
పాత నిబంధన పాఠము: ఆదికాండము 28:10-17; పత్రిక పాఠము: రోమా 5:1-11; సువార్త పాఠము: మార్కు 8:31-38; కీర్తన 73.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: ఆదికాండము 28:10-17
10-11యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. 12అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశము నంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. 13మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. 15ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా 16యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని 17భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.
బేతేలులో యాకోబుకు దేవునితో జరిగిన ఆశ్చర్యకరమైన ఎన్‌కౌంటర్, మన జీవిత ప్రయాణంలో వ్యక్తులుగా, సంఘాలుగా అనుకోకుండా దేవునిని ఎక్కడ కలుసుకొంటాము అనే దాని గురించి ఆలోచించమని చెప్తున్నట్లుగా ఉంది. ఏశావు యొక్క ద్వేషం నుండి తప్పించుకొని పారిపోతూవున్నప్పుడు దారిలో యాకోబుకు దేవుడు కనిపించాడు (ఆది 27:41-45). యాకోబు పారిపోవడానికి కారణం ఏశావుకు చెందిన జన్మహక్కును (ఆది 25:29-34) మరియు ఆశీర్వాదములను (ఆది 27:1-40) దొంగిలించటమే. కుటుంబ హోదాను యాకోబు పట్టుకోవడంతో అది యాకోబును ప్రమాదములోనికి నెట్టింది, కుటుంబము నుండి దూరం చేసింది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతడు తన ప్రియమైన తల్లి రిబ్కాను కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి (అంటే దక్షిణం నుండి) ఉత్తరాన ఉన్న హారానుకు ప్రయాణిస్తూ ఉన్నాడు. హారానులోని తమ స్వస్థలం నుండి అతని పితరులు, దేవుడు వారి సంతతికి వాగ్దానం చేసిన దేశానికి విశ్వాసంతో ప్రయాణిస్తే ఇతడు తిరిగి వారి స్వస్థలానికి వెళ్తు ఉన్నాడు (ఆదికాండము 12:1-9). ప్రయాణం మధ్యలో, రాత్రిపూట కారణంగా విశ్రాంతికి అతడు ఎంచుకున్న సైట్‌లో, యాకోబు తన జీవితాన్ని మార్చే ఒక అసాధారణమైన కల కన్నాడు. దేవుడు యాకోబుకు కూడా చేరువవుతున్నాడు. నేడు మనలో చాలా మంది దేవుని నుండి వినాలను కుంటున్నాం. మనకు కూడా భరోసా కావాలి, దిశానిర్దేశం కావాలి, పనులు జరిగేలా హామీలు కావాలి. మనకు కూడా బేతేలు కావాలి. యాకోబు కథ బైబిల్ యొక్క పెద్ద సందేశాలలో ఒకటి. దేవుడు మన గురించి పట్టించుకుంటాడు మరియు మనల్ని చేరుకుంటున్నాడు అనే సందేశం ఈ కధలో ఉంది.
తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసి, ఆ స్థలమునకు బేతేలను (దేవుని మందిరము) పేరు పెట్టాడు. అబ్రాహాము కూడా ఈ స్థలములో ఆరాధించాడని, ఆది 12:8 చెప్తూ ఉంది.
అయితే నేడు ఆ స్థలమునకు ఇవ్వబడిన పేరులా అది లేదు. అక్కడ చెల్లాచెదురుగా నున్న రాళ్లు రప్పలు పిచ్చిగా పెరిగిన కలుపు మొక్కలు తప్ప మరేమియు చూడలేము. ఒకప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు మన పితరులు సమావేశమైన స్థలమీదేనా అని మనలను మనమే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉదయకాలమున మన పాఠము యేసు ఉన్న చోటల్లా దేవుని మందిరమే అని తెలియజేస్తూ ఉంది. అది సంఘము కానివ్వండి లేదా మీ ఇల్లు కానివ్వండి, విశ్వాసులముగా మనమున్న ప్రతి చోట అది దేవుని మందిరమే.
యేసు ప్రతి స్థలమును బేతేలుగా చేయుచున్నాడు
- ఆయన దేవుని సన్నిధికి మార్గమును తెరచుచున్నాడు 10-12
- దేవుని వాగ్దానములను గురించి ఆయన మనకు నిశ్చయత నిచ్చుచున్నాడు 13-15
- దేవునితో పరిపూర్ణమైన జీవితమునకు ఆయన మనలను నడిపించుచున్నాడు 16-17
1
10-11యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.
యాకోబు రిబ్కాల క్రియను బట్టి, ఇస్సాకు కుటుంబం అల్లకల్లోలంగా ఉంది. ఇంట్లో పరిస్థితులు సద్దుమణిగే వరకు యాకోబు కనానును విడిచిపెట్టి కొంతకాలం తన బంధువుల వద్దకు వెళ్లాలని రిబ్కా కోరుకుంది. ఎప్పుడు తలితండ్రులతో కలిసి ఉంటూ ఉండే వాడు స్వస్థలాన్ని స్వంత వ్యక్తులను వదిలి తాను మునుపెప్పుడు వెళ్లని స్థలానికి వెళ్ళవలసి వచ్చింది.
యాకోబు యొక్క వాస్తవ స్థితిని గమనిస్తే, తన ప్రాణాన్ని కాపాడుకొనే ప్రయత్నములో పారిపోతున్నవానిగా, భయపడుతూ, ఒంటరిగా, భవిష్యత్తు ఏవిధముగా ఉండబోతుందో తెలియని వానిగా, దయనీయముగా, నిర్జన్యమైన ప్రదేశములో అతడు నిస్సహాయునిగా, తన స్వభావంలో మోసగించాలనే ప్రవుత్తిని కలిగియున్న వానిగా, ఇతరులను పణంగా పెట్టి తన సొంత ప్రయోజనాలను చూసుకొనేవానిగా, తన తండ్రిని మోసగించుటను బట్టి అపరాధ భావముతో ఉన్నాడు.
యాకోబు కనానుకు ఉత్తరాన ఉన్న హారాను నగరానికి 500 మైళ్ల ప్రయాణంలో బయలుదేరాడు. నేడు ఈ భూమి సిరియా అని పిలువబడుతుంది. ఈ ప్రయాణములో, అతడు మోసం ద్వారా తాను కోరుకున్న వాగ్దానాన్ని పొందగలిగానని గర్వపడుతూ ఉండొచ్చు. అట్లే తన అపరాధ భావన అతనిని భయపెడుతూ ఉండొచ్చు. కాని తన తండ్రి రెండవమారు తనకు మళ్ళీ చెప్పిన వాగ్దానంతో అతను ఉత్సాహంగాను ఉండొచ్చు. యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్తూ, బేతేలు అనబడే స్థలానికి చేరుకొన్నాడు.
యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. అప్పుడతడు ఒక కల కనెను. 12అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశము నంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
యాకోబు చాలా రోజులుగా ప్రయాణములో ఉన్నాడు. అతను దాదాపు 70 మైళ్ళు ప్రయాణించాడు, ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, యాకోబు బయలుదేరటానికి ముందు తన తండ్రియైన ఇస్సాకు ఇష్టపూర్వకంగా తనను దీవించియుండుటను, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతోకూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అను మాటలను నెమరు వేసుకొంటూ ఉండొచ్చు, ఆదికాండము 28:3-5. మెస్సియాను గూర్చిన ఆశీర్వాదము ఎలా నెరవేరబోతుందో అందుకు తాను ఏమి చెల్లించవలసి యున్నదో యాకోబుకు తెలియదు. లాబాను నుండి తనకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో అని ఆలోచిస్తూ ఉండొచ్చు. తన తండ్రి గుడారాలను మళ్ళీ ఎప్పుడైనా చూస్తానా అని మధనపడుతూ ఉండొచ్చు. ఈ విషయాలను గురించి అతడు ఆలోచిస్తూ పండుకొనగా, నిద్రలో యాకోబుకు ఒక కల వచ్చింది. ఈ కల చాలా ప్రత్యేకమైనది. ఆ కల జరిగిపోయిన విషయాలను జ్ఞ్యాపకం చెయ్యటం లేదు భవిష్యత్తు యాకోబు కొరకు దాచియుంచిన విషయాలను గురించి చెప్పేది కాదు. అందులో ఒక నిచ్చెన కనబడింది అది భూమిమీద నిలుపబడి యుండెను; దాని కొన ఆకాశము నంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
ఆ కలలో అతను తాను ఉన్న ప్రదేశం నుండి పరలోకానికి చేరుకునే మెట్ల మార్గాన్ని చూశాడు. పరలోకం భూమి ఇవి రెండూ నిజానికి పాపం ద్వారా వేరు చేయబడ్డాయి. కాని యాకోబుకు కలలో కనిపించిన ఆ నిచ్చెన భూమిని పరలోకమును కలుపుతూ ఉంది. ఈ నిచ్చెన వాటి మధ్యన సంబంధాన్ని తిరిగి స్థాపించింది. దీని ద్వారా దూతలు దయగల పనులపై అటూ ఇటూ వెళ్తూ ఉన్నారు. ఈ నిచ్చెన పరలోకం మరియు భూమికి మధ్య కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉంది. “ప్రభువు దాని పైన నిలబడ్డాడు” ఆయన కృపలో యాకోబు క్రింద ఉన్నాడు. మెట్ల మీద దేవదూతలు పైకి ఎక్కుతూ, యాకోబు అవసరాలు మరియు అభ్యర్థనలను దేవుని దగ్గరకు మోసుకెళ్తున్నారు, అలాగే దిగుతూ, దేవుని సహాయం హామీతో తిరిగి వస్తున్నారు. ఇక్కడ ఇది యాకోబును దేవునితో సంభాషించేందుకు అవకాశమిచ్చింది. అతడు మధ్యవర్తి ద్వారా అంగీకరించబడ్డాడనే బలమైన పాఠాన్ని అతనికి నేర్పుతుంది. ప్రభువైన యేసు ఒకసారి యాకోబు కలను ప్రస్తావించి, యాకోబు చూసిన మెట్ల మార్గంతో తనను తాను పోల్చుకున్నాడు (యోహాను 1:51). ఆకాశాన్ని మరియు భూమిని కలిపే మెట్ల మార్గాన్ని నేనేనని యేసు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులో, దేవుడు ఒక వంతెనను నిర్మించాడు, దానిపై ఆయన మన దగ్గరకు వస్తాడు మరియు దానిపై మనం ఆయన వద్దకు తిరిగి రావచ్చు.
2
13మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.
ఈ కలను ఇచ్చి దీని మర్మాన్ని కనుక్కొనెలా దేవుడు యాకోబును వదిలేయలేదు. దేవుడు అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. తన తండ్రి దేవుని నుండి తనకు వస్తున్న హామీల గురించి మాట్లాడటం అతను విన్నాడు. మొట్టమొదటిసారి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను అని తనను తాను పరిచయము చేసుకొన్నాడు. ఇక్కడ దేవుడు అనే మాటకు, సరిపోల్చలేని సర్వశక్తిమంతుడనైన వాడను అని, యెహోవా అను మాటకు కృపామయుడునైన వాడను అని అర్ధం. దానికి తోడుగా ఆయన తాను నీ తండ్రియైన ఇస్సాకు దేవుడను నీ తాతయైన అబ్రాహాము దేవుడనని చెప్తూ తనను యాకోబు కుటుంబముతో కలుపుకొంటున్నాడు.
యాకోబు కల యొక్క పరాకాష్ట ప్రభువు స్వయంగా పరలోకపు మెట్ల ముందు నిలబడి అతని తాతయైన అబ్రహంకు ఇచ్చిన వాగ్దానాలను యాకోబుకు మరలా చెప్పటం. యాకోబు తన తండ్రిని మోసగించి పొందిన వాగ్దానాలను ఇప్పుడు అతడు దేవుని పెదవుల నుండి విన్నాడు. ఇక్కడ మోసం లేదు. అతని వారసులు అనేకులు అవుతారని, వారు భూమిని వారసత్వంగా పొందుతారని మరియు వారి ఒక గొప్ప వారసుడి ద్వారా భూమిపై ఉన్న అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయని దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు. ఈ వ్యక్తీకరణ అబ్రాహాము సంతానము యొక్క ప్రపంచవ్యాప్త సార్వత్రికతను సూచిస్తుంది. వీళ్ళు అబ్రాహాము సహజ సంతానాన్ని మించిపోతారు.
అబ్రాహాము ఇస్సాకులకు ఇచ్చియున్న అవే వాగ్దానములను ఆయన యాకోబుకు ఇవ్వడం ద్వారా తాను యాకోబుకు కూడా దేవుడునై యుందునని సెలవిచ్చియున్నాడు. 13వచనంలో నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదనని దేవుడు యాకోబుకు చెప్పాడు. యాకోబు ఆ భూమిని వదిలి వెళ్లబోవుచున్నాడు కానీ దేవుని మాట ప్రకారము యాకోబు దానిని పోగొట్టుకోడు. భూమిమీదనున్న ఇసుక రేణువులవలె యాకోబు సంతానము విస్తరిస్తుంది. ఆ టైములో ఆ మనుష్యునికి కాబోయే భార్య విషయము ఏ మాత్రము తెలియనప్పటికిని అతని సంతానము భూమియందంతట విస్తరించునని ఆయన సెలవిచ్చియున్నాడు. దేవుని శిక్షణా తరగతిలో చేరుటకు ముందుగా యాకోబు ఈ వాగ్దానములను బట్టి బలమును పొందుకొన్నాడు. ఈ వాగ్దానములను యాకోబు ఎప్పుడు మర్చిపోలేదు. ఎల్లప్పుడూ వాటిని అతడు తన హృదయములో ఉంచుకొన్నాడు.
దేవుడు విశ్వాసులందరికి పరిశుద్ధ లేఖనాలలో ఎన్నో వాగ్దానములను ఇచ్చాడు. ప్రతి ఒక్కటి మీకు జ్ఞపకముందా? ఈ వాగ్దానాలన్నీ మన అవసరతలలో ఈ జీవిత ప్రయాణములో ప్రతి సందర్భములో మనకు సహాయముగా ఉండులాగున, మనలను ఆదరించులాగున, మనలను బలపరుచులాగున, మనలను నిర్ధేశించులాగున మనకు ఇవ్వబడి ఉన్నాయి.
దీనికి దేవుడు మరో వాగ్దానాన్ని జోడించాడు: “ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను.” ఇక్కడ యాకోబు తాను ఎరుగని హారాను ప్రజల యొద్దకు వెళ్తు ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఆ రాత్రి తాను బ్రతికి ఉంటానని గాని, తిరిగి తన కుటుంబమును చూస్తాననిగాని, తన స్వదేశమును మరలా చూస్తాననిగాని యాకోబు తలంచలేదు. అలాంటి పరిస్థితులలో దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుకు ఉన్న అన్ని అనుమానములను తీర్చి అతనికి ఉన్న అస్థిరమైన విషయాలలో అతనికి వాగ్దానము యిచ్చియున్నాడు.
హెబ్రీ గ్రంధకర్త, మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెనని (4:15) మనకు జ్ఞ్యాపకం చేస్తూవున్నాడు. యేసు మన రక్తమాంసములను తీసుకొని మనవలె శోధింపబడ్డాడు శ్రమలను బాధలను అనుభవించియున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన పాఠములోని యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా, ఆయన మన ఒంటరితనంలో మన అస్థిర విషయములలో అవసరతలలో ఆయన మనతో మాట్లాడుతున్నాడని జ్ఞపకముంచుకోండి. ఆయన మనతో ఉన్నాడని, ఆయన వాగ్దానాలన్నీ మనతో నిలచియున్నవనే విషయాన్ని అది మనకు జ్ఞ్యాపకం చేస్తువుందని జ్ఞపకముంచుకోండి.
నేడు మనమును ఆశీర్వదింపబడియున్న యాకోబు సంతానమై యున్నాము. యాకోబు కుమారుడైయున్న యేసు ద్వారా దేవునియొక్క ఆశీర్వాదములు ప్రతి దేశమునకు ప్రతి ఒక్కరిదగ్గరకు ప్రవహిస్తూ వున్నాయి. కల్వరి మీద ఆయన బలి ప్రజలందరి కొరకు. ఆయనను విశ్వసిస్తూ ఉన్న ప్రతిఒక్కరిని క్షమించుచున్నాడు, రక్షణను దయచేస్తూ ఉన్నాడు, ప్రతి దీవెనతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
3
16యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని 17భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.
మరుసటి రోజు ఉదయం యాకోబు కొన్ని మిశ్రమ భావోద్వేగాలతో మేల్కొన్నాడు. దేవుడు తనకు చెప్పిన దానికి అతను కృతజ్ఞుడయ్యాడు, కానీ ప్రధానమైన భావోద్వేగం విస్మయం యొక్క భావన. “నిజంగా ప్రభువు ఈ ప్రదేశంలో ఉన్నాడు, నాకు అది తెలియదు” అని ఆశ్చర్యపోతాడు. దేవుని ఇంట్లో మరియు స్వర్గ ద్వారం వద్ద తనను తాను కనుగొన్నప్పుడు అతడు గంభీరమైన విస్మయంతో నిండిపోతాడు. ఇక్కడ, అతను ఒంటరిగా మరియు బహిష్కరించబడ్డాడని భావించిన చోట, అతను స్వర్గ ద్వారం వద్దకు వచ్చానని కనుగొన్నాడు. ఆ సమయంలో అతని ప్రియమైన తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుండవచ్చు, కాని అతడు దేవుని ఇంట్లో ఉన్నాడు. దేవదూతల సంరక్షణలో ఉన్నాడు. అతను అన్యులతో చుట్టుముట్టబడిన అపరిచితుడు అయినప్పటికీ, అతను దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ వింత ప్రదేశంలో, దేవుడు అతనితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు, అతనితో మాట్లాడాడు మరియు అతన్ని ఆశీర్వదించాడు.
తనకు కలిగిన అద్భుత దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, యాకోబు తన తలపై ఉన్న రాయిని తీసుకొని దానిని ఆ సంఘటన యొక్క స్మారక చిహ్నంగా నిలిపాడు. దేవుడు తనకు కనిపించిన విలువైన ప్రదేశాన్ని గుర్తించడానికి, దానిని వేరు చేయడానికి అతను దానిని నూనెతో అభిషేకించాడు. దానిపై నూనె పోయడం అనేది అక్కడ అతనికి కనిపించిన దేవునికి ప్రతిష్టించే చర్య, సంఖ్యాకాండము 7:1. అతడు ఈ ప్రదేశానికి బేతేలు (హీబ్రూలో “దేవుని ఇల్లు”) అని పేరు పెట్టాడు.
ఈ రోజు ఈ ఇల్లు లేదా ఈ మందిరము పరలోకపు గవినియై ఉంది. దేవుడు తన వాక్యము సంస్కారముల ద్వారా మనందరి దగ్గరకు వచ్చుచున్నాడని చెప్పగలం. యేసు నందు దేవుడు తన క్షమాపణను ప్రేమను మనపై క్రుమ్మరించినప్పుడు, ఆయన మనలో ప్రతి ఒక్కరి కొరకు పరలోకపు మార్గాన్ని తెరుస్తూ ఉన్నాడు. మనము ఎక్కడ ఉన్నప్పటికినీ, ఏ స్థలములోనైతే మన ప్రభువు మన దగ్గరికి వచ్చి మనలను చేర్చుకొనుచున్నాడో అదే బేతేలు.
దేవుడు ఎల్లప్పుడు మనతో ఉన్నాడని ఆయన వాగ్దానములు ఇంకను మన మీద నిలిచి ఉన్నావనే స్థిరమైన నిశ్చయతను మనము యేసు నందు కలిగియున్నాము. ఆ దేవుని ప్రేమ యొక్క రుజువును, రోమా 8:32, తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అను మాటలలో మనం చూడగలం.
మన జీవిత ప్రయాణము, యాకోబునకు వలె కష్టముగా ఉన్నను, మనం అనిశ్చితి మార్గములలో ఉన్నను, మన ముందు మన కొరకు వేచియున్న దానిని గురించి మనకేమి తెలియకపోయినను, మన ప్రక్కన యేసు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా ఉందాం.
దేవుడు ఇక్కడ నిశ్చయముగా ఉన్నాడని మనము చెప్పునట్లుగా, యేసునందు ప్రతి స్థలము మనకు ఒక బేతేలులా ఉండులాగున దేవుడు దయచేయును గాక. మనము క్రొత్తగా దేవుని సన్నిధికి మార్గమును చూడగలుగునట్లుగా, ప్రతి దినము మనము దేవుని యొక్క వాగ్దానములను స్వీకరించునట్లుగా, ఖచ్చితమైన దేవునితో పరిపూర్ణ జీవితమును ఎల్లప్పుడు కలిగియుందుమను నిశ్చయతను కలిగియుండునట్లుగా, తండ్రీ, ప్రతి స్థలమును ఒక బేతులుగా మార్చండి. ఆమెన్.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.