పరిశుద్ధ లేఖనాలు ప్రపంచములోని అన్ని ఇతర పుస్తకాల కంటే భిన్నమైనవని, అవి దేవుని మాటలని నేను నమ్ముతున్నాను. (దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది అను 2తిమోతి 3:16,17 లేఖనమును బట్టి మరియు ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి అను 2పేతురు 1:21 లేఖనమును బట్టి దేవుని పరిశుద్దులైన గ్రంథకర్తలు పరిశుద్దాత్మ దేవుడు వారిని ప్రేరేపించిన రీతిగా లేఖనములను గ్రంథస్థము చేసియున్నారు కాబట్టే అవి దేవుని మాటలు). పరిశుద్దాత్ముని దైవావేశము అంటే, గ్రంథకర్తలు గ్రంథస్థము చెయ్యవలసిన అంశాల్ని, ఆలోచనల్ని, మాటల్ని దేవుడే వారిలోనికి ఉదియున్నాడని అర్ధము. కాబట్టే ద్వితీయోపదేశకాండము 4:2;12:32, నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు; నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు అని చెప్తూవున్నాయి.
లేఖనాల యొక్క అక్షరానుసరమైన ప్రేరణ అను సిద్ధాంతము “మానవ తర్కము కారణములపై” ఆధారపడి లేదు, అది లేఖనములపై మాత్రమే ఆధారపడియున్నదని నేను నమ్ముతున్నాను. (ఈ విషయాన్ని లేఖనాలు తెలియజేస్తూ, 2తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది; యోహాను 10:35 లేఖనము నిరర్థకము కానేరదు గదా; రోమా 3:2 ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను; 1 కొరింథీ 2:13 మనుష్య జ్ఞానము నేర్పుమాట లతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము, అని చెప్తూవున్నాయి).
పరిశుద్ధ లేఖనాలు దేవుని మాటలై యున్నవి గనుక, అవి ఎలాంటి తప్పులనుగాని వైరుధ్యాలనుగాని లేవని నేను నమ్ముతున్నాను, వాటి లోని ప్రతి భాగము ప్రతి మాట సత్యమని నేను నమ్ముతున్నాను. మత్తయి 5:18, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యోహాను 10:35 లేఖనము నిరర్థకము కానేరదు గదా; యోహాను 17:17 నీ వాక్యమే సత్యము. బైబిలులోని ఒక భాగము మరియొక భాగాన్ని వివరిస్తూవుందని నేను నమ్ముతున్నాను,1 కొరింథీయులకు 2:13మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
బైబులులోని భాగాలు చరిత్రను భౌగోళికపరమైన అంశాలను మరియు ఇతర లౌకిక సంబంధమైన వాటిని గురించి కూడా తెలియజేస్తూవున్నాయి.
పరిశుద్ధ లేఖనాలు యేసుని గూర్చి సాక్ష్యమిస్తు ఉన్నాయి. యోహాను 5:39, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
క్రైస్తవుల విశ్వాసానికి జీవితానికి ఇది మాత్రమే మార్గదర్శిగా ఉండటమే కాకుండా అందరికి నిత్య రక్షణను పొందే క్రమములో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి అవసరమైన వాటిని భోదిస్తూవుంది, (2 తిమోతికి 3:15 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము; లూకా 11:28, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను).
పరిశుద్ధ లేఖనాలు క్రైస్తవ సంఘ విశ్వాసానికి ఆధారముగా దేవుని ద్వారా ఇవ్వబడివున్నాయి, (క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడి యున్నారు ఎఫెసీయులకు 2:20). అందుకే క్రైస్తవ సంఘములో ప్రకటింపబడు అన్ని సిద్ధాంతాలకు పరిశుద్ధ లేఖనాలే మూలమై ఉన్నాయి, అందునుండే ప్రతి సిద్ధాంతము తప్పక తీసుకోబడాలి. కాబట్టే క్రైస్తవులందరిని మరియు ప్రతి సిద్ధాంతాన్ని లేఖనముల ద్వారానే పరీక్షించాలని మరియు తీర్పు తీర్చాలన్నదే ఏకైక ఆజ్జ్య లేక నియమము. దాని ప్రకారమే పరిశుద్ధ లేఖనాలను అవి చెప్తూవున్న సిద్ధాంతములను అర్ధం చేసుకోవలసి యున్నాము.
సైన్సుగా చెప్పబడుతూ వున్న ప్రతి సిద్ధాంతాన్ని నేను తిరస్కరిస్తూ ఉన్నాను. మన కాలములో ఇది సంఘములో చాల ప్రజాదరణను సంపాదించుకొనియున్నది. ఇది పరిశుద్ధ లేఖనాలలోని మాటలన్నీ దేవుని మాటలు కాదని కొన్ని భాగాలు దేవుని మాటలని కొన్ని భాగాలు మనుష్యుల మాటలని చెప్తూవుంది. అలా అంటే లేఖనాలు తప్పును కలిగి ఉన్నట్లే కదా. ఇలాంటి తప్పుడు బోధను ఘోరమైనది గాను దైవదూషణ గాను ఎంచి తిరస్కరిస్తూ వున్నాను. ఇది క్రీస్తుకు ఆయన అపోస్తులుల భోధలకు పూర్తి విరోధముగా ఉండటమే కాకుండా దేవుని వాక్యము మీద మనుష్యులను న్యాయ నిర్ణేతలుగా నియమిస్తూ క్రైస్తవ సంఘము యొక్క పునాదిని దాని విశ్వాసాన్ని కూలదోస్తూ ఉంది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.