ఆలోచించండి
● ఈ బైబిల్ కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు.

మత్తయి 3:16,17, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. లూకా 4:1,2 యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యొర్దాను నదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత శోధింపబడుచుండెను.

యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై అంటే? యేసు ఆత్మ చేత అరణ్యములోకి ఎందుకు నడిపించబడ్డాడు? యేసును శోధించడానికి దేవుడు సాతానును ఎందుకు అనుమతించాడు? యేసు లొంగిపోయి పాపం చేసి ఉంటే? ఇది సాధ్యమేనా?

● ఈ భాగాన్ని మూల్యాంకనం చేయడానికి మరియు నేర్చుకోవడానికి మీకు సహాయపడేలా ఈ పాఠము యొక్క అంశాన్ని ఉపయోగిధ్ధాం. ఈ వచనాలలో ఉన్న అంశము “యేసు ఎవరో తెలుసుకోండి”. ఈ యేసు ఎవరో తెలుసుకోవడానికి మన పాఠాన్ని చదువుకొందాం.

మూల్యాంకనం
● మూల్యాంకనంలో భాగముగా ముందుగా కధలోని పాత్రలేమిటి? వస్తువులేమిటి? ఈ కథ ఎక్కడ, ఎప్పుడు జరిగింది? కథలో సమస్య ఏమిటి? ఏయే సంఘటనలు జరిగాయి అనే ప్రశ్నలకు ఈ బైబిల్ భాగాన్ని ఉపయోగించి వాటికి జవాబులు తెలుసుకొందాం.

● కథలోని పాత్రలు ఎవరు? యేసు మరియు అపవాది; పరిశుధ్ధాత్ముడు మరియు దేవదూతలు.

● కథలోని వస్తువులు ఏమిటి? అరణ్యము, రాళ్ళు, ఎత్తైన ప్రదేశం మరియు భూలోక రాజ్యములు, యెరూషలేము మరియు దేవాలయ శిఖరము.

● ఈ కథ ఎక్కడ జరిగింది? యూదయ అరణ్యంలో.

● ఈ కథ ఎప్పుడు జరిగింది? క్రీ. శ. 28/29లో. ఆయన బాప్తిస్మములో దైవిక ఆమోదం మరియు అనుకూలత యొక్క అద్భుతమైన అభివ్యక్తి తర్వాత ఇది వెంటనే జరిగింది.

● సమస్య ఏమిటి? యేసును ప్రలోభపెట్టడానికి/ శోధించడానికి దేవుడు అపవాదిని అనుమతించాడు. నిజదేవునిగా నిజమానవునిగా గెలవడానికి యేసు ఈ శోధనలను తీసుకోవాలి. ఈ శోధనలు అపవాది చేత కాదు, దేవునిచే ఉద్దేశించబడ్డాయి, దీని శాశ్వతమైన ప్రణాళిక రక్షకుడు శోధించబడాలని మరియు విజయం సాధించాలనేదే. అట్లే ఈ యుద్ధం లో యేసు తన దైవత్వాన్ని ఉపయోగించకూడదనేది నియమము. ఆయన ఒంటరిగా తన నిజ మానవత్వముతో మాత్రమే ఈ యుద్దాన్ని గెలువవలసియున్నాడు. ఈ మొత్తం ఆధ్యాత్మిక యుద్ధం సమయంలో, యేసు ఉపవాసం ఉన్నాడు.

● ఈ కథనంలో ఏయే సంఘటనలు జరిగాయి?
యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యొర్దాను నదినుండి తిరిగి వచ్చి ఆత్మచేత అరణ్యములోనికి  నడిపించబడ్డాడు_ యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై_ అంటే, త్రియేక దేవుని యొక్క ముగ్గురు వ్యక్తులు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. బాప్తిస్మము వద్ద తండ్రి మరియు పరిశుధ్ధాత్ముడు కుమారుడు చేస్తున్న దానిని వారు ఆమోదించినట్లుగా తమను తాము బయలుపరచుకొన్నారు. యేసు నిజదేవుడు మరియు ఆయన నిజ స్వభావంలో నిజమానవుడై యున్నాడు. ఆయన మానవ స్వభావంలో, ఆయన ఆలోచనలు మరియు చర్యలన్నీ ఆత్మ యొక్క అద్భుతమైన శక్తిచే నిర్దేశించబడ్డాయి. విమోచన పనిలో ఆయనను పూర్తి సామరస్యంతో నింపిన ఆత్మతో ఆయన పనిచేశాడని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి. మార్కు 1:13, ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతోకూడ నుండెను.

ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడ్డాడు _ఎందుకు? యేసు తనకు మరియు అపవాదికి మధ్య పోటీలో పరీక్షించబడాలి. రెండు సంకల్పాల మధ్య పరీక్ష, దేవుని చిత్తం లేదా అపవాది సంకల్పం. అందుకే ఈ పరీక్షలో ప్రవేశించమని యేసు పరిశుద్ధాత్మచే నిర్దేశించబడ్డాడు. యేసు ఇష్టపూర్వకంగా వెళ్లాడని చాలా స్పష్టంగా ఉంది. యేసు చిత్తానికి మరియు తండ్రి చిత్తానికి లేదా పరిశుద్ధాత్మకు మధ్య ఎప్పుడూ వైరుధ్యం లేదు.

అరణ్యములో_ ఏ మానవ సాంగత్యం లేకుండా ఆయన అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు. అక్కడ ఆయన తన బహిరంగ పరిచర్య ప్రారంభంలోనే అపవాదిని జయించటానికి కలుసుకున్నాడు. దేవుని కుమారుడైన యేసు మన కొరకు అపవాది యొక్క ప్రలోభాలకు (శోధనకు) లోనయ్యాడు. ఈ ప్రలోభాలు చాలా తీవ్రమైనవి. నలభై రోజులు క్రీస్తు అపవాది యొక్క ప్రలోభాలకు గురయ్యాడు. ఈ మొత్తం ఆధ్యాత్మిక యుద్ధం సమయంలో, యేసు ఉపవాసం ఉన్నాడు. ఈ నలభై రోజులలో ఆయన భరించినది మన మానవ భావనలన్నింటికీ మించినది, అందుకే యేసు తన శిష్యులతో భూమిపై ఉన్న రోజుల్లో వాటి గురించి మాట్లాడలేదు. శోధన 40 రోజుల పాటు కొనసాగింది. ఈ 40 రోజులు యేసు ఏమి తినలేదు; భయంకరమైన ఆకలి మరియు దాహంతో ఉన్నాడు. ఆయన నిజమైన మానవ స్వభావాన్ని బట్టి ఆయన ఆకలి మరియు దాహానికి గురయ్యాడు.

ఈ 40 రోజులు ఐగుప్తు నుండి వలస వచ్చిన 40 సంవత్సరాలను గుర్తు చేస్తున్నాయి. ఇశ్రాయేలు కూడా అరణ్యంలో శోధన, ఆకలి మరియు దాహం అనుభవించింది. ఆయన ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఎదుర్కొనని పరీక్షను యేసు ఎదుర్కొన్నాడు (నిర్గమ 15:25; 20:20).

యేసును శోధించడానికి దేవుడు సాతానును ఎందుకు అనుమతించాడు? ఆదాము (దేవుని కుమారుడు) అపవాది అతనిని శోధించినప్పుడు అతడు విఫలమయ్యాడు. కానీ ఈ దేవుని కుమారుడైన యేసు మన స్థానాన్ని తీసుకొనుటకు దిగివచ్చాడు. ఆయన అపవాదిని ఓడించుటకు శోధనలో దేవుని చిత్తానికి విధేయత చూపాలి. ఒకవేళ యేసు విఫలమై పాపంలో పడితే? దీనివల్ల ఆయన మనల్ని విమోచించడం అసాధ్యం. ఇది సాధ్యమేనా? దేవుని కుమారునిగా యేసుకు పాపం అసాధ్యం.

గుర్తుంచుకోండి, ఇక్కడ వివరించబడిన మూడు శోధనలు మాత్రమే విమోచనా కార్యాన్ని అడ్డుకునేవి కావు.

ఈ 40 రోజులలో, యేసు ఉపవాసం ఉన్నాడు; ఆయన ఏమీ తినలేదు మరియు భయంకరమైన ఆకలి మరియు దాహంతో ఉన్నాడు. అపవాది యేసు దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో” అన్నాడు. యూదయ అరణ్యములోని మౌంట్ క్వారంటానియాపై ఒక ప్రదేశం సాంప్రదాయకంగా ఖచ్చితమైన ప్రదేశంగా పరిగణించబడుతుందని కొందరి అభిప్రాయము.

ఇక్కడ అపవాదికి ఉపయోగించబడిన గ్రీకు పదం డయాబోలోస్. ఈ పదానికి అర్థం నిందించువాడని అర్ధం, వాడు అబద్ధమునకు జనకుడు.

శోధకుడు యేసు దగ్గరకు వచ్చి “నువ్వు దేవుని కుమారుడివైతే” అని చెప్పాడు_ తన దైవిక కుమారత్వాన్ని నిరూపించుకోమని ఇక్కడ అపవాది యేసును సవాలు చేయడం లేదు. యేసు దేవుని కుమారుడని అపవాదికి తెలుసు, కాని ఆయన ఆ వాస్తవాన్ని అనుమానించేలా చేస్తున్నాడు. అపవాది: నీవు దేవుని కుమారుడివి కాబట్టి, ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. నేను ఒక సాధారణ పరిష్కారాన్ని చెప్తాను: ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పండి, ఆకలిని తీర్చుకోండి అని అంటున్నాడు. ఈ సూచనలో తప్పేంటి?

ఈ శోధన యేసుకు తండ్రి పై అపనమ్మకాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది. యేసు తన శారీరక ఆకలిని తగ్గించుకోవడానికి తన దైవిక శక్తిని ఉపయోగించాలని శోధించబడ్డాడు. ఆహారం, నీళ్లు లేకుండా మానవులు 40 రోజులు జీవించలేరు. ఇప్పటికే 40 రోజులు అద్భుతంగా తనను పోషించిన తండ్రిపై ఆధారపడకూడదని యేసు శోధించబడ్డాడు. అందుకే యేసు ఈ సూచనను తిరస్కరించాడు. యేసు తన మొత్తం పరిచర్యలో, తన వ్యక్తిగత ప్రయోజనం కోసం తన దైవిక శక్తిని ఎన్నడూ ఉపయోగించలేదు. ఆయన చేసిన అద్భుతాలు ఎల్లప్పుడూ ఇతరులకు ఉపయోగపడేవి.

సమాధానంగా యేసు ద్వితీయోపదేశకాండము 8:3 నుండి దేవుని వ్రాతపూర్వక వాక్యాన్ని ఉటంకిస్తూ, “మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు” అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చాడు. తన శరీరానికి ఆహారాన్ని పొందడం కంటే తండ్రికి విధేయత చూపడం చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పాడు, యోహాను 4:34, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది. యేసు ఒక అద్భుతం చేయడం ద్వారా తన స్వంత మహిమను ప్రదర్శించలేదు కాని తన తండ్రి వాక్యంపై నమ్మకాన్ని ప్రదర్శించాడు.

ఏదెనులో ఆదాము శోధన మరియు అరణ్యములో యేసు శోధన మధ్య వ్యత్యాసాన్ని చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. రెండు సందర్భాల్లోనూ సాతాను దేవునిపై అపనమ్మకాన్ని వారిలో మేల్కొల్పడానికి తన ప్రయత్నాలలో భాగముగా అక్కడ పండును తినమని చెప్పాడు, ఇక్కడ రాయిని రొట్టెగా మార్చుకొని తినుమని చెప్తూవున్నాడు. ఏదెను ఆహారంతో సమృద్ధిగా ఉన్న ప్రదేశము, అక్కడ ఆకలి లేదు, కాని వాడు ఏదెనులో విజయం సాధించాడు. కాని యేసు విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు వాడు అరణ్యంలో విఫలమయ్యాడు. యేసు తన భూసంబంధమైన అవసరాలను తీర్చుకోవడానికి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన దైవిక శక్తిని ఉపయోగిస్తే తన మిషన్‌లో విఫలమవుతాడు.

శోధనల క్రమం మత్తయి 4:1–11లో వేరేగా ఉంటుంది లూకా 4:1–13లో వేరేగా ఉంటుంది. మత్తయి ఇశ్రాయేలీయులను ఉద్దేశిస్తూ, వారి జీవితాలలో ప్రాముఖ్యమైన వాటి క్రమములో వీటిని వ్రాసియున్నాడు. లూకా అన్యులను ఉద్దేశిస్తూ వారి జీవితాలలో ప్రాముఖ్యమైన వాటి క్రమములో వీటిని వ్రాసియున్నాడు తప్పితే మరొక కారణమేమి లేదు.

లూకా నివేదించిన తదుపరి శోధన రాజకీయ స్వభావంగలది. అపవాది యేసుతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రతిపాదించాడు.

అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి – ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. ఇక్కడ అపవాది తన అధికారమును చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాని అంతిమంగా, యేసును నడిపించేది ఆత్మయే అన్న సంగతిని మర్చిపోకండి. ఈ శోధన తప్పుడు నమ్మకాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉద్దేశించబడింది.

మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి – ఉదాహరణగా, మోషే చనిపోక ముందు దేవుడు అతనిని నెబో పర్వతానికి తీసుకువెళ్లాడు, మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను. అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించాడు, ద్వితీయోపదేశకాండము 34:1-3. అట్లే అపవాది కూడా యేసును ఎత్తయిన ఒక కొండ మీదికి తోడుకొనిపోయి భూలోక రాజ్యములను చూపించింది.

భూలోక రాజ్యములు – పాలస్తీనా, లేదా కనాను రాజ్యాలు మరియు తక్షణ సమీపంలో ఉన్న రాజ్యాలు. సమీప ఎత్తైన కొండ యూదయలోని హెబ్రోన్ కావచ్చు. యూదయ మూడు భాగాలుగా విభజించబడింది మరియు ఆ భాగాలను రాజ్యాలు అని పిలిచేవారు; మరియు వారికి అధ్యక్షత వహించిన హేరోదు కుమారులు రాజులు అని పిలువబడ్డారు.

నీకిత్తును – ఈ రాజ్యాలన్నీ. ఇది యేసును రాజకీయ పాలకునిగా చేస్తాననే ప్రతిపాదన. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు – ఈ అందమైన భూమి యొక్క సంపద, వైభవం, పట్టణాలు, నగరాలు, పర్వతాలు మొదలైనవి. అది నాకప్పగింపబడియున్నది – ఈ రాజ్యాలన్నీ నా హక్కుగా ఉన్నాయి, ఎందుకంటే అవి చాలా చెడ్డవి అంటూ తన వాదనను నొక్కి చెప్పాడు. అపవాది కూడా ఈ ప్రపంచంలో కొంత ఆధిపత్యాన్ని కలిగి ఉంది, యోహాను 12:31; కొలొస్సి 1:13; 1యోహాను 5:19. ఇక్కడ వాడు ఇవ్వజలని వాటిని ఇస్తానని చెప్తూవున్నాడు.

అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అపవాదికి యేసు యూదుల రాజు అని తెలుసు. కాబట్టి వాడు యేసును తండ్రి చిత్తం నుండి మళ్లించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. యేసూ, రాజుగా మీరు వచ్చారు. మీరు పేదవారు, మరియు నిరాయుధులు, మరియు అనుచరులు లేదా సైన్యాలు లేనివారు. కాబట్టి నన్ను ప్రభువుగా అంగీకరిస్తే, విశ్వసిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా, వెంటనే ఇవన్నీ మీ స్వాధీనం చేస్తానని  ప్రతిపాదించాడు.

నాకు మ్రొక్కుము – ఇది చాలా తీవ్రమైన ప్రయత్నం, ఇది ఇంతకు ముందు జరిగిన దాడి కంటే సాహసోపేతమైన దాడి. ఇప్పటికే వాడు ఎన్నో రకాలుగా యేసును శోధిస్తూ ఉన్నప్పటికినీ వాడు ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నాడు. అందుకే ఎట్టకేలకు తన డీల్‌లో బోల్డ్‌నెస్‌ని ప్రదర్శించాడు. రక్షకుని యొక్క దైవభక్తి పై మరింత నిర్ణయాత్మకమైన మరియు ఘోరమైన ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. భూమ్యాకాశములను సృష్టించిన తండ్రిని గౌరవించి ఆరాధించడానికి బదులుగా దేవుని కుమారుడు అపవాదిని ఆరాధించాలనే ప్రతిపాదన ఇది; ప్రపంచాన్ని విమోచించడానికి యేసు బాధపడి చనిపోవాల్సిన అవసరం లేదని బదులుగా, ఆయన అరణ్యములో ఒక్కసారి మాత్రమే సాతానుకు తలవంచి వాణ్ని ఆరాధించుమని, ఈ విషయం మరెవరికీ తెలియదని వాడు ఒత్తిడి తెస్తువున్నాడు. ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధం (1వ ఆజ్ఞ). యేసు తన ఒప్పందానికి అంగీకరిస్తాడని; ఈ రాజ్యాలను ఆయనకు ఇచ్చే హక్కు అపవాదికి ఉందని ఆయన ఒప్పుకుంటాడని; దేవుని కంటే కూడా వాడి పై ఆధారపడతాడని వాడు అనుకున్నాడు.

అపవాది యొక్క శోధనలు చాలా ఆమోదయోగ్యమైనవిగా అనిపిస్తాయి. వాడు తన ఆకర్షణలను మనస్సుకు చాలా కళాత్మకంగా ప్రదర్శిస్తాడు. వాడు ఆయనను ఎక్కువగా ఏం అడగడం లేదని వాటిని యేసుకు ఇచ్చినట్లయితే, యేసు ఆ బహుమతిని గుర్తించి దానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలని అడుగుతున్నాడు.

ఇది స్పష్టంగా నిషేధించబడింది, యేసు ద్వితీయోపదేశకాండము 6:13 నుండి ఒక ఉల్లేఖనంతో అపవాదికి జవాబిచ్చాడు: “నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.”

పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి–నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.

అపవాది యేసును యెరూషలేము దేవాలయంలోని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇది ఎలా జరిగిందో మనం ఖచ్చితంగా వివరించలేనప్పటికీ, ఇది అక్షరాలా జరిగింది. యేసు ఇష్టపూర్వకంగా వెళ్లాడని, అపవాదికి పరిమితమైన శక్తి మాత్రమే ఉందని, తన ఇష్టానికి వ్యతిరేకంగా యేసును వాడు బలవంతం చేయలేడనేది స్పష్టం.

ఆలయం చుట్టూ 50 అడుగుల వెడల్పు మరియు 75 అడుగుల ఎత్తుతో మండపాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న వాకిలి 67 అడుగుల వెడల్పు మరియు 150 ఎత్తుతో ఉంది. దీని పైభాగం నుండి దిగువన ఉన్న కిద్రోను లోయ 700 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. చరిత్రకారుడైన జోసెఫస్ ఈ విషయాలను గురించి చెప్తూ, ఎవరైనా తలతిరగకుండా కిందకి చూడలేరని, మరియు దైవిక రక్షణ లేకుండా పడిపోతే ఎవరూ బ్రతకరని చెప్పాడు.

అక్కడ అపవాది కీర్తన 91:11, 12 వచనాలను ఉదహరించాడు, (“నీ మార్గాలన్నిటిలో” అనే ముఖ్య పదబంధాన్ని విడిచిపెట్టి). వాడి ఈ సవాలును అంగీకరించకపోతే, తండ్రిపై విశ్వాసం లేదని యేసుకు చెప్పడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఇది అన్ని పరిస్థితుల్లోనూ దేవుని దూతలు రక్షిస్తారని చెప్తూవున్న వాగ్దానం కాదు. దేవుని ప్రజలు దేవుడు ఇచ్చిన బాధ్యతలను ప్రతి రోజు నిర్వర్తించేటప్పుడు ప్రభువు రక్షణకు సంబంధించిన హామీ ఇది. దేవుణ్ణి అలా శోధించడం విశ్వాసం కాదు. ఇది సందేహానికి నిదర్శనం.

ఇక్కడ నుండి క్రిందికి దుముకుము –  అటువంటి దుందుడుకు చర్య మరణం లేదా తీవ్రమైన గాయానికి దారి తీయవచ్చు. ఇక్కడ శోధన ఏమిటంటే, వాగ్దానం యొక్క రక్షణను వెంటనే పొందాలనేది.

చెప్పబడియున్నదని చెప్పాడు ఎందుకంటే – తనపై నమ్మకం ఉంచే వారిని రక్షించుమని దేవుడు తన దేవదూతలకు ఆజ్జ్యాపించుదునని వాగ్దానం చేసిన ఒక కీర్తనను ఉదహరిస్తూ, ప్రత్యేక రక్షణను వాగ్దానం చేసే ఈ లేఖన భాగముపై మీరు ఆధారపడి చూపించండి అని వాడు అడుగుతున్నాడు.

వ్యక్తిగత కీర్తి మరియు పేరును పొందే ప్రయత్నంలో దేవాలయ శిఖరం నుండి దూకడం ద్వారా దేవుని శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని యేసు భావించినట్లయితే పాపానికి పాల్పడి ఉండేవాడు.

మస్సాలో ఇశ్రాయేలు దేవుణ్ణి శోధించినప్పుడు మోషే వారిని హెచ్చరించిన హెచ్చరికను యేసు ఉటంకిస్తూ ఈ శోధనను ఎదుర్కొన్నాడు. అందుకు యేసు, “నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు“, ద్వితీయోప 6:16. మస్సా వద్ద ఇశ్రాయేలీయులు తమకు నీరు అందించాలని డిమాండ్ చేయడం ద్వారా ప్రభువును పరీక్షించారు. తమకు, తమ పశువులకు నీరు లేనందున ప్రజలు మోషేను రాళ్లతో కొట్టడానికి దాదాపు సిద్ధంగా ఉన్నారు. మోషే ప్రభువును వేడుకున్నాడు, ప్రభువు తన కర్రను తీసుకొని హోరేబ్ వద్ద ఉన్న బండను కొట్టమని ఆదేశించాడు. వెంటనే నీరు ప్రవహించి ప్రజలందరి మరియు వారి జంతువుల దాహార్తిని తీర్చింది, నిర్గమ 17:1-7.

మస్సా వద్ద ప్రజలు దేవుడు తమకు వాగ్దానం చేయని అద్భుతాన్ని కోరడం ద్వారా దేవునికి పరీక్ష పెట్టారు. ఈజిప్టు నుండి మరియు ఎర్ర సముద్రం గుండా వారి ప్రయాణానికి సంబంధించి ఆయన  మునుపటి అద్భుతాలన్నీ దేవుడు వారి అవసరాలను తీర్చగలడని మరియు కొనసాగిస్తాడని ప్రజలను ఒప్పించి ఉండాలి. వారి డిమాండ్లు వాళ్ళు దేవుణ్ణి నమ్మడం లేదని తేలింది. వారు దేవుణ్ణి శోధించారు.

మలాకీలో ప్రభువు తనను పరీక్షించమని దాదాపుగా సవాలు చేస్తూవున్నాడు. “నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు”, మలాకీ 3:10.

రెండింటి మధ్యన ఉన్న వ్యత్యాసం, వాస్తవానికి, దేవుని స్పష్టమైన ఆజ్ఞ. దేవుడు చెప్పినట్లు మనం నమ్మకంగా చేసినప్పుడు మరియు ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోమని ధైర్యంగా ఆయనను పిలిచినప్పుడు, మనం దేవుణ్ణి ప్రలోభపెట్టడం లేదు. ఆయనపై, ఆయన వాక్యంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాము ఆ వాక్యాన్ని ఉపయోగిస్తువున్నాం. ఇది దేవునికి ప్రీతికరమైనది.

అరణ్యములో సాతాను ఈ ఓటమి కథ అంతం కాదు. లూకా ఇలా చెప్తూవున్నాడు, “అపవాది ప్రతి శోధనను ముగించి, కొంత కాలము ఆయనను విడిచిపోయెను.” యేసు తన భూసంబంధమైన పరిచర్యలో వివిధ పరీక్షలను ఎదుర్కొన్నాడు. వీటిలో అత్యంత తీవ్రమైనది సిలువ. ప్రతి పరీక్షలో, యేసు తండ్రి చిత్తాన్ని చేస్తూనే ఉన్నాడు.

● సమస్య పరిష్కారమైందా?
పరిష్కరించబడింది, యేసు అన్ని శోధనలను గెలిచాడు.

నేర్చుకోండి
● ఈ పాఠం యొక్క ప్రధాన థీమ్ ఏమిటి? క్రీస్తు యొక్క శోధనలు.

● ఈ పాఠం ఏ పాపం ఒప్పుకోవాలని చెప్తూవుందో చెప్పండి?
యేసు దేవుని వాక్యం గురించి తెలియనివాడు కాదు. కాని ప్రతిరోజూ మనం బైబిల్ చదవడం/కంఠస్థం చేయడంలో విఫలమవుతుంటాం. అపవాది వలె, నేడు చాలా మంది లేఖనాలను ఉటంకిస్తూవున్నారు కాని, వాడి వలె వారు దానిని తప్పుగా అన్వయిస్తూవున్నారు. నేడు ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వక్రీకరించవచ్చు (2 పేతురు 3:16) కాబట్టి ఒకని బోధలను మనం తప్పక పరిశీలించవలసియున్నాము (1 యోహాను 4:1). పాపాత్మకమైన దానిని నమ్మి లేదా ఆచరిస్తూ మోసపోకూడదు. మనుష్యులముగా మన పాపాలను మనం బట్టి మనలను మనం నిందించుకోకూడదు. శోధన పాపం కాదు కాని ప్రమాదం నుండి బయటపడటానికి మనం త్వరగా శోధనను దూరంగా ఉంచాలి. బైబులును వక్రీకరించడం మరియు దానిని తన స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించడం, తప్పుగా అర్థం చేసుకోవడం అనే వాటి విషయాలలో మనం తప్పిపోతూ ఉన్నామని ఈ పాఠము తెలియజేస్తూవుంది.

● ఈ పాఠంలో దేవుని ప్రేమను మీరు ఎక్కడ చూస్తారు?
మన స్థానంలో వచ్చిన తన స్వంత కొడుకును శోధించడానికి దేవుడు అపవాదిని  అనుమతించాడు. యేసు ఈ శోధనలను తీసుకొని గెలిచాడు మరియు అపవాది యొక్క అధికారం నుండి మనలను విడిపించాడు. యేసుకు పాపం లేదు. అతను పాపం చేయలేదు. ఆయన ఎప్పుడూ లొంగిపోలేదు, కాని ఆయన అన్ని శోధనలను గెలిచాడు. ఇప్పుడు ఆయన మనకు సహాయం చేస్తూవున్నాడు.

● ఈ పాఠంలో దేవుడు ఏమి చేయాలని మనకు బోధిస్తున్నాడు?
ఆధ్యాత్మిక యుద్ధంలో దేవుని వాక్యం ఒక శక్తివంతమైన ఆయుధం; హెబ్రీయులు 4:15-16 శోధన ఎలా ఉంటుందో దేవుడు అర్థం చేసుకున్నాడు; యేసు తన భూజీవితంలో శోధించబడిన అనుభవాలు, మన మానవ బలహీనతల్లో మనపై సానుభూతి చూపేందుకు ఆయనకు సహాయం చేశాయి. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు మరియు మన గురించి శ్రద్ధ వహిస్తాడు కాబట్టి, శోధనను అధిగమించడానికి సహాయం కోసం మనం కోరినప్పుడు దేవుడు కనికరము మరియు దయతో ఉంటాడని మనం నమ్మకంగా ఉండవచ్చు. సాతాను బైబులు వాక్యాల యొక్క నిజమైన అర్థాన్ని వక్రీకరించి ఇతర తప్పుడు ప్రకటనలు చేశాడు. యోహాను 8:44లో, యేసు సాతానును “సత్యాన్ని పట్టుకోని వ్యక్తిగా వర్ణించాడు, ఎందుకంటే అతనిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడు, అతడు తన మాతృభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. ఈ పడిపోయిన ప్రపంచంలో చెడు పనిచేస్తూ ఉన్నందున, మన స్వంత జీవితంలో కూడా మనం అబద్ధాలను ఎదుర్కొంటాము. అయితే, మనకు అందే సందేశాలు నిజమా కాదా అనే దానిని గురించి తెలివిగా ఆలోచించడానికి మన మనస్సును ఉపయోగించుకునే శక్తిని దేవుడు మనకు ఇచ్చాడు. యేసు అబద్ధాలను ఎదిరించి, సత్యాన్ని నొక్కిచెప్పినట్లు మనం కూడా అలాగే చేయాలి. సాతాను దేవుని సంరక్షణను సందేహించమని యేసును ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడల్లా, ప్రేమపూర్వక శ్రద్ధతో ప్రవర్తిస్తూ దేవుని వాగ్దానాలపై యేసు విశ్వాసం చూపించాడు. మానవులుగా, మనకు రోజూ అనేక అవసరాలు ఉన్నాయి, వాటిని దేవుడు మనకు అందించడం వల్ల మాత్రమే మనం వాటిని పొందుకొంటున్నాం. దేవుడు ఒక్కడే మన భక్తికి అర్హుడు. దేవుడు ఎవరినీ శోధించడు, శోధనలు అపవాది, లోకము మరియు మన స్వంత పాపపు శరీరము నుండే వస్తాయి.

శోధనలు కొనసాగుతూనే ఉంటాయి. క్రీస్తు ఈ శోధనలను విజయవంతంగా ఎదుర్కొన్నందున సాతాను ముగించబడ్డాడని కాదు. లూకా 4:13 సాతాను “అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను” అని చెప్తూవుంది. ఈ రోజు, అతని పట్టును  విజయవంతంగా ప్రతిఘటించిన తర్వాత, మనం మన సర్వాంగ కవచాన్ని ప్రక్కన పెట్టలేం – వాడు తిరిగి వస్తాడు!

పరిశుధ్ధాత్ముడు యేసును నడిపించాడు మరియు ఆయన శోధనలలో ఆయనతో పాటు ఉన్నాడు, యేసు నిజంగా దేవుని కుమారుడని ధృవీకరించాడు. ఆశీర్వదించబడిన తండ్రి కుమార పరిశుధ్ధాత్ములు నేడు మనతో పాటు ఉన్నారు, తద్వారా మన శరీరం, మన గర్వం మరియు మన ఇష్టానికి సంబంధించిన అపవాది శోధనలను మనం తట్టుకోగలము. దేవుని నామంలో పవిత్ర బాప్టిజం ద్వారా, మనం నిజంగా ఆయనకు ప్రియమైన పిల్లలం.

నడిపింపు
● మీరు ఈ సందేశాన్ని భాగస్వామ్యం చేయగల మంచి పరిస్థితి ఏమిటి? పాపులకు; మానవులుగా పుట్టినందుకు శోధనలను బట్టి నిందించుకొనే వారికీ; ట్రయల్స్ మరియు టెంప్టేషన్లలో ఉన్నవారికి; 1వ ఆజ్ఞను పాటించని వ్యక్తులకు; అపవాదికి తమ ఆరాధనలు ఇస్తున్న వ్యక్తులకు; స్వీయ నీతిపరులకు మొదలైన వారికి.

ఆయన జీవితమంతా, హెబ్రీ పత్రిక నొక్కిచెప్పినట్లు, మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను, హెబ్రీ. 4:15. యేసు మనలాగే అన్ని విధాలుగా శోధించబడ్డాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు; ఆయన ఎవనిని శోధింపడు అని యాకోబు 1:13 చెప్తూవుంది. కాబట్టి యేసు నిజంగా శోధింపబడ్డాడా? అని కొందరు ప్రశ్నించొచ్చు.

సమాధానం: యేసు ఎవరు? ఆయన నిజమానవుడు నిజదేవుడై యున్నాడు. ఆయన మీలాగే నాలాగే నిజమైన మానవుడు. ఆయనకు శరీరం ఎముకలు మరియు రక్తమాంసాలు ఉన్నాయి. ఆయన శారీరకంగా ఎదిగాడు, మానసికంగా ఎదిగాడు. ఆయనకు నొప్పి తెలుసు. ఆయనకు నిద్ర అవసరం. ఆయన భావోద్వేగాలను కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు, ఆయన ఆనంద పడ్డాడు. కొన్నిసార్లు, ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ఆయన నిజదేవుడై యున్నాడు. ఆయన ఒక దైవిక వ్యక్తి అని అందువలన, ఆయన దైవిక స్వభావాన్ని కలిగి ఉన్నాడని లేఖనాలు మనకు భోదిస్తూవున్నాయి. ఆయన జీవితములో ఆయన మానవ స్వభావానికి ఆయన దైవిక స్వభావం నుండి కొద్దిగా బూస్టర్ ఇంజెక్షన్ ఇవ్వబడిందని, తద్వారా అది ప్రత్యేక ఒత్తిళ్లను తట్టుకోగలదని లేదా శోధనకు దూరంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి ఉదాహరణలు లేవు, అది తప్పుడు బోధ. మన ప్రభువైన యేసుకు తన మానవ స్వభావంలో నిజముగా శోధించబడటం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది అనేది తెలుసు, ఎందుకంటే ఆయన వాటి గుండా నిజ మానవునిగా ఆయన వెళ్లియున్నాడు.

ప్రభువైన యేసుకు మరియు మనకు మధ్య చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం లేకుండా, యేసు మన రక్షకునిగా మారలేడు. బయటి నుండి- లోకము నుండి మరియు చెడు నుండి మనకు వచ్చే శోధనలు ఉన్నాయి. యేసు వీటిని పూర్తిగా అనుభవించాడు. ఆయన వాటికి ఎప్పుడూ లొంగలేదు. ఆయన వాటి బలాన్ని గరిష్టంగా అనుభవించాడు. అట్లే మనకు లోపల నుండి వచ్చే ప్రలోభాలు కూడా ఉన్నాయి. అవి లోకం, శరీరం మరియు అపవాది ద్వారా వస్తాయి, అవి మన స్వంత స్వభావంలో, మన శరీరంలో పాతుకుపోయాయి. యేసు విషయంలో అది ఎప్పుడూ నిజం కాదు. యోహాను 14:30, “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియు లేదు“అని చెప్తూవుంది. అర్థం: “నాలో అతను దిగగలిగే చోటేది లేదు- నన్ను బలహీనపరచేలాగున వాడు గలిగేందుకు పాపం యొక్క వదులుగా ఉండే దారం నాలో ఏమియు లేదు.”

యేసు తన స్వంత కోరికలచే శోధించబడినట్లయితే, ఆయనకు పాపభరితమైన కోరికలు ఉన్నాయని అర్థం; అప్పుడు ఆయన పవిత్రుడు కాదు అపవిత్రుడు. పాపుల నుండి వేరు చేయబడడు. ఆపై ఆయన ఎప్పటికీ మన పాపరహిత ప్రత్యామ్నాయంగా మరియు త్యాగంగా వ్యవహరించలేడు మరియు ఆయన తన స్వంత పరిపూర్ణ నీతిని ఎన్నటికీ ధరించలేడు. అదనంగా, ఆయనకు స్వయంగా సహాయం కావాలి. విఫలమైన ఎవరైనా మనకు అవసరమైన సహాయాన్ని అందించలేరు. అందుకు ఎప్పుడూ విఫలం కాని వ్యక్తి కావాలి; అలాంటి వ్యక్తి మాత్రమే మనం విఫలం కాకుండా ఉండేందుకు సహాయం చేయగలడు. యేసు ఖచ్చితంగా అలాంటి రక్షకుడు ఎందుకంటే ఆయన శోధనను ఎదుర్కొన్నాడు మరియు దానిని జయించాడు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాల నే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.