చనిపోయినవాళ్లు దెయ్యాలుగా అవుతారా? బైబిల్ ఏం చెప్తుంది?
ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ప్రసంగి 12:7ని బట్టి “మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును” అను మాటలను బట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, శరీరం మరియు ఆత్మ వేరు చేయబడతాయి అని తెలుస్తూవుంది. అట్లే హెబ్రీయులు 9:27ని బట్టి “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” అంటే శరీరము నుండి వేరుపడిన ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది వెంటనే దేవుని తీర్పు ఉంటుంది అని తెలుస్తూవుంది. మరణించిన తరువాత జీవం లేని శరీరం మాత్రమే ఈ భూమిపై ఉంటుంది. లూకా 16:19-31ని బట్టి దేవుని తీర్పు తరువాత ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఉంటుందని అక్కడి నుండి వెనుకకు రాదని అంటే చనిపోయిన వారు తిరిగి ఈ లోకానికి దెయ్యాలుగా రారని అలా వచ్చే ఛాన్స్ లేదని బైబులు చెప్తూవుంది.
మరి చనిపోయిన వాళ్ళు వెనుకకు వచ్చే ఛాన్స్ లేనప్పుడు కొన్నిసార్లు మనకు బాగా పరిచయమున్న మన పరిసరాలలో అక్కడ ఎవరో ఉన్నట్టు మనలను ఎవరో చూస్తున్నట్లు అనిపించడమే కాకుండా వెంటనే భయం వేస్తుంది రోమాలు పైకిలేస్తాయి, కొందరికి కొన్ని రూపాలు కూడా కనిపిస్తూవుంటాయి. మరికొందరికి మరణించిన వారి కుటుంబ సభ్యులు కనిపించొచ్చు, ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని. మరికొందరు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఏదో వాళ్ళని నొక్కిపెట్టినట్టు, వాళ్ళు లేవాలని ప్రయత్నించినా లేవలేకపోయినట్లు కేకలు వెయ్యడానికి ప్రయత్నించినా వెయ్యలేక పోయినట్లు అనుభవించిన సంఘటనల గురించి చెప్తుంటారు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో ఉండొచ్చు, మరి వీటిని ఎలా వివరిధ్ధాం. వ్యక్తులకు ఎదురైయే పారానార్మల్ అనుభవాలను సాతానుకు వాని దూతలకు ఆపాదించవచ్చు.
అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి అని ప్రకటన12:9 చెప్తూవుంది. వీళ్ళందరూ సాతాను నాయకత్వము క్రింద గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నారని 1 పేతురు 5:8 చెప్తూవుంది. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు అని యోహాను 8:44 చెప్తూవుంది. ఈ మాటలకు, సాతాను తన శక్తులను అబద్ధం చెప్పడానికి ఉపయోగిస్తాడని మరియు మనుష్యులను నిజదేవుని నుండి దూరపరచడానికి మరియు వారి నిత్యజీవాన్ని దోచుకోవడానికి వారిని నాశనము చెయ్యడానికి ప్రయత్నిస్తాడని అర్ధం. గనుకనే మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము అని ఎఫెసీయులకు 6:12లో చెప్తూవుంది. మనకు హాని కలిగించటానికి ప్రయత్నించే ఈ దురాత్మల సమూహములతో అందరూ ఇక్కడ పోరాడుతూ ఉన్నారని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే మనుష్యులకు ఎదురైయే పారానార్మల్ అనుభవాలను సాతానుకు వాని దూతలకు బైబులు ఆపాదిస్తూవుంది.
ఎందుకంటే మనుష్యులలో ఉన్న జెనెటిక్స్, బ్రెయిన్ కెమిస్ట్రీ, ట్రామా, స్ట్రెస్ అనే వాటి ద్వారా ఒక వ్యక్తియొక్క ఆలోచనలు మరియు భావాలను సాతాను వాని దూతలు నియంత్రిస్తూ మనుష్యులను పారానార్మల్ అనుభవాల ద్వారా అబద్దాలను నమ్మేటట్లు చేస్తూ ఒకని నిత్యత్వపు స్థితిని (స్వర్గమా నరకమా) నిర్ణయించడానికి ప్రయత్నిస్తూవున్నాయి. నయానో భయానో వీటి తంత్రాలకు లోబడిన ప్రజలు దేవుని కృపను తృణీకరిస్తూ తమ స్వార్ధ ప్రయోజనాల నిమిత్తము తమ్మును తాము సంతృప్తిపరచుకొనే క్రమములో వీటిని నమ్ముతూ విభజింపబడియున్నాము.
మనకు దాని గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా, సాతాను మన శత్రువండి. వాడు దేవుణ్ణి మరియు దేవుని ప్రజలందరిని వ్యతిరేకిస్తూవున్నాడు. ఈ భూమ్మీద ఉన్న ప్రతి చెడు పథకం వెనుక వాడు ఉన్నాడు. ఆరాధించబడాలని వాడు తహతహలాడుతున్నాడు, పూజింపబడాలనే వాడి దురాశే దీనంతటికి కారణం. వాడు దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. అలాగే తన సమయం పరిమితం అనే సంగతి వాడికీ తెలుసు.
కాని సాతాను ఒక ఓడిపోయిన శత్రువండి. ఆదికాండము 3:15లో దేవుడు చేసిన ప్రవచనం ప్రకారం యేసు తన విమోచన కార్యము ద్వారా, సాతానుని తలను నలుగగొట్టియున్నాడు. వానికి పరిధి నిర్ణయింపబడింది. వానికి వాని దూతలకు శిక్షావిధి సమీపించియున్నది. ప్రకటన 20:7-10 ప్రకారము ప్రజలను మోసపరచిన అపవాది వాని దూతలు వాడి తంత్రములో చిక్కుబడి వానిని నమ్మి వానిని వెబడించిన వాళ్ళు అగ్ని గంధకములు గల గుండములో చివరకు పడవేయబడతారని వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడతారని బైబులు చెప్తూవుంది.
కాబట్టే ఎఫెసీయులకు 6:16 ఆ క్షణం వరకు మనం సాతానుకు వ్యతిరేకంగా ఆయుధధారులమై పోరాడవలసియున్నామని చెప్తూవుంది. సాతాను వాని దూతలతో పోరాటమా అని భయపడకండి, యేసుని శక్తి, వాగ్దానములను బట్టి మనమందరం అపవాదిపై పైచెయ్యిని కలిగియున్నామని యాకోబు 4:7లో బైబులు చెప్తూవుంది.
ఈ సమాచారంతో ఇప్పుడు మీరు మీ స్వంత ప్రశ్నలను మరియు ఇతరుల ప్రశ్నలను పరిష్కరించగలరని నేను ఆశిస్తున్నాను.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.