డైనోసార్‌లు నిజమేనా? బైబులు వాటి గురించి ప్రస్తావిస్తూ ఉందా?
భూమి వయస్సు పై క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పెద్ద చర్చలో డైనోసార్ల అంశం కూడా ఒకటి. భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు అని విశ్వసించే వాళ్ళు బైబులు డైనోసార్లను గురించి ప్రస్తావించటం లేదని చెప్తూ మొదటి మనిషి భూమిపైకి రావడానికి మిలియన్ల సంవత్సరాల ముందే డైనోసార్‌లు చనిపోయాయని బైబిల్ను వ్రాసిన వ్యక్తులు జీవించి ఉన్న డైనోసార్లను చూడలేదని వాదిస్తారు. బైబులు ప్రకారము భూమి వయస్సు చాలా తక్కువ అని విశ్వసించే వాళ్ళు బైబులు డైనోసార్లను గురించి ప్రస్తావించిందని చెప్తారు.
ప్రపంచవ్యాప్తంగా డైనోసార్‌లుగా పిలువబడుతున్నటువంటి అంతరించిపోయిన సరీసృపాల జీవులకు సంబంధించి పెద్ద సంఖ్యలో లభ్యంఔతూ ఉన్న వాటి ఎముకలను పరిశీలిస్తే, ఒకప్పుడు డైనోసార్‌లు ఉనికిలో ఉండేవనే వాస్తవాన్ని మనం తిరస్కరించలేం, తిరస్కరించడానికి ఎలాంటి కారణం కూడా లేదు. ఆదికాండము 1:24వ వచనము దేవుడు–వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతిప్రకారము పశువులను పురుగులను అడవిజంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను అని చెప్తూవుంది కాబట్టి దేవుడు డైనోసార్లను సృష్టి యొక్క ఆరవ రోజున సృష్టించాడని మనం నమ్ముతాం.
నిజానికి “డైనోసార్” అనే పదం క్రీ.శ 1841లో ఉనికిలోనికి వచ్చిందండి, కాబట్టే “డైనోసార్” అనే పదం బైబిలు లో మనకు కనబడదు. అయితే యోబు గ్రంధము రెండు భయంకరమైన జీవుల గురించి ప్రస్తావిస్తూ ఉంది. వాటి వివరణలు నేటి ఆధునిక జంతువులతో సరిపోలటంలేదు కాని ఈ వివరణలు యోబు గ్రంధములో 40:15-24 వచనాలలో చెప్పబడిన జంతువైన నీటిగుఱ్ఱము సౌరోపాడ్ రకానికి చెందిన డైనోసార్ తో సరిపోలుతూ ఉన్నాయి కాబట్టి అది డైనోసార్ అయ్యుండొచ్చు. ఈ నీటిగుఱ్ఱము దేవుని జీవులన్నింటిలో అత్యంత శక్తివంతమైనదిగా చెప్పబడింది, దీని తోక దేవదారు చెట్టుతో పోల్చబడింది. బ్రాచియోసారస్ మరియు డిప్లోడోకస్ వంటి డైనోసార్‌లు, దేవదారు చెట్టుతో సులభంగా పోల్చ గలిగే భారీతోకలను కలిగి ఉంటాయి. యోబు 40:15-18 వచనాలు ఈ నీటిగుఱ్ఱము యొక్క భౌతికరూపాన్ని వివరిస్తూవున్నాయి (నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి. దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి. దాని ప్రక్క టెముకలు ఇనుప కమ్ములవలె ఉన్నవి). యోబు 40:19-24 వచనాలు ఈ నీటిగుఱ్ఱము యొక్క కార్యకలాపాలు మరియు అలవాట్లను గురించి చెప్తూవున్నాయి. (అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది. దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలచును. అరణ్య జంతువులన్నియు అచ్చట ఆడుకొనును. తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును. నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?).
సౌరోపాడ్స్ చాలా పొడవాటి మెడలు, పొడవాటి తోకలు, చిన్న తలలు మరియు నాలుగు చాలా పెద్ద స్తంభాల వంటి కాళ్ళను కలిగి ఉంటాయి. భారీ పరిమాణాలను బట్టి అవి ప్రసిద్ది చెందాయి. భూమిపై ఇప్పటివరకు నివసించిన అతిపెద్ద జంతువులు ఇవే. సౌరోపాడ్‌లు 60 అడుగుల ఎత్తు, 110 అడుగుల పొడవు, 100 మెట్రిక్ టన్నుల వరకు బరువుంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటి జీవితకాలం 300 సంవత్సరాలు. సౌరోపాడ్స్ లో అనేక జాతులు ఉన్నాయి.
అట్లే యోబు గ్రంథములోని 41:1-34 వచనాలలో చెప్పబడిన జంతువైన మకరము పోలిక, వివరణ నేటి ఆధునిక జంతువులతో సరిపోలటం లేదు కాని ఈ పోలిక, వివరణ బహుశా సముద్రంలో ఒకప్పుడు ఉండిన క్రోనోసారస్ కు చెందిన డైనోసార్ తో సరిపోలుతూ ఉన్నాయి. ఈ మకరము, నీటిగుఱ్ఱములాగా, గొప్ప పరిమాణం మరియు బలం కలిగిన ఒక ప్రత్యేకమైన జీవి. కాబట్టి అది డైనోసార్ అయ్యుండొచ్చు. యోబు 41:1-17 వచనాలు ఈ మకరము యొక్క భౌతిక రూపాన్ని వివరిస్తూవున్నాయి. (నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా? నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టి వేసెదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా?వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా? దానిమీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు. దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచుకొందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగల వాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా దాని అవయవములను గూర్చియైనను దాని మహాబలమును గూర్చియైనను దాని చక్కని తీరును గూర్చియైనను పలుకక మౌనముగా నుండను. ఎవడైన దాని పై కవచమును లాగి వేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా? దాని ముఖద్వారములను తెరవగల వాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడియున్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొనియున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడియున్నవి. భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొనియున్నవి). 18-24 వచనాలు ఈ మకరము యొక్క కార్యకలాపాలు మరియు అలవాట్లను గురించి ప్రత్యేకతను గురించి తెలియజేస్తూ (అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి. దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దానినుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ముమంట మీద కాగుచున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము భయము దాని యెదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడిరాదు. దాని గుండె రాతివలె గట్టిగా నున్నది. అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము). 18-21 వచనాలు అది అగ్నిని పీల్చే డ్రాగన్‌గా కూడా పేర్కొనబడింది.
క్రోనోసారస్ అంతరించిపోయిన షార్ట్-నెక్డ్ ప్లియోసార్ జాతికి చెందిన ఒక సముద్రపు సరీసృపం. దీనికి గ్రీకు టైటాన్స్ నాయకుడు క్రోనోస్ పేరు పెట్టబడింది. వీటిలో అతిపెద్దది దాదాపు 30 నుండి 36 అడుగులు పొడవు ఉంటుంది. ఇది 11 మీటర్ల వెడల్పుతో, పెద్దపెద్ద దవడలతో పెద్ద శంఖాకార దంతాల వరుసలను కలిగి ఉంటాయి, ఇది 12 నుండి 15 టన్నులు బరువు ఉంటుందని అంచనా వేయబడింది. క్రోనోసారస్ యొక్క పుర్రె పొడవు 8-10 అడుగులుగా అంచనా వేయబడింది.
అదనంగా, బైబులు “డ్రాగన్స్” గురించి కూడా ప్రస్తావించింది. శతాబ్దాలుగా డ్రాగన్‌లకు సంబంధించిన అనేక సాహిత్య వర్ణనలు పెద్ద డైనోసార్‌లకు దగ్గరగా సరిపోతాయి. డ్రాగన్స్ కి సంబంధించిన బిబిలికల్ నాన్ బిబిలికల్ కధలు రెఫరెన్సెస్ లు మానవులకు డైనోసార్‌లతో ముడిపడియున్న ఇంట్రాక్షన్స్ నుంచి ఉద్భవించి ఉండొచ్చు.
శాస్త్రవేత్తలేమో డైనోసార్స్ మరణించిన 65 మిలియన్ ఇయర్స్ తరువాత మొదటి మనుష్యులు భూమిపై ఉద్భవించారని అభిప్రాయపడుతుంటారు. డైనోసార్లు ఎప్పుడు అంతరించిపోయాయనే విషయంలో బైబిల్ పండితుల మధ్య ఏక అభిప్రాయము లేదు. కొందరు అవి ఎక్కువకాలం జీవించలేదని నోవహు జలప్రళయమునకు ముందే అవి అంతరించి పోయాయని నోవహు కాలములో అవి గాని బ్రతికి ఉంటే అవి నోవహు ఓడ లోనికి ప్రవేశించి ఉండేవి కదా అని ప్రశ్నిస్తు ఉన్నారు. మరికొందరు డైనోసార్ జాతికి చెందిన చిన్న జంతువులు నోవహు ఓడలో ఉండి బ్రతికి అవి మధ్య యుగాల వరకు జీవించి ఉండవచ్చని చెప్తారు. డైనోసార్స్ మధ్య యుగాల వరకు జీవించి ఉన్నాయని చెప్పడానికి గణనీయమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయండి.
ఏది ఏమైనప్పటికీ, పరిణామవాదుల క్లెయిమ్స్ కి విరుద్దముగా, లేఖనాలు మరియు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ డైనోసార్‌లు మరియు మానవులు ఒకప్పుడు సమకాలీనులని చెప్తూ ఉన్నాయి. 2005లో డా. మేరీ ష్వైట్జర్ అనే శాస్త్రవేత్త ఇప్పటికీ మృదువుగా మరియు సాగేదిగా ఉన్న కణజాలంతో కూడిన టైరన్నోసారస్ రెక్స్ ఎముకను కనుగొన్నానని దానిలోని రక్తనాళాలను మరియు ఎర్ర రక్త కణాలుగా కనిపించిన వాటిని తాను చూడగలిగానని ఆమె చెప్పింది. తర్వాత, ఇతర డైనోసార్ జాతులలోని మృదు కణజాలాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఎవల్యూషన్ టైమ్-లైన్ ప్రకారమైతే, డైనోసార్‌లు దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించి పోయాయి, అయితే శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలములో కనుగొంటున్న డైనోసార్స్ యొక్క అవశేషాలు అవి ఈ మధ్యకాలం దాకా మనుగడలో ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. ఈ మధ్యకాలములో కనుగొనబడిన డైనోసార్స్ యొక్క మృదు కణజాలం గట్టిపడకుండా శిలాజంగా మారకుండా మిలియన్ల సంవత్సరాలు ఉంది అంటే నమ్మొచ్చంటారా? నమ్మలేం. ఎందుకంటే అది మిలియన్ సంవత్సరాల నాటిది కాకపోవొచ్చు, ఈ మధ్యకాలం నాటిది కావొచ్చు. డైనోసార్లు మరియు మానవులు ఒకప్పుడు సమకాలీనులని చెప్పటానికి ఇది ఒక రుజువు.
నోవహు జలప్రళయము తర్వాత కూడా డైనోసార్లు జీవించివున్నాయి అనడానికి ఇతర ఆధారాలు ఏమిటంటే వివిధ డైనోసార్ల రూపాలను ప్రతిబింబించే అనేక పురాతన కళాఖండాలే. ఈ కళాఖండాలు విగ్రహాలుగా, కుండలపై చిత్రీకరింపబడిన చిత్రాలుగా, ద్వారాలపై అలంకరణలుగా, ఇతర కళాకృతుల రూపాలలో శాస్త్రవేత్తలకు లభ్యమై ఉన్నాయి. క్రీ. పూ 3300 B.C నాటికి చెందిన మెసొపొటేమియన్ సిలిండర్ సీల్ ఇందుకు ప్రత్యేకమైన ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే నేటికాలపు జిరాఫీలు రెండు ఎదురుపడినప్పుడు అవి వాటి పొడుగాటి మెడలతో ఎలా అయ్యితే కొట్టుకొంటాయో అలాగే రెండు సౌరోపాడ్‌లు వాటి మెడలతో కొట్టుకొంటున్నట్లుగా స్పష్టంగా దానిపై చిత్రీకరించబడి ఉంది.
ఈ మధ్య కాలములో ఉత్తర అమెరికా భారతీయులు తమ గుహలలో గీసుకొనిన చిత్రాలలో చాలామటుకు డైనోసార్‌లను పోలి ఉండే జంతువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐరోపాలోని మధ్య యుగాల నాటి సెయింట్ జార్జ్ ది డ్రాగన్ స్లేయర్ యొక్క accountsతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో సంస్కృతులలో డ్రాగన్‌ల కథలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ కల్పిత కథలు పెద్ద డ్రాగన్ వంటి జంతువులు, డైనోసార్‌లతో మానవ నిజ జీవిత అనుభవాలపై ఆధారపడి ఉండవచ్చనేది కల్పితం కాకపోవొచ్చు.
దాదాపు ప్రతి పురాతన నాగరికతలో పెద్ద సరీసృపాల జీవులను వర్ణించేందుకు వాళ్ళు ప్రత్యేకమైన కళను వాడేవాళ్లు. ఉత్తర అమెరికాలో కనిపించే పురాతన పెట్రోగ్లిఫ్‌లు, కళాఖండాలు మరియు చిన్న మట్టి బొమ్మలు డైనోసార్ల యొక్క చిత్రాలను కలిగివున్నాయి. దక్షిణ అమెరికాలోని రాతిశిల్పాలు డిప్లోడోకస్లాంటి జీవులను స్వారీ చేస్తున్న పురుషులను గురించి చెప్తున్నాయి. అద్భుతంగా, ట్రైసెరాటాప్స్-వంటి, టెరోడాక్టిల్-వంటి మరియు టైరన్నోసారస్ రెక్స్ లాంటి జీవుల యొక్క చిత్రాలు భద్రము చెయ్యబడి ఉన్నాయి. రోమన్ మొజాయిక్‌లు, మాయన్ కుండలు మరియు బాబిలోనియన్ నగర గోడలఫై ఉన్న వీటి చిత్రాలు మనుష్యులకు వీటి పట్ల ఉన్న అపరిమితమైన మోహానికి సాక్ష్యమిస్తున్నాయి. మనుష్యులు డైనోసార్స్ కలసి జీవించారనడానికి ఆంత్రోపిక్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి. ఉత్తర అమెరికా మరియు పశ్చిమ-మధ్య ఆసియాలోని ప్రదేశాలలో ఒకే కాలానికి చెందిన మానవులు మరియు డైనోసార్‌ల శిలాజ పాదముద్రల వంటి భౌతిక ఆధారాలు ఉన్నాయి
కాబట్టి, బైబులు డైనోసార్లు గురించి ప్రస్తావిస్తూ ఉందా? లేదా అనేది ప్రాముఖ్యం కాదు. బైబులు ప్రకారము డైనోసార్‌లు మనిషి సహజీవనం చేశారనే ఆలోచనను అంగీకరించొచ్చు. డైనోసార్‌లు మనుషులు సహజీవనం చేస్తే డైనోసార్‌ల కేమైంది? అనే ప్రశ్నను బైబులు చర్చించనప్పటికి నాటకీయ పర్యావరణ మార్పులు, అంతరించిపోయేలా వేటాడబడిన వాస్తవం కారణంగా జలప్రళయం తర్వాత కొంతకాలానికి డైనోసార్‌లు కూడా అంతరించి పోయివుండొచ్చు, అంతే.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.