కృపలో ఏర్పరచబడటం రెండవ భాగము, ఎఫెసీయులకు 1:4-6 వచనాలను చదువుకొందాం. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అను మాటలను ఎలా అర్ధం చేసుకొందాం.
ఈ ఆర్టికల్ లో దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానానికి అలాగే నిత్యరక్షణకు ఆయన కొందరిని నిత్యత్వములో ఏర్పరచుకోవడం అను వాటి మధ్యనున్న వ్యత్యాసాన్ని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నం చేధ్ధాం.
దేవుని ముందస్తు జ్ఞానానికి ప్రతిది తెలుసు, జగత్తు పునాది వేయబడక మునుపే (తాను సృష్టించబోయే వాటి విషయములో, ఆ సృష్టిలో జరగబోయే వాటి విషయాలలో) దేవునికి ఒక పక్క పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. సృష్టిలో ఏది ఎలా జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఎలా స్పందిస్తుందో ఆయనకు ముందుగానే తెలుసు, ప్రతి దానిని గురించిన ప్రతి పిన్ పాయింట్ కూడా ఆయనకు ముందుగానే తెలుసు.
సాతాను, చెడిన మానవుల వికృత సంకల్పమే చెడుకి మూలం మరియు కారణం గనుకనే హోషేయ13:9లో ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు అని చెప్పటమే కాకుండా కీర్తనలు5:4లో తాను దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడను కానని చెడుతనమునకు తన యొద్ద చోటు లేదనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
సాతాను, సాతానుచే చెడగొట్టబడిన మనిషి తమ వికృతమైన దుర్మార్గమైన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో దేవునికి ముందుగానే తెలుసు. వారి దుర్మార్గమైన చర్యలు, పనులలో కూడా దేవుని ముందస్తు జ్ఞానం పనిచేస్తూనే ఉంటుంది. దేవుడు చెడును ఇష్టపడడు కాబట్టి చెడు ఎంత దూరం వెళ్ళాలి, దానిని ఎంత కాలం భరించాలి అనే విషయములో ఒక పరిమితిని మరియు కొలతను నిర్దేశించాడు. అలాగే ఆయన ఎప్పుడు, ఎలా దానితో జోక్యం చేసుకొంటాడో, శిక్షిస్తాడో అనే విషయాలు దేవుని చేతిలోనే ఉంటాయి. దేవుడు తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఆయనచే ఎన్నుకోబడిన వారి విషయములో తగిన రీతిలో ఆయన ప్రతిది నియంత్రిస్తూ ఉన్నాడని, సమస్తమును ఆయన స్వాధీనములోనే ఉన్నవనే విషయాన్ని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయనే విషయాన్ని మరచిపోకండి.
ఆయన పర్ఫెక్ట్ ప్లాన్ లో భాగముగా ఇప్పుడు, నిత్యరక్షణకు ఆయన కొందరిని నిత్యత్వములో ఏర్పరచుకోవడం అను దానిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేధ్ధాం.
తన చిత్తప్రకారమైన_ అనే మాట దేవుని పర్ఫెక్ట్ ప్లాన్ లో భాగముగా పరలోకానికి సంబంధించిన ఈ ఆశీర్వాదాలు దేవుని శాశ్వతమైన ఉద్దేశ్యానికి అనుగుణంగా ప్రేమచేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకొనిన వారి కొరకు దేవుని ఉద్దేశం, రూపకల్పన ఫలితంగా జగత్తు పునాది వేయబడక మునుపే డిజైన్ చెయ్యబడియున్నాయని తెలియజేస్తూ ఉన్నాయి.
మనలను ముందుగా _ అనే మాట వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంది తప్ప కమ్యూనిటీస్ గురించి మాట్లాడటం లేదు అనే విషయాన్ని జ్జ్యపాకం పెట్టుకోండి.
తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున అంటే (తన ఇష్టము సంతోషానికి అనుగుణముగా) మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను_అనే మాటను కొందరు తప్పుగా అర్ధంచేసుకొంటారు. ఎలా అంటే, ఏర్పరచుకోవడాన్ని కొందరు “ఎంచుకున్నారు” అనే అర్ధములో తీసుకొంటారు. అంటే ప్రేమచేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనుటకు దేవుని కృప లేదా క్రీస్తు యొక్క యోగ్యత కారణం కాదని, ఏర్పరచబడిన వాళ్ళు మంచివారని ఉత్తమమైనవారని యోగ్యులని దేవుడు అనుకోవడం మూలన్న అదే మనలను దేవుడు ఎన్నిక చేయుటకు కారణమని భావిస్తూ ఉంటారు, భోదిస్తూ ఉంటారు. ఒకవేళ అలా అనుకుంటూ ఉంటే అది తప్పని తెలుసుకోండి, లేఖనాలకు విరుద్ధమైన బోధ అది.
ఎందుకంటే, ఏర్పరచబడిన వాళ్ళు మంచివారని ఉత్తమమైనవారని యోగ్యులని దేవుడు అనుకోవడం మూలన్న అనే బోధ, “సత్ క్రియలు” “మంచిప్రవర్తన” “సరి అయిన స్వీయనిర్ణయం” “ఉద్దేశపుర్వకముగా నిగ్రహించుకోవడం” అనే తప్పుడు బోధల వైపు మనలను మళ్లిస్తూ తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన రక్షణను, దేవుని దయాసంకల్పమును తక్కువ చేస్తూ మనిషిని తన రక్షణలో ఒక భాగముగా చేస్తూవుంది. కాబట్టే అది లేఖనాలకు విరుద్ధమైన బోధ అని చెప్తున్నాను.
ఉదాహరణకు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు “ప్రభువని” చెప్పలేడని 1కొరింథీయులకు12:3లో ఉన్న మాటలు మనకందరికి బాగా కంఠస్థం. ఈ మాటలకు, పరిశుద్ధాత్మ సహాయం చేయకపోతే యేసును “ప్రభువు” అని చెప్పే సామర్థ్యం ఎవరికి లేదని, ఎవరూ యేసును తమ ప్రభువుగా అంగీకరించలేరని ఒప్పుకోలేరనేగా అర్ధం. ఇదే మాటలు మరోలా చెప్పాలంటే, ఏ ఒక్కరు వారి స్వంత ఆలోచనవలననైనను లేక వారి స్వంత నిర్ణయము వలననైనను ప్రభువైన యేసుక్రీస్తు నందు నమ్మికయుంచలేరని ఆయన యొద్దకు జేరనేలేరనే కదా ఈ వచనము చెప్తుంటా. ఒక మనిషిలో విశ్వాసమనేది “పరిశుద్దాత్ముని యొక్క అద్భుతమైన సృష్టిగా” బైబులు వర్ణిస్తూవుంది. మరి పరిశుధ్ధాత్మకు ఆ గొప్పతనాన్ని ఇవ్వకుండా “మేము యేసును నమ్ముకోవాలని నిర్ణయించుకున్నామండి” అని కొందరు చెప్తుండటం బాధాకరం.
మరికొందరు, కాలములో ఎవరెవరు క్రైస్తవులవుతారో దేవుడు ముందుగానే భవిష్యత్తు లోనికి చూసేసి వారిని మాత్రమే ఆయన ఏర్పరచుకొన్నాడని, ఎన్నుకొన్నాడని చెప్తుంటారు, ఈ వచనము అలా చెప్తూవుందా? లేదే. ఏర్పరచబడిన వారిలోని విశ్వాసము వారు ఏర్పరచబడక మునుపే వారిలో ఉంచబడింది అనే విషయాన్ని ఈ వచనము చాల స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. నిత్యత్వములో దేవుడు ఏర్పరచుకొనిన వారిలో ఆయన ముందుగా వారి రక్షణను చూడలేదు. వారి రక్షణను గురించి ముందుగా తెలుసుకోలేదని కేవలము దేవుని చిత్తప్రకారమైన దేవుని దయాసంకల్పమే మన ఎన్నికకు కారణమని మూలమని ఈ వచనము చాల స్పష్టముగా తెలియజేస్తూ ఉంది.
యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా స్వీకరించుటకై _అనే మాటలు ఏర్పరచబడియున్న వాళ్ళు క్రీస్తు ద్వారా ఏర్పరచబడియున్నారని తెలియజేస్తూ ఒక నిర్దిష్ట సంఖ్యను (కొందరిని) మాత్రమే పరలోకానికి తీసుకు రావడం దేవుని ఉద్దేశ్యంకాదని చెప్తూవుంది. ఇది ప్రజలందరి కొరకైన విమోచకుడి మధ్యవర్తిత్వం గురించి తెలియజేస్తూవుంది. అంటే, ఏర్పరచబడియున్న వాళ్ళు యేసుక్రీస్తు ద్వారా “రక్షించబడాలి మరియు ప్రాయశ్చిత్తం యొక్క ప్రయోజనాలను పంచుకోవాలి” అనేదే దేవుని ఉద్దేశ్యం అని తెలియజేస్తూ యేసుక్రీస్తు లేకుండా ఎవడును జీవమునకు ఏర్పరచబడలేదని, ఎన్నుకోబడలేదని ఆయన లేకుండా ఎవరూ రక్షించబడరు అని చెప్తూవుంది, యూదులైనను సరే.
జగత్తు పునాది వేయబడకమునుపే_ అనే పదము ఏర్పరచబడిన వాళ్ళు ఎంపిక చేయబడిన సమయాన్ని తెలియజేస్తూ ఉంది. మేము మాత్రమే ఎన్నిక చెయ్యబడిన ప్రజలము అని అనుకొనే ఇశ్రాయేలీయులతో ఈ మాటలు ఏమి చెప్తున్నాయంటే, మిమల్ని మాత్రమే కాదు ఆయన తన కుమారుని ద్వారా సర్వలోకస్థులను తనకు పిల్లలుగా యూదా మతవ్యవస్థ అనేది ఏర్పడక ముందే, ఏర్పరచబడిన వారిని నిత్యత్వములోనే ఏర్పరుచుకొనియున్నాడని తెలియజేస్తూ ఉంది. అట్లే 1పేతురు1:18-21 వచనాలలో పేతురు రక్షకుని గురించి చెప్తూ, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను అని చెప్పిన మాటలు సృష్టి ఏర్పడక ముందే, దేవుడిని కోల్పోయిన మనుష్యులను రక్షించడానికి యేసుక్రీస్తును పంపడం అనే దేవుని ఉదేశ్యమును గురించి చక్కగా వివరించియున్నాడు. ఈ దేవుని ఉద్దేశ్యము తాత్కాలిక ఏర్పాటు కాదని; అకస్మాత్తుగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావమూలముగా రూపుదిద్దుకోలేదని; ఇది తరాలకు అనుగుణముగా తీసుకున్న నిర్ణయము కాదని, ఇది దేవుని మనస్సులో శాశ్వతమైన ఒక ప్రయోజనం నుండి ఏర్పడింది కాబట్టి దీనికి ఒక ప్రాముఖ్యత, ఒక గౌరవం, నిశ్చయత ఉందనే విషయాన్ని తెలియజేస్తూవుంది.
- “జగత్తు పునాది వేయబడకమునుపే” దేవునికి ఒక ప్లాన్ ఉందనే విషయాన్ని ఒప్పుకొంటున్నారా? ఎందుకంటే “జగత్తు పునాది వేయబడకమునుపే” దేవునికి ఒక ప్లాన్ ఉందనే విషయం, జరగబోయే దానిని గురించి దేవుడు తీసుకున్న స్థిరమైన ముందస్తు నిర్ణయాన్ని గురించే కదా చెప్తుంటా. “నిత్యత్వము” అనే సిద్ధాంతానికి సంబంధించి మీకున్న ఎన్నో ప్రశ్నలు అభ్యంతరాలు తొలగింపబడివుంటాయి అని అనుకొంటున్నాను.
- “జగత్తు పునాది వేయబడకమునుపే” దేవునికి ఒక ప్లాన్ ఉందంటే, ఆయన ప్లాన్ “శాశ్వతమైనదని” దేవుడికి కొత్త ప్రణాళికలు, కొత్తపథకాలు ఏవిలేవనే విషయాన్ని ఇది తెలియజేస్తూవుంది. కాబట్టే యోబు 23:13 ఆయన ఏకమనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు? అనే మాటలు దేవుని మనసును మార్పు చెందని ఆయన ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయనే విషయాన్ని చూడండి.
అయితే ఏర్పరచబడిన వారు కాలంలో ఎలా విశ్వాసములోనికి తేబడియున్నారనే ప్రశ్నకు, నిత్యత్వములో ఏర్పరచబడటం అనేది ఒక కారణం అని చెప్తూ, నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి అని అపొస్తలులకార్యములు13:48 తెలియజేస్తూ ఉంది.
ఈ వ్యక్తీకరణ రెండు విషయాలను తెలియజేస్తూవుంది_ ఇది “ఎన్నిక” అనే సిద్ధాంతాన్ని గురించి అంటే “దేవుడు నిత్యజీవానికి ఏర్పరచుకొనిన వ్యక్తులు” దేవునిని విశ్వసించుటను గురించి తెలియజేస్తూవుంది. అలాగే ప్రకటింపబడిన సువార్తను నిత్యజీవానికి ఏర్పరచబడని వ్యక్తులు అలక్ష్యము, నిర్లక్ష్యము చెయ్యక విశ్వసించుటను గురించి తెలియజేస్తూ ఉంది. అన్యజనులు విమోచన తమకు అని విని సంతోషించారు. దేవుని పిల్లలు కావాలంటే వారు మొదట యూదులుగా మారాల్సిన అవసరం లేదు. యూదులు మరియు అన్యజనులు, “నిత్యజీవము కొరకు నియమించబడిన వారందరూ” సువార్తను విశ్వసించారు. వారు దేవుని చర్య ద్వారా విశ్వాసులు అయ్యారు, వారి వైఖరి లేదా నిర్ణయం వల్ల కాదు. దేవుడు తప్ప మరెవరూ అలాంటి ఏర్పాటును చెయ్యలేరు అనే విషయాన్ని ఈ వచనము చాల స్పష్టముగా తెలియజేస్తూ ఉంది.
దేవునియొక్క కృపగల చిత్తము, యేసుక్రీస్తునిబట్టి దేవునికి కలిగిన సంపూర్ణమైన సంతోషమే మనలను సంపాదించు చున్నదని, మనలో పనిచేయుచున్నదని, మనకు సహాయపడుచున్నదని, మన రక్షణకు దానికి సంబంధించిన వాటికీ తోడ్పాటునిచ్చుచున్నదని దీనిపై మన రక్షణ స్థాపించబడియున్నదని “పాతాళ లోకపు ద్వారములు” దాని ఎదుట నిలువనేరవని, మత్తయి 16:18 చెప్తూ యోహాను 10:28లో వ్రాయబడి యున్నట్లుగా ఎవరును ఆయన గొర్రెలను ఆయన చేతినుండి అపహరింపలేడని తెలియజేస్తూ ఉంది.
ఈ వచనాన్ని బట్టి కొందరు కృపలో ఏర్పరచబడియున్నారని లేక రక్షణకు ముందుగానే నిర్ణయింపబడి యున్నారని చెప్పొచ్చు. అలాగే మఱొక ప్రక్క ఈ వచనాన్ని బట్టి కొందరు ఉగ్రత కొరకు కొందరు ఏర్పరచబడలేదని లేక నరకమునకు నిర్ణయింపబడలేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే, లోకములోని పాపులందరి పట్ల దేవునికున్న ప్రేమ సార్వత్రికమను సత్యాన్ని లేఖనాలు స్పష్టముగా బయలుపరుస్తూ ఉన్నాయి. అంటే, ఆ దేవుని ప్రేమ ఎలాంటి మినహాయింపులు లేకుండా మానవులందరిని చేర్చుకొంటూ ఉంది. అలాగే క్రీస్తు సంపూర్ణముగా మానవులందరిని దేవునితో సమాధానపరచియున్నాడు. మానవులందరు విశ్వాసమునకు తేబడాలని దానిలో వాళ్ళు సంరక్షింపబడాలని తద్వారా వారిని రక్షించాలని దేవుడు మనస్ఫూర్తిగా ఆశపడ్తువున్నాడు, ఈ విషయాన్నే 1తిమోతి 2:4చెప్తూ “ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు” అని సాక్ష్యమిస్తూవుంది. నిత్యత్వములో దేవుడు వీళ్ళు నరకములో ఉండాలని ముందుగానే ఎవరిని నిర్ణయించ లేదు.
అయితే నరకానికి ఎవరు వెళ్తారు అనే ప్రశ్నకు ఎన్నిక అనేది కారణం కాదు. బాధాకరమైన ఈ వాస్తవానికి లేఖనాలు పేర్కొంటున్న కారణాలు, ప్రజలు దేవుని వాక్యాన్ని త్రోసివేయడం, తమ్మును తాము నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకోవడం, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచక పోవడం, వాక్యము పశ్చాత్తాపము ద్వారా విశ్వాసము లోనికి తేవాలని మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్న పరిశుధ్ధాత్మను మొండిగా ఎదిరించడం, ఎన్నోమారులు చేర్చుకొనవలెనని దేవుడు అనుకొన్నప్పటికిని గాని ఒల్లకపోవడమనేవే కారణాలు. వీళ్ళే నరకానికి వెళ్తారు. ఈ విషయాలనే అపొస్తలుల కార్యములు 13:46; 7:51; మత్తయి 23:37 తెలియజేస్తూవున్నాయి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.