మత్తయి సువార్త 1

అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి, 1-17 (లూకా 3:23-38; రూతు 4:18-22; 1 దినవృత్తాంత ములు 3:10-17)

మత్తయి క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకము. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు జన్మమునకు చెందిన దేవుని రికార్డు. “దావీదు కుమారుడు” అనేది వాగ్దాన రక్షకునికి వాడే సాధారణమైన పేరు, నజరేయుడైన యేసు దావీదు నుండి వచ్చిన భౌతికమైన వారసుడని యేసు చట్టబద్దమైన తండ్రియైన యేసేపు రాజైన దావీదు యొక్క ప్రత్యక్ష వారసుడనే వాస్తవాన్ని డాక్యుమెంట్ చేయడం ద్వారా మత్తయి తన సువార్తను ప్రారంభిస్తూ ఉన్నాడు. అట్లే ఈ విషయం తప్పైతే నిరూపించమని మత్తయి తన పాఠకులను సవాలు చేస్తూ ఉన్నాడు.

దావీదు కుమారుడు” అనే అధికారిక బిరుదును యూదులు తాము ఎదురు చూసే మెస్సీయకు అన్వయించు కొన్నారు. ఈ డిసిగ్నేషన్ క్రింద వారు ఆయనను ఎదురుచూసేందుకు ప్రవచనాత్మక అధికారం ద్వారా నడిపించబడ్డారు. మత్తయి అబ్రాహాము దావీదులను మాత్రమే ఇక్కడ పేర్కొనుటకు కారణం, ఈ ఇద్దరికి మాత్రమే క్రీస్తుని గూర్చి వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి. మత్తయి అబ్రాహాము దావీదుల పేర్లను పేర్కొనుట ద్వారా వారికివ్వబడిన వాగ్దానాలను యూదులకు జ్ఞపకం చేస్తూ, వాగ్దానానికి వారసులుగా, వారికి ప్రవచింపబడిన క్రీస్తును వారు అంగీకరించునట్లు వారిని ప్రభావితము చేస్తూ ఉన్నాడు మరియు యూదులైన క్రైస్తవుల దృష్టిని మేల్కొల్పుతూ, ఈ క్రీస్తు అబ్రహాము కుమారుడనే నిశ్చయతను వారికి ఇస్తున్నాడు.

(మత్తయి 9:27 యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చిదావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి; మత్తయి 12:23 అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి; మత్తయి 21:9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి).

  1. యూదుడైన మత్తయి తన సువార్తను ప్రధానంగా పాత నిబంధన గ్రంధాలతో సుపరిచితులై క్రైస్తవులుగా మారిన యూదుల కొరకు వ్రాసాడు.
  2. యేసు అబ్రాహాము దావీదుల వంశావళినుండి వచ్చియున్నాడని తెలియజేస్తూ వాగ్దానము చెయ్యబడిన మెస్సయ్యా ఈయనే అను నిశ్చయతను ఇస్తూ ఉన్నాడు.
  3. యేసు దావీదు నుండి వచ్చిన చట్టబద్దమైన భౌతికమైన వారసుడని చెప్తూ వాదనకు ఆస్కారం లేకుండా చేస్తూ ఉన్నాడు.

మత్తయి యేసుక్రీస్తు వంశావళిని మూడు ప్రధాన విభాగాలుగా విభజిస్తూ ఇశ్రాయేలు చరిత్రలోని మూడు ప్రధాన విభాగాల నుండి ఎంపిక చేసిన ప్రతి విభాగములోనుండి 14 పేర్లు కోట్ చేసాడు, బహుశా మనం వాటిని సులభముగా గుర్తుంచుకోవడం కోసం. 2-6 వచనాలలోని, మొదటి విభాగము Theocracy దైవపరిపాలనా కాలానికి సంబంధించినది.

V 2-6_ అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; 3యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, 4ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; 5నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను; 6యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.

యూదులు తమ పితరుడైన అబ్రాహామును గురించి దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానములు గురించి చాల గర్వపడుతూ ఉంటారు. అబ్రాహాము వారసుల నుండి మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు. కాని దురదృష్టవశాత్తు, వాళ్ళ “కాన్సెప్ట్ అయిన మెస్సయ్య” శతాబ్దాలుగా వక్రీకరింపబడటం మూలాన్న” వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యమును బలమైన రాజ్యముగా తిరిగి నెలకొల్పి దావీదు సింహాసనము నుండి పాలించే ఒక పొలిటికల్ మెస్సయ్య కొరకు (పొలిటికల్గా తమను స్ట్రాంగ్ పోసిషన్లో ఉంచే రాజుకొరకు) చూడటం మొదలుబెట్టారు. కాని ఇలాంటి మెస్సయ్యను దేవుడు వారికి వాగ్దానము చెయ్యలేదు.

మత్తయి సువార్త యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, యూదులకు దేవుని మెస్సియానిక్ వాగ్దానాలను గుర్తుచేయడం, వారి అంచనాలు తరచూ దేవుని వాగ్దానాలకు విరుద్ధంగా ఉన్నాయని చూపించడం మరియు దేవుని ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్య ఖచ్చితంగా ఈ యేసేనని వారిని ఒప్పించడం.

  1. ఈ విభాగములో నలుగురు స్త్రీలు పేర్కొనబడియున్నారు, తామారు, రాహాబు, రూతు, బత్షెబా.
  2. ఎందుకని వాళ్ళు ఈ వంశావళిలో చేర్చబడియున్నారు?
  3. ఎందుకని మత్తయి బత్షెబా పేరును చెప్పకుండా ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, అని చెప్తూ ఉన్నాడు?

తామారు వేశ్యపాత్ర పోషించిన కనానీయురాలు, ఆదికాండము 38:6-30, సంఖ్యాకాండము 26:20,21లో పేర్కొన బడియున్నది. రాహాబు (అన్యురాలు, యెరికో పట్టణపు వేశ్య) యెహోషువ 2:1-24; 6:17-2521లో పేర్కొనబడి యున్నది; ఆమె ఇశ్రాయేలు దేవునిని గూర్చి తెలుసుకుంది. ఆమె విశ్వాసము ఆ విశ్వాసపు ఫలాలు మన అందరి కొరకు ఉదాహరణలుగా హెబ్రీ 11:31; యాకోబు 2:25 పేర్కొనబడి ఉన్నాయి. రూతు ఒక అన్యజాతి స్త్రీ, మోయాబీయురాలు (లోతు పెద్ద కుమార్తె తన తండ్రి అయిన లోతుతో అతనికి తెలియకుండా నెరపిన అశ్లీల సంబంధం ద్వారా వచ్చిన మోయాబియురాలు), ఆదికాండము 19:36,37; రూతు 1-4 అధ్యాయములలో పేర్కొనబడి యున్నది. బత్షెబా హిత్తీయుడైన ఉరియా భార్య. దావీదు ఆమెను ఇష్టపడి ఆమెను తన కోసం తీసుకొన్నాడు. ఉరియాను యుద్ధంలో చంపించాడు. ఈమె 2సమూయేలు 11, 12; 1రాజులు 1,2 లో పేర్కొనబడి యున్నది.   

రక్షకుడి పూర్వీకులలో ఇటువంటి తీవ్రమైన నైతిక లోపాలకు పాల్పడిన వ్యక్తులను చేర్చడం షాకింగ్ గా అనిపిస్తుందా? ఈ పేర్లను ఈ వంశవృక్షంలో రికార్డ్ చేయడానికి పరిశుద్ధాత్మ మత్తయిని ప్రేరేపించకపోతే బాగుండేదని అనుకుంటున్నారా? అసౌకర్యంగా ఉందా? బైబులు, ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెదకు వాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి అని రోమా 3:23,11,12 లో చెప్తూ ఉంది. మార్టిన్ లూథర్ గారు బైబిలులోని ఈ భాగమును ధ్యానించుచు క్రీస్తును గూర్చి వ్యాఖ్యానిస్తూ, “క్రీస్తు పాపుల గురించి సిగ్గుపడని వ్యక్తియని, ఆయన వారిని తన కుటుంబ వృక్షంలో కూడా ఉంచియున్నాడని, ప్రభువే అలా చేస్తే, మనం ఎవరినీ తృణీకరించ కూడదని, పాపులకు సహాయపడే క్రమములో జరిగే పోరాటంలో మనం కూడా పోరాడవలసియున్నామని” చెప్పారు. మత్తయి ఈ నలుగురిని క్రీస్తుని వంశావళిలో చేర్చడం ద్వారా, దేవుని వాగ్ధానమైన ఈ మెస్సయ్య పాపులకోసం వచ్చియున్నాడని ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి 9:13 లో యేసు ఇదే విషయాన్ని చెప్తూ, నేను పాపులను పిలువవచ్చితినిగాని నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పటం, ప్రతిఒక్కరు క్రీస్తుయేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడటమే (రోమా3:24) మెస్సయ్య రాకడ ఉద్దేశ్యమని మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞపకం చేస్తూ ఉన్నాడు.

ఈ పాపుల జాబితా మనకు ఓదార్పుని కూడా ఇస్తూ ఉంది. ఎవరైతే పాపులను వెతికి రక్షించుటకు వచ్చి సమస్త లోక పాపముల కొరకు తన రక్తమును చిందించియున్నాడో, ఎవరి కొరకైతే ఆయన మరణించి యున్నాడో, అందు మిమ్మల్ని నన్నును చేర్చియున్నాడో, ఆ యేసు మనలను గురించి సిగ్గుపడటంలేదని ఈ పాపుల జాబితా మనకు నిశ్చయతను ఓదార్పును ఇస్తూ ఉంది. యెషయా1:18 లో యెహోవా–రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును అను ఆదరణకరమైన మాటలను మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞపకం చేస్తూ ఉన్నాడు.

బత్షెబాను యూరియా భార్యగా పిలవడం వెనుక మత్తయి ఉద్దేశ్యమేమిటంటే, మత్తయి దావీదు తప్పును ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. వ్యభిచారం మరియు హత్య చేసిన పాపి దావీదు. అట్లే అతడు దేవుని కృపలో క్షమింప బడియున్నాడనే విషయాన్ని మరచిపోకూడదని అదే కృపలో దేవుడు తాను వాగ్దానము చేసియున్న రీతిగా పాపులైన వారినందరిని క్షమించుటకు రక్షించుటకు యేసును పంపియున్నాడని మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞపకం చేస్తూ ఉన్నాడు.

  • 2-6 వచనాలలోని విశ్వాసపు వీరులు మత్తయి పాఠకులకు మనకు నేడు వేటిని గుర్తుచేస్తూ ఉన్నారు?

వారి రక్షకునిగా వారు ఎరిగియున్న యేసుపై వారి విశ్వాసము కేంద్రీకృతమైయున్నదని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు.

V 7-11_ సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; 8ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; 9ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను; 10హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; 11యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

మత్తయి యేసుక్రీస్తుని వంశావళిని మూడు విభాగములుగా విభజించియున్నాడు. మొదటి విభాగములో ప్రజలు Theocracy క్రింద ఉండేవాళ్ళు అంటే ప్రజలు దైవికమైన మార్గదర్శకత్వము ద్వారా దేవుని పాలన క్రింద ఉండేవాళ్ళు. ఇక్కడ విశ్వాసమే ప్రధానము. 

అయితే ప్రజలు కొంతకాలానికి monarchy ని కోరుకున్నారు. అంటే ప్రజలు kingship రాజుల క్రింద ఉండటానికి కోరుకున్నారు. దేవుని పాలనను వద్దనుకుని ఇశ్రాయేలీయులు రాజరికపు వ్యవస్థ క్రింద ఉండటాన్ని ఇష్టపడ్డారు.

ఆ క్రమములో మాకు రాజును నియమింపుమని ఇశ్రాయేలీయులు అప్పటి ప్రవక్తయైన సమూయేలును అడిగినప్పుడు ప్రవక్తయైన సమూయేలు హర్ట్ అయ్యి ఈ విషయాన్ని ప్రార్ధన ద్వారా దేవుడైన యెహోవా ముందుకు తీసుకొని వెళ్ళి నప్పుడు, యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా– సమూయేలు, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు అని చెప్పిన విషయం 1 సమూయేలు 8:6,7 లో ఉంది. ఇశ్రాయేలీయులు రాజులను కలిగి ఉండటం దేవుని చిత్తానికి అనుగుణంగా లేదు.

ఆయన ప్రజలు ఆయన పరిపాలన క్రింద ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాని దేవుడు తన ప్రజల కోరిక మేరకు వారు అడిగినట్లుగా వారికి రాజులను ఇచ్చాడు. ఆ రాజులలో ఒక రాజైన దావీదును తన వాగ్దానాన్ని మోసేవాడిగా ప్రభువు పూర్వీకుడిగా ఎన్నుకున్నాడు. ఆ లైన్ ని ఆయన ఏవిధముగా కాపాడాడో, సంరక్షించి యున్నాడో, దేవుడు ఇశ్రాయేలీయుల రాజుల చరిత్రలో ఏవిధముగా జోక్యం చేసుకొనియున్నాడో, ఇశ్రాయేలీయులను వారి మొండితనాన్ని మరియు దేవుని చిత్తాన్ని ఎదిరించే వారి స్వభావం వీటిమధ్య దేవుడు తన చిత్తాన్ని ఏ విధముగా నెరవేర్చుకొనియున్నాడో స్పష్టముగా జ్ఞపకం చేసుకొనుమని మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్జ్యపాకం చేస్తూ ఉన్నాడు.

ఇశ్రాయేలీయులు దేవునిపాలన వద్దంటూ రాజుల పాలనే కావాలన్నారు. అది దేవునికి ఇష్టం లేదు. ప్రజలేమో కావాలన్నారు. దేవుడు వారు అడిగినట్లుగా రాజులను వారికిచ్చాడు. ఇశ్రాయేలీయులు వారి తప్పుడు నిర్ణయాన్ని బట్టి వారేం పోగొట్టుకొన్నారో తెలుసా? 12 గోత్రాలలో 10 గోత్రాలను పోగొట్టుకున్నారు.

సొలొమోను_వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారు ఈ విషయాన్ని 1 రాజులు 11:4 చెప్తూ ఉంది. సొలొమోను విగ్రహారాధన కారణంగా అతని కుమారులు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలను ఇక ఎన్నడూ పాలించరు అని దేవుడు సెలవిచ్చిన కారణముగా 1 రాజులు 11:11-13 సొలొమోను తరువాత రాజ్యము రెండుగా విభజింపబడింది. ఉత్తర దక్షిణ రాజ్యములుగా ఏర్పడ్డాయి. ఉత్తర రాజ్యములో ఆషేరు, దాను, ఎఫ్రాయిమ్, గాదు, ఇశ్శాఖారు, మనష్షే, నాఫ్తాలి,  షిమ్యోను, రూబేను, మరియు జెబులున్ గోత్రాలు ఇశ్రాయేలు అను పేరుతో ఒక రాజ్యముగా ఏర్పడ్డాయి. ఇశ్రాయేలును పాలించిన ప్రతి రాజు యెహోవాను కాకుండా అన్యదేవతలను ఆరాధించియుండుటను బట్టి అట్లే ఈ 10 గోత్రాల భక్తిహీనతను బట్టి దేవుడు వీరిని తన వాగ్దాన దేశము నుండి అస్సిరియనుల ద్వారా భూమి నలుదిక్కులకు చెదరగొట్టి యున్నాడు.

దక్షిణాన యూదా మరియు బెంజమిన్ అనే రెండు గోత్రాలు యూదా రాజ్యముగా ఏర్పడ్డాయి. మత్తయి యొక్క ఈ రెండవ విభాగములో పేర్కొనబడిన రాజులందరూ దక్షిణ రాజ్యమునకు చెందినవారు.

సొలొమోను తర్వాత రెహబాము దక్షిణ రాజ్యమునకు రాజయ్యాడు. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు, అతడు వీటి కొరకు గుళ్లను కూడా కట్టాడు, 1 రాజులు 11:5 ఈ విషయాన్ని గురించి చెప్తూ ఉంది. రెహబాము తన తండ్రిని ఫాలో అయ్యాడు. ఇతడు కూడా అన్యదేవతల విగ్రహములను నిలిపి, వాటికి బలిపీఠములను కట్టించాడు. వాటిని ఆరాధించాడు. స్వలింగ సంపర్కులు కూడా దేశములో ఉండేవాళ్ళు. ప్రజలు తమ పితరులు చేసిన దాని కంటే ఎక్కువగా పాపము చేసారు. ఫలితముగా, ఐగుప్తురాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని వస్తువులను, రాజనగరుయొక్క ఖజానాలోని వస్తువులను, సమస్తమును అతడు ఎత్తికొని పోయాడు ఈ విషయాలన్నీ 1 రాజులు 14:22-26 వచనాలలో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. సొలొమోను కాలములో దేవుడు వారికిచ్చిన ఆధిక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు,  దేవుడు ఆ ఆధిక్యతను వారినుండి తీసివేసాడు.

తర్వాత అబీయా_ ఇతడు తన తండ్రి అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచాడని, 1 రాజులు 15:3 చెప్తూ ఉంది.

తర్వాత ఆసా_ ఇతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని స్వలింగ సంపర్కులను దేశములోనుండి వెళ్ల గొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టించి ప్రజలను దేవుని వైపుకు తిరిగి మళ్ళించాడని, 1రాజులు 15:11 చెప్తూ ఉంది.

తర్వాత యెహోషాపాతు_ ఇతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసా మార్గమందు నడచుచు దానిలో నుండి తొలగిపోకుండెను అని 2 దినవృత్తాంతములు 20:32 చెప్తూ ఉంది. భూమిపై ప్రభువు న్యాయం స్థాపించాలనే ఉత్సాహంతో, తన ప్రజల జీవితాలలో వారి ఆత్మల పట్ల సంరక్షణను యెహోషాపాతు తీసుకోవడం గొప్ప విషయం. ఇది ఒకవైపు మాత్రమే, మరొకప్రక్క యెహోషాపాతుకు దేవుడు గొప్ప సంపదను, గౌరవాన్ని ఇచ్చినప్పటికి, ఓఫిర్ బంగారం మరియు సొలొమోను వంటి గొప్ప వ్యాపారిగా, రాజుగా ఉంచగలిగే ప్రతిష్ట కోసం యెహోషాపాతు ఆశపడి దుర్మార్గుడైన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసాడు, ఈ విషయాలన్నీ 2 దినవృత్తాంతములు 20:35-37లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత యెహోరాము_ ఇతని భార్య పేరు అతల్యా. ఈమె ఉత్తర రాజ్యముకు రాజైన దుర్మార్గులైన ఆహాబు, యెజెబెలుల కుమార్తె. ఈమె తన కుమారుడైన అహజ్యా మరణం తరువాత, దక్షిణ రాజ్యపు సింహాసనాన్ని స్వాధీనం చేసుకుని యూదా రాజ గృహంలోని సభ్యులందరినీ ఊచకోత కోసింది. మెస్సయ్యనిక్ లైన్ (రక్షకుని వాగ్దానము) ఆగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో, రాజైన యెహోరాము కుమార్తెయు అహజ్యాకు సహోదరియైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషు చంపబడకుండ అతని రహస్యముగా తప్పించి యోవాషును ఆరుసంవత్సరములు యెహోవా మందిరములో దాదితో కూడ దాచిపెట్టింది, ఈ విషయాలన్నీ 2 రాజులు 11 అధ్యయమందు గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. అహాబు సంతతివారు నడచిన ప్రకారముగా యెహోరాము ఇశ్రాయేలు రాజుల యొక్క చెడు నడతలను ఫాలో అయ్యాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాడు. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించడమే కాకుండా యూదావారిని విగ్రహపూజకు లోపరచాడు. యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసాడు.

ఫలితముగా, అతడు శపింపబడి సమస్తమును పోగొట్టుకొని మరణించాడు. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు కూడా అతనికి చేయలేదు. అతడు యెవరికిని ఇష్టములేని వాడై చనిపోయాడు. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరే చోట జనులు అతని పాతి పెట్టారు, ఈ విషయాలన్నీ 2 దినవృత్తాం తములు 21 అధ్యయమందు గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను అను వాగ్దానము నిమిత్తమును 1 రాజులు 11:36, దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేకయుండెనని బైబులు చెప్తూ ఉంది.

అలాగే, యెహోరాము ఉజ్జియాకు మధ్య మూడు తరాలు ఉన్నాయి. మత్తయి కావాలనే ఈ మూడు తరాలను వదిలేసాడు. వీటిలో ఆల్మోస్ట్ ఒక దగ్గర మెస్సయ్యనిక్ లైన్ ఆగిపోయే పరిస్థితి.

అలాగే మత్తయి వదిలేసిన ఈ ముగ్గురు రాజులను గూర్చి 2 దినవృతాంతములు 22-25 అధ్యాయములలో చూడగలం.

తర్వాత ఉజ్జియా_ ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించాడు, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసాడు,  ఈ విషయాలన్నీ 2 దినవృత్తాంతములు 26:1-5 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత యోతాము_  ఇతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్యయంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాడు. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి, ఈ విషయాలన్నీ 2 దినవృత్తాంతములు 27 అధ్యయమందు గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత ఆహాజు_ ఇతడు కూడా ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, విగ్రహములను చేయించాడు. బెన్‌హిన్నోము లోయలో ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాడు. అతడు విగ్రహములకు బలులు అర్పించుచు ధూపము వేయుచు యెహోవాకు కోపము పుట్టించాడు ఈవిషయాలన్నీ 2 దినవృత్తాంతములు 28:1-5 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత హిజ్కియా_ హిజ్కియా మంచి రాజు, అతనిని యెహోవా గొప్పగా ఆశీర్వదించాడు, ఇతనిని గురించి 2 రాజులు 20:1-11 వచనాలలో చూడగలం.

తర్వాత మనష్షే_ ఇతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించాడు, అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసాడు. అట్లే యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచాడు. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించాడు. యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే ప్రజలను రేపాడు, ఈ విషయాలన్నీ 2 రాజులు 21: 1-18లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. అయితే మనష్షేను అష్షూరు రాజు ఓడించి అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయాడు. అక్కడ మనష్షే శ్రమలో తన దేవుడైన యెహోవాను బతిమాలు కొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడైయున్నాడని మనష్షే తెలుసుకొన్నాడు, తన దేశములో ఉన్న విగ్రహారాధనను తొలగించడానికి తీవ్రముగా ప్రయత్నించాడు, ఈ విషయాలన్నీ 2 దినవృత్తాంతములు 33:11-14 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత ఆమోను_ ఇతడు కూడా యెహోవా దృష్టికి చెడునడత నడిచాడు, ఈ విషయాలన్నీ 2 రాజులు 21:19-24లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత యోషీయా_ ఇతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదువలే ప్రవర్తించాడు. మందిరమును సంస్కరించి ఇశ్రాయేలీయుల యొక్క మత సంప్రదాయాలపై చెరగని ముద్రను వేసాడు, ఈ విషయాలన్నీ 2 రాజులు 22:1-22:30 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత యెకొన్యా_ఇతడు ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడునెలల పదిరోజులు ఏలాడు. ఇతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచాడు. ఏడాది నాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించాడు, ఈ విషయాలన్నీ 2 దినవృత్తాంతములు 36:9,10; 2 రాజులు 24:8-17 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. కొంతకాలానికి సిద్కియా మూర్ఖముగా బబులోను మీద తిరుగబడగా, బబులోను యెరూషలేము మీదికి వచ్చి సిద్కియాను పట్టుకొని సిద్కియా చూస్తూ ఉండగా అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయారు. యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్చేశారు. యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టేసారు. పట్టణమందు మిగిలి యుండిన వారిని, బబులోను రాజు పక్షము చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని చెరగొని పోయారు గాని వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చారు మరియు యెహోవా మందిరమందున్న ప్రతిదానిని తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బంగారమును, విలువైన ప్రతిదానిని బబులోను పట్టణమునకు ఎత్తికొని పోయారు, ఈ విషయాలన్నీ 2 రాజులు 25:1-22 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

ఈ విభాగము యొక్క సారాంశమును మనం పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలీయులు రాజు కావాలన్నారు. దేవుడు రాజులను ఇచ్చాడు. రాజుల మూలముగా ఇశ్రాయేలీయులు రెండు భాగాలుగా చీలిపోయారు. పది గోత్రాలు భూదిగంతముల వరకు విసిరి వేయబడ్డాయి. మిగిలిన రెండు గోత్రాల రాజులలో అనేకులు ఇశ్రాయేలు రాజులను ఫాలో కావడం మనం గమనించాం.

దేవుడు తన కృపలో తాను వాగ్దానము చేసియున్న రీతిగా మాట తప్పక దావీదు సంతతిని నాశనము చెయ్యడానికి మనసు రాక మిగిలియున్న రెండు గోత్రాల వాళ్ళు కనికరింపబడ్డారు తప్ప, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కాదు ఇదే విషయాన్ని మత్తయి ఇశ్రాయేలీయులకు జ్ఞపకం చేస్తూ, ఆ దేవుడు తన కనికరమును బట్టి రాజుల చరిత్రలో ఏవిధముగా జోక్యం చేసుకొనియున్నాడో, దేవుని చిత్తాన్ని ఎదిరించే ఇశ్రాయేలీయుల స్వభావమును తన కనికరమును బట్టి క్షమిస్తూ తన చిత్తాన్ని ఏవిధముగా నెరవేర్చుకొని మెస్సయ్యను అనుగ్రహించియున్నాడో గుర్తించుమని చెప్తూ ఉన్నాడు. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తే ఆ మెస్సయ్యా అని ఆయన వంశావళి ఇది అని ఈ రెండవ విభాగము ద్వారా మత్తయి తెలియజేస్తూ ఉన్నాడు.

11యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. క్రీ.పూ. 587లో లేక 586లో బబులోను సామ్రాజ్యం యెరూషలేము నగరాన్ని ఓడించి దాన్ని నాశనం చేసింది. యెరూషలేము దేవాలయములోని పవిత్ర ఉపకరణాలను యెరూషలేము దాని పరిసర ప్రాంతాలలోని యూదులను బబులోనుకు చెరగొనిపోయారు. క్రీ.పూ. 538లో పారశీకులు బబులోను వారిని ఓడించి యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లవచ్చని అనుమతినిచ్చే వరకు ఈ ప్రవాసం (చెర) కొనసాగింది.

12 బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; 13 జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; 14 అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; 15 ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; 16 యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

17 ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదువరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తువరకు పదునాలుగు తరములు. ప్రజలు ఇప్పుడు hierarchy (వ్యవస్థ) క్రింద వున్నారు.

ప్రాముఖ్యముగా ఈ విభాగములోని ఈ జాబితా, దావీదు సంతానము బబులోనుకు కొనిపోబడిన కాలములో (అల్లకల్లోలమైనటువంటి ఆ పరిస్థితులలో) మరియు బబులోను చెరలో ఉన్నన్ని సంవత్సరాలు, క్రీస్తు రాకడ వరకు యెహోవా మెస్సయ్య యొక్క లైన్ని చెక్కుచెదరకుండా సజీవంగా ఉంచి ఉన్నాడనే విషయాన్ని ఈ వచనాల ద్వారా మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞపకం చేస్తూ ఉన్నాడు.

షయల్తీయేలు _ యెకొన్యా, సిద్కియా యూదాను పాలించిన చివరి రాజులు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెకొన్యా, సిద్కియాలను చెరలోనికి తీసుకొని వెళ్లియున్నాడు. యెకొన్యా కుటుంబము అతని పరివారము చెరలోనికి తీసుకుపోబడి యున్నారని 2 రాజులు 24:15 చెప్తూ ఉంది. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు అని 1 దినవృత్తాంతములు 3:17 చెప్తూ ఉంది. బబులోను చెరలో, షయల్తీయేలు చెరలో ఉండిన రెండవ రాజుగా పరిగణింపబడ్డాడు. ఒకవేళ యూదా చెరలోనికి పోకపోతే దావీదు సింహాసనం నుండి షయల్తీయేలు యూదా రాజ్యమును దావీదు వారసునిగా పాలించి ఉండేవాడు. ఇందుకు ఒక కారణముంది, (మత్తయి రెండవ విభాగములో రాజైన ఆమోను తరువాత రాజైన యెహోయాహాజును, యెహోయాకీమును వంశావళిలో చేర్చలేదు). యిర్మీయా చెప్తుండగా బారూకు వ్రాసిన గ్రంధమును యెహోయాకీము కాల్చివేసి యుండుటనుబట్టి యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా సెలవిస్తూ –దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అను శాపమే కారణం, ఈ విషయం యిర్మీయా 36:27-31 వచనాలలో గ్రంథస్థము చెయ్యబడియున్నది. ఈ మాటలు యెహోయాకీము మనుమడైన షయల్తీయేలులో నిజమయ్యాయి. టైటిల్ తొలగించబడింది.

జెరుబ్బాబెలు _ యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ ఈ విషయం 1 దినవృత్తాంతములు 3:17-19 లో ఉంది. ఇక్కడొక ప్రశ్న మనకెదురు కావొచ్చు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు కాదా?  పెదాయా కుమారుడా? అని ఎవరన్నా ప్రశ్నించవొచ్చు. దీనికి జవాబు, సహోదరులు కలసి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోతే చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసికొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమె యెడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను అని ద్వితీయోపదేశకాండము 25:5,6 వచనములు చెప్తున్నట్లుగా షయల్తీయేలు జరిగించియున్నాడు, ఈ విషయం 1 దినవృత్తాంతములు 3:17-19 లో చెప్పబడింది.

మత్తయి 1:12లో షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను అనే మాటలకు లూకా 3:27 లో జెరుబ్బాబెలు షయల్తీయేలుకు పుట్టెను అనే మాటలకు షయల్తీయేలు జెరుబ్బాబెలుకు చట్టబద్ధమైన తండ్రి అని అర్ధం.

ప్రవక్త అయిన హగ్గయి ప్రవాసం తరువాతి యూదా అధిపతిగా జెరుబ్బాబెలును పేర్కొనియున్నాడు, ఈ విషయం హగ్గయి 1:14, 2:1లో చెప్పబడి యున్నది. లేఖనాల్లోని జెరుబ్బాబెలు కథ ప్రకారం: జెరుబ్బాబెలు బబులోనులో చెరలో నివసిస్తు ఆ చెరలో, “చెరలో ఉన్న యూదా దేశపు యువరాజుగా” గుర్తింపును కలిగి యున్నాడు. పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు ఒక ఉత్తర్వును జారీ చేస్తూ, యెహోవా యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గనుక మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడై యుండునుగాక అని ప్రకటించాడు, ఎజ్రా 1:1-3. అప్పుడు వెంటనే జెరుబ్బాబెలు చెరలో ఉన్న యూదా దేశపు అధిపతిగా యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించటానికి దేవుడు ఎవరినైతే ప్రేరేపించాడో ఆ మనుష్యులందరికి అధిపతిగా సారధ్యమును తీసుకొని ప్రజలతో కలసి యెరూషలేముకు వచ్చారు. జెరుబ్బాబెలు సారధ్యములో దేవుని మందిరం తిరిగి కట్టబడింది. ఈ విషయాలన్నీ ఎజ్య్రా వ్రాసిన గ్రంధములో పొందుపరచబడి ఉన్నాయి.   

అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, అను విషయం తప్ప వీళ్ళ గురించి మనకేమి తెలియదు.

యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను, ఇక్కడ సువార్తికుని లక్ష్యం నిస్సందేహంగా యేసును మరియ భర్తయైన యేసేపు యొక్క చట్టబద్ధమైన కుమారుడిగా, ఆయన పుట్టుకతో మరియు దావీదు సింహాసనానికి సరైన వారసుడిగా పేర్కొనడం. చట్టం ముందు యేసేపు యేసుకు తండ్రి. అతని అన్ని హక్కులు మరియు అధికారాలు, ఆయన పుట్టుక మరియు పూర్వీకుల కారణంగా, చట్టం ద్వారా అతని కొడుకుకు బదిలీ చేయబడ్డాయి. అతను జీవించినంత కాలం, యేసేపు యేసు యొక్క చట్టబద్ధమైన తండ్రి వలె తన పాత్రను కొనసాగించాడు, మత్తయి 13:55; యోహాను 6:42. ఆయన క్రీస్తు అని పిలువబడ్డాడు, ఇది ఖచ్చితంగా హిబ్రూ మెస్సీయకు సమానమైన అర్థాన్ని కలిగి ఉంది: దేవుని అభిషిక్తుడు. ఇది అతని అధికారిక బిరుదు, ఆయన నిర్వహించబోయే ఆఫీసెస్ ని (రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా) తెలియజేస్తూ ఉంది.

ఆశ్చర్యపరచే విషయమేమిటంటే, యేసు దగ్గరకు వచ్చేటప్పటికి, రాజైన దావీదు వంశస్థుడైన యేసేపు సాధారణమైన వడ్రంగిగా ఉన్నాడు. దావీదు వంశస్థునిగా గుర్తింపు లేకుండా ఉన్నాడు. యూదులు యేసును మెస్సయ్యగా అంగీకరించకపోవడానికి ఉన్న అనేక కారణాలలో ఈ రెండు కూడా ఉన్నాయి.  ఇక్కడ దేవుడు తాను వాగ్దానము చేసిన దావీదు లైన్ ను ఎంత జాగ్రత్తగా కాపాడియున్నాడో, సంరక్షించియున్నాడో అర్ధం చేసుకోండి. దేవుడు వాగ్దానము చేసినది, శాపము నుండి విమోచించె రక్షకున్ని తప్ప ఇశ్రాయేలును బలమైన రాజ్యముగా తిరిగి నిలబెట్టే రాజును దేవుడు వాగ్దానము చెయ్యలేదు. అది దేవుని ఉద్దేశ్యము కాదు గనుకనే దావీదు కుమారుడైన యేసేపు సాధారణమైన వడ్రంగిగా ఉన్నాడు.

యేసు పూర్వీకుల జాబితాలో ఉన్నతమైన వ్యక్తులున్నారు మరియు అణగారిన వ్యక్తులు ఉన్నారు, రాజులున్నారు మరియు సామాన్యులున్నారు, ధనవంతులున్నారు మరియు పేదలు ఉన్నారు, పురుషులు ఉన్నారు మరియు స్త్రీలు ఉన్నారు. ఇది ఆనాటి ఇశ్రాయేలీయులకు మనకు ఏ విషయాన్ని తెలియజేస్తూ ఉంది? అనే ప్రశ్నకు, జాతి, లింగం, ఐశ్వర్యం, పేదరికం, విద్య లేదా విద్యలేకపోవడం అనేవి అవరోధాలు కావని ముఖ్యమైనవి కావని అందరూ పాపులు, అందరికి క్షమాపణ అవసరమని, దేవుడైన యెహోవా ఆ క్షమాపణను అందరికి ఉచితముగా ఇచ్చి ప్రజల శాపమును తొలగించుటకు తన కుమారుని పంపుదునని వాగ్దానము చేసి పంపియున్నాడనే విషయాన్ని ఆ రక్షకుడైన యేసు క్రీస్తుని జాడను అబ్రాహాము నుండి దావీదువరకు, దావీదునుండి బబులోను చెర వరకు, అక్కడి నుండి క్రీస్తు వరకు తెలియజేస్తూ ఉంది. ఇది మానవ చరిత్రపై దేవుడు నియంత్రణలో ఉన్నాడనే విషయాన్ని ఇశ్రాయేలీయులకు మనకు బహు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. 

అలాగే మనమొక విషయాన్ని మరచిపోకూడదు, యేసుక్రీస్తుని వంశావళిలో పేర్కొనబడిన స్త్రీలు తమ రాజైన మెస్సీయ వంశావళిలో ఉండటం యూదులకు సంతోషము కలిగించని విషయం. కాని వారు అవునన్నా కాదన్నా ఇదే నిజం. మత్తయి మిగతా అధ్యాయాలలో పంచుకోబోతున్న విషయాలను గురించి ఇది ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంది.

మత్తయి సువార్త మిగతా అధ్యాయాలలో, యేసు, మెస్సీయ విషయంలో యూదుల అంచనాలను ఖండించటాన్ని మనం చూడొచ్చు. యేసు యూదులను సబ్బాతు విషయములో, దేవునికి ఇచ్చే వాటి విషయములో, దేవుని పట్ల విధేయత విషయములో మరియు పరలోకరాజ్యము విషయములో యూదులు ఆలోచించే విధానం తప్పనే విషయాన్ని యేసు ఖండించటాన్ని ఇది స్పష్టముగా తెలియజేస్తూ ఉంది.  

ఎందుకని మత్తయి యేసుక్రీస్తుని వంశావళిలోని మూడు విభాగములలో ఒకొక్క విభాగములో 14 తరాలను పేర్కొన్నాడు? బైబులు ఈ విషయాన్ని గురించి ఏమి చెప్పటం లేదు కాని కొందరు ఈ విధముగా చెప్తుంటారు:  బైబిలులో ఏడు సంపూర్ణతకు గుర్తు. దేవుడైన యెహోవా ఆరు దినములలో సృష్టిని సృష్టించి ఏడవ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకొనియున్నాడు. 

14 లో_ 7 తరాలు + 7 తరాలు = 14 తరాలు. ఒకొక్క విభాగములో 14 తరాలు అంటే  రెండు ఏడులు ఉన్నాయి. రెండు ఏడులు చొప్పున మూడు విభాగములలో కలిపి 42 తరాలు, అంటే మూడు విభాగములలో 6 ఏడులు ఉన్నాయి. అంటే 6/7. యేసు జననంతో చివరి 1/7 ప్రారంభమయ్యింది. పాత నిబంధనలో  ఇశ్రాయేలీయుల కోసం, ప్రతి 49 సంవత్సరాల తరువాత జూబ్లీ సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరం బానిసలు స్వతంత్రులుగా విడిపించబడతారు మరియు అమ్మబడిన ఆస్తులను వారి అసలు యజమానులకు తిరిగి ఇస్తారు, తద్వారా ఏ కుటుంబమూ శాశ్వతంగా దాని వారసత్వాన్ని కోల్పోదు. మత్తయి సువార్తను చదివే వ్యక్తులు ఆ చివరి తరం తరువాత ఉంటారు, అది వారిని  “ఏడవ ఏడు” లో ఉంచుతుంది. క్రీస్తు జననం ద్వారా ప్రపంచమంతా నిజమైన జూబ్లీలోనికి ప్రవేశించింది, ఎందుకంటే యేసు పాపపు బానిసలందరినీ (మొత్తం మానవ జాతిని) విడిపించాడు వారిని పరలోకపు తండ్రి ఇంటికి తిరిగి రావడానికి అనుమతించి యున్నాడు అని తెలియ చేయడానికే మత్తయి ఇలా చెప్పియున్నాడని కొందరు చెప్తూ ఉంటారు.

ఇది ఆసక్తికరమైన మరియు సముచితమైన ఆలోచనే, కాని మత్తయి సూటిగా ఈ విషయాన్ని గురించి ఉద్ఘాటించడం లేదు. దేవుడు తన ప్రజల వ్యవహారాలను నిర్దేశించిన క్రమాన్ని మరియు రక్షకుడు పుట్టే వరకు దావీదు వారసులను ఆయన యెట్లు సంరక్షించి ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలని ఆయన కనికరాన్ని బట్టి మనం ఆశ్చెరువు నొందాలని ఈ విషయాన్ని మత్తయి మనకే వదిలేసాడు.

మత్తయి స్పష్టంగా, యేసేపు వంశావళిని గురించి చెప్తున్నాడు. లూకా మరియ వంశావళిని గురించి చెప్తున్నాడు. ఇద్దరూ దావీదు యొక్క ప్రత్యక్ష వారసులు. దావీదు తరువాత, యేసేపు యొక్క వరుసలో యూదా రాజులు ఉన్నారు, కాని మరియ యొక్క లైన్ లో అంతగా తెలియని సామాన్యులు ఉన్నారు, వీరు కూడా దావీదు నుండే వచ్చారు, కాని రాజ వారసత్వ వరుసలో లేరు. ఏదేమైనా, యేసు తల్లి అయిన మరియ మరియు యేసు చట్టబద్దమైన తండ్రి అయిన యేసేపు ఇద్దరూ దావీదు రాజు నుండే వచ్చారు. ఈ మాటలకూ పరిపూర్ణమైన అర్ధం, అబ్రాహాము దావీదులకు వాగ్దానము చెయ్యబడిన మెస్సీయ ఈ యేసు క్రీస్తే అని అర్ధం.

యేసు యొక్క జన్మము 18-25

18 యేసుక్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. 19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20 అతడు సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమైదావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది; 21 ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. 22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. 23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 24 యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని 25 ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

1-17 వచనాలలో అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇది అని యేసుని మానవ వంశావళిని గురించి తెలియజేసియున్నాడు. మళ్ళి ఇప్పుడు 18-25 వచనాలలో ఆ యేసు క్రీస్తుని జననవిధమెట్లనగా అని చెప్తూ ఆ యేసు జన్మమును గూర్చి ఆయన దైవికమైన వంశావళిని గురించి సంక్షిప్తముగా మత్తయి తెలియజేస్తూ ఉన్నాడు.  

ఆ టైములో మరియ “యేసేపుకు ప్రధానము చెయ్యబడియున్నది”. ఆ రోజులలో బాల్య వివాహాలు సాధారణం. కాబట్టి ప్రధానములో, ప్రధానము చెయ్యబడిన వాళ్ళు సాక్షుల సమక్షంలో వివాహ ప్రమాణాలు బహిరంగముగా చేసేవాళ్ళు. ప్రధానము చెయ్యబడిన వాళ్ళు భార్యాభర్తలుగా పరిగణించబడేవారు. అప్పటి ఆచారం ప్రకారం, వివాహమును తరువాత చేసేవాళ్ళు, వివాహమైనప్పటి నుంచి వధూవరులు తమ జీవితాన్ని ఒకటిగా ప్రారంభించేవాళ్ళు. ఆ కాలములో ప్రధానమనేది ఒక బంధం, ఇది మరణముతో గాని లేదా విడాకులతో గాని తెగిపోతుంది. ఆ కాలములో ఇరువురికి ప్రధానము చెయ్యబడిన తరువాత ఇరువురిలో ఎవరన్నా అకస్మాత్తుగా వివాహానికి ముందే మరణిస్తే బ్రతికున్నవారిని వితంతువుగా పరిగణించెడివాళ్ళు.

మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత, వారేకము కాకమునుపు, అంటే (వివాహమై వారిరువురు ఒకటిగా తమ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు) ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి –దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. మరియ ఆ మాటకు బహుగా తొందరపడి–ఈ శుభవచనమేమిటో అని ఆలోచించు కొనుచుండగా దూత – మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను. ఈ మాటలు లూకా సువార్త 1:26-38 వచనాలలో గ్రంథస్థం చెయ్యబడి ఉన్నాయి.

పెళ్లి వేడుకకు ముందు, మరియ గర్భవతి. ఆమె పరిస్థితి సున్నితమైనది మాత్రమే కాదు, కన్యకు చాలా బాధ కలిగించేది, అవమానకరమైనది. ఆమె పరిస్థితికి పరిశుద్ధాత్మ యొక్క అతీంద్రియ శక్తే కారణమనే వాస్తవాన్ని ఆమె సంపూర్ణముగా నమ్మింది. ఆమె ప్రతిష్ట, ఆమె గౌరవం మరియు ఆమె జీవితం ప్రమాదంలో ఉన్న అటువంటి పరిస్థితులలో ఆమె నైతిక నిజాయితీ మరియు ఆమెకు దేవునిపై ఉన్న బలమైన విశ్వాసం తప్ప మరేవి ఆమెకు మద్దతుగా లేవు. కాని ఎలాంటి తడవు సందేహము లేకుండా మరియ, నీ మాటచొప్పున నాకు జరుగును గాక, అని అనడం నమ్మడానికి చాల కష్టముగా ఉండొచ్చు. దేవునిపై ఆమెకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆమె తడవు చెయ్యక సందేహించక ఎంత చక్కగా వ్యక్తీకరించియున్నదో చూడండి, ఆమె సమర్పణను దేవుని చిత్తానికి లోబడుటను గమనించండి. దేవునికి తల్లిగా మరియ పరిచర్య ప్రత్యేకం, అపూర్వం.  

మరియ పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను”. ఇది ఒక వాస్తవాన్ని తెలియజేస్తు మానవ చరిత్ర అంతటిలో ఈ పుట్టుక ప్రత్యేకమైనదని నిత్యత్వములో తండ్రి కనిన నిజమైన దేవుడైన యేసుక్రీస్తు, మానవులను శాప విముక్తులను గావించడానికి ఆయన కన్య అయిన మరియ గర్భమును ఎన్నుకొన్నాడని కన్యయైన మరియకు నిజమైన మనిషిగా జన్మించియున్నాడనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ సత్యాన్నే మనమందరం విశ్వాస ప్రమాణములో ఒప్పుకొంటూ ఉన్నాం.

ఈ భాగములో ఉన్న సత్యములు : కన్యకు జన్మించుట ద్వారా (నిజ దేవుడు నిజ మానవుడు) ఒక వ్యక్తి యందు జతచేయ బడ్డారు.

  1. యేసు నిజ దేవుడైయున్నాడు_యేసుని దైవికమైన నామములు, దైవికమైన భోదలు, దైవికమైన క్రియలు, దైవికమైన గుణ లక్షణాలు, దైవికమైన ఘనత _ఇవన్ని యేసు నిజదేవుడైయున్నాడని తెలియజేస్తూ ఉన్నాయి. 
  2. యేసు నిజమానవుడైయున్నాడు_మానవ శరీరము (రక్త మాంసములు), ఆత్మ, మానవ క్రియలు_ఇవన్ని యేసు నిజ మానవుడై యున్నాడని తెలియజేస్తూ ఉన్నాయి. 

యేసుక్రీస్తు నిజదేవునిగాను నిజమానవునిగాను ఒకే వ్యక్తిలో ఇరువురిగా ఉండుటకు అవసరమేముంది? అని మీరు ప్రశ్నించవచ్చు.

ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు, (రోమా 3:23), అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెనని, ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెనని (గలతి 4:4,5), ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు (రోమా 5:19), శరీరధారిగా, సమస్త విషయములలో యేసు మనవలెనే శోధింపబడినను ఆయన పాపములేనివాడుగా ఉండెనని హెబ్రీ 4:15 చెప్తూ ఉంది. ఈ లేఖన భాగాలు, యేసు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెనని మనుష్యులందరి కొరకు యేసు దానిని సంపూర్ణముగా నెరవేర్చాల్సి ఉంది కాబట్టే యేసు నిజమానవుని గాను మరియు నిజదేవునిగాను ఒకే వ్యక్తిలో ఉండుట అవసరమైయుండెనని చెప్తూ ఇది యేసుని Active obedience ని తెలియజేస్తూ ఉంది. 

కీర్తన 49:7,8, ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెనని, (హెబ్రీ 2:14), యోహాను 1:29, ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఉంది. ఈ దేవుని గొర్రెపిల్ల అయిన మనుష్య కుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని, చాల స్పష్టముగా మార్కు 10:45 చెప్తూ ఉంది. ఈ లేఖన భాగాలు, యేసు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము గా తన ప్రాణము ఇచ్చుటకు ఆయన మరణించాల్సి ఉందని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు యేసు నిజమానవునిగాను మరియు నిజదేవునిగాను ఒకే వ్యక్తిలో ఉండుట అవసరమైయుండెనని చెప్తూ ఇది యేసుని Passive obedienceని తెలియజేస్తూ ఉంది.

కన్యకు జన్మించుట ద్వారా (నిజ దేవుడు నిజ మానవుడు) ఒక వ్యక్తి యందు జతచేయబడ్డారు, ఎందుకంటే, నిజమానవునిగా _ ధర్మశాస్త్రము క్రింద ఉన్నాడు, మరణించాడు. నిజదేవునిగా _ ధర్మశాస్త్రమును పరిపూర్ణ ముగా నెరవేర్చాడు, అందరికి ప్రాయశ్చిత్తము చేసాడు.

దూత మరియతో (లూకా 1:26-38 లో) చెప్పిన మాటలన్ని మరియ యేసేపుకు తెలియజేసి వుండొచ్చు. మత్తయి 1:19ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ క్లిష్ట సమయంలో,  సగటు మనిషి సామర్ధ్యానికి మించిన సాక్ష్యాన్ని బట్టి అతడు ఆమెను నిర్దోషి అని నమ్మలేకపోయాడు. నిశ్చితార్థం చేసుకున్న భర్తగా అతనికి భర్త హక్కులు బాధ్యతలు ఉన్నాయి. అతడు నీతిమంతుడు, న్యాయవంతుడు, చట్టాన్ని గౌరవించేవాడు ఇలాంటి విషయాలలో కఠినమైన రాజీపడని వారి ధర్మశాస్త్రపు ఆజ్ఞలను బట్టి, ద్వితీయోప 22:23-29 నీతిమంతుడైన యేసేపు ఆమెను బహిరంగగా అవమానపరచుటకు ఇష్టపడక, ఆమెను రహస్యంగా దూరంగా ఉంచాలని భావించాడు. అతడు మరియను బహిరంగంగా బహిర్గతం చేయడానికి ఆమె పైకి ప్రజా అవమానాన్ని నిందను తేవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భర్తగా తాను ప్రేమను పంచిన స్త్రీ ఆమె. అతని మానవత్వం, ప్రేమ, ఆప్యాయత, తీవ్రమైన పరీక్షకు గురయ్యాయి. ఫలితముగా అతడు కఠినమైన చర్యను తీసుకోవడానికి ఎంచుకోలేదు. ఆమె జీవితాన్ని రక్షించడానికి కారణం చెప్పకుండా నిశ్చితార్థం యొక్క బంధాన్ని నిశ్శబ్దంగా రద్దు చేసుకుందామని అతడు అనుకున్నాడు. యేసేపు మనస్సు కలవరపరిచే సమస్యతో బాధతో, నిరాశతో, అపసవ్య ఆలోచనలతో పెనుగులాడుతూ ఉంది. అట్లే అతడు ఆమె పట్ల తీసుకోబోతూ ఉన్న చర్య కూడా అతనికి కఠినమైనదిగా అనైతికమైనదిగా కనిపిస్తూ ఉండొచ్చు.

20అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇక్కడే దేవుడు తన కుమారుని తల్లి తరపున తన మానవత్వం ప్రకారం జోక్యం చేసుకొని, దేవదూతను యోసేపు వద్దకు పంపగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; 21ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక నువ్వు ఆ బిడ్డకు చట్టబద్దమైన తండ్రిగా యేసు అని పేరు పెట్టాలి, అని చెప్పటం మత్తయి 1:19-21 వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ప్రిడిక్షన్ రూపంలో ఉండే కమాండ్.

దేవదూత కలలో కనిపించడం అనేది దేవుడు తన చిత్తాన్ని తెలియజేయడానికి లేదా ప్రత్యేక సందర్భాలలో భవిష్యత్తును బహిర్గతం చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. దేవదూత యేసేపును “దావీదు కుమారుడవైన యోసేపూ” అని సంబోధించడం అతని హీరోయిక్ మూడ్ ని మేల్కొల్పడానికి కాదు. పుట్టబోవుచున్న శిశువును చట్టబద్ధముగా అంగీకరించుమని ఆయనను స్వీకరించమనే ఆలోచనను నొక్కి చెప్పడం. అతడు మరియను తన భార్యగా అంగీకరించి బహిరంగంగా ఇంటికి తీసుకెళ్లడానికి భయపడ కూడదు. ఇంద్రియాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ప్రభువును నిశ్చయముగా విశ్వసిస్తూ దూత మాటలను అంగీకరించి మరియను చేర్చుకోవడం యేసేపును పాత నిబంధన విశ్వాస వీరులలో ఒకనిగా చేస్తూ ఉంది. ఈ ప్రజా గుర్తింపు మరియ ఆమె బిడ్డ గౌరవాన్ని కాపాడుతుంది.

యేసు అనేది యూదులలో ఒక సాధారణమైన పేరు. ఇది పాత నిబంధనలోని హిబ్రూ పేరైన యెహోషువతో సమానం. యేసు అనే పేరుకు “యెహోవా రక్షిస్తాడు” అని అర్ధం. ఆ రోజుల్లో ఈ పేరు ఒక సాధారణ బిడ్డకు పెడితే, అది రక్షకుడి గురించి దేవుని వాగ్దానాన్ని ప్రజలకు జ్ఞపకం చెయ్యడానికి కావచ్చు. అయితే క్రీస్తు విషయానికి వచ్చేటప్పటికి, ఇది లోకములోని ఏకైక రక్షకుడైన ఈయన ఎవరు, ఏం చేస్తాడో అనే విషయాన్ని (తన ప్రజలను వారి పాపముల నుండి ఈయనే రక్షించును) తెలియజేస్తూ ఉంది. “ఆయన ప్రజలు” అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులే కాదు, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు అంటే భూమిపై ఉన్న ప్రతి జాతి మరియు దేశస్థులు అందు చేర్చబడియున్నారు.

అయితే ఆ కాలములో యూదులు రోమన్ల అణచివేత నుండి వారిని రక్షించి, దావీదు, సొలొమోనుల వంటి రాజ్యాన్ని తిరిగి స్థాపించే మెస్సీయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుని కొరకు అంటే పాపం యొక్క భయంకరమైన శాశ్వతమైన పరిణామాల నుండి మానవాళిని విడిపించే రక్షకుని కొరకు వాళ్ళు ఎదురు చూడకుండా వాళ్ళ జీవితాలకు భద్రత మరియు భౌతిక బహుమతులు అందించే భూసంబంధమైన మెస్సీయ కొరకు మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టే యేసుని కాలములో యూదులలో కొందరు యేసును రాజుగా చేయుటకు బలవంతముగా పట్టుకొబోయారని, యోహాను 6:15 తెలియజేస్తూ ఉంది.

22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు 23అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.

మత్తయి ప్రధానంగా యూదులకు ఈ సువార్తను వ్రాస్తూ ఉన్నాడు, వాళ్ళు పాత నిబంధన లేఖనాలతో సుపరిచితులు మరియు ప్రభువు, ప్రవక్తల వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది సువార్తికుడు నమోదు చేసిన విధంగా జరిగిన సంఘటన కాదు, కాని శతాబ్దాల క్రితం ప్రభువు ఖచ్చితంగా నిర్ణయించి, పూర్తిగా ప్లాన్ చేసిన సంఘటన. యెషయా 7:14లో ప్రవచనం చెప్పినది ఆయనే. కాబట్టే ప్రభువు తన ప్రవక్త ద్వారా యెషయా 7:14లో చెప్పినట్లు ఇదంతయు జరిగెనని మత్తయి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సూచన ఇప్పుడు నెరవేరింది. కన్యక, దేవునిచే నియమింపబడి ఎన్నుకోబడియున్నది, ఆమె బిడ్డతో ఉన్నది, ఒక కొడుకును కనబోతూ ఉన్నది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు, ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నిత్యదేవుడే శరీరధారియై కనిపించే విధంగా మనమధ్యకు వచ్చాడని మత్తయి ఈ మాటల ద్వారా యూదులకు తెలియజేస్తూ ఉన్నాడు. (యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను; యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి; 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను).

24 యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని 25 ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

యేసేపు దగ్గరకు దూత తెచ్చిన మాటలు అత్యుత్తమమైన ప్రకటనగా చెప్పొచ్చు. మరియ నమ్మకత్వాన్ని బట్టి యోసేపుకున్న సందేహాలన్ని తొలగిపోయాయి. వాటి స్థానములో, వాగ్దానము చెయ్యబడిన మెస్సయ్య, లోక విమోచకుడైన దేవుని కుమారుని సంరక్షణను తీసుకొనే అవకాశము అతనికి ఇవ్వబడియున్నదనే అద్భుతమైన శుభవార్తను యేసేపు అందుకున్నాడు. యోసేపు దేవదూతను నమ్మాడు మరియు అతని ఆజ్ఞలను పాటించాడు. ఆలస్యం చేయకుండా మరియను తన భార్యగా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు.

కాథలిక్కులు మరియను “బ్లెస్డ్ వర్జిన్” అని చెప్తూ, ఆమె యేసుకు జన్మనిచ్చిన తరువాత తన జీవితాంతం కన్యగానే ఉండిపోయిందని వాళ్ళు నమ్ముతారు. ప్రొటెస్టంట్లు మరియను “కన్య” అని సూచించినప్పుడు, ఆమె యేసు పుట్టే వరకు మాత్రమే కన్యగా ఉందని, యేసు తర్వాత, మరియ యేసేపులకు పిల్లలు ఉన్నారని వాళ్ళు నమ్ముతారు.

ఈ భిన్నాభిప్రాయాలకు కారణం, క్రొత్తనిబంధనలో ప్రభువుయొక్క “సోదరులు” మరియు “సహోదరీలు” అని ప్రస్తావించ బడిన దాదాపు పది సందర్భాలు ఉన్నాయి (మత్తయి 12:46;  13:55; మార్కు 3:31-34; మార్కు 6:3; లూకా 8: 19–20; యోహాను 2:12, 7:3, 5, 10; అపోస్తుల కార్యములు 1:14; 1 కొరింథీయులకు 9:5). “సోదరులు” మరియు “సహోదరీలు” (గ్రీకు: అడెల్ఫోస్/అడెల్ఫ్) అనే పదానికి బైబిల్లో విస్తృతమైన అర్థం ఉంది. “సోదరులు” మరియు “సహోదరీలు” అనే పదం ఎల్లప్పుడూ ఒకే భూసంబంధమైన తలితండ్రులకు జన్మించిన పిల్లలకు మాత్రమే వర్తించదు. కొన్నిసార్లు ఇది బంధువులు లేదా దగ్గరి బంధువుల పిల్లలకు కూడా వర్తిస్తుంది. మరియ యేసేపులకు యేసుతో పాటు ఇతర కుమారులు మరియు కుమార్తెలు ఉన్నారా లేదా అనేది నిర్ధారించడం అసాధ్యం. ఇది ఒక సమస్య కాదు భిన్నాభిప్రాయాలు మాత్రమే అని గుర్తుంచుకోండి.

సారాంశం: దావీదుకు చట్టబద్ధమైన వారసుడును కుమారుడును యైన యేసుక్రీస్తు, అన్ని కాలాల విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము వంశావళికి చెందినవాడై, (ఆయన పెంపుడు తండ్రియైన యేసేపుకు దూత ద్వారా దేవుని మధ్యవర్తిత్వం గురించి ఉపదేశింపబడిన తర్వాత), ఆయన కన్యయైన మరియ ద్వారా జన్మించాడు.

దేవుని వాక్యాన్ని వ్యాఖ్యాన రూపములో దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay no. is +91 9848365150