఉంటుంది. బహుమతులతో, తలుపు త్రోసుకొని అకస్మాత్తుగా లోపలి వచ్చి తన పిల్లలను కౌగిలించుకోవడానికి చేతులు చాచిన ఒక తండ్రివలె ఉంటుంది. “డాడీ వచ్చేసారు” అంటూ ఆయన పిల్లల హృదయాలు భయంతో కాదు, ఆనందంతో నిండిపోతాయి.
ఆ దినమున పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అని పేతురు చెప్తూవున్నాడు. పంచభూతములు అనేవి పీరియాడిక్ టేబుల్ లోని మూలకాలను సూచించటం లేదు. వీటి గురించి క్రీ.శ. 60 లో వాళ్లకి తెలియదు. పంచభూత ములు అనేవి విశ్వం యొక్క క్రమబద్ధమైన నిర్మాణములోని ప్రాధమిక మూలకాలు. పైన ఉన్న ప్రతిదీ (ఆకాశములు) గతించిపోతాయి. క్రింద ఉన్న ప్రతిదీ (భూమి) మరియు జలములు (నీరు) మరియు మనం ఆధారపడగలమని మనం అనుకున్నవన్నీ- సూర్యుని కాంతి (అగ్ని) మరియు గాలి, ఆహార గొలుసు అన్ని కూడా లయమైపోతాయి. ప్రపంచం ప్రారంభమైనప్పటి నుండి ఉనికిలో ఉన్న పదార్థం యొక్క కణం నిర్మూలించబడిందని చెప్పడానికి కనీసం ఆధారాలు లేవు. పదార్థం యొక్క కణాన్ని పూర్తిగా నిర్ములించేంత శక్తివంతమైన రసాయన శక్తులు లేవు. మనిషి యొక్క శక్తికి సంబంధించి నంత వరకు, పదార్థం నాశనము కానిది కాని అదంతా దేవుని ఆజ్జ్యచే ఒక ఫాబ్రిక్ వలె కాలిపోతాయని, శిథిలావస్థ కూడా ఉండదని పేతురు చెప్తూవున్నాడు.
అట్లే “భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును” అని పేతురు చెప్తూవున్నాడు. ఇది కొంచెం పారాఫ్రేజ్ అనే చెప్పాలి – ఇక్కడ వాడబడిన గ్రీకు పదము లిటరల్ గా “భూమి మరియు దానిలోని అన్ని పనులు” అని తెలియజేస్తూవుంది. ఆ పనులు ఖచ్చితంగా దేవునివి, ఆ రోజు దేవుని క్రమబద్ధమైన నిర్మాణం యొక్క బాహ్య మరియు అంతర్గత అద్భుతాలను మానవాళి దిగ్భ్రాంతితో చూస్తుంది. ఆ పనులన్ని కూడా ప్రజలు చేసిన క్రియలవలె బహిర్గతపర్చబడతాయి. “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది”, హెబ్రీ 4:13. అవును, దేవుని కళ్ళు కోట్లాది మంది ప్రజల పనులను చూసేంత సార్వత్రికమైనవి, ఆయన జ్ఞాపకశక్తి అనంతమైనది మరియు ఆయన మనస్సు ప్రతిఒక్కరిని ఖచ్చితముగా తీర్పు తీర్చగల శక్తివంతమైనది.
11-12ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమై పోవునట్టియు, పంచభూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగల వారై యుండవలెను. 13అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
14ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితు లుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి.
ఈ రోజుల్లో కొందరు ఈ ప్రపంచం విపరీతమైన వేడిని బట్టి అంతమైపోతుందని మరికొందరు మంచులో కప్పబడి నాశన మవుతుందని చెప్పడం వినే ఉంటాం. అట్లే కొందరు భౌతిక శాస్త్రవేత్తలు భవిష్యత్తులో సూర్యుని ఇంధనం అయిపోతుందని తర్వాత భూమి క్రమేణా నెమ్మదిగా చల్లబడి మానవ జీవితం నాశనమవుతుందని అందుకు మిలియన్ల సంవత్సరాలు పడుతుందని చెప్తూవున్నారు. అయితే ప్రభువు దినమున ఇవన్నీ అకస్మాత్తుగా రవులుకొని హింసాత్మకంగా లయమై పోతాయని, పదార్థం యొక్క పరమాణు నిర్మాణం కూడా కరిగిపోతుందని పేతురు చెప్తున్నాడు.
కొన్నిసార్లు క్రైస్తవులు చర్చిని రెండవ రాకడ వరకు దాక్కొని కనిపెట్టు గొప్ప ప్రదేశంగా మరియు భక్తిహీనుల నుండి దూరంగా ఉండేందుకు ఆశ్రయమైన ప్రదేశముగా మాత్రమే చూస్తారు. అయితే చర్చిని రిఫ్రెష్ చేసే ప్రదేశముగా, స్వస్థపరచే ప్రదేశముగా, శిక్షణ పొందేందుకు సహాయపడే ప్రదేశముగా మరియు స్ఫూర్తిని పొందేందుకు సహాయపడే ప్రదేశముగా, మాట ద్వారా క్రియద్వారా లోకములో దేవుని మహిమపరచే ప్రదేశముగా చూడవలసియున్నాము.
దేవుడు మన ప్రభువు తిరిగి వచ్చే రోజుని నిర్ణయించాడు, అపొ.కార్య 17:31, నీ రాజ్యము వచ్చుగాక (మత్తయి 6:10) మరియు ప్రభువైన యేసూ రమ్ము (ప్రకటన 22:20) అని మనము ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రభువు రాకడను వేగవంతం చేస్తున్నాము. క్రైస్తవులు “ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము” అని ఆశతో అపేక్షించుచు ప్రార్దించు చుండగా, ప్రభువు ఆ ప్రార్థనకు నిశ్చయముగా జవాబిస్తాడు.
నిజమైన క్రైస్తవుడు ప్రభువు దినము రాబోతున్నదని భయపడడు. ఎందుకంటే అతడు దానిని తన విమోచన కాలంగా ఎదురుచూస్తున్నాడు కాబట్టి ఏ సమయంలోనైనా, తన ప్రభువు మరియు రక్షకుని తిరిగి రావడాన్ని అతడు స్వాగతిస్తాడు. అతడు తన విమోచకుని ఆగమనం కోసం దేవుణ్ణి సంతోషపెట్టేంత కాలం దైవిక జీవితం మరియు ప్రవర్తనతో వేచి ఉండటానికి సిద్ధంగా ఉంటాడు.
యేసుక్రీస్తు రక్తం మన అన్ని పాపాలను శుభ్రపరచియుండుటను బట్టి ఆయన ద్వారా మనం అంత్య దినమును తప్పించు కొంటాం. ఐగుప్తులోని పస్కా పశువు రక్తంతో గుర్తించబడిన అన్ని గృహాలను మరణ దూత దాటినట్లే దేవుని ఉగ్రత మనలను దాటుకొని వెళుతుంది. మనం దేవుని సంరక్షణలో సురక్షితంగా ఉంటాం, మంచి కాపరి చేతిలో నుండి నమ్మకమైన గొర్రెలను ఎవరూ లాక్కోలేరు. తీర్పు దినం గురించిన ఈ ముందస్తు అవగాహన మన దైనందిన జీవితంలో మార్పును తేవాలని పేతురు ఆశపడుతూ, ఈ లోక విషయాల కోసం బ్రతకడంలో ఏమన్నా అర్ధం ఉందా అనే భావములో కరకుగా మాట్లాడుతూ, కడగబడి, నీతిమంతునిగా తీర్చబడి, పరిశుద్ధపర్చబడి, ఆత్మ శక్తి, బహుమతులతో నింపబడిన వ్యక్తులకు “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జీవించుడి” అని చెప్తూ, శాంతము గలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను, ఆయనతో సమాధానముగాను ఉండుడి” అని అతడు పిలుపునిచ్చాడు. నిష్కళంకులుగాను, నిందారహితులుగాను ఉండేందుకు క్రైస్తవులు (క్రీస్తును పోలి ఉండేందుకు) అన్ని ప్రయత్నాలు చేయాలి. ఈ ప్రయత్నాలు రక్షణను ఇవ్వవు (యేసు ఇప్పటికే దానిని సాధించాడు), కాని అవి ప్రజలందరి పట్ల ఆయన కున్న అద్భుతమైన దయకు సాక్ష్యమిస్తాయి.
ఎందుకంటే, తీర్పు దినం గురించిన ఆలోచనతో తన సంఘాల్లోని ప్రజలు స్తంభించిపోవడం పేతురుకు ఇష్టం లేదు. అంతిమ విధ్వంసం గురించి తెలుసుకోవడం ప్రజలను పనిలేకుండా, ఉదాసీనంగా, ఫలించనివారిగా మరియు దేవుని బహుమతులను వృధా చేయు వారిగా చేయకూడదు. ఇతరులకు దేవుని ఆశీర్వాదాలను తెచ్చేలా దేవుడు తన పిల్లలపై భారీగా ఆయన దీవెనలను ఉంచాడు. అంతం గురించిన స్పష్టమైన జ్ఞానం, భయపెట్టడానికి బదులుగా దేవుణ్ణి ఆరాధిస్తూ జీవించడానికి, ఆయన వాక్యానికి లోబడి జీవించడానికి, క్రైస్తవ సంఘాలను నిర్మించడానికి, అట్లే విశ్వాసులు నివసించే చోట దేవుడు మంచిగా కనిపించేలా చేసేందుకు వారికి శక్తినిస్తూ వుందనే విషయాన్ని వారు జ్ఞాపకముంచుకోవలసియున్నారు.
అంతము భయంకరంగా అనిపిస్తుంది కదా, భయపడకండి. విశ్వాసులు ఈ దృశ్యాలన్నింటినీ దేవదూతల సురక్షిత బాహువుల నుండి చూస్తారు, న్యాయాధిపతి తిరిగి వచ్చినప్పుడు వారు మనలను భూమి నుండి తీసుకువెళతారు (1 థెస్స 4:13-18; లూకా 16:22; మత్తయి 13:41,49-50). దేవుడు వస్తున్నాడు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, మానవుని పాపం దేవుని మంచి ప్రపంచాన్ని వికృతీకరించినందువల్ల పాత ఆకాశములు భూమి అన్ని నాశనమవుతాయి. ఈ విశ్వం యొక్క ఉపసంహరణ పూర్తయిన తర్వాత, ఆయన తన సృజనాత్మక మాట ద్వారా మరోసారి క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి ఉనికిలోకి వస్తాయి, రోమా 8:19-22. ఇది పూర్తిగా వింతగా ఎలియన్ గా ఉండే మరో రకమైన ఉనికి కాదు, కాని మన స్వంత విశ్వం, కూల్చివేయబడి పునర్నిర్మించబడుతుంది, రూపాంతరం చెందుతుంది మరియు పునరుద్ధరించబడుతుంది, యెషయా 65:17; యెషయా 66:22; ప్రకటన 21:1. కొత్త ప్రపంచం పాతదాని కంటే కొన్ని గొప్ప ప్రయోజనాలను కలిగి ఉంటుంది: యోహాను వ్రాసిన ప్రకటన 21:3లో చెప్పినట్లుగా పరలోకము, భూమి ఇక విడివిడిగా ఉండవు: ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది. దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ప్రకటన 22:3. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము, 1 యోహాను 3:2.
వాటియందు నీతి నివసించును అంటే పాపం, అధర్మం, చెడు, హింస, మానవులను చంపువాళ్ళు లేదా హత్యలు, యుద్ధం, క్రూరత్వం, ద్వేషం, అసూయలు, నేరం మరియు జైళ్లు ఉండవు. ఈ పాత క్రమం గతించిపోతుంది. అక్కడ పరిపూర్ణమైన నీతి, ప్రేమ మరియు స్నేహం ఉంటాయి, ప్రకటన 21:27; 1 కొరింథీ 6:9-10; హెబ్రీ 12:14. యెషయా 65:19 లో చెప్పబడినట్లుగా, రోదనధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఏదెను తోటలోని ఆదాము హవ్వల మొట్టమొదటి స్థితిలోకి మనల్ని తిరిగి తీసుకొని రావడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చాలా ఎక్కువే చేసాడు. ఒకసారి మనము క్రొత్త ఆకాశము, భూమిలోకి ప్రవేశించిన తర్వాత, అక్కడ సాతాను పరీక్షలు, శోధనలు ఇక ఉండనే ఉండవు. దీనిని బట్టి మనం ఆదాము పతనం మరియు మన పాపం ద్వారా మనం ఏమి కోల్పోయామో గ్రహించవలసియున్నాము. సృష్టి యొక్క పునరుద్ధరణ మరియు పునఃప్రారంభం కొరకు మరియు దేవుని పిల్లల స్వేచ్ఛ కొరకు ఆశతో కనిపెట్టుచు అపేక్షించడం నేర్చుకోవలసి యున్నాము.
1-14 ఈ లోకము నిలిచియుండదని తెలిసి, మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకవలసియున్నాము, మత్తయి 6:33. దురదృష్టవశాత్తూ మనం తరచుగా ఈ ప్రపంచం యొక్క ఐహికవిచారము ధనమోహమును బట్టి పరధ్యానంలో ఉన్నాము, మత్తయి 13:22. మన అనేక వైఫల్యాలలో, ప్రభువు మన పాపాలను క్షమిస్తూ విశ్వాసంలో మనలను పునరుద్ధరించడానికి తన వాక్యము సంస్కారముల ద్వారా దయతో పని పనిచేస్తూవున్నాడు. ఆయన మనలను అంతము వరకు కాపాడుతాడు.
ఓ ప్రభువా, నన్నును చనిపోయిన వారందరినీ లేపి, నాకును క్రీస్తును విశ్వసించే వారందరికిని శాశ్వత జీవితాన్ని ఇచ్చే ప్రభువు దినం కోసం నేను వేచి ఉండేలా ఒకే నిజమైన విశ్వాసంలో నన్ను యేసుక్రీస్తుతో ఉంచుమని ప్రార్దిస్తూవున్నాను, ఆమెన్.
15మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. 16వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.
ప్రతి క్రైస్తవుడు యేసు తిరిగి రావాలని కోరుకుంటాడు. “యేసూ త్వరగా రండి!” అని మొఱ్ఱ పెడుతూ ఉంటాడు. అయితే ఆయన రాకడలో ఉన్న ఆయన “నెమ్మదితనాన్ని” బట్టి అయోమయపడకూడదు లేదా విలువైన సమయాన్ని వృథా చేయకూడదు. యేసు రాకడ ఆలస్యమవుతూ ఉండటానికి కారణం, ఆయన దీర్ఘశాంతమును చూపిస్తూ ఉండటమే, ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది. అనేకులను రక్షణలోనికి తెచ్చుటకే ఆయన ఆలస్యము చేస్తూవున్నాడు. దేవుడు సహనం చూపకపోతే అన్నీ నాశనమైపోతాయి. ప్రభువు ప్రతి విశ్వాసితో ఎంత ఓపికగా పనిచేస్తూ ఉన్నాడో ఆలోచించండి, అతన్ని క్షమించి, అతను విఫలమైన ప్రతిసారీ అతనిని పికప్ చేస్తూవున్నాడు, రోమా 2:4.
ఉదాహరణకు ఆనాటి ఆసియా మైనర్‌లోని సంఘము శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ, అది అనాటోలియా (ఆసియా మైనర్) మొత్తాన్ని కవర్ చేసేంత శక్తివంతమైన నెట్‌వర్క్ గా వేగంగా పెరుగుతూ ఉండడాన్ని ఆసియా మైనర్‌లోని క్రైస్తవులు గమనిస్తూనే వున్నారు. మొదట అన్యమతస్థులచే సంఘము హింసించబడిన తరువాత, చివరకు అన్యమతవాదం నిషేధించబడే స్థాయికి సంఘము ఎదిగింది. క్రైస్తవ మతం రాష్ట్ర మతంగా మారింది. మన కాలంలో కూడా, దేవుని శక్తివంతమైన ఆత్మ పని చేయడాన్ని చూస్తూనేవున్నాం.
పేతురు అతని పాఠకులు ఇద్దరూ పాల్‌ను గొప్పగా భావించారు. అతనిని క్రీస్తులో నిజమైన స్నేహితునిగా తీసుకొన్నారు. ఆసియా మైనర్‌లోని ఐదు ప్రావిన్సులలోని పేతురు పాఠకులు పౌలు నుండి ఇదే బోధనలను విన్నారు. పౌలు వ్రాసిన కొన్ని ఉత్తరాలు, బహుశా అతడు ఎఫెసీయులకు, గలతీయులకు లేదా కొలొస్సయులకు వ్రాసిన ఆసియా ఉత్తరాలు అప్పటికే చెలామణి అవుతున్నాయి. పౌలు వాటిని అపొస్టోలిక్ అధికారంతో వ్రాశాడు. క్రీస్తు మాటలను స్వయంగా వింటున్నట్లుగా ప్రజలు అతని పత్రికలను వినవలసి ఉన్నారు. అయితే ప్రజల అవగాహనలో పరిమితుల కారణంగా లేదా వారు వినడానికి ఇష్టపడని వాటికి విధేయత చూపని వారి హృదయాల మొండితనం కారణంగా, పౌలు యొక్క కొన్ని బోధలు గ్రహించుటకు కష్టముగా ఉన్నాయి (ఇప్పటికీ ఉన్నాయి). పౌలు బోధలు విశ్వాసులకు కూడా సవాలుగా ఉండొచ్చు. అబద్ధ బోధకులు, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం గురించి పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని (రోమా 3:37-31; గలతీ 5:1) తమకు అనుకూలముగా మలుచుకొని విశ్వాసులు తమకిష్టం వచ్చినట్లు జీవించవచ్చనే అర్థంలో పౌలు బోధలను వక్రీకరించారు. పాపం చేయడం వల్ల దేవుని కృపను ప్రదర్శించడానికి మరిన్ని అవకాశాలు వస్తాయని భోదించారు, రోమా 3:5-8; 6:1. కొంతమంది తన భాషను దేవుని ఉచిత కృప పై తప్పుగా అర్థం చేసుకున్నారని పౌలు స్వయంగా ఫిర్యాదు చెయ్యడం, రోమా 3:8; 6:1లో చూడొచ్చు. 2 పేతురు 2లోని అబద్ధ బోధకులు అదే పనిని ఇక్కడ చేస్తూవుండుటను బట్టి పేతురు ఈ విషయాన్ని ఇక్కడ కోట్ చేసి ఉండొచ్చు, 2:12,17.
పౌలు స్థాపించిన సంఘాలలో అతడు లేకపోవడాన్ని బట్టి సమస్యలు సృష్టించే వారు పౌలు బోధలను దుర్వినియోగం చెయ్యడం మనం చూడొచ్చు. అటువంటి వారిని ఉద్దేశిస్తూ పౌలు వ్రాసిన 2 కొరింథీయులకు చదవండి. దేవుని వాక్యం అందరికి ప్రాణాధారం కాబట్టి, ఆయన ఉపదేశాలను గనుక మనం వక్రం చేస్తే మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆయన శిక్ష నుండి తప్పించుకోలేం. పేతురు ఇక్కడ పౌలును కోట్ చెయ్యడం ద్వారా, తాను మరియు పౌలు ఇద్దరూ సిద్ధాంతాలలోను మరియు తప్పుడు బోధకులను వ్యతిరేకించడంలో ఒకటిగా ఉన్నామని ధ్రువీకరిస్తూవున్నాడు.
17ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. 18మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
పేతురు తన పత్రికను ముగిస్తూ తన ప్రియులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొని యున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి అని చెప్తూవున్నాడు. ఈ బోధలు కొత్తవి కావు. ప్రజలు క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక అంశాలలో ఇప్పటికే బోధించబడ్డారు, కాని వాటి వెనుక ఉన్న ఆవశ్యకత క్షీణించిపోతూవుంది, ప్రజలు మరచిపోతున్నారు. తీర్పు దినం యొక్క బోధనలు క్రైస్తవుల స్పృహలో ముందంజలో ఉండాలి మరియు వ్యక్తులుగా చర్చిగా వారు చేసే ప్రతి పనిని ప్రభావితం చేయాలి.
కాచుకొని యుండుడి ఎందుకంటే, సాతాను రక్షణ సందేశాన్ని పాడు చేయడం ద్వారా దేవునితో మీ సంబంధాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రక్షణ యొక్క స్థిరత్వంలో కాచుకొని ఉండటానికి ఏకైక మార్గం దేవుని వాక్యం అంతటిలో నిలిచి ఉండటమే. ప్రతి బోధకుడు సత్యాన్ని బోధించడు. ప్రతి సువార్తికుడు నిజమైన సువార్తను ప్రకటించడు. ప్రతి “క్రైస్తవ” ఉపాధ్యాయుడు క్రీస్తును బోధించడు. తనను తాను మీ స్నేహితుడిగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ నిజంగా మీ స్నేహితులు కాదు. క్రైస్తవులు పొరపాట్లు చేసి వారి సురక్షిత స్థానం (యేసు రక్తం ద్వారా వారి కోసం కొని, వాక్య వాగ్దానాల ద్వారా ఇవ్వబడిన స్థలం) నుండి పడిపోయేలా చేయడానికి సాతాను “నీతివిరోధులను” ఉపయోగిస్తున్నాడు. “మీ జాగ్రత్తలో మీరు ఉండండి!”
చివరిగా ఈ పత్రిక యొక్క ముగింపులో, పేతురు ఈ మూడు అధ్యాయాలను సంగ్రహిస్తూ తన ముఖ్యంశమును వ్యక్తీకరించి యున్నాడు: మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఈ ఆసియా మైనర్ క్రైస్తవులు దేవుని వాక్యం గురించిన వారి జ్ఞానంలో వృద్ధి చెందడంతో, వారు సాతాను అబద్ధాలను వివేచించే జ్ఞానంలో వృద్ధి చెందుతారు, ఆ అబద్ధాలను తిరస్కరించే శక్తిలో వృద్ధి చెందుతారు, నశించిపోయిన ప్రజలను రక్షించడానికి మిషనరీ ఉత్సాహంలో వృద్ధి చెందుతారు, ఓపికగా పరిచర్య చేయడంలో ప్రేమ పెరుగుతుంది. ప్రజలకు, వారి స్వంత రక్షణ పట్ల నిశ్చయతలో ఎదుగుతారు మరియు బాధలలో ఉండే వ్యక్తుల పట్ల ప్రేమను చూపించడానికి కరుణలో ఎదుగుతారు. విశ్వాసులు తాము పడిపోకుండా దేవుని వాక్యంలో బలపరచుకోవడం ద్వారా ఎదుగుతారు.
ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తుకు, సమస్త మహిమ చెందును గాక! రోమా 16: 25-27 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. 2 తిమోతికి 4:18 ప్రభువు ప్రతి దుష్కా ర్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రకటన 1:5,6 నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ప్రకటన 5:12,13 వారు–వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును –సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని, ఆమేన్.
15-18మన ప్రభువు సహనం మన రక్షణకు చాలా అవసరం, మనం పశ్చాత్తాపపడడానికి ఆయన మనకు సమయం ఇస్తున్నాడు. పాపం మరియు రక్షణను తీవ్రంగా పరిగణించడానికి మనకు కేటాయించిన సమయాన్ని ఉపయోగిస్తున్నామా? మన ఆరాధనలను మరియు ప్రార్థనలను మరియు పశ్చాత్తాపపడమని మన ప్రభువు యొక్క దయతో కూడిన పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నామా? రోజువారీ పశ్చాత్తాపాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. పడిపోయిన పాపులను పునరుద్ధరించడానికి మరియు వారి రక్షణ యొక్క స్థిరత్వంలో వారిని బలోపేతం చేయడానికి ఓపికగల ప్రభువు ఎప్పుడూ వాక్యము సంస్కారముల ద్వారా పని చేస్తున్నాడు.
ఓ ప్రభువా, నేను మీ కృపలోను జ్ఞానంలోను వృద్ధి చెంది మీ మహిమను శాశ్వతంగా ప్రకటించునట్లు నా దగ్గరకు వచ్చి, మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి, ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.