తాము తమ వారసుల ద్వారా ఎప్పటికి జీవించి ఉంటామని ప్రాచీన కాలములో ఇశ్రాయేలీయులు నమ్మెడి వారు. వారి దృష్టి లో వంశాన్ని కొనసాగించడానికి కుమారులు లేకపోవడం శాపం. మనుష్యులు చనిపోయి మట్టిలో కలిసిపోతారని కొందరు భావించేవారు (ప్రసంగి 12:7, మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును; కీర్తన 104:29, నీవు వాటి ఊపిరి తీసివేయు నప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును; యోబు 7:9,10, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు). అయితే మృతుల ఆత్మలు ఏ అనుభూతులు లేని ఒక స్థలానికి చేరు కొంటాయని మరికొందరి నమ్మకం (ప్రసంగి 9:10, నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివి యైనను జ్ఞానమైనను లేదు). కొందరు మరణించకుండానే దేవునితో ఉండటానికి కొనిపోబడ్డారని కూడా బైబులు ప్రస్తావిస్తూ ఉంది (ఆదికాండము 5:24, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొని పోయెను గనుక అతడు లేకపోయెను; 2 రాజులు 2:11, ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణ మాయెను).

మంచివారైనా చెడ్డవారైనా సరే మృతులు తిరిగి లేస్తారని మంచివారు నిత్య జీవాన్ని చెడ్డవారు నిత్య శిక్షను అనుభవిస్తారని దానియేలు గ్రంథం తెలియజేస్తూ ఉంది (దానియేలు 12:1-3, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలమువరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు). తనను విశ్వసించే వారిని దేవుడు పాతాళానికి పంపడని, వారికి ఆయన నూతన జీవాన్నిస్తాడనే నమ్మకం కొన్ని కీర్తనలలో వ్యక్తమవుతూ ఉంది (కీర్తన 16:10,11, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియ జేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు; 49:13-15, స్వాతిశయ పూర్ణులకునువారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురువారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును; యెషయా 26:19, మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును).

క్రీ.పూ. 586లో ఇశ్రాయేలీయులు బబులోనుకు బందీలుగా వెళ్లారు. తర్వాత క్రీ.పూ. 538లో పారసీకరాజు బబులోనును జయించి ఇశ్రాయేలీయులు స్వదేశానికి తిరిగి వెళ్లే వీలు కల్పించాడు. సాతాను (దేవుని శత్రువు) ఓడిపోతాడని మృతులు తిరిగి జీవిస్తారని పారశీకులు నమ్మేవాళ్ళు. ఈ నమ్మకం యూదులను సైతం ప్రభావితం చేసింది. క్రీస్తు పుట్టుకకు నాలుగు వందల సంవత్సరాల పూర్వం వర్ధిల్లిన గ్రీకు తత్వం కూడా యూదులను బాగా ప్రభావితం చేసింది. గ్రీకు తత్వం దేహం అశాశ్వతమని అది క్షయమై పోతుందని అయితే దృగ్గోచరం కాని ఆత్మ నిరంతరం ఉంటుందని  భోదించేది.

క్రీస్తు అనుచరుల భౌతిక దేహాలు క్షయమై పోతాయని, దేవుడు వారిని లేపినపుడు వారి దేహాలు ఆత్మసంబంధ -మైన దేహాలుగా మారతాయని అపొస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు (1 కొరింథీయులకు 15:35-54, అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరి ఏ గింజ యైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చు చున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకు ను భేదము కలదు గదా మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమై నదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలీహనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడ ఉన్నది. ఇందు విషయమై–ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయెను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు. మంటినుండి పుట్టిన వాడెట్టివాడో మంటినుండి పుట్టిన వారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయత ను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి యున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొని నప్పుడు, – విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును). శరీరము నశించిన తర్వాత ఆత్మ మాత్రమే సజీవంగా ఉంటుందనే భావనకు ఇది భిన్నమైంది. ఆత్మ శరీరము రెండూ నూతనమై పునరుజ్జీవం పొందడమే నిత్య జీవమని పౌలు భావన. అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు అని యేసు కూడా అన్నాడు (యోహాను 11:25,26). తనను నమ్మిన వారికి తాను నిత్య జీవాన్ని ఇస్తానని యేసు వాగ్దానం చేశాడు (యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను). యూదుల్లోని సద్దూకయ్యులు పునరుత్థానము గురించి యేసుని ప్రశ్నించారు (లూకా 20:27, పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి). ఈ ప్రశ్నకు బదులుగా పునరుత్థానులైన దేవుని ప్రజలు పరలోకములో దేవదూతల్లా ఉంటారని యేసు వారికి చెప్పాడు (మార్కు 12:18-27, అందుకు యేసు–మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు. వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు). దేవుని రాజ్యములో ఎవరు ఉంటారని కూడా వారు యేసుని ప్రశ్నించారు. యేసు ఇచ్చిన జవాబును లూకా 14:15-24లో చూడండి. దేవుడు యేసును మృతులలో నుంచి తిరిగి లేపాడు గనుక దేవుని ప్రజలు కూడా తిరిగి ఇస్తారని ఆదిమ క్రైస్తవుల విశ్వాసం (అపొ.కార్య. 2:22-24, మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను; అపొ.కార్య. 2:29-32; 1 కొరింథీ 15:20-28, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింప బడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయన వారు బ్రదికింపబడుదురు. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచియుంచెను. సమస్తమును లోబరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును; 1 థెస్సలొనీ 4:13-17, సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము). నూతన యెరూషలేం దేవుని నివాసమని అక్కడ ఆయన తన ప్రజల మధ్య ఉంటాడని ఆయన వారిని నిత్యం కాపాడి పోషిస్తాడని ప్రకటన 21 అధ్యాయములో ఉంది. యెహెఙ్కేలు 37:26,27; మత్తయి 1:23; 2 కొరింథీ 4:16-5:5 కూడా చూడండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.