తీతుకు పరిచయం
కొత్త నిబంధనలోని 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు వ్రాసిన పత్రికలు పాస్టర్ ని గురించి సమాచారాన్ని కలిగివున్నాయి కాబట్టి వాటిని పాస్టోరల్ పత్రికలుగా పిలుస్తారు. “పాస్టోరల్స్” అనే పదాన్ని 1703లో DN బెర్డోట్ మరియు 1726లో పాల్ ఆంటోన్ ప్రచారం చేశారు. కొత్త నిబంధనలోని పాస్టోరల్ పత్రికల్లో, తీతుకు రాసిన పత్రిక మూడవది. తీతు యొక్క చారిత్రక నేపథ్యం మరియు తిమోతీకి వ్రాసిన రెండు పత్రికల గురించి పూర్తి వివరణ కోసం, పౌలు యొక్క పాస్టోరల్ పత్రికల్లో సాధారణ పరిచయం క్రింద ప్రత్యేకించి “చారిత్రక నేపథ్యం” అనే విభాగాన్ని చదవండి.
రచయిత
పౌలు (1:11).
గ్రహీత
ఈ లేఖ తీతును ఉద్దేశించి వ్రాయబడింది (1:4). ఈ లేఖ గ్రహీత అయిన తీతు, అపొస్తలుల కార్యములలో ప్రస్తావించబడ లేదు, పౌలు పత్రికల్లో మాత్రమే 13 సార్లు ప్రస్తావించబడ్డాడు. ఈ పత్రికను తీతుకు సంబోధించడంతో పాటు, గలతీయులకు, 2 కొరింథీయులకు మరియు 2 తిమోతిలో పౌలు అతనిని సూచించాడు. తీతు గ్రీసు దేశస్థుడు పుట్టుకతో అన్యజనుడు, గలతీ 2:3. అతడు ఏ ప్రావిన్స్ లేదా నగరం నుండి వచ్చాడో లేదా అతడు ఎప్పుడు మార్చబడ్డాడో మనకు తెలియదు. పౌలు తీతును “మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు” (తీతు 1:4) అని పిలుస్తున్నాడు కాబట్టి, అతడు పౌలు ద్వారా క్రైస్తవత్వములోనికి కన్వెర్ట్ అయిన వారిలో నిస్సందేహంగా ఒకడు. పౌలు తన మిషనరీ ప్రయాణాలకు ముందు ఒక సంవత్సరం మొత్తం అంతియొకయలో పనిచేశాడు (అపొ. కార్య. 11:26) కాబట్టి తీతు అంతియొకయ వాడుయై ఉండొచ్చు అని కొందరు అంటారు.
కొందరు యూదయనుండి వచ్చి–మీరు మోషే . నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొంద లేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి, అపొ. కార్య. 15:1,2. పౌలు యెరూషలేము నాయకులతో ఈ వివాదమును గురించి చర్చించడానికి అంతియొకయ నుండి బయలుదేరినప్పుడు, పౌలు తీతును తన వెంటబెట్టుకొని బర్నబాతో కూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని అని చెప్తూ “అయినను నాతో కూడ నున్న తీతు గ్రీసు దేశస్థుడునైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు” అని రక్షణకు సున్నతి అవసరం లేదనుటకు తీతును సజీవ రుజువుగా, ఉదాహరణగా పౌలు అతనిని తన వెంట తీసుకెళ్లాడు, గలతీ 2:1, 3. సున్నతి లేకుండా క్రైస్తవుడిగా (అన్యజనుడైన) తీతును అంగీకరించడం అక్కడ పౌలు యొక్క వైఖరిని సమర్థించింది.
తరువాతి సంవత్సరాలలో, అపొస్తలుడి విలువైన సహోద్యోగిగా తీతు పేర్కొనబడ్డాడు. తీతు పౌలుకు విలువైన నమ్మకమైన సహచరుడిగా, పరిచర్యలో గణనీయమైన సహాయకునిగా ఉన్నాడు. పౌలు మూడవ మిషనరీ ప్రయాణంలో ఎఫెసస్‌లో ఇతడు పౌలుతో కలిసి పనిచేశాడు. పౌలు కొరింథీయన్ చర్చికి తన మొదటి ఉత్తరాన్ని వ్రాసి ఇతని ద్వారా పంపియుండొచ్చు. ఈ సంఘం పట్ల అతనికున్న ప్రేమపూర్వక శ్రద్ధ, ఆ సంఘాలలోని పరిస్థితులకు సంబంధించిన నమ్మకమైన సమాచారాన్ని పొందే ఉద్దేశ్యంతో మరియు కొరింథీ సంఘంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి పౌలు తీతును గ్రీస్‌లోని కొరింథీకి పంపేలా అతనిని ప్రేరేపించింది, అతడు పంపబడ్డాడు. ఇది చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన మిషన్, ఇది అపొస్తలుడిని చాలా లోతుగా ప్రభావితం చేసింది. కొద్దికాలానికి తీతును కలుసుకోవాలనే ఆశతో అతడు త్రోయస్ వరకు ప్రయాణించాడు, అక్కడికి తీతు వచ్చి కలుస్తాడని ఆశించాడు (2 కొరింథీ 2:12,13). తీతు అక్కడ పౌలుకు కనిపించనందున, పౌలు మాసిదోనియకు వెళ్లాడు, అక్కడ అతడు కొరింథీలో తీతు పరిచర్య విజయవంతమైందను అనుకూలమైన నివేదికను తీతు నుండి అందుకున్నాడు (2 కొరింథీ 7:6,7,13,14). పౌలుకు నివేదించిన తర్వాత, తీతు యెరూషలేములో పేదల కోసం సేకరణను కొనసాగించడానికి మరియు వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి కొరింథీకి తిరిగి వచ్చాడు (2 కొరింథీ 8:6,16,17; 12:18). తన కొరింథీయన్ అసైన్‌మెంట్ లన్నింటిలో, తీతు సువార్తికునిగా, విశ్వసనీయునిగా మరియు గౌరవనీయమైన ట్రబుల్షూటర్‌గా నిరూపించబడ్డాడు.
పౌలు తన మొదటి చెర కాలము నుండి విడుదలైన తర్వాత, క్రేతును సందర్శించి క్రీ.శ. 57-58 క్రేతు నగరాల్లో సువార్తను వ్యాప్తి చేసాడు.
క్రేతీయుల అనైతికత సమస్య కారణంగా, క్రైస్తవ జీవనంలో ధర్మబద్ధత యొక్క అవసరాన్ని నొక్కి చెప్పడం ముఖ్యం. తప్పుడు బోధకులు, ప్రత్యేకించి “సున్నతి పొందిన వారు” (1:10), విశ్వాసులను తప్పుదారి పట్టిస్తూవున్నారు. కొందరు సంఘములో విభజన తెచ్చుటకు ప్రయత్నిస్తూ వున్నారు. సమస్యలు సృష్టించేవారు మొదటిగా సరిదిధ్ధబడవల్సి యున్నారు కాబట్టి ఇది అంత తేలికైన పని కాదు (1:10-16). కాబట్టి సంఘమును సంపూర్ణముగా ఒక క్రమములో పెట్టడానికి పౌలు తీతును క్రీ.శ. 64లో క్రేతుకు పంపాడు, (తీతు 1:5). సంఘ చరిత్రలో సిజేరియాకు చెందిన యూసేబియస్ ప్రకారం, తీతు క్రేతు యొక్క మొదటి బిషప్‌గా పనిచేశాడు.
పౌలు చలికాలం గడపాలని భావించిన నికొపొలిలో తీతు మళ్లీ అతనితో చేరేలా క్రేతుకు ప్రత్యామ్నాయాన్ని పంపుతానని పౌలు తీతుకు వాగ్దానం చేశాడు (3:12). పౌలు వసంతకాలంలో నికోపోలిస్‌ను విడిచిపెట్టి స్పెయిన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు, అతనితో పాటు తన ఉపయోగకరమైన సహచరుడైన తీతు కూడా రావాలని అతడు కోరుకున్నాడు.
చివరగా, తీతు పౌలు యొక్క రెండవ చెర కాలములో కొంత భాగం పౌలుతో కలిసి రోమ్‌లో ఉన్నాడు, రోమ్ నుండి అతడు దల్మతియకు పంపబడ్డాడు (2 తిమోతి 4:10). ఈ అసైన్‌మెంట్ గురించి మనకేమి తెలియదు.
తీతు, నిస్సందేహంగా, పౌలు కంటే చిన్నవాడు తిమోతి కంటే చాలా పెద్దవాడు. పౌలు తన చిన్న “కుమారుడైన” తిమోతికి ఇచ్చినంత ప్రోత్సాహం అతనికి అవసరం లేదు. క్రేతు ద్వీపంలో అతడి పని కొరకు పౌలు తీతుకు ఇచ్చిన సలహాలు అన్ని కాలాలలోని సంఘానికి మరియు దాని పాస్టర్‌లకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి.
క్రేతు
మధ్యధరా సముద్రంలో నాల్గవ అతిపెద్ద ద్వీపం, క్రేతు ఏజియన్ సముద్రానికి నేరుగా దక్షిణంగా 156 మైళ్ల పొడవు మరియు 30 మైళ్ల వెడల్పుతో ఉండెడిది. క్రొత్త నిబంధన కాలంలో దాని మొదటి శతాబ్దపు నివాసులు అసత్యం మరియు అనైతికతకు ప్రసిద్ధి చెందారు (1:12,13). వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను–క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు (1:12). పెంతెకొస్తు రోజున పేతురు ప్రసంగించే సమయంలో క్రేతు నుండి వచ్చిన అనేక మంది యూదులు యెరూషలేములో ఉన్నారు (అపొ. కార్య 2:11), వారిలో కొందరు క్రీస్తును విశ్వసించి, తమ దేశపు ప్రజలకు సువార్తను పరిచయం చేసి ఉండొచ్చు.
సందర్భం మరియు ఉద్దేశ్యము
పౌలు ఈ లేఖను క్రేతు మార్గంలో వెళ్తున్న జేనాను మరియు అపొల్లో (3:13) ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకొని క్రీ.శ. 68లో వ్రాసివుండొచ్చు. వ్యతిరేకతను ఎదుర్కోవడంలో తీతుకు వ్యక్తిగత అధికారం మరియు మార్గదర్శకత్వం ఇవ్వడానికి (1:5; 2:1,7–8,15; 3:9), విశ్వాసం మరియు ప్రవర్తన గురించి సూచనలు మరియు తప్పుడు బోధకుల గురించి హెచ్చరికలు ఇందులో ఉన్నాయి. పౌలు తన భవిష్యత్తు ప్రణాళికలను తీతుకు తెలియజేసాడు (3:12).
వ్రాసిన ప్రదేశం మరియు తేదీ
పౌలు బహుశా మాసిదోనియ (ఫిలిప్పి) నుండి వ్రాసి ఉండొచ్చు, ఎందుకంటే అతడు ఇంకా నికోపోలిస్ (పశ్చిమ గ్రీస్) చేరుకోలేదు (3:12). అతడు తన మొదటి రోమన్ ఖైదు (అపొ. కార్య. 28) నుండి విడుదలైన తర్వాత బహుశా క్రీ.శ. 68 లో వ్రాసియుండొచ్చు. అనేక లక్షణాలలో తీతు 1 తిమోతిలా ఉండడం మూలాన్న అనేకులు ఈ రెండు క్రీ.శ. 65లో వ్రాయబడి ఉండొచ్చు అని అంటారు.
విలక్షణమైన లక్షణాలు
క్రేతీయుల అబద్ధ బోధలకు విరుద్ధముగా, ప్రేమించడం మరియు మంచి పనులు చెయ్యడం “ఏదైతే మంచిదో” దానిని బోధించడంపై పదే పదే నొక్కి చెప్పడం (1:8,16; 2:3,7,14; 3:1,8,14) మరియు క్రైస్తవ సిద్ధాంతం యొక్క క్లాసిక్ సారాంశాలు (2:11-14; 3:4-7).
తీతులో క్రీస్తు
క్రీస్తు యొక్క దైవత్వము మరియు విమోచనా కార్యము 2:13,14 లో అందంగా చెప్పబడింది: అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
కీ వర్డ్
చర్చి జీవనం కోసం మాన్యువల్ నిర్వహించడం – ఈ సంక్షిప్త లేఖ క్రేతులోని సంఘాలు వాటి పర్యవేక్షణలో తీతు పాత్ర మరియు బాధ్యతపై దృష్టి పెడుతూ వుంది. తప్పుడు ఉపాధ్యాయులు మరియు భిన్నాభిప్రాయాలను తిరస్కరించడం మరియు మంచి పనులతో అనైతిక ప్రవర్తనను భర్తీ చేయడం, అట్లే క్రమములో ఉంచబడాల్సిన సంఘాలకు అపోస్త్లిక్ ప్రతినిధిగా తన అధికారాన్ని దృఢంగా అమలు చేయడానికి తీతును బలోపేతం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి ఇది వ్రాయబడింది.
కీ వచనము
తీతుకు 1:5, నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. తీతుకు 3:8, ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి.
కీ అధ్యయము: 2వ అధ్యాయము
అవుట్‌లైన్
I. ప్రారంభ శుభాకాంక్షలు (1:1–4)
II. క్రేతులో తీతు నియామకం (1:5–16)
ఎ. ఇంకా చేయవలసిన వాటిని పూర్తి చేయండి (1:5)
బి. పెద్దల అర్హతలు (1:6–9)
C. క్రేతులో సమస్యలు (1:10–16)
III. తీతు తప్పనిసరిగా మంచి సిద్ధాంతాన్ని బోధించాలి (2:1–15)
ఎ. పెద్దలకు (2:1, 2)
బి. వృద్ధ మహిళలకు (2:3–5)
సి. యువకులకు (2:6–8)
D. బానిసలకు (2:9, 10)
E. సువార్త ప్రేరణ (2:11–15)
IV. మంచిని చేయడం కోసం రిమైండర్‌లు (3:1–11)
ఎ. మంచిని చేయడం (3:1, 2)
బి. మనిషి పాపపు స్వభావం (3:3)
సి. దేవుని దయ మరియు ప్రేమ (3:4–8)
డి. మూర్ఖపు వివాదం మరియు విభజన వ్యక్తులను నివారించడం (3:9–11)
V. ముగింపు సూచనలు మరియు శుభాకాంక్షలు (3:12–15)
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.