మట్టల ఆదివారము బి సిరీస్

పాత నిబంధన పాఠము: జెకర్యా 9:9-10; పత్రిక పాఠము: ఫిలిప్పీ 5:7-0; సువార్త పాఠము: మార్కు 11:1-10; కీర్తన 24.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: జెకర్యా 9:9-10

జెకర్యా 9:9-10, సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములులేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

పాత నిబంధనలోని ప్రవచనాత్మక దర్శనాలు మరియు కథలు, ముఖ్యంగా ఇశ్రాయేలును శక్తివంతమైన దేశంగా చేసిన దావీదు రాజవంశంతో సంబంధం ఉన్నవి, మెస్సయ్య రాజుగా వస్తాడని మాట్లాడినందున అవి ఇశ్రాయేలు గొప్పతనాన్ని పునరుద్ధరించే రాజైన మెస్సయ్య కోసం ఇశ్రాయేలీయులలో ఆశను రేకెత్తించాయి. విమోచకుడి ఆలోచన రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది, చాలామంది భౌతిక శక్తి ద్వారా తమ అణచివేతదారులను తరిమికొట్టే మెస్సీయ పై దృష్టి సారించారు. మెస్సీయ ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి స్థాపించాలని, యూదు ప్రజలను తిరిగి వాగ్దాన భూమికి సమీకరించాలని, యెరూషలేములో ఆలయాన్ని పునర్నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా శాంతి యుగాన్ని స్థాపించాలని ఆశించారు. మళ్ళి వారి దేశం యొక్క కీర్తిని పునరుద్ధరించే ఎంతో గొప్ప విజేతయైన ఆ రాజు కోసం వారు ఎదురు చూస్తున్నారు.

ఆ కాలములో, ఈ అధ్యాయంలోని మొదటి భాగం ఈ ప్రపంచాన్ని, ఇశ్రాయేలు పొరుగువారిని నిర్దాక్షిణ్యంగా జయించిన గొప్ప విజేతయైన అలెగ్జాండర్ ది గ్రేట్ రాకను గూర్చి వచ్చిన దేవోక్తిని గురించి ప్రవచిస్తూ ఉంది. అలెగ్జాండర్ ది గ్రేట్ తన విజయ మార్గంలో ముందుకు సాగుతున్నాడు. అతని రాక వార్త అతని మార్గంలో ఉన్నవారి హృదయాలలో భయాన్ని రేకెత్తించేదిగా ఉంది. వారి మెస్సీయ కూడా ఇశ్రాయేలును సైనిక విజయానికి నడిపించే శక్తివంతమైన రాజకీయ విమోచకుడని వారు భావించారు. అలాంటి పరిస్థితులలో, మన ఈ పాఠములో జెకర్యా గొప్ప విజేతయైన అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వారికి భిన్నంగా, అందరికంటే ఎంతో గొప్ప విజేతయైన మెస్సయ్యను గురించి ఆ రాజు యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రవక్త మెస్సీయ విజయాలపై దృష్టి పెట్టాడని ఆ విషయాన్ని చెప్పాలనుకొంటున్నాడనే విషయములో ఎలాంటి సందేహము లేదు. అయితే అతని మాటల ద్వారా, ఈ రాజు చాలా వింతైన రాజుగా ఉన్నాడు. ఆయన గొప్ప తగ్గింపుతో వచ్చుననే విషయము మరియు ఆయన సాత్విక స్వరముతో మాట్లాడుననే విషయము ఈ రాజును చాలా వింతైన రాజుగా చూపెడుతూ ఉన్నాయి.

యేసు ఎంతో వింతైన రాజుగా ఉన్నాడు
1. ఆయన గొప్ప తగ్గింపుతో వస్తాడు
2. ఆయన సాత్విక స్వరముతో మాట్లాడతాడు

1

జెకర్యా అందరికి సుపరిచితమైన ప్రవక్త కాడు. బైబులు బాగా తెలిసియున్న వారికి కూడా ఈయన గురించి పెద్దగా ఏమి తెలియదు. యేసు రాకడకు 500 సంవత్సరాల ముందు ఇతడు ప్రవక్తగా ఉన్నాడు. ఆ కాలములోనే ఇశ్రాయేలీయులు బబులోను చెరనుండి యూదా దేశమునకు తిరిగి వచ్చియున్నారు.

జెకర్యా ఏవిధముగా ఈ ప్రవచనాన్ని ప్రారంభించాడో చూడండి. సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు ……. గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. అతని కాలములోని ప్రజలకు ఈ మాటలు గుచ్చుకొని ఉంటాయి. ఎందుకంటే, ఇశ్రాయేలు చరిత్రలో అది వారికెంతో కష్టకాలం. అప్పుడే వాళ్ళు చెరనుండి వారి స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి జీవితాలు వాళ్ళు అనుకున్నట్లుగా లేవు. వారు ప్రేమించిన వారి పట్టణము శిధిలమయ్యింది. వారి మందిరం నాశనం చెయ్యబడింది. వాటిని కట్టాలన్న వారి ప్రయత్నాలు వారి శత్రువుల చేత అడ్డగింపబడుతూ ఉన్నాయి. అది వారికీ చీకటి కాలంగా ఉంది. వారి జీవితాలలో సంతోషమనేది లేదు, ఉల్లాసము కూడా లేదు. కాని ఆయన తన ప్రజలను సంతోషముతో ఉల్లాసములో ఉప్పొంగమని ఆజ్ఞాపించాడు. సంతోషము ఉల్లాసము అనే మాటలకు ప్రవక్త ఇక్కడ వాడిన చిత్రము, సంతోషముతో ఉల్లాసముతో గంతులు వేయుడని, కేకలు పెట్టుడని అర్ధం. ఎందుకు బహుగా సంతోషించుచు ఉల్లాసముగా ఉండాలి? అనే ప్రశ్నకు, అతడు, ఎందుకంటే, నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. “నీ రాజు” అని అంటున్నాడు. నీ సొంత రాజు, చాలా కాలంగా వాగ్దానం చేయబడినవాడు, చాలా కాలంగా ఎదురుచూస్తున్నవాడు, దేవుడు వారికి “రాజు”గా వాగ్దానం చేసినవాడు, నీయొద్దకు వచ్చుచున్నాడు.

దీనిని ఆలకిస్తూవున్న వారికీ ఈ విషయము ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. ఎందుకంటే, ఆ కాలములో వారికి రాజు లేడు. వారి చివరి రాజు హిజ్కియా. అతడు వారితో పాటు చెరలోనికి వెళ్లి అక్కడనే మరణించాడు. అక్కడితో రాజుల వంశావళి సమాప్తమైపోయింది. 536 సంవత్సరంలో వారు పాలస్తీనాకు తిరిగి వచ్చినపుడు వారికి రాజు లేడు. కాని ఇప్పుడు జెకర్యా వారి రాజు వారి యొద్దకు వచ్చుచున్నాడని చెప్తూ ఉన్నాడు. ఇది వారిని ఎంతో ఆశ్చర్యపర్చి ఉండొచ్చు.

అంతకంటే ఎక్కువగా ఆ రాజు వచ్చుచున్న విధానము వారిని ఎంతగానో ఆశ్చర్యపర్చి ఉండొచ్చు. జెకర్యా చెప్తున్న ప్రకారము, ప్రపంచాన్ని గర్వంగా విధ్వంసకరంగా జయించిన వారిలా కాకుండా, ఈ రాజు గుర్రం ఎక్కి రాడు. ఆయన దీనుడునై, గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. రాజు ఇలా రావడాన్ని ఎవరు ఊహించరు, అసలు అనుకోరు. దీనుడునై అనే మాటకు, వినయం, సౌమ్యత మరియు అహంకారం లేదా గర్వం లేకపోవడం తరచుగా సున్నితమైన పాత్రతో ముడిపడి ఉంది. అలాగే ఆ కాలములో, ఆ దినములలో, రాజు గాడిదను ఎక్కి తమ ప్రజల యొద్దకు వచ్చే వాళ్ళు కారు. అదెలా ఉంటుందంటే, ప్రధాన మంత్రి గారు డొక్కు సైకిలును ఎక్కి మన దగ్గరకు వస్తున్నట్లుగా ఉంది. జెకర్యా ఇక్కడ చెప్తున్న రాజు భలే వింతైన రాజుగా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతూవున్న రాజు వారి ఎక్సపెక్టషన్స్కి అస్సలు దగ్గరగా కూడా లేడు.

ఆయన తగ్గింపుతో ఎందుకని వచ్చాడో అర్ధం చేసుకోవడానికి ముందుగా అసలు ఆయన ఎందుకని వచ్చాడో మనం అర్ధం చేసుకోవాలి. జెకర్యా ఆ విషయాన్ని గురించి చెప్తూ, నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును అని ఆయనను గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన నీతిపరుడు అంటే ఆయన తన స్వభావములో, ఖచ్చితముగా పాపము లేనివాడని, ఆయన ఆవిధముగా ఉండుటను బట్టి ఆయన రక్షణగలవాడుగా అంటే కాపాడువానిగా విడిపించువానిగా వచ్చుచున్నాడని అర్ధం. ఆయన వారికీ నిజమైన స్వేచ్ఛను దయచేయుటకు తన నీతితో వారిని రక్షించుటకు వచ్చుచున్నాడు.

ఇక్కడ జెకర్యా చెప్తున్న రాజు యేసే. మన సువార్త పాఠము మార్కు 11 స్పష్టము చేసియున్నట్లుగా ఆయనే ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు. ఆయన సిలువ వేయబడుటకు ముందు ఆదివారము, పస్కా పండుగ కొరకు ఆయన జయోత్సాహముతో గాడిదను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించుటను గురించి మార్కు చెప్పాడు. ఆయన ఏవిధముగా వచ్చునని జెకర్యా చెప్పాడో అదేవిధముగా ఆయన తగ్గింపుతో గాడిదనెక్కి వచ్చాడు. రాజు నీతిమంతునిగా రావడం పాపాత్మకమైన మానవునికి ఆనందానికి కాదు, భయానికి కారణం అవుతుంది. అయితే దీనుడై అనే మాట ఎంతో ఓదార్పును కలుగజేస్తూ ఉంది.

ఆయన దీనుడై తగ్గింపుతో రావడం అందరిని రక్షించాలనే ఆయన ప్రణాళికలో ఒక భాగం. పాపము దాని ఫలితాలు మనలను దోషులుగా తీర్పు తీర్చి నిత్యమరణపు శిక్ష క్రిందికి మనలను తెచ్చియుండగా అందరిని దాని నుండి రక్షించే క్రమములో, దేవుడైయున్న యేసు శరీరధారియై మన స్థానములో మన కొరకు ధర్మశాస్త్రము క్రింద ఉండవలసి వచ్చింది. గనుకనే ఆయన తగ్గింపుతో రావాల్సి వచ్చింది. ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను, 2 కొరింథీయులకు 8:9.

యేసు తగ్గింపులో ఉన్న సంతోషాన్ని ఉల్లాసాన్ని గమనిస్తే, ధర్మశాస్త్రము క్రింద నిజముగా మన స్థానమును ఆయన తీసుకొని మన కొరకు అది కోరుచున్న వాటినన్నిటిని నెరవేర్చి మన పక్షముగా చెల్లించవలసిన అపరాధ రుసుమును చెల్లించుటకు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. హెబ్రీయులకు 4:15, మన ప్రధానయాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను, అని చెప్తూ అది మనకు నిశ్చయతను కలుగజేస్తూ ఉంది. “దీనుడు” అని అనువదించబడిన హీబ్రూ పదం ‘అని’ తరచుగా పేద, సామాజికంగా దుర్బల వ్యక్తులను సూచిస్తుంది. ద్వితీ. కాం. 15:11; యెషయా 10:2; కీర్తన 140:12 లలో వాడిన ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా, జెకర్యా తన మెస్సీయ రాజును పేదలు మరియు అణచివేతకు గురైన వారితో కలుపుతున్నాడు. ఆయన తగ్గింపు ఆయన యొద్దకు వెళ్ళు లాగున మనలను ప్రోత్సహిస్తూ ఉంది. మన రక్షకుడు కఠినమైన న్యాయాధిపతి వలె లేడు.

దీనుడై ఆయన గాడిద మీద వచ్చాడు. ఆవిధముగా రావటం ద్వారా ఆయన ఎంత చేరదగిన వానిగా ఉన్నాడో చూడండి. ఆయన ఎక్కి వచ్చిన గాడిదకు నిజమైన అర్ధం, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును, మత్తయి 11:28. న్యాయాధిపతుల కుమారులు గాడిదలపై ప్రయాణించే రోజులు చాలా కాలం నుండి ఉన్నాయి, న్యాయాధిపతులు 10:4; 12:14. సొలొమోను పట్టాభిషేకములో దావీదు తన కంచరగాడిదను యిచ్చియున్నాడు 1 రాజులు 1:33,38,44. ఈ లోకానికి చెందని రాజ్యం తప్ప, ఒక రాజు గాడిదపై ప్రయాణించిన సందర్భం లేదు. కాబట్టి, ఈ ప్రవచనం యూదులను ఈ లోకానికి రాజు కాకుండా ప్రవక్త-రాజు కోసం ఎదురుచూసేలా రూపొందించబడింది. ఈ రోజు, గాడిదపై స్వారీ చేస్తున్న ఏ రాజైనా యెరూషలేముకు వచ్చాడా? అని ఏ యూదుడనైనా అడగండి. వాడు యేసు పేరు తప్ప మరెవరినీ పేర్కొనలేడు.

2

ఈ వింత రాజు రాకడలో ఆదరణ మాత్రమే గాక ఎదురుచూడని ఫలితము కూడా ఉంది. మన పాఠము యొక్క 2వ భాగములో జెకర్యా దానిని గురించి చెప్తూ, ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములులేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ఎఫ్రాయిము (తెగలు) అతి పెద్ద తెగలతో కూడినది. ఇశ్రాయేలు చరిత్రలో ఎఫ్రాయిమ్ తెగ ముఖ్యమైన పాత్ర పోషించింది, దక్షిణానికి వ్యతిరేకంగా తిరుగుబాటులో 10 ఉత్తర తెగలకు నాయకత్వం వహించి ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించింది. దక్షిణ రాజ్యమైన యూదాకు యెరూషలేము ముఖ్యపట్టణము. రథములు, గుఱ్ఱములు, యుద్ధపు విల్లు అనేవి యుద్ధోపకరణములు. వాటిని నేను తీసివేయుదును అని చెప్తున్నాడు అంటే తన ప్రజలకు తాను సమాధానమును తీసుకువచ్చెదనని ప్రజలకు యుద్ధ సంబంధమైన ఇతరములు అవసరంలేదని ఈ రాజు సమాధానమును స్థాపించునని చెప్తున్నాడు.

ఆయన పాలన సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు ఉండునని అతడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలకు, ఆయన సమాధానమును అనుభవించని ఏ ప్రదేశము కూడా భూమి మీద ఉండదని అర్ధం. ప్రతిఒక్కరిని కాపాడుటకు తిరిగి దేవునితో సమాధానానికి తెచ్చుటకు ఆయన వచ్చియున్నాడు.

అందరం మరణకరమైన యుద్దములో ఉన్నాం. ఆ యుద్ధము కూడా దేవునితో. ప్రతిఒక్కరు సాతానుని వెంబడిస్తూ పాపములో ఉన్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకముగా యుద్దములో ఉంటిమని పౌలు చెప్తూ ఉన్నాడు (ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు రోమా 8:7.) లోకసంబంధమైన పాప మార్గములను అనుసరించుట ఎంత మాత్రము తెలియనితనం కాదు, యీ లోకస్నేహము దేవునితో వైరమని యాకోబు చెప్తూవున్నాడు యాకోబు 4:4.

అయితే, విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము, రోమా 5:1 అనేమాటలు జెకర్యా చెప్పుచున్న దానిని ప్రతిబింబిస్తున్నాయి. యుద్ధము చెయ్యడానికి ఈ రాజైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ యుద్ధము ఇంతవరకు ప్రపంచానికి తెలియనంత భయంకరమైన మరణాంతకమైన యుద్ధం. ఈ యుద్దాన్ని యేసు గెలిచాడు. పాపాన్ని మరణాన్ని సాతానుని ఓడించుట ద్వారా మరణపాత్రమైన వాటి స్వాధీనమునుండి ఆయన మనలను కాపాడటమే కాకుండా ఆయన తిరిగి మనలను దేవునితో సమాధానపర్చాడు.

ఆ రాజు తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యము భూమి ఈ చివరినుండి ఆ చివరి వరకు నేడు విస్తరించబడి ఉంది. ఇక భయపడనవసరం లేదు మనం దేవుని కృప క్రింద ఉన్నాం. ఆయన అసాధారణ యుద్ధముతో మనం సమాధానంతో దేవుని దగ్గరకు తిరిగి వచియున్నాం. ఈ రాజును ఇప్పుడు ఇపుడు విశ్వాసముతో అంగీకరించండి, ఆమెన్.