ధర్మశాస్త్రము
ప్రశ్న : దేవుడు తన ధర్మశాస్త్రమును ప్రజలందరికి ఎట్లు ఇచ్చాడు?
రోమా 2:14,15, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
ధర్మశాస్త్రములేని అన్యజనులకు మోషే ధర్మశాస్త్రము లేనందున దేవుడు వారిని శిక్షించడం న్యాయమేనా?
“స్వభావరీత్యా” అన్యులు వారి హృదయాలలో వ్రాయబడిన దేవుని సహజ జ్ఞానం ద్వారా నడిపించబడటం మూలాన్న, వారికి చంపడం, దొంగిలించడం, అధికారాన్ని, అగౌరవపరచడం, వ్యభిచరించడం, ఆశించడం మొదలగునవి తప్పు అని తెలుసు. దీని అర్థం వారికి దేవుని మొత్తం చిత్తం తెలుసని కాదు. నైతిక మార్గంలో క్రియలు చేయాలనే సహజ ప్రేరణ వారికి ఉన్నంత వరకు, ధర్మశాస్త్రసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచు, “వారు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.”
జవాబు: తన ధర్మశాస్త్రమును వారి హృదయముల యందు వ్రాయుట ద్వారా ప్రజలందరికి ఇచ్చాడు.(స్వాభావికమైన ధర్మశాస్త్రము)
ప్రశ్న : దేవుడు ఎందుకు ప్రతివానికి మనసాక్షిని కూడా ఇచ్చాడు?
రోమా 2:14,15, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పు చుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
అన్యులు తమ “ధర్మశాస్త్రసారము తమ హృదయాలపై వ్రాయబడి ఉన్నాయని” చూపించడానికి కారణం మనస్సాక్షి యొక్క చర్య. కొన్ని సహజ ప్రవర్తనా నియమాలు పాటించాలి, కొన్ని పనులు చేయాలి మరియు మరికొన్ని చేయకూడదు అనే సహజ భావనపై మనస్సాక్షి పనిచేస్తుంది. ఒక వ్యక్తి మనస్సాక్షి అతని క్రియలు నియమాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించినప్పుడు, అతడు తనను తాను సమర్థించుకోవడానికి మొగ్గు చూపుతాడు. అలాగే ఒక వ్యక్తి తన హృదయంలో వ్రాయబడిన చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నాడని తెలిసిన సందర్భాలు ఉంటాయి. అతడు చేయకూడనిదని తనకు తెలిసే చేస్తున్నాడనుకోండి, అప్పుడు అతని లోపల నుండి ఒక స్వరం అతనిని నిందిస్తూ పాపం చేశాడని అతనికి నమ్మకం కలిగిస్తుంది. అలాంటి వ్యక్తి “[దేవుని వ్రాతపూర్వక, బహిర్గత] చట్టం నుండి వేరుగా” పాపం చేసాడు, దేవుని ముందు దోషిగా ఉంటాడు, ఎందుకంటే అతడు ఉద్దేశపూర్వకంగా తెలిసే దేవుణ్ణి ధిక్కరించాడు. మనస్సాక్షి ద్వారా బలోపేతం చేయబడిన దేవుని చట్టం యొక్క సహజ జ్ఞానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అతను “ధర్మశాస్త్రానికి దూరంగా” పాపం చేసినట్లే, అతను “ధర్మశాస్త్రానికి దూరంగా” నశించిపోతాడు.
తీర్పు దినాన దేవుడు తీర్పు తీర్చేది “మనుష్యుల రహస్యాలు”. ప్రజలు తాము చెప్పే లేదా చేసే వాటి ద్వారా వాటిని మనకు స్పష్టం చేస్తే తప్ప మనం ప్రజల ఉద్దేశాలను చూడలేము, మనకు అవి రహస్యమే. ప్రజలు తమ హృదయాలలో భావించే దానికి మరియు వారు తమ చేతులతో చేసే దానికి దగ్గరి సంబంధం ఉంది, పౌలు చెప్తున్నట్లుగా, “ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసే వారందరూ ధర్మశాస్త్రం లేకుండా నశించిపోతారు మరియు ధర్మశాస్త్రం కింద పాపం చేసే వారందరూ ధర్మశాస్త్రం ద్వారా తీర్పు తీర్చబడతారు. ఎందుకంటే ధర్మశాస్త్రం వినే వారు దేవుని దృష్టిలో నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారే నీతిమంతులుగా తీర్చబడతారు.” దేవుని తీర్పు ప్రజల ఉద్దేశ్యాలు ఏమిటో, వారి జీవితాలలోని క్రియలు మరియు కార్యకలాపాలను చేయడానికి వారిని ప్రేరేపించిన వాటి ద్వారా నిర్ణయించబడుతుందని చెప్పడానికి ఇది మరొక మార్గం.
ధర్మశాస్త్రం వినడానికి మరియు దానిని పాటించడానికి మధ్య చాలా తేడా ఉంది. ఉదాహరణగా, హైవే పై వేగాన్ని గంటకు 55 మైళ్లకు పరిమితం చేయబడింది అనుకోండి. ఇది వాహనానికి ఆరోగ్యకముగా ఉండటమే కాకుండా, ఇది పెట్రోల్ మరియు ప్రాణాలను ఆదా చేస్తుంది. మీరు చట్టంతో ఏకీభవించడానికి ఆ విషయం మీకు తెలియజేయబడింది. మీకు తెలిసే ఉధ్దేశ్యపూర్వకముగా 55 జోన్‌లో గంటకు 70 మైళ్ల వేగంతో డ్రైవింగ్ చేస్తుంటే, చట్టానికి వ్యతిరేకముగా తిరగబడుతున్నారు, అది మీ నిర్ణయం.
జవాబు : దేవుని ధర్మశాస్త్రమునకు సాక్ష్యముగా ప్రతి వానిలో ఒక స్వరముగా ఉండులాగున ప్రతి వ్యక్తికి దేవుడు మనసాక్షిని ఇచ్చాడు.
ప్రశ్న : ఒక వ్యక్తి యొక్క మనఃసాక్షి ఎందుకని సంపూర్ణముగా ఆధారపడ తగినది కాదు?
రోమా 1:21,22, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయ మాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
దేవుని సృష్టిలో వారు నిజ దేవుని శాశ్వత శక్తిని ఆయన దైవిక స్వభావం యొక్క అదృశ్య లక్షణాలను చూడగలిగారు, కాని వారు ఆయనను దేవునిగా మహిమపరచడానికి నిరాకరిస్తున్నారు. అట్లే ప్రతి రోజు వారు అనుభవిస్తూవున్న ఆ దేవుని తాత్కాలిక ఆశీర్వాదాలను బట్టి వారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. తత్ఫలితంగా “వారి ఆలోచన వ్యర్థమైంది మరియు వారి మూర్ఖ హృదయాలు చీకటిగా మారాయి.”
తమ వాదములను వ్యర్ధమైనవిగా చేసుకొంటున్నది, వారి అవివేక హృదయమును అంధకారమయముగా చేసుకొంటున్నది వారేనని, వేరెవరు కాదని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే, వారు తాము జ్ఞానులమని చెప్పుకొంటూ, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చుకొన్నారు. తమ సహజమైన, పునర్జన్మ లేని స్థితిలో తాము ఏర్పరచుకొన్నవి మాత్రమే దేవుళ్ళని చెప్తూ బుద్ధిహీనముగా నిజదేవుని మహిమపరచకున్నారు ఆయనకు కృతజ్ఞతా స్తుతులను తెలియజేయుటకు నిరాకరిస్తున్నారు. దేవుడు ఎవరిని దుష్ట జీవనశైలికి “ప్రోగ్రామ్” చేయలేదు. దేవుని గురించిన తమ జ్ఞానాన్ని అణగద్రొక్కుతూ తమను తాము మూర్ఖులుగా చేసుకున్న వారి ఆలోచనల ఫలితం చెడు ఎంపికలు, చెడు చర్యలు.
ఎఫెసీయులకు 4:18,19, వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
అన్యుల సమస్య ఏమిటంటే, వారు నిజదేవునిని తమలోనున్న సహజ జ్ఞానము ద్వారా ఎరిగియున్నప్పటికిని ఆయనను నిరాకరిస్తూ ఉండటం మూలాన్న వారి మనస్సు అంధకారమయ్యింది. వారి బుద్ధిహీనతను బట్టి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుచేయబడి, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి (దేవుని గురించిన తమ జ్ఞానాన్ని అణగ ద్రొక్కుతూ తమను తాము మూర్ఖులుగా చేసుకున్న వారి ఆలోచనల ఫలితం చెడు ఎంపికలు, చెడు చర్యలతో) నడుచుకొనుచున్నారని పౌలు ఆరోపిస్తున్నాడు. పునర్జన్మ లేకపోవడాన్ని బట్టి తప్పుడు విలువల సమితితో తప్పుడు ఆలోచనతో, వారు తప్పుడు చర్యలకు పాల్పడటం సహజమే. అంతేకాదు వారు సిగ్గు లేకుండా (మనఃసాక్షిని మొద్దుబార్చి) అత్యాశతో వారి జీవనశైలిలో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం అనైతిక మార్గాల్లో తమను తాము ఇంద్రియాలకు అప్పగించుకున్నారు/చిక్కుకున్నారు.
జవాబు 1: ఒకని మనఃసాక్షి పాపమును బట్టి మొద్దుబారుటచే అతడు పాపము చేయునప్పుడు అది అతనిని ఏ మాత్రమును బాధించదు గనుక ఒకని మనఃసాక్షి సంపూర్ణముగా ఆధారపడ తగినది కాదు.
1 కొరింథీయులకు 8:7, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.
మన అవయవాలలో కన్ను చాలా సున్నితమైనది మృదువైనది అని చెప్పబడింది, అది దుర్వినియోగాన్ని సహించలేదు, బలహీనమవుతుంది, అపవిత్రమవుతుంది. కాని మనస్సాక్షి అంతకంటే చాలా మృదువైనది మరియు సున్నితమైనది.
బలి మాంసం తినడం సరైనదేనా అనే విషయములో అనిశ్చితి ఉన్నప్పుడు లేదా అలా చేసినందుకు పశ్చాత్తాపపడు తున్నప్పుడు సున్నితము మృదువైన మనస్సాక్షి “అపవిత్రం” అవుతుంది, బలహీనపడుతుంది.
విగ్రహం వట్టిదని, విగ్రహాలకు బలి ఇచ్చిన మాంసంలో వారు పాలుపంచుకున్నప్పటికీ, వారు విగ్రహారాధనలో పడిపోయే ప్రమాదం ఉండదని క్రైస్తవులైన వారందరికీ తెలుసు. కాని కొందరు ఈ విషయంపై అజ్ఞానంగా ఉన్నారు. వారు ఒక విగ్రహానికి నిజమైన ఉనికి ఉందని భావించడం ఒక కారణమైతే, ఆ మాంసంలో పాలుపంచుకోవడం అన్యుల మూఢనమ్మకంలో వారిని ధృవీకరించడమే అనేది రెండవ కారణం. అన్యులు క్రైస్తవ మతంలోకి మారినప్పటికిని వారి పూర్వ భావనలు, అభిప్రాయాలు మరియు మూఢనమ్మకాల భావాలు వారిని త్వరగా వదిలిపెట్టవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పూర్వ భావనలు, అభిప్రాయాలు మరియు మూఢనమ్మకాల భావాలను అధిగమించలేక పోవడాన్ని బట్టి ఒకని మనఃసాక్షి బలహీనమవుతుంది, అపవిత్రమవుతుంది.
కొందరు బలమైన క్రైస్తవులు మాంసం తినడం అనే తమ హక్కును వదులుకోకుండా, విగ్రహము వట్టిదని ఎంచి బలి మాంసమును తింటూ వారి క్రైస్తవ స్వేచ్చకు నిదర్శనంగా ఆ విషయాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి గిల్టీ తో తింటున్నారు. వీళ్ళు తమ క్రైస్తవ స్వేచ్ఛను వినియోగించుకొంటూ తినకుండా స్టాండ్ తీసుకోవచ్చు. అది అంత ముఖ్యమైన విషయమేమి కాదు. భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము. ఇది ఎంపికకు సంబంధించిన విషయం. కొందరు బలి మాంసం తిని బలహీన క్రైస్తవులను ఎందుకు బాధపెట్టాలి? తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.
రోమా 14:2, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూరగాయలనే తినుచున్నాడు.
క్రైస్తవులైన యూదులు మరియు క్రైస్తవులైన అన్యులు ఇద్దరూ తమ స్వంత యోగ్యత లేదా సహకారాన్ని జోడించకుండా, యేసుక్రీస్తును తమ ఏకైక రక్షణగా చూశారు. అందువల్ల, వాస్తవానికి, వారు దేవుని ముందు సంపూర్ణంగా ఒకటిగా ఉన్నారు. కాని వారి ఐక్యతకు కేంద్రంగా పనిచేసిన ఈ అతి ముఖ్యమైన సిద్ధాంతానికి బయట, సాంస్కృతిక జాతిపరమైన భేదాలు వారి మధ్యలో ఉన్నాయి. ఈ తేడాలు వారి మధ్య నిజమైన ఆధ్యాత్మిక ఐక్యతకు అడ్డంకి కాలేదు, కాని సాధారణ, దైనందిన సంఘ జీవితంలో, ఈ తేడాలను పరిష్కరించుకోవాలి మరియు పరిష్కరించాలి.
శతాబ్దాలుగా యూదులు దేవుని పాత నిబంధన ఆచార నిబంధనల క్రింద జీవిస్తున్నారు. ఇది పవిత్రమైన అపవిత్రమైన ఆహారాల మధ్య తేడాను స్పష్టంగా తెలియజేస్తూవుంది. ఉదాహరణకు, పంది మాంసం తినడం నిషేధించబడింది. అయితే, ఈ పాత నిబంధన వాగ్దానం చేయబడిన మెస్సీయ వచ్చే వరకు మాత్రమే యూదు జాతిపై దేవుడు విధించిన బోధనా సాధనం (కొలొస్సయులు 2:16, 17, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది). కొత్త నిబంధన రాకతో, ఈ నిబంధనలకు యూదులు ఇకపై కట్టుబడి ఉండనక్కరలేదు. కాని క్రైస్తవులుగా మారిన యూదులు కొత్త నిబంధనను తెలుసుకుని అర్థం చేసుకున్నప్పటికీ, వారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంత సులభం కాదు.
అన్యులు ఎప్పుడూ ఆచార నియమాల క్రింద లేరు. వారు ఎప్పుడూ పంది మాంసం తినేవారు. కాని ఇప్పుడు వారు యూదు క్రైస్తవుల సమక్షంలో అలా చేయడం లేదా “అపవిత్రమైన” ఆహారాలతో సహా భోజనంలో చేరమని యూదులపై ఒత్తిడి తీసుకురావడం వారి సంఘ సంబంధాలను దెబ్బతీసేది. ఇలాంటి సందర్భాలలో, అన్యులు ఏదైనా మరియు ప్రతిదీ తినడం ద్వారా క్రైస్తవ స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆహారము విషయములో అన్యులైన క్రైస్తవులు ఇప్పటికీ రిజర్వేషన్లు ఉన్న యూదు క్రైస్తవుల కంటే ఎక్కువ పరిణితి చెంది మాట్లాడే విధంగా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆహరం తప్ప రక్షించే విశ్వాసం ఉండటం లేదా లేకపోవడం కాదు. పౌలు అలాంటి పరిస్థితిని సంగ్రహంగా ఇలా అన్నాడు, “ఒక వ్యక్తి విశ్వాసం అతన్ని ప్రతిదీ తినడానికి అనుమతిస్తుంది, అట్లే విశ్వాసం బలహీనంగా ఉన్న మరొక వ్యక్తి కూరగాయలను మాత్రమే తింటాడు.”
జవాబు 2: ఒకని మనఃసాక్షి దేవుని వాక్యము పాపమని చెప్పని దానిని కూడా పాపమని వానికి చెప్పవచ్చును గనుక ఒకని మనఃసాక్షి సంపూర్ణముగా ఆధారపడ తగినది కాదు.
ప్రశ్న : ఎందుకు, అప్పుడు, దేవుడు తన ధర్మశాస్త్రమును మనకు రెండవసారి నిర్దిష్టమైన రీతిలో ఇచ్చాడు?
రోమా 7:7, ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
పాపపు స్వభావము వలన ప్రేరేపింపబడిన పాపపు కోరికలు మరణానికి ఫలాన్నిస్తాయి తప్ప, దేవుని ధర్మశాస్త్రం పాపానికి కారణం కానే కాదు. దేవుని చిత్తం పట్ల ప్రజలను అప్రమత్తం చేయుట ద్వారా వారు చెడు ఏమిటో తెలుసుకుని, దానిని నివారించగలిగేలా చెయ్యటమే ధర్మశాస్త్రం యొక్క ఉపయోగకరమైన విధి. కాబట్టే ఆయన రెండవసారి అందరూ తన చిత్తాన్ని తెలుసుకొనులాగున నిర్దిష్టమైన రీతిలో వ్రాతపూర్వకంగా ఇచ్చాడు.
రోమా 2:18, ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేప్ఠమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా?
జవాబు : ఆయన చిత్తమేమైయున్నదో పరిపూర్ణముగా మనమెరుగునట్లు దేవుడు తన ధర్మశాస్త్రమును మనకు రెండవ సారి నిర్దిష్టమైన రీతిలో ఇచ్చాడు.
ప్రశ్న : దేవుడు తన ధర్మశాస్త్రమును మనకు దయచేసి రెండవ నిర్దిష్టమైన రీతి ఏది?
నిర్గమ కాండము 20. (దేవుడు ధర్మశాస్త్రమును సీనాయి పర్వతము వద్ద ఇచ్చాడు.)
ద్వితీయోపదేశకాండము 5:22, ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.
యోహాను 1:17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను.
రోమా 13:8-10. (ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చుటకుగాను దేవుడు మనలను కోరుచున్నాడను దానిని గూర్చి పౌలు వ్రాయుచున్నాడు).
జవాబు: దేవుడు తన ధర్మశాస్త్రమును బైబులు నందు లిఖింపజేయుట ద్వారా దానిని రెండవ నిర్దిష్టమైన రీతిలో మనకు దయచేసాడు. (లిఖింపబడిన ధర్మశాస్త్రము)
ధర్మశాస్త్ర సారాంశము
ప్రశ్న : దేవుడు మనకు బైబులు నందు దయచేసి ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశమేది?
ద్వితీయోపదేశకాండము 5:1-22. ప్రత్యేకముగా 22వ వచనము: ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.
ద్వితీయోపదేశకాండము 10:4,5, ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
జవాబు : దేవుడు తన ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశముగా పది ఆజ్ఞలను మనకు దయచేసాడు.
మోషే యొక్క ధర్మశాస్త్రము
సీనాయి పర్వతము మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మూడు రకములైన ధర్మశాస్త్ర నియమములను యిచ్చి యున్నాడు.
మొదటిగా, ఆయన వారిని ఒక జనాంగముగా పరిపాలించుట కొరకు పౌర సంబంధమైన ఆజ్ఞలను యిచ్చి యున్నాడు. ఉదాహరణకు: ఒకనిని గాయపర్చినను లేక ఒకనికి నష్టము కలుగజేసినను అట్టి నేరములకు శిక్ష విధించుటకుగాను పౌర సంబంధమైన ధర్మశాస్త్రము నియమింపబడింది (నిర్గమ కాండము 21:22 చూడండి, నరులు పోట్లాడుచుండగా గర్భవతియైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రాని యెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను).
రెండవదిగా, దేవుడు ఇశ్రాయేలీయులకు శుద్ధికరణాచార సంబంధమైన ఆజ్ఞలను కూడా యిచ్చియున్నాడు. ఇందులో ఇశ్రాయేలీయులు తమ దేవునిని ఎప్పుడు, ఎక్కడ, ఏవిధముగా ఆరాధించాలో చెప్పబడింది. యాజకులకు, బలులకు, సబ్బాతు దినములకు, ప్రత్యక్ష గుడారమునకు సంబందించిన నియమాలు ఛాయలుగా, చిత్రములుగా, వాగ్దానము చేయబడిన మెస్సయ్యను సూచించుచు సేవించుటకు ఇవ్వబడింది.
మూడవదిగా, దేవుడు నీతి సంబంధమైన ఆజ్ఞలను కూడా ఇశ్రాయేలీయులకు యిచ్చియున్నాడు. సృజించి నప్పుడే అన్ని కాలాలలో ప్రజలందరి కొరకైన దేవుని చిత్తమై ఉండులాగున మానవుని హృదయములో దేవుడు నీతి సంబంధమైన ఆజ్ఞలను లిఖించాడు. దేవుడు నీతి సంబంధమైన ధర్మశాస్త్రమును ఇశ్రాయేలు ప్రజల కొరకు పది ఆజ్ఞల రూపములో ఇచ్చాడు. ఈ పది ఆజ్ఞలలో ప్రజలందరి కొరకైన ఆయన పరిశుద్ధ చిత్తము ప్రత్యేకమైన రీతిలో యెట్లు అన్వయింపబడునను దానిని ఆయన ఎన్నుకొనిన ప్రజలుగా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేశాడు.
దేవుడు క్రొత్త నిబంధనలో సీనాయి పర్వతము మీద మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఇకను వర్తించదని స్పష్టముగా తెలియచేసాడు (కొలొస్సి 2:16,17, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములో నైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశ మియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది; గలతి 3:23-25, విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము; 5:1, ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి).
అలాగైతే ఎందుకు మనము పది ఆజ్ఞలను ఉపయోగిస్తూ ఉన్నాం? ఎందుకంటే, పది ఆజ్ఞలు దేవుని నీతి సంబంధమైన ధర్మశాస్త్ర రూపమును, ప్రజలందరి కొరకైన ఆయన పరిశుద్ధ చిత్తమునై ఉన్నాయి. గుర్తు చేసుకోండి పాతనిబంధనలో పౌర మరియు శుద్ధికరణాచార సంబంధమైన ఆజ్ఞలు ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే దేవుని చేత ఇవ్వబడి యున్నాయి. ఈ కారణాన్ని బట్టి, పది ఆజ్ఞలలోని ప్రాముఖ్యమైన సారంశము క్రొత్త నిబంధనలో అవే మాటలలో కాకుండా లేక సీనాయి పర్వతము మీద దేవుడిచ్చిన అదే క్రమములో కాకుండా తిరిగి చెప్పబడి ఉన్నాయి, (మత్తయి 19:18, యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము; రోమా 13:8-10, ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే; గలతి 5:19, శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము).
సీనాయి పర్వతము మీద ఇవ్వబడిన పది ఆజ్ఞల క్రమాన్ని ఉపయోగించుటకు లూథరు ఎన్నుకొన్నాడు ఎందుకంటే దేవుని నీతి సంబంధమైన ఆజ్ఞలు సులభ సారాంశ క్రమములో ఇక్కడ మనము బైబులునందు కలిగియున్నాము. దేవుని నీతిసంబంధమైన ఆజ్ఞలను పిల్లలకు భోదించుటకు ఈ విధానము సులభముగా ఉండునని అతడు తలంచాడు. అందుకే మోషే పది ఆజ్ఞ్యల విషయమై వాడిన మాటలను మనము వాడుతున్నాము. కాని ఈ మాటలు ప్రత్యేకమైన విధానములో దేవుడు నీతి సంబంధమైన ఆయన ఆజ్ఞల యొక్క సారాంశమును పాత నిబంధన ప్రజలకు ఇచ్చియున్నాడని మనము మనసులో ఉంచుకొనవలసి యున్నది. విశేషముగా దీనిని మనము మూడవ ఆజ్ఞను చదువునప్పుడు జ్ఞపకముంచుకోవలసియున్నది.
ప్రశ్న : దేవుని ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశము ఏమై యున్నది?
మత్తయి 22:37-40, అందుకాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
రోమా 13:9,10, ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
జవాబు : “నీ దేవునిని నీ పొరుగువానిని ప్రేమించుము” అనునది దేవుని ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశమై యున్నది.
ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట
ప్రశ్న : నీ దేవుడైన యెహోవాను నేనే (నిర్గమ కాండము 20:2) అను మాటలతో ఆయన తన ఆజ్ఞలను మనకు పరిచయము చేస్తున్నపుడు దేవుడు ఏ విషయాన్ని మనకు జ్ఞపకం చేస్తూ ఉన్నాడు?
కీర్తనలు 95:6,7, ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
యెషయా 43:11, నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.
1 యోహాను 4:8,9, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
జవాబు : ఈ మాటలతో తన ఆజ్ఞలను దేవుడు మనకు పరిచయము చేయునప్పుడు మన ప్రియమైన సృష్టికర్త మరియు రక్షకుడై యున్నవాడు ఈ ఆజ్ఞలను మనకు ఇచ్చియున్నాడని ఆయన మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.
ప్రశ్న : మన ప్రియమైన సృష్టికర్త మరియు రక్షకుడైయున్నవాడు మనకు ఈ ఆజ్ఞలను ఇచ్చియున్నాడని దేవుడు మనకు ఎందుకని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు?
1 యోహాను 4:19, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
ఎఫెసీయులకు 5:1,2 కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి……ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
1 యోహాను 5:3 మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
కీర్తన 119:47, నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.
జవాబు : మనము ఆయన ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా సంతోషముతో లోబడాలని దేవుడు వీటిని మనకు జ్ఞ్యాపకం చేస్తున్నాడు.
ప్రశ్న : దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట మనలను బానిసలుగా చేస్తుందని మన జీవితాలలో నుండి ఉల్లాసమంతటిని తీసివేస్తుందని తలంచుట ఎందుకని తప్పై ఉన్నది?
కీర్తన 19:7,8,11 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
కీర్తన 119:14, 35, 45 సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు
చున్నాను. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము. నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును.
మత్తయి 5:3-10, (దేవుని చిత్తమునకు విధేయత చూపుటే నిజమైన సంతోషమునకు మార్గమై యున్నదని ధన్యతలలో యేసు తెలియజేసాడు.)
ఆదికాండము 3:1-6, (దేవుని ఆజ్ఞను ఉల్లంగించుట సంతోషము తెస్తుందని తలంచునట్లుగా సాతాను హవ్వను మోసగించాడు.)
యోహాను 8:34, అందుకు యేసు– పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
జవాబు : దేవుని ఆజ్ఞలు మన జీవితాలలో జ్ఞానానికి స్వాతంత్య్రానికి సంతోషానికి మార్గాన్ని చూపెడుతూ ఉన్నాయి కాబట్టి అవి మనలను బానిసలుగా చేయునని తలంచుట తప్పు.
ప్రశ్న : ఆయన ఆజ్ఞలకు మనమెట్లు విధేయత చూపవలెనని దేవుడు కోరుచున్నాడు?
మత్తయి 5:48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
1 పేతురు 1:14-16, నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది…… మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
జవాబు : ఆయన ఆజ్ఞలకు మనము పరిపూర్ణ విధేయులుగా ఉండవలెనని కోరుచున్నాడు.
ప్రశ్న : దేవుని ఆజ్ఞలకు పరిపూర్ణముగా విధేయత చూపుటలో మనం ఎప్పుడు తప్పిపోతూ ఉన్నాం?
యాకోబు 4:17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును.
జవాబు : దేవుడు చెప్పినది మనం చేయనప్పుడు మనం ఆయన మాటలకు పరిపూర్ణముగా విధేయత చూపడంలో తప్పిపోతూ ఉన్నాం. (చెప్పినది చెయ్యకపోవడం అనే పాపం)
లేవీయకాండము 5:17, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును.
1 యోహాను 3:4, పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
జవాబు : దేవుడు నిషేదించిన వాటిని మనం చేసినప్పుడు మనం పరిపూర్ణముగా విధేయత చూపడంలో తప్పిపోతూ ఉన్నాం. ( చేయవద్దని చెప్పిన దానిని చేయుట అనే పాపము)
ప్రశ్న : దేవుని ఆజ్ఞలకు పరిపూర్ణముగా విధేయుడైన వాడెవడు?
రోమా 3:12, అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
హెబ్రీయులకు 4:14,15 ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు ……..సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
జవాబు : దేవుని ఆజ్ఞలకు యేసు ఒక్కడే పరిపూర్ణముగా విధేయుడిగా ఉన్నాడు
ధర్మశాస్త్రము యొక్క ఉదేశ్యము
ప్రశ్న : దేవుని ధర్మశాస్త్రము ప్రజలందరి బాహ్య జీవితాలలో ఏ ఉద్దేశ్యమును నెరవేరుస్తూ ఉంది?
1 తిమోతికి 1:11 ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును, హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండినయెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని, నీతిమంతునికి నియమింపబడలేదు.
రోమా 2:14, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.
కీర్తన 119:120, నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
ద్వితీయోపదేశకాండము 4:24, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.
జవాబు : దేవుని ధర్మశాస్త్రము ప్రజలందరి దుష్టక్రియలను అదుపులో ఉంచుట ద్వారా లోకములో క్రమమును సంరక్షించుటకు సహాయపడుచున్నది. (ధర్మశాస్త్రము ఒక హద్దు వలె)
ప్రశ్న : దేవుని ధర్మశాస్త్రము ప్రజలందరి హృదయములలో ఏ ఉద్దేశ్యముతో పనిచేస్తూ ఉంది?
రోమా 3:19,20 ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పు చున్నదని యెరుగుదుము….. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
రోమా 7:7 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
లూకా 18:13, అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
జవాబు : దేవుని ధర్మశాస్త్రము ప్రజలందరి పాపమును మరియు వారికీ రక్షకుని యొక్క అవసరతను చూపుతూ ఉంది. (ధర్మశాస్త్రము అద్దము వలె)
ప్రశ్న : దేవుని ధర్మశాస్త్రము పాపలోకమందు జీవించుచున్న క్రైస్తవులకు కూడా ఏవిధముగా ఉపయోగపడుతూ ఉంది?
2 కొరింథీయులకు 5:15 జీవించు వారిక మీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
రోమా 12:1, 2, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
కీర్తన 119:9, యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?
కీర్తనలు 119:105, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
జవాబు : దేవుని ధర్మశాస్త్రము, దేవునికి ఇష్టమైన జీవితమును జీవించుమని పాపలోకము చేత చుట్టబడియున్న క్రైస్తవులకు చెప్తూవుంది. (ధర్మశాస్త్రము మార్గదర్శిగా)