మొదటి భాగము
2 వ యోహాను: పరిచయం (1–3)
1పెద్దైనెన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. 2నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.
యోహాను తనను తాను పెద్దగా పిలుచుకోవడంపై వ్యాఖ్యల కోసం, “రచయిత” క్రింద ఉన్న పరిచయ గమనికలను చూడండి. పేతురు కూడా ఈ పదాన్ని ఉపయోగించాడు (1 పేతురు 5:1). వృద్ధాప్య అపొస్తలుడు తన ఆత్మీయ పిల్లలందరి పట్ల చూపిన ఆప్యాయతని ఈ గ్రీటింగ్స్ తెలియజేస్తూవుంది.
ఇప్పుడు, ఏర్పరచబడినదైన ఈ అమ్మగారు ఆమె పిల్లలు ఎవరు కావొచ్చు? ఈ మాటలు ఎవరికి ఉద్దేశించబడి నవి? ఈ మాటలు అస్పష్టముగా ఉండుటను బట్టి, ఇలాంటప్పుడు బైబిల్ వివరణ యొక్క ప్రాథమిక నియమాన్ని అనుసరించి పదాల యొక్క సాధారణ అర్థంతో ప్రారంభిధ్ధాం. పౌలు తన ఉత్తరాలలో నాలుగింటిని నిర్దిష్ట వ్యక్తులకు, రెండు తిమోతికి మరియు ఒకటి తీతుకు మరొకటి ఫిలేమోనుకు వ్రాసాడు. ఇట్లే యోహాను కూడా నిర్దిష్ట వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని వ్రాసి వున్నట్లైతే, పేరులేని ఈ అమ్మగారు సంఘములో ఒక బలమైన లేలీడర్ అయి ఉండాలి, తరచూ ట్రావెలింగ్ టీచర్స్ కు ఆతిథ్యం ఇచ్చేదిగా లేదా తన ఇంటిలో చర్చిగా కలుసుకొనేందుకు స్థలాన్ని ఇచ్చినదై ఉండియుండాలి. ఉదాహరణకు, ఫిలిప్పీకి చెందిన లూదియ పౌలుకు బస మరియు సమావేశ స్థలాన్ని అందించిన రీతిగా మనం ఈ అమ్మగారిని గురించి అనుకో వచ్చు, అపొ. కార్య. 16:15.
యోహాను తన కోసం (“పెద్ద“) అనే ఒక రూపకాన్ని ఎంచుకున్నట్లే, అతడు తన మొదటి పాఠకుల కోసం కూడా ఒక రూపకాన్ని ఎంచుకొని ఏర్పరచబడినదైన ఈ అమ్మగారు అని వ్రాసి ఉండొచ్చు. ఆ కోణంలో, “ఈ అమ్మ గారు” ఒక సంఘం కావొచ్చు. వాస్తవానికి, పశ్చిమ ఆసియా మైనర్‌లోని యోహాను పర్యవేక్షించే సంఘాలలో బహుశా ఇది ఒక సంఘమేమో. బైబిల్ తరచుగా చర్చిని, దేవుని ప్రజలను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారిని “ఫెమినైన్” (స్త్రీగా) కోట్ చెయ్యడం గమనించే ఉంటారు:
- ఇశ్రాయేలు ప్రజలు కన్యగా పిలువబడ్డారు, (విలాపవాక్యములు 1:15 యెహోవా కన్యకయైన యూదా కుమారిని; 2:13 యెరూషలేము కుమారి; సీయోను కుమారి, కన్యకా; ఆమోసు 5:2 కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను); ఇశ్రాయేలు ప్రజలు వివాహిత స్త్రీగా పిలువబడ్డారు, (యెషయా 62:4, 5 విడువబడిన దాని వని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును); ఇశ్రాయేలు ప్రజలు తల్లిగా పిలువ బడ్డారు, (యెషయా 54:1 గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటె విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు); మరియు ఇశ్రాయేలు ప్రజలు వితంతువుగా కూడా పిలువబడ్డారు, (యెషయా 54:4 భయపడకుము నీవు సిగ్గుపడ నక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు).
- యెరూషలేములో నివసిస్తున్న విశ్వాసులు సీయోను కుమార్తెగా పిలువబడ్డారు, (యెషయా 52:2 లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారి).
- నమ్మకమైన విశ్వాసులు వధువుగా పిలువబడ్డారు; అపనమ్మకమైన విశ్వాసులు వేశ్యగా పిలువబడ్డారు (యెహెజ్కేలు 16 అధ్యాయం మొత్తం ఈ రూపకాలకే అంకితం చేయబడింది).
- యేసు తనను తాను వరునిగా పిలుచుకొనియున్నాడు (మత్తయి 25:5); విశ్వాసులు ఆయన వధువు సంఘమై యున్నారు (ప్రకటన 21:9; 22:17).
- పౌలు కూడా ఇటువంటి చిత్రాలనే ఉపయోగించియున్నాడు: “పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రదానము చేసితిని గాని“, 2 కొరింథీయులు 11:2.
- ఎఫెసీయులు 5:26, 27లో పౌలు విశ్వాసులను “స్త్రీగా” వర్ణించాడు: అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
“ఏర్పరచబడినదైన అమ్మగారు” ఒక సంఘం. ఆమె “పిల్లలు” సభ్యులు. “ఏర్పరచబడిన నీ సహోదరి” (13వ వచనం) పిల్లలు ఎఫెసులోని యోహాను సంఘ సభ్యులై ఉండాలి. వారు ప్రేమించబడ్డారు, యోహానుచే ప్రేమించబడ్డారు మరియు సత్యము ఎరిగినవారందరిచే ప్రేమించబడ్డారు. సత్యము ఎరిగినవారందరు అంటే వారిని ఎరిగియున్న క్రైస్తవులందరిచే, వారు సత్యమును హృదయపూర్వకముగా స్వీకరించి యుండుటను బట్టి మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమును బట్టి (యోహాను 14:6), వారు ప్రేమించబడ్డారు.
యోహాను సువార్త నుండి, యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను; యోహాను 8:32 సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా; యోహాను 14:6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు; మరియు 1 యోహాను 1:6 ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింప కుందుము, 1 యోహాను 1:8, మనము పాపములేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు; 1 యోహాను 3:19,20 చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. ఈ వచనాలు ద్వారా సత్యమంటే ఏమిటో మనకు తెలియజేయుటకు సమగ్రముగా చైతన్యవంతమైన అర్థంలో సత్యం ఉపయోగించబడింది. సత్యం అనేది ఆచరణాత్మకంగా, యేసుక్రీస్తు చేసినది, చేస్తూ ఉన్నది, చేసేది మరియు సూచించేదంతా. కాబట్టి సత్యం తెలుసుకోవడమే కాకుండా అనుసరించబడింది మరియు చేయబడుతుంది.
సత్యము దేవుని ద్వారా వస్తుంది. సత్యము అనేది ఒక సజీవ శక్తి, నిజమైనవన్నింటిని మరియు సత్యమైన వన్నింటిని బయలుపరుస్తూ ఉంది. ఇది ఆధ్యాత్మిక శక్తికి వనరు, స్పష్టంగా ఆలోచించడానికి, తెలివిగా ఎంచుకోవడానికి మరియు సరిగ్గా వ్యవహరించడానికి శక్తినిస్తుంది. ఇది చర్చి యొక్క గొప్ప నిధి, ఇది మనకు క్రీస్తును, క్రీస్తు రక్షణను వెల్లడిస్తూవుంది మరియు క్రీస్తును విశ్వసించే సామర్థ్యాన్ని కూడా ఇస్తూవుంది. మనతో ఎల్లప్పుడు ఉండు దేవుని సత్యము అనే వాగ్దానము ద్వారా, ఆయన మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికి ఆపలేడని మరియు ఆయన వాక్యం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అతడు హామీని ఇస్తూ వున్నాడు.
మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము, సువార్తను ప్రేమించే వారు సమాజంలో, వ్యక్తులలో, కుటుంబాలలో, పొరుగు ప్రాంతాలలో అది కలిగించే ప్రభావాలను చూసి ఆనందిస్తారు. వారి హృదయాలు దాని ప్రభావం పూర్తిగా కనిపించే ప్రదేశాల వైపుకు, ప్రజలవైపుకు ప్రేమతో ఆకర్షించబడతాయి.
దేవుని వాక్యాన్ని విశ్వసించడం, సత్యాన్ని ఒప్పుకోవడం మరియు ఇతర క్రైస్తవులతో సహవాసం చేయడం అనేది దేవుడు మొదటగా ఇచ్చిన సామర్థ్యమే. ప్రజలు క్రైస్తవులుగా మారాలని ఎన్నుకోరు -దేవుడు మొదట ఎన్నుకున్న దానికి వారు ప్రతిస్పందిస్తున్నారు. (ఎఫెసీయులు 1:11-14, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసార ముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించు చున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు; ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము, 1 యోహాను 4:19. యేసు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో మాట్లాడుతూ, అందుకు కారణాన్ని మరియు దాని ప్రభావాన్ని గురించి కొంచెముగా తెలియజేస్తూ, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది యోహాను 15:16, 19).
యోహాను యొక్క అపొస్టలిక్ గ్రీటింగ్: 3సత్య ప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్ద నుండియు, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.
ఇది ఒక ఆశీర్వాదం, ఒక వాగ్దానం, ఒక నిశ్చయత. ప్రజలలో చెడు ఉన్నప్పటికి వారిని ప్రేమించాలనే దేవుని నిర్ణయమే కృప. ఆ కృప పాపాత్ములపై దేవుని నీతియుక్తమైన న్యాయపు శిక్షను రద్దు చేసింది. కనికరము అనేది కృప యొక్క చర్యలో భాగం. పాపాత్ములైన తిరుగుబాటుదారులపై దేవుని దయే కనికరము. దేవుడు తన కుమారుడిని శరీరధారిగా, పాపం చే విషపూరితమైన ఈ గ్రహం మీద జీవించడానికి, శ్రమపడడానికి, చనిపోవడానికి మరియు తిరిగిలేచి ఇక్కడ మరణిస్తున్న ప్రజలకు క్షమాపణ మరియు జీవితాన్ని ఇవ్వడానికి పంపడమే కనికరము. ఇది ఉదారంగా, తండ్రి దయతో, క్రీస్తురక్తం ద్వారా విమోచించబడిన లోకముపై దేవుని అనుగ్రహాన్ని కురిపిస్తూవుంది. సమాధానము అనేది దేవుడు మరియు ప్రజల మధ్య కొత్త సంబంధం. ఇది క్రీస్తు లేకుండా ఉన్న యుద్ధ స్థితిని భర్తీ చేస్తుంది. కల్వరిలో ఏమైతే జరిగియున్నదో దానిని బట్టి దేవుడు లోకానికి సమాధానమును ప్రకటించాడు. దానిని విశ్వసించే వారందరూ దానిని కలిగియున్నారు. దేవుని సమాధానము ప్రజల హృదయాలను పాలిస్తూవున్నప్పుడు అపరాధం, సందేహం మరియు భయం తొలగిపోతాయి. సమాధానమనేది ఆయన కుమారుని ప్రత్యక్షతలో, విమోచనలో దేవుని ప్రేమ యొక్క ఆశీర్వాద ప్రభావము. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ సమాధానపడిన తండ్రి నుండి మాత్రమే కాకుండా, దైవత్వంలో ఆయనతో సమానంగా మరియు దేవుని యొక్క అన్ని లక్షణాలను ఆయనతో కలిగి ఉన్న తండ్రి యొక్క శాశ్వతమైన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కూడా మనపైకి వస్తూ వున్నాయి. సువార్త సందేశం యొక్క రక్షణ సత్యాన్ని మనం విశ్వసించినప్పుడు మరియు ప్రేమించినప్పుడు మరియు మన జీవితమంతా పునర్జన్మ సహాయంతో మార్పుచెందినప్పుడు ఈ బహుమతులు మన వద్దకు సత్యంలో వస్తూ వున్నాయి. ఈ నిశ్చయత క్రైస్తవులకు అన్ని వేళలా అందుబాటులో ఉంది, చెందుతూవుంది.
3వ వచనం ప్రకారం, దేవుని ప్రజలు సత్యం మరియు ప్రేమలో కృప, కనికరము, సమాధానమును కలిగి ఉంటారు. దేవుని సత్యమే దేవుని సమాధానమునకు మూలం. దేవుని నిజమైన సమాధానమును మీకు తెలియజేయని పక్షంలో మీరు దానిని తెలుసుకోలేరు. దేవుని సమాధానమును గురించిన నిశ్చయత యొక్క ఏకైక మూలం దేవుని వాక్యం. తప్పుడు బోధకులందరూ మరియు అన్ని కల్ట్‌లు ఏదో ఒక విధంగా దేవుని వాక్యంపై దాడి చేస్తారు, బైబిల్ సరిపోదని, అసంపూర్తిగా ఉందని, చెత్తగా ఉందని లేదా పురాతనమైనదని ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ కూడా ముఖ్యమైనది—క్రైస్తవ కుటుంబాల లో ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరియు క్రైస్తవ సంఘంలోని సభ్యుల మధ్య ఉన్న ప్రేమ అక్కడ కృప, కనికరము మరియు సమాధానము సజీవంగా ఉన్నాయని తెలిపే ఖచ్చితమైన సూచికలు.
అపొస్తలుడైన యోహాను మరియు క్రీస్తును తండ్రియైన దేవుని కుమారునిగా ఎరిగియున్న వారందరూ ఒకరినొకరు సత్యంను బట్టి ప్రేమిస్తారు. అబద్ద బోధకులు యేసు శరీరధారియైన దేవుడని ఒప్పుకోవడానికి నిరాకరించిన వారు (1యోహాను 2:18-25; 4:1-6) వారికి సత్యం తెలియదు లేదా యోహాను వ్రాస్తున్న క్రైస్తవులను ప్రేమించలేరు. యేసును ఎరిగిన వారికి సత్యం తెలుసు, యేసుతో పాటు, వారికి దయ, కనికరము మరియు సమాధానము తోడుగా ఉంటాయి.
పరలోకపు తండ్రి మీ కుమారుని ద్వారా ప్రేమలో మాకు సత్యాన్ని తెలియజేసారు. మా నుండి ఈ సత్యాన్ని, ప్రేమను దొంగిలించాలని అనుకొంటున్న వారందరి నుండి మమ్మును రక్షించుము. మార్గము, సత్యము మరియు జీవమైయున్న క్రీస్తులో మమ్ములను ఉంచుము, ఆమెన్.
రెండవ భాగం
సత్యం మరియు ప్రేమలో నడవండి (4–6)
4తండ్రివలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచు చుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. 5కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. 6మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.
కొంతమంది మాత్రమే సత్యంలో నడుస్తున్నారు, అనే మాటల విషయానికి వస్తే, సంఘము క్రైస్తవ జీవితంలోని వివిధ దశలలో ఉన్న వ్యక్తుల సమాహారమని, అందులో కొందరు పిల్లలుగా ఉంటారని, వారికి తమ జీవితాలను అదుపులో ఉంచుకొనే సామర్ధ్యముండదని; మరికొందరు ఆధ్యాత్మిక టీనెజర్స్ గా ఉంటారని (సగం పిల్లలుగా సగం పెద్దలుగా), వారి ప్రవర్తన పరిపక్వత మరియు పిల్లతనం మధ్య మారుతూ ఉంటుందని; ఇంకొందరు అనుభవజ్ఞులుగా, పరిణతి చెందిన వారుగా, నాయకులుగా, శిక్షకులుగా, మరియు ఇతరులకు నిర్వాహకులుగా ఉన్న వారుంటారనే విషయం యోహానుకు తెలియనిది కాదు. మరి కొంతమంది మాత్రమే సత్యంలో నడుస్తున్నారు అనుటలో యోహాను ఉద్దేశ్యం తండ్రివలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము – సభ్యులందరూ తండ్రి ఆజ్ఞలకు విధేయులై వాటిని పాటిస్తూ, దేవుని వాక్యం మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా – సత్యంలో నడవాలని అతడి ఆకాంక్ష. మన సృష్టికర్తగా మన రక్షకునిగా విధేయతను చూపుమని దేవుడు ఆజ్ఞాపించియున్నాడు.
ఇది కొత్త ఆజ్ఞ కాదు. దేవుని చిత్తానికి అవిధేయత చూపడం ఏదెను తోటలో మరణానికి దారితీయించింది. అది అందరికి సంక్రమించి యున్నది. దేవుడు మనలను ఆయన నుండి స్వతంత్రంగా, డిస్‌కనెక్ట్‌డ్ గా, ఆయన నుండి వేరుగా పనిచేసేలా సృజించలేదు. ఆయన మనలను తన స్వరూపమందు, మంచి దానిలో ఆనందించేలా మరియు చెడుకు దూరంగా ఉండేలా, చేశాడు. ఆ కోణంలో చూస్తే, దేవుని చిత్తానికి విధేయత చూపడం అనేది అవిధేయత చూపిస్తే శిక్షించుదునను బెదిరింపుతో మన నుండి ఎదురుచూస్తున్న బలవంతపు చర్య క్రిందికి వస్తుంది తప్ప బానిసత్వం క్రిందికి రాదు. దేవునికి విధేయత చూపడం అనేది మనం క్రీస్తులా మారే ప్రక్రియ, అది ఆనందాన్ని తెస్తుంది.
మొదటిగా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతూ, రెండవదిగా ప్రామాణికమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడంలో ఇతరులను మనం ఎలా ట్రీట్ చేస్తున్నామనేది చాలా ప్రాముఖ్యము. ఇతరులను నీచంగా, పగ, గాసిప్, వెక్కిరింపు నిందించడానికి బదులుగా వారితో ప్రేమగా ప్రవర్తించడం చాలా అద్భుతమైన పనులను చేస్తుంది: ఇది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఇది మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది మరియు మనం ఎదగడానికి పరిణతి చెందడానికి సహాయపడుతుంది. ఇది ఇతరుల జీవితాలను మెరుగుపరుస్తుంది. అది దేవుని శక్తి నిజమైనది మరియు పని చేస్తుందని సమాజానికి శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. ప్రేమగల సంఘం ఎన్నటికీ మరుగు చేయబడదు. అది నిజ దేవుని కోసం ఎదురుచూసే వ్యక్తులకు ఎదురులేని ఆకర్షణగా ఉంటుంది.
కాబట్టి, సంఘములో ప్రేమను పెంపొందించుకోవాలని యోహాను వేడుకొంటూ వున్నాడు. అంటే, రిలేషన్షిప్స్ మీద మనం పని చేయాలని, దయ కనికరమును అలవర్చుకోవాలని, మరొకరి కష్టాలను వినాలని, ఒకరి భారాన్ని మరొకరు మోయాలని, దయతో మాట్లాడాలని, మనకు కలిగిన అవమానాలను మరియు గాయాలను క్షమించాలని, ఇతరులను ప్రోత్సహించాలని మరియు వారిని నిర్మించడంలో సహాయపడాలని, పొందడంలో మాత్రమే కాకుండా ఇవ్వడంలో సంతృప్తిని పొందుకోవడం అలవాటుగా చేసుకోవాలని యోహాను వేడుకొంటూ వున్నాడు.
మూడవ భాగం
మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి (7–11)
7యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు.
4 నుండి 6 వచనాలలోని సమస్యలు, మొదటిగా ప్రేమ మరియు సత్యంలో నడవడం, ఇది ఆనందదాయకమైన విషయ మేమి కాదు, ఇది క్రైస్తవులకు సంఘాలకు జీవన్మరణ సమస్య. వాస్తవం ఏమిటంటే, సంఘము, సాతాను వాని దయ్యాలు మరియు అతడి క్రైస్తవ వ్యతిరేక మానవ ఏజెంట్ల చే ముట్టడింపబడి యున్నది. వారు మోసగాళ్ళు, విశ్వాసం నుండి తొలగి తిరుగుతున్న వారు, ఇతరులను తమతో పాటు దేవుని సత్యం నుండి తొలగించడానికి ప్రయత్నిస్తూ వున్నారు. యేసుక్రీస్తుపై విశ్వాసాన్ని తృణీకరించడం లేదా కోల్పోవడం సంఘములోని అన్ని తప్పులకు, అబద్ద భోధలకు, విగ్రహారాధనకు, నేరాలకు, దుర్వినియోగానికి మరియు చెడుకు కారణమని చెప్పొచ్చు.
ఈ పత్రికను వ్రాసేటప్పుడు, సెరింథస్ వంటి కల్ట్ లీడర్‌లను యోహాను దృష్టిలో ఉంచుకుని ఉండవచ్చు (1 యోహాను “సందర్భం” క్రింద చూడండి). సెరింథస్ మరియు అతని గ్నోస్టిక్ (Gnostics) కల్ట్ క్రైస్తవ బోధలను, వివిధ మార్గాల్లో పునర్వ్యవస్థీకరించారు, అయితే క్రీస్తు యొక్క రెండు స్వభావాలను వారు తిరస్కరించడం వాటిలో అన్నింటికంటే ఘోరమైన విషయం.
ఈ కేంద్ర సత్యంపైనే మన రక్షణ ఆధారపడి ఉంది. ఈ సత్యాన్ని వివరించే క్రమములో గ్నోస్టిక్స్ (Gnostics) తప్పుడు వివరణను ఇచ్చారు. ఆ తప్పుడు బోధ – దేవుని నిజకుమారుడైన యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని తిరస్కరించడం. మరో మాటలో చెప్పాలంటే, యేసు యేసేపు మరియల కుమారుడు మాత్రమేనని ఆయన దేవుని కుమారుడు కాదని, దేవుని శాశ్వతమైన కుమారుడు శరీరధారియాయేనను పవిత్ర సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఈ మోసగాళ్ళు కన్యయైన మరియ యందు దేవుని నిత్యకుమారుడు శరీరధారియాయేనను విషయాన్ని తిరస్కరించడమే కాకుండా, క్రీస్తు స్థాపించిన వాక్యము సంస్కారముల (కృపా వాహనాల) ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు మన వద్దకు వస్తున్నారనే విషయాన్ని కూడా వారు తిరస్కరించారు. వారు యూకారిస్ట్ నుండి మరియు ప్రార్థన నుండి దూరంగా ఉన్నారు, ఎందుకంటే వారు యూకారిస్ట్ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శరీరమని ఒప్పుకోరు. కొందరు అబద్ద బోధకులు చెప్తున్నలా, యేసులో ఒక భాగం దేవునిగా ఒక భాగం మనిషిగా లేడు, లేదా ఆయన కొన్ని సమయాల్లో దేవునిగా కొన్ని సమయాల్లో మనిషిగా లేడు, ఆయన సంపూర్తిగా నిజ దేవునిగాను మరియు సంపూర్తిగా నిజ మానవునిగాను, ఏకకాలంలో, నిరంతరంగా మరియు శాశ్వతంగా ఉన్నవాడు.
యేసు శరీరధారియాయెనను విషయాన్ని తృణీకరించడం అనేది నరకం నుండి వచ్చిన అబద్ధం, శతాబ్దాలుగా చాలా మంది మోసగాళ్ళు మరియు కల్ట్ నాయకులు చెప్తున్న అబద్ధం. క్రీస్తు సంపూర్ణముగా నిజదేవుడు మరియు సంపూర్ణముగా నిజమానవుడు కాకపోతే, మనకు రక్షకుడు లేడు. సెరింథస్ యేసు సంపూర్ణముగా నిజదేవుడు మరియు సంపూర్ణముగా నిజ మానవుడు కాడు అనే తప్పుడు బోధను భోదిస్తూ, కొంతకాలం ఉండేలా భూలోక యేసుపైకి ఏదో దైవత్వం దిగివచ్చిందని, కాని కల్వరి ముందు అది ఆయనను విడిచిపెట్టిందని చెప్తూ చాలా మందిని నమ్మేలా ఒప్పించగలిగాడు. అయితే, సిలువపై కుమ్మరించబడినది కేవలం భూసంబంధమైన యేసు రక్తము మాత్రమే కాదు, దేవుని కుమారుని రక్తమని బైబిల్ బోధిస్తుంది. లోక పాపాలకు చెల్లింపు ప్రపంచ సహ-సృష్టికర్త ద్వారా చేయబడింది.
సెరింథస్ క్రిస్మస్ ను మరియు గుడ్ ఫ్రైడే ని మాత్రమే నాశనము చెయ్యటానికి ప్రయత్నించటం లేదు. వాడు ఈస్టర్ ను మరియు పునరుత్థానాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రీస్తు నిజదేవునిగా నిజమానవునిగా తన శరీరంతో ఈస్టర్ రోజున లేచాడు, అదే విధంగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఇప్పటికీ రెండు స్వభావాలను కలిగి ఉన్నాడు (దైవిక మరియు మానవ). మహిమలో ఆయన తన తండ్రియైన దేవుని కుడి చేతి వైపున కుర్చుండి పగలు రాత్రి మన కోసం మధ్యవర్తిత్వం చేస్తూవున్నాడు.
కొన్నిసార్లు ఈ అబద్ధాన్ని చెప్పే మోసగాళ్లు మోసగాళ్లుగా కనిపించరు. వారు మంచి పురుషులుగా, స్త్రీలుగా, విద్యావంతులుగా, ఆలోచనాపరులుగా మరియు మంచి పౌరులుగా కనిపిస్తారు. వారు తమ సంస్థ పేరులో క్రీస్తు పేరును ఉపయోగించవచ్చు. వారు క్రైస్తవ కీర్తనలను ఉపయోగించవచ్చు మరియు క్రైస్తవ పదజాలాన్ని ఉపయోగించవచ్చు. కాని క్రీస్తు శరీరధారియాయే నను విషయాన్ని తిరస్కరించే వ్యక్తులు శత్రువులో భాగమే. వారు మోసగాళ్లు, క్రీస్తు విరోధులు ఎందుకంటే వారి పని క్రీస్తు పనిని రద్దు చేయటం. (క్రీస్తు విరోధి గురించి మరింత వ్యాఖ్యానానికై 1 యోహాను 2:18–23 లోని గమనికలను చూడండి).
ఈ మోసగాళ్లు లోకములో బయలుదేరి యున్నారని యోహాను చెప్తున్నాడు. ఈ ప్రకటనను రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు: (1) అనుచరులను గెలుచుకోవడానికి వారు కల్ట్స్ నుండి లోకములోనికి బయలుదేరి యున్నారు; (2) వారు చర్చి నుండి ప్రపంచంలోని కల్ట్స్ లోకి బయలుదేరి యున్నారు. (1 యోహాను 2:19లో, “వారు మనలోనుండి బయలువెళ్లిరి” అని యోహాను చెప్పినట్లుగా). ఈ రెండు విషయాలు వాస్తవానికి సంఘ చరిత్రలో జరిగాయి. ఇది క్రైస్తవులకు దుర్వార్త అని చెప్పొచ్చు.
సిమియోను ఆయనను గురించి చెప్పినట్లుగా, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు, లూకా 2:34, అను మాటలు కరెక్ట్. అబద్ద భోధకులందరు యేసును ఫణముగా పెట్టి గౌరవాన్ని పొందాలని కోరుకొంటున్నారు బదులుగా అవమానాన్ని నాశనాన్ని పొందుకొంటారు. ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయును, మత్తయి 21:44.
8అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీమధ్యను నెర వేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
యోహాను, ఇతర నిజమైన క్రైస్తవ ఉపాధ్యాయులు తమ జీవితాలను క్రీస్తులోని సత్యాన్ని బోధిస్తూ గడిపారు, తద్వారా విశ్వసించే వారు మరణం వరకు విశ్వాసపాత్రంగా వుండాలని చివరకు శాశ్వతమైన జీవిత కిరీటాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు. క్రైస్తవులు తమ ప్రతిఫలాన్ని కోల్పోయేలా చేసే మోసగాళ్లచే తన జీవితకాలపు పని పాడుచేయబడకుండా యోహాను జాగ్రత్తగా చూచుకొనుడి అని వారిని హెచ్చరిస్తూవున్నాడు.
సాతాను స్వీయసంతృప్తిగల మరియు ఆత్మసంతృప్తిగల క్రైస్తవులపైకి రావడానికి ఇష్టపడతాడు, ఎందుకంటే వారు తమ కవచాన్ని ధరించకపోవచ్చు మరియు వారి ఆయుధాలు బహుశా తుప్పు పట్టి నిస్తేజంగా ఉండి ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా చూచుకొనుడి. సంరక్షణకు సంబంధించిన దేవుని వాగ్దానాలను చూసి మనం ఎన్నటికీ పడిపోమని భావించడం ఒక వక్రీకరణ కాబట్టి జాగ్రత్తగా చూచుకొనుడి. చెడు విషయాలు ఇతరులకు మాత్రమే జరుగుతాయని అనుకోవడం ఒక కామన్ ఫాంటసీ. చాలా మంది క్రైస్తవులు నేను దేవునిని నమ్ముకున్నాను నాకే ఎందుకిలా జరిగింది అని దిగ్బ్రాంతి పడుతూవుంటారు, జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు బాప్టిజం పొంది, ధృవీకరించబడినందున మీరు ఇప్పుడు సాతానుకు దూరంగా ఉన్నారని కాదు కాబట్టి జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రజలు విశ్వాసం నుండి పడిపోతారు – విత్తేవాడు మరియు విత్తనం గురించి యేసు చెప్పిన ఉపమానం గుర్తుందా? కలుపు మొక్కల మధ్య మరియు రాళ్ళ మధ్య పెరుగుతున్న మొక్కలు, తరువాత ఎండిపోయి చనిపోయే మొక్కలు గుర్తున్నాయా? హెబ్రీయులు 6:4–6, ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచు చున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము మరియు 10:26–31, మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచ బడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? –పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు –ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి జాగ్రత్తగా చూచుకొనుడి. వారి రక్షణ విశ్వాసాన్ని వారే త్రోసిపుచ్చుకొంటూన్నారని గమనించని కొందరు తుదకు నరకంలో ఉంటారు.
ఎలా జాగ్రత్తగా చూచుకోగలం? దేవుని వాక్యాన్ని వినడానికి, చదవడానికి మరియు నేర్చుకోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జాగ్రత్త పడగలం. సత్యమునకు మూలంగా మరియు సరిగ్గా ఆలోచించడానికి మరియు పని చేయడానికి ఆధ్యాత్మిక శక్తికి మూలంగా లేఖనాలను తీసుకొనుట ద్వారా జాగ్రత్త పడగలం. ఓదార్పు, క్షమాపణ, పోషణ మరియు బలోపేతం కొరకై ప్రభువు రాత్రి భోజన అవకాశాలను స్వాగతించడం ద్వారా జాగ్రత్త పడగలం. క్రైస్తవ స్నేహితులను ఎన్నుకోవడం ద్వారా మరియు క్రైస్తవ ఆలోచనలు మరియు లోక పోకడలో దేవుని నిర్దేశకత్వమును కోరుకొనుట ద్వారా జాగ్రత్త పడగలం. నిజమైన క్రైస్తవ సంఘంలో మరియు దాని పరిచర్యలలో పాల్గొనడం ద్వారా జాగ్రత్త పడగలం. అక్కడ సేవ చేయడం మరియు జవాబుదారీగా ఉండడం ద్వారా జాగ్రత్త పడగలం. ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం ద్వారా, దేవుని ప్రత్యేక రక్షణ మరియు మార్గదర్శకత్వం కోసం పిలుపునివ్వడం ద్వారా జాగ్రత్త పడగలం. సాతాను నీ కోసం వస్తున్నాడనే కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కోవడం ద్వారా – జాగ్రత్త పడగలం.
పోరాటానికి ప్రతిఫలం విలువైనది. మొదటిగా, ఈ భూమిపై మన జీవితం మెరుగుపడుతుంది. తమ తల్లిదండ్రులను గౌరవించే వారందరికీ దేవుడు ఇప్పటికే సీనాయి పర్వతం నుండి వాగ్దానం చేసినట్లుగా, “మీకు మేలు జరుగుతుంది.” మీ జీవిత నాణ్యత మెరుగుపడుతుంది. తండ్రి తన పిల్లలకు నిజంగా అవసరమైనవన్నీ పంపిస్తానని వాగ్దానం చేసాడు. కాని మనము గొప్ప తీర్పును దాటినప్పుడు మరియు మన దేవుడు మన కొరకు సృష్టించే కొత్త ఆకాశము మరియు కొత్త భూమిలోకి ప్రవేశించినప్పుడు పూర్తి ప్రతిఫలం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకటన 21 మరియు 22 అధ్యాయాలలో కనిపించే పరలోక దర్శనం మన ఈ పోరాటంలో చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంది: అక్కడ మరణం, దుఃఖం, ఏడుపు లేదా నొప్పి లేదు. ప్రజలు అనారోగ్యంతో ఉన్న శరీరం మరియు మనస్సు యొక్క అన్ని విషయాల నుండి స్వస్థత పొందుతారు – శాపం పోతుంది, సురక్షితంగా ఆనందంతో ఆయనతో ఆయన బిడ్డలతో కలిసి జీవిస్తాము.
9క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. 10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొన వద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. 11శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.
పౌలు క్రైస్తవులకు బోధించినట్లుగా, “లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని, (దానిని మించి ఉండకూడదని) 1 కొరింథీయులకు 4:6, క్రైస్తవులు అపొస్ట్లిక్ బోధనలో ఉండాలని మరియు కొత్త బోధలను కనిపెట్టకూడదని లేదా అనుమతించకూడదని యోహాను కూడా హెచ్చరిస్తూవున్నాడు.
దేవుని వాక్యం ఆయన తన్ను తాను ఎలా తెలియజేసుకొనియున్నాడో తెలియజేస్తూవుంది. బైబిలు బోధలను విశ్వసించి, వాటికి విధేయత చూపి, వాటిని ప్రకటించే వాడు తండ్రి కుమారునితో ఇద్దరితో సజీవ సంబంధం కలిగి ఉంటాడని యోహాను మనకు వాగ్దానం చేస్తూ వున్నాడు.
దురదృష్టవశాత్తు, కొందరు దేవునిని చులకనగా తీసుకొంటారు. అటువంటి వారి దగ్గరకు సాతాను క్రొత్త బోధలను విజయవంతముగా తీసుకొని వెళ్లి, వారిని ప్రలోభపెడ్తాడు మరియు “ప్రామాణిక” క్రైస్తవంలో విసుగును పెంచటం మూలాన్న క్రొత్త బోధల పట్ల ఆకర్షితుడైయేటట్లు చేస్తాడు. సెరింథస్ మరియు అతని గ్నోస్టిక్ (Gnostic) కల్ట్ క్రొత్త భోధలకు ఆకర్షితులయ్యే వారికి ఉత్తేజకరమైన కొత్త రహస్య సమాచారాన్ని అందించడంలో గొప్ప విజయాన్ని సాధించింది. బైబిల్‌కు మించిన బోధలలో దేవుడు లేడని యోహాను ఈ రాకెట్‌ని బయటపెట్టాడు. పరిశుద్ధ లూకా మొదటి శతాబ్దం మధ్యలో వీరిని గురించి చెప్తూ, “ఏథెన్సు వారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదో యొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు” (అపొ. కార్య. 17:21) అని వీరిని బహిర్గత పరచియున్నాడు. పవిత్ర గ్రంథానికి కలిపిన అన్ని సిద్ధాంతపరమైన జోడింపులలోగాని లేదా ఫిలొసొఫికల్ రిప్లేసెమెంట్స్ లోగాని- మార్మన్ బుక్ లోగాని, ఎక్స్ కెథడ్రా డిక్రీస్ అఫ్ ది పోప్స్ లోగాని, లేటర్-డే ప్రవచనాలలో గాని దాని రివలేషన్స్ లోగాని, లేదా ప్రోగ్రెసివ్ యూనివర్సిటీ ఫిలొసొఫీస్ లలో గాని, అనేకమైన అబద్దపు భోధలలో – దేవుడు లేడు. బైబిలుకు జోడించడం ద్వారా గాని లేదా బైబిలులో నుండి తీసివేయడం ద్వారా గాని బైబిల్ సందేశాన్ని తారుమారు చేసే వారు శాపగ్రస్తులవుతారని బైబులు తెలియజేస్తూవుంది, ప్రకటన 22:18, 19ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగ జేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
క్రైస్తవులమయిన మన మనస్సులలో మరియు హృదయాలలో సాతాను అబద్ధాలు పాతుకుపోకుండా చూసుకోవడం అత్యవసరం. అట్లే దేవుని సత్యానికి విరుద్ధంగా బోధించే వారికి క్రైస్తవులు మద్దతు లేదా ఆశ్రయం ఇవ్వకుండా వుండటం వారిని ప్రోత్సహించకుండా వుండటం కూడా అత్యవసరం. యోహాను “ఏర్పరచబడినదైన అమ్మగారు మరియు ఆమె పిల్లలు” తప్పుడు బోధలను సహించకూడదని వాటికి మద్దతు ఇవ్వకూడదని చెప్తూవున్నాడు. క్రీస్తు బోధల నుండి తొలగిపోయిన ట్రావెలింగ్ టీచర్స్ కు ఆహారం బసను నిరాకరించడం ద్వారా వీరిని అడ్డుకొమ్మని యోహాను చెప్తూవున్నాడు. యోహాను యొక్క సూచనలు స్పష్టంగా ఉన్నాయి: ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చు కొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. అంటే వారిని మీ ఇంటికి తీసుకెళ్లవద్దు లేదా వారిని స్వాగతించవద్దు. ఒకవేళ మీరు వారిని తీసుకొని వెళ్తే లేదా స్వాగతిస్తే, మద్దతు ఇస్తే మీరు వారి చెడు పనికి సహాయకులుగా, ఉపకరణాలుగా ఉంటున్నట్లే. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. తప్పుడు బోధలకు లేదా తప్పుడు బోధకులకు మద్దతు ఇవ్వడం ద్వారా తెలియకుండానే సాతాను మద్దతుదారులుగా ఉండకండి. అలా చేయడం వల్ల మీ విశ్వాసం మరియు ఇతరుల విశ్వాసం దెబ్బతింటుంది అని యోహాను వారికి తెలియజేస్తూవున్నాడు. మీరు తెలియకుండా రాంగ్ రూట్ లో కారు నడిపారే అనుకోండి, ప్రమాదాలు జరిగే ప్రమాదముంది మనకు, ఇతరులకు. తెలియకనే అప్పుడు మీరు శిక్షార్హులు అవుతారు. ఇచ్చే సాధారణ క్రైస్తవ ఆతిథ్యం, వారి తప్పుడు బోధలతో ఏకీభవిస్తున్నామనే అభిప్రాయాన్ని ఇవ్వకుండా, ఇతరులను మోసగించడానికి మరియు యేసుపై నుండి వారి విశ్వాసాన్ని జారవిడుచుకోవడానికి కారణం కాకుండా ఉండేందుకు తప్పుడు బోధకులకు మద్దతు ఇవ్వకూడదు.
ట్రావెలింగ్ టీచర్స్ కు వ్యక్తిగత ఆతిథ్యం అందించడం 21వ శతాబ్దంలో పెద్ద సమస్య కాదు. కాని తప్పుడు బోధకులకు మద్దతు డబ్బు అందించడం సమస్యగా వుంది. ఈ రోజు చాలా మంది బైబిల్ క్రైస్తవులు క్రీస్తు బోధలను భోదించని సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. కొందరు అబద్దపు సంఘాలలో సభ్యత్వం కొనసాగిస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, వారు క్రీస్తు బోధలను భోదిస్తూవున్నారా లేదా అనేది నాకు అనవసరం. నేను పట్టించుకోను. సంఘం బాగానే ఉంది, నేను ఇక్కడే బాప్తిస్మం తీసుకున్నాను మరియు వివాహం చేసుకున్నాను; ఒక్కొక్కసారి వారి బోధలు తప్పు అని అనిపిస్తుంది కాని ఈ స్థలాన్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. మరికొందరు మా పాస్టర్ గారు భోదించే అన్ని విషయాలను నేను విశ్వసించను. నేను అంగీకరించే వాటిని ఎంచుకుంటాను అని చెప్తూ ఉంటారు. మీరు మీ డబ్బును మీ మద్దతును తప్పుడు బోధకులకు ఇస్తే, మీరు వారి చెడ్డ పనిలో భాగస్వాములు అవుతున్నారు, పాలుపంచు కొంటున్నారు, జ్ఞాపకముంచుకోండి.
మనల్ని రక్షించడానికి వచ్చిన శరీరధారియైన దేవుడు అనే క్రీస్తు బోధకు నమ్మకంగా ఉండడం ద్వారా మాత్రమే మనం ప్రేమలో సత్యంలో నడుస్తాము. క్రీస్తు బోధ నుండి వైదొలగిన వారికి తండ్రియైన దేవుడు ఉండడు, నిత్యజీవముండదు. వారికి మద్దతు ఇచ్చే వారు వారి చెడ్డ పనిలో పాలుపంచుకొంటున్నారు, వారి శిక్షలో కూడా పాలుపంచుకుంటారు. మీరు ప్రేమలో మరియు సత్యంలో నడవడానికి యేసు ఇప్పటికీ మానవ శరీరంతో మన దగ్గరకు వస్తాడనే సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ మీ పట్ల శ్రద్ధ వహించడానికి ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు.
మా ప్రభువును రక్షకుడైన యేసూ, మీరు మీ కృప ద్వారా నిజమైన దేవునిగా మరియు నిజమైన మానవునిగా మా వద్దకు వచ్చారు. సత్య బోధలో ఉండేందుకు మాకు విశ్వాసాన్ని ఇవ్వండి. దాని నుండి ఎప్పటికీ వైదొలగకుండా, ఇతర బోధలను పట్టుకోకుండా, అబద్ద బోధకులకు మద్దతు ఇవ్వకుండా మేముండునట్లు మాకు సహాయము చెయ్యండి, ఆమెన్.
నాలుగవ భాగం
చివరి శుభాకాంక్షలు (12, 13)
12అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను.
ఈ లేఖ చిన్నదిగా ఎందుకుంది అనేదానికి ఇక్కడ కారణముంది – అనేక సంగతులు మీకు వ్రాయవలసి యుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. “ఏర్పరచబడినదైన అమ్మగారు మరియు ఆమె పిల్లలు” యోహానుకు సమీపంలోనే ఉన్నారు, సమీప భవిష్యత్తులో వారిని వ్యక్తిగతంగా సందర్శించాలని అతడు ఆశపడుతూ వున్నాడు. అతడు వారిని దర్శించాడో లేదో మనకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు.
యోహాను ఈ ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. అతడు చాలా గొప్ప నాయకుడు. అతడు వృద్దుడైనను ఇంకను పరిచర్యలోనే వున్నాడు. అతడు వ్రాసిన బైబిల్ యొక్క ఐదు పుస్తకాలు ఈ రోజు మనం పదవీ విరమణ సంవత్సరాలుగా పిలుస్తున్న టైంలో అతనిచే వ్రాయబడ్డాయి. ప్రజలందరి కోసం తన సర్వస్వాన్ని అందించిన వ్యక్తికి సేవ చేయడంలో అలసిపోవడం అతనికి ఆనందం. పశ్చిమ ఆసియా మైనర్లో అతని పర్యవేక్షనలో ఉన్న సంఘాలకు అతడు చేసిన పర్యటనలు గుణాత్మకమైనవి. అవి అతడు ప్రేమించిన వ్యక్తులతో, “కుటుంబ పునఃకలయికలుగా” చెప్పొచ్చు.
కాగితము అనే పదం కాస్త కాలజ్ఞానదోషం (అనాక్రోనిజం). 12వ వచనంలోని పదం వాస్తవానికి పాపిరస్‌ను సూచిస్తుంది, ఇది నది రెల్లు నుండి తయారు చేయబడిన ఒక వ్రాత పత్రం. వీటిని స్క్రోల్స్‌గా చుట్టవచ్చు. సిరా అంటే పొడి కార్బన్, నీరు మరియు గమ్ లేదా నూనెతో తయారు చేయబడింది.
ముఖాముఖిగా మాట్లాడడం చాల మంచి విషయం. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు మరియు వివరణలు ఇవ్వవచ్చు.
13ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.
సంఘ ఫెలోషిప్‌లో భాగం కావడం గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి. దేవుడైన యెహోవా– నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అనుకొనినట్లుగా, ఒకే మనస్తత్వం గల సంఘాలు ఒకరినొకరు కనుగొని ఒకరికొకరు మద్దతు, ప్రార్థన, ప్రోత్సాహం, ఉపదేశాలు మరియు పరిచర్య ఆలోచనలు ఇవ్వడం మంచిది. యేసు ప్రభువు కోసం ఆరు దశాబ్దాల సుదీర్ఘ పని తర్వాత, కొత్త నిబంధన చర్చి యూదయ మరియు గలిలీలోని కొన్ని వందల మంది భయభ్రాంతులకు మరియు గందరగోళానికి గురైన విశ్వాసుల నుండి ప్రపంచవ్యాప్త విశ్వాసుల నెట్‌వర్క్‌గా ఎలా ఎదిగిందో చూడటం యోహానుకు ఎంతటి సంతృప్తిని కలుగజేసి ఉండొచ్చొ ఊహించుకోండి. 13వ వచనంలోని “పిల్లలు” బహుశా ఎఫెసులోని యోహాను హోమ్ చర్చి సభ్యులై ఉండొచ్చు. వారు యోహాను వ్రాసిన ప్రతి దానికీ తమ “ఆమేన్”ని జోడించారు.
అపొస్తలుడు వచ్చి అన్ని సమస్యలను పరిష్కరించాలని యోచిస్తున్నాడు. అప్పటి వరకు, విశ్వాసంలో స్థిరంగా నిలబడమని సంఘమునకు హెచ్చరికను ఇచ్చాడు. మీరు కూడా అపొస్తలుల సాక్ష్యం మరియు పవిత్ర గ్రంథాలన్నింటినీ కలిగి ఉన్నారు. దేవుని ప్రత్యక్షతకు కట్టుబడి ఉండండి. మన రక్షణ మరియు ఆనందం యైన యేసును ఆయన పనిని తగ్గించే అబద్దపు బోధల పట్ల జాగ్రత్తగా ఉండండి.
ప్రభువా, మీ బోధలకు నమ్మకంగా ఉండేలా మాకు సహాయము చెయ్యండి. మోసగాళ్ల నుండి మమ్మల్ని రక్షించండి. మీ రాకడలో మా ఆనందం పరిపూర్ణమగులగున నమ్మకమైన సహోదరీ సంఘాలతో మాకు సహవాసం ఇవ్వమని అడుగుచున్నాము, తండ్రి, ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.