ఆదికాండము 4:1-16, 1ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని–యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. 2తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు. 3కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; 5కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తనముఖము చిన్నబుచ్చుకొనగా 6యెహోవా కయీనుతో–నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? 7నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. 8కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలుమీదపడి అతనిని చంపెను. 9యెహోవా–నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు –నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 10అప్పుడాయన–నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తముయొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది. 11కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; 12నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. 13అందుకు కయీను –నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. 14నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడోవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 15అందుకు యెహోవా అతనితో–కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతి దండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. 16అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.

ఆలోచించండి
మానవ చరిత్రలో ఇదే మొదటి హత్య. కయీను తన సోదరుడైన హేబెలును చంపాడు. భూమిపై పుట్టిన మొదటి మానవుడు మొదటి హంతకుడు ఎలా అయ్యాడు? ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? కయీను తన సోదరుడిని చంపాలని ఎలా శోధించబడ్డాడో అధ్యయనం చేధ్ధాం.

మూల్యాంకనం చేధ్ధాం
కథలోని పాత్రలు ఎవరు? ఆదాము, హవ్వ, కయీను, హేబెలు మరియు దేవుడు.
ఈ కథలోని వస్తువులు ఏమిటి? మంద, పొలము, పంట, మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్వినవి, అర్పణలు, కయీను చేతి నుండి రక్తం, కయీను గురుతు, మరియు నోదు దేశము.
ఈ కథ ఎక్కడ జరిగింది? పొలములో.
ఈ కథ ఎప్పుడు జరిగింది? మానవ చరిత్ర ప్రారంభంలో.
సమస్య ఏమిటి? కయీను తన సోదరుడైన హేబెలును చంపటం మరియు దేవుడు కయీనును శిక్షించడం.
ఈ కథలో ఏ సంఘటనలు జరిగాయి?
ఆదాము హవ్వలు ఎవరు? ఆదాము హవ్వలు మొదట సృష్టించబడిన జీవులు సమాధాన కరమైన స్థితిలో దేవుని తోటలో అక్షయులుగా అమర్త్యులుగా ఆశీర్వదింపబడివారుగా ఉండేవాళ్ళు. పతనము తర్వాత మొదటి పాపులుగా, క్షయులుగా మర్త్యులుగా శపింపబడిన వారుగా దేవుని తోటనుండి వెళ్లగొట్టబడ్డారు. అట్లే వీళ్ళు మొదటి విశ్వాసులు, భూమిపై దేవుని సంఘము వీరితో ప్రారంభమయ్యింది.

పతనం తరువాత, ప్రభువైన యెహోవా ఆదాము హవ్వలను పిల్లలతో ఆశీర్వదించాడు. హవ్వ ఒక కుమారునికి జన్మనిచ్చింది, ఆమె కయీనును కని–”యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను “.

హవ్వ ఈ మాటలు ఎందుకు చెప్పింది? ఆదాము హవ్వలకు దేవుడు ఎవరో తెలుసు. తమ మొదటి స్థితిని వాళ్ళు ఎలా పాడు చేసుకున్నారో వారికి తెలుసు. వారిపై దేవుని తీర్పు గురించి వారికి తెలుసు. వారు ఇప్పుడు భూమిపై ఇద్దరిగా ప్రయాణాన్ని ప్రారంబించియున్నారు. ఆమె 9 నెలలు గర్భం దాల్చింది. హవ్వకి అది కొత్త అనుభవం. చాలా బాధలో ఆమె కయీనుకు జన్మనిచ్చింది (ఆదికాండము 3:16). ప్రభువు సహాయంతో ఆమె ఒక మనిషిని పుట్టించింది. ఇది ఆదాము హవ్వలకు అద్భుతంగా అనిపించింది. ఈ మాటల ద్వారా, హవ్వ మొదటి మానవ జన్మ యొక్క అద్భుతం పట్ల తన ఆశ్చర్యాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తం చేసింది. ఆమెకు దేవుని చిత్తం తెలుసు. యెహోవా దయ ఆయన సృజనాత్మక పనిలో పాల్గొనడానికి ఆమెను అనుమతించింది. హవ్వకు కుమారుడిని ఇవ్వడం ద్వారా, ఒడంబడిక దేవుడు మానవ జాతిని చనిపోనివ్వలేదు. హవ్వ తన కుటుంబ వంశం కొనసాగుతుందని ఈ సాక్ష్యాన్ని చూసి సంతోషించింది. ఇప్పుడు ఆమె ఒక వ్యక్తిని సంపాదించింది. ఆమెకు మొదటి మెస్సియానిక్ ప్రవచనం గురించి కూడా తెలుసు (ఆదికాండము 3:15). కాబట్టి హవ్వ తన ఈ చిన్ని కొడుకైన కయీను రక్షకుడని, వాగ్దానం చేయబడిన వారసుడని, అతడు పాము తలని నలిపివేస్తాడని భావించింది. అందుకే “యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నానని” ఆమె చెప్పింది.

హవ్వ తన మొదటి కుమారుడికి కయీను అని ఎందుకు పేరు పెట్టింది? కయీను అంటే అర్థం ఏమిటి? ఆదాము హవ్వలు తమ కొడుకుకు పేరు పెట్టమని దేవుణ్ణి అడగలేదు. ఆదాముకు జంతువులకు పేర్లు పెట్టే అనుభవం ఉంది (ఆదికాండము 2:20). వారు తమ మొదటి బిడ్డకు “కయీను” అని పేరు పెట్టారు, దీని అర్థం “పొందబడినది” లేదా “ఈటె” (స్ట్రైకర్, ఆదికాండము 3:15). వారు తమ కుమారునికి తమ సృష్టికర్త పేరును ఎంచుకోలేదు కాని వారు తమ రక్షకుని పేరును ఎంచుకున్నారు. విశ్వాసిగా హవ్వ తన కుమారుడే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని నమ్మింది.

తరువాత హవ్వ హేబెలుకు జన్మనిచ్చింది. హవ్వ తన రెండవ కుమారుడికి హేబెలు అని ఎందుకు పేరు పెట్టింది? హేబెలు అంటే అర్థం ఏమిటి? హేబెలు అంటే “వానిటీ” (వ్యర్ధము). అతడు ఆమెకు రెండవ సంతానం, ఆమె రెండవ కుమారుడు. ఆమె ఏదేనుకు వెలుపల భూసంబంధమైన జీవితం (ఏదేనులో దీవెనకరమైన జీవితం) యొక్క వ్యర్థాన్ని అనుభవించి, మోక్షం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండొచ్చు.

కొంతకాలం తర్వాత, కయీను భూమిని సేద్యపరచు రైతు అయ్యాడు మరియు హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. ఆదాము హవ్వలకు ఇతర కుమారులు మరియు కుమార్తెలు ఉన్నారు (ఆదికాండము 5:4), కాని వారి పేర్లు మనకు తెలియవు.

కాలక్రమంలో కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు.

ఇది మనకు ఏమి బోధిస్తుంది? భూమిపై ఉన్న చర్చి చాలా చిన్నది. కానీ, దేవునికి భయపడే ఆ ఇద్దరు తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుణ్ణి ఆరాధించడం నేర్పించారు. అందుకే ఆదాము హవ్వల ఇద్దరు కుమారులు కోత సమయంలో యెహోవాకు బలులు అర్పించారు. సహోదరులు తమ ప్రతి ఉత్పత్తి నుండి దేవునికి అర్పణ తేవాలని నిర్ణయించుకోవడంతో సమస్య మొదలైంది.

కయీను హేబెలులు ఎవరికి అర్పణలు అర్పించారు? వారు “యెహోవాకు” అర్పణలు అర్పించారు. ఆదాము హవ్వలు తమ పిల్లలకు రక్షకుడైన-దేవుని, నమ్మకమైన దయగల దేవుణ్ణి తెలుసుకోవడం మరియు ప్రేమించడం నేర్పించారు. అట్లే వారికి మరొక ఆప్షన్ కూడా లేదు.

వారు యెహోవాకు ఎలాంటి అర్పణలు తెచ్చారు? కయీను తన పొలంలోని పంట నుండి కొంత, యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెల్ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఉత్తమమైన వాటిని యెహోవాకు అర్పణగా తెచ్చాడు.

దేవునికి అర్పణలు ఇవ్వాలని భూమిపై ఉన్న కయీను హేబెలుకు ఎలా తెలుసు? కయీను హేబెలు ఇద్దరూ, నిజమైన ప్రభువును గూర్చిన జ్ఞానంలో ఆదాము చేత ఉపదేశించబడినందున, వాళ్ళు యెహోవాకు అర్పణలు తెచ్చారు. అప్పటికి, అర్పణలను గురించి వివరించే మోషే ధర్మశాస్త్రం ఇంకా ప్రవేశపెట్టబడలేదు. కాని ఆదాము కుటుంబం దేవునికి ఇష్టమైన ఆరాధనను ఆచరించేదని మనం చెప్పగలం. అందులో భాగముగా కయీను హేబెలులు ఇరువురు తమ అర్పణలలో కొంత భాగాన్ని ప్రభువు బలిపీఠము మీద కృతజ్ఞతగా తమ శ్రమ ఫలాలలో నుండి ఉంచారు. ఈ టైములో వారి వయస్సు ఎంతో మనకు ఖచ్చితంగా తెలియదు, కాని వారు చిన్న పిల్లలు మాత్రం కాదు. ఇది “ఒక రోజు జరిగిన సంఘటనో” లేదా “వారి మొదటి అర్పణ” రోజు జరిగిన సంఘటనో మనకు తెలియదు.

ఈ ఆరాధనలో కయీను మరియు హేబెల్ హృదయాల వైఖరులు ఎలా ఉన్నాయి? 3,4 వచనాలు కయీను హేబెలు హృదయ వైఖరిలో ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూవున్నాయి; కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు.

పతనం తర్వాత దేవుడు మానవాళిని పూర్తిగా విడిచిపెట్టలేదు అట్లే మానవజాతి దేవునికి వెన్ను చూపలేదు. పతనం దేవునితో మన సంబంధాన్ని నాశనం చేసినప్పటికీ, అది దానిని తుడిచివేయలేదు. కాబట్టి కయీను దేవుని తోట నుండి వేరుగా ఉంటూ శాపానికి గురైయున్నానని ఎరిగియున్నప్పటికిని, దేవుని పట్ల బాధ్యతగానే ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే కయీను అర్పణగా పొలము పంటలో ఏమి తెచ్చాడో ఎటువంటివి తెచ్చాడో మనకు నిర్దిష్టముగా తెలియదు. దేవుడు ప్రత్యేకంగా ఏదైనా అడిగాడా మనకు తెలియదు. కయీను తన బహుమతిని తీసుకువచ్చినప్పుడు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడో తెలుసుకోవడానికి మనకు మార్గం లేదు. 5వ వచనం ఆధారంగా మనకు తెలిసిన విషయమేమిటంటే, కయీను తెచ్చిన దానితో దేవుడు సంతోషించలేదనే విషయం ఆయన దానిని లక్ష్యపెట్టలేదనే విషయము మాత్రమే మనకు తెలుసు.

కయీను పొలము పంటలో కొంత అర్పణగా తెచ్చాడు, కాని ఆ “కొంత” యొక్క నాణ్యత స్పష్టముగా ఇక్కడ పేర్కొనబడలేదు. ఆ “కొంత” కయీను శ్రమ ఫలాలలో ఉత్తమమైనవి మరియు “ప్రధమ ఫలాలు” కాదు. యెహోవాకు అర్పణగా తెచ్చే వాటి విషయములో కయీను ప్రత్యేకముగా ద్రుష్టి పెట్టలేదు. కయీను తక్కువ విలువ కలిగినవి మిగిలిపోయిన వాటిని తెచ్చాడు. ఇక్కడ అతడు తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించాడు. బహుశా కయీను (కుటుంబ) ప్రతిపాదన/ సిఫార్సును బట్టి మాత్రమే అర్పణను యెహోవాకు తెచ్చియుండొచ్చు.

యెహోవా హేబెలును అతని యర్పణను ఎందుకని లక్ష్యపెట్టాడు. కయీనును అతని యర్పణను ఆయన ఎందుకని లక్ష్యపెట్టలేదు? “యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను“. హేబెలు అర్పణ విశ్వాసం నుండి ప్రవహించింది, విశ్వాసం ద్వారా హేబెల్ దేవునికి ఆమోదయోగ్యుడు అయ్యాడు. హేబెలు దేవుని నుండి పొందుకొనిన మేలులను బట్టి ఆయన మంచితనం దయను బట్టి హృదయపూర్వక కృతజ్ఞతకు రుజువుగా యెహోవాకు అర్పణను తీసుకువచ్చాడు. మంచి విశ్వాసం నుండి స్వచ్ఛమైన ప్రేమ ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు 11:4, విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేప్ఠమైన బలి దేవునికి అర్పించాడని, దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడని చెప్తూవుంది. హేబెలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తేవడం వాటి విలువ, వాటి ఎంపిక కారణంగా యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టలేదు. హేబెలుకు యెహోవా పట్ల అతడు తెచ్చిన అర్పణ పట్ల గౌరవం ఉంది. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టడమంటే, హేబెలు అర్పణను మరియు దానితోపాటు చేసిన ప్రార్ధనను బట్టి యెహోవా సంతృప్తి చెందుటను అది సూచిస్తూ ఉంది.

అట్లే హేబెలు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడని, (అతడు రాబోయే మెస్సీయను విశ్వసించాడని) ఈ విశ్వాసం కారణంగానే, అతడు నీతిమంతుడని దేవుడు అతని గురించి సాక్ష్యమిచ్చాడని, మత్తయి 23:35 కూడా చెప్తూవుంది. అప్పుడు, ఇప్పుడు, దేవుడు ఇచ్చేవారి అర్పణను అది తెచ్చిన వారి హృదయ లోతులలోనికి చూస్తాడు. ఈ వాస్తవాన్ని ఆదికాండము 4:4 నమోదు చేసింది, “యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను,” అను మాటలలో మొదట అర్పణను తెచ్చిన హేబెలును గురించి తరువాత అర్పణను గురించి మాట్లాడుతూ ఉంది. యిర్మీయా 17:10, ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడనని చెప్తూవుంది. అట్లే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడని కీర్తన 44:21 కూడా చెప్తూవుంది.

అప్పుడు, ఇప్పుడు, ప్రభువు విశ్వాసం గురించి సాక్ష్యమిచ్చినప్పుడు, విశ్వాసం తెచ్చే అర్పణలను సూచించడం ద్వారా ఆయన సాక్ష్యమిస్తాడు. దేవుడు హేబెలును “నీతిమంతుడుగా” ఆమోదించాడు, అతడు యెహోవా దైవిక సన్నిధిలో న్యాయంగా మరియు పవిత్రంగా నిలబడగలవాడు, హేబెలు చేసిన దాని వల్ల కాదు, కాని అతని విశ్వాసం వల్లనే. రాబోయే రక్షకుని గురించి దేవుడు చూపని వాగ్దానాలను హేబెలు విశ్వసించాడు మరియు అతని క్రియలు దానిని చూపించాయి. చనిపోయిన ఈ మొదటి వ్యక్తి నేటికీ మనతో మాట్లాడగలిగేలా పవిత్ర గ్రంథంలోని పేజీలలో హేబెల్ విశ్వాసాన్ని రికార్డ్ చేయడం ద్వారా దేవుని ఆమోదాన్ని అతడు పొందాడు. విశ్వాసం యొక్క మార్గం కఠినమైనది కావచ్చు, కాని దేవుని దయ సరిపోతుంది.

అట్లే 1 యోహాను 3:12, మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా? అని కయీనును గురించి తెలియజేస్తూవుంది. మొదటి హంతకుడైన కయీను కథ (ఆదికాండము 4), ప్రజలు తమ చెడు భావోద్వేగాలు మరియు కోరికలను నియంత్రించనప్పుడు ఏమి జరుగుతుందో వివరిస్తూవుంది. ఈ అర్పణలు హేబెలు యొక్క స్వేచ్ఛా సంతోషకరమైన విశ్వాసాన్ని మరియు కయీను యొక్క చట్టబద్ధమైన, అయిష్ట హృదయ స్థితి మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాయి. కయీను అర్పణ అంగీకరించబడనప్పుడు అతడు కోపపడుటను బట్టి అతని అర్పణ స్వనీతిపరమైన ప్రేరణతో జరిగిందని అర్ధం చేసుకోవచ్చు.

కయీనుకు దేవుని పట్ల ఈ విధమైన వైఖరి ఎందుకని ఏర్పడింది? కయీను ఆదాము హవ్వల కుటుంబంలో సభ్యుడై యున్నప్పటికీ, బాధాకరమైన విషయమేంటంటే, అతడు దేవుని కుటుంబానికి బయట ఉన్నాడు. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెనని, హెబ్రీయులకు 11:6 చెప్తూవుంది.

కయీను ఆరాధనలో మనం ఎలాంటి పాపాలను చూడవచ్చు? కయీను అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. ఎందుకంటే కయీను అర్పణను అవిశ్వాసంతో తెచ్చాడు. బయటికి కనబడేలా కయీను తన అర్పణను యెహోవాకు అర్పించాడు, కాని అతని ప్రేరణ అపవిత్రమైనది. అతడు ఆరాధన యొక్క మోషన్స్ ద్వారా మాత్రమే వెళ్ళాడు, అతని ఉద్దేశ్యాలు స్వార్థపూరితమైనవి. దేవుడు కయీను హృదయంలో కపటత్వాన్ని, తప్పుడు ఆరాధనను మరియు కోపాన్ని చూశాడు. అతడు తన సోదరుడైన హేబెలు యొక్క స్వచ్ఛమైన స్వభావం పట్ల అసూయపడ్డాడు.

ఆధ్యాత్మిక స్థితిలో కయీను హేబెలు ఎలాంటి వ్యక్తులు? కయీను అవిశ్వాసి మరియు హేబెల్ విశ్వాసి.

కయీను అర్పణ పట్ల దేవుడు తన అసంతృప్తిని ఏ విధంగా చూపించాడు? మనకు తెలియని విధంగా, కయీను హృదయ వైఖరిని బట్టి దేవుడు అసంతృప్తి చెందియున్నాడని, అతని అర్పణ ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని దేవుడు కయీనుకు తెలియజేసాడు. కయీను తిరస్కరించబడలేదు, అతని అర్పణ మాత్రమే లక్ష్యపెట్టబడలేదు అనే విషయాన్ని గమనించవలసియున్నాము.

కయీను ఈ విషయాన్ని గుర్తించాడా? గుర్తించాడు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొన్నాడు. కయీను దేవునిచే విమర్శింపబడ్డాడు. ఇది ఎవరికైనా కష్టమే, కయీను దాని ద్వారా నిరుత్సాహపడ్డాడు. హేబెలు యొక్క విశ్వాసం మరియు దేవుడు హేబెలు అర్పణను అంగీకరించడం బట్టి కయీను తన సోదరుడైన హేబెలు పట్ల అసూయపడ్డాడు. అతనికి మిక్కిలి కోపము వచ్చింది, ఆ కోపము అతని ముఖంలో ప్రతిబింబించింది. ఇక్కడ కయీను దేవునికి సారీ చెప్పి ఉండొచ్చు. అసూయ మిక్కిలి కోపము వలన వచ్చిన ద్వేషము చివరికి హేబెలును తొలగించాలి అనే ఆలోచన అతనికి కలిగించింది.

తోబుట్టువుల మధ్య కొంతైనను పోటీ లేని కుటుంబం చాల అరుదైనది. అహంకారం మరియు భావోద్వేగ అపరిపక్వత తోబుట్టువుల మధ్య శత్రుత్వాన్ని కొన్ని నాటకీయ మార్గాల్లో రేకెత్తిస్తుంది.

ఈ చెడు ఆలోచన యొక్క పురోగతిని తిప్పికొట్టడానికి యెహోవాయే స్వయంగా జోక్యం చేసుకొని, కయీనుతో–నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువని చెప్పాడు.

దేవుడు కయీనును ఎందుకని హెచ్చరించాడు? యెహోవా, రక్షకుడైన-దేవుడు, కయీనుతో బహుశా ముఖాముఖిగా మాట్లాడాడు. యెహోవా తన ప్రామాణికమైన ప్రేమను హెచ్చరించడం ద్వారా చూపించాడు. కయీను కోపం, ఆ కోపం యొక్క పరిణామాల గురించి దేవునికి తెలుసు. ఈ పరిస్థితులలో కయీను కోపం అసమంజసమైనది మూర్ఖమైనది. లోపం కయీనుతోనే ఉంది. అతడు అర్పణను చక్కగా తెచ్చి ఉంటే, అతడు విశ్వాసాన్ని కలిగి ఉంటే, విశ్వాసాన్ని చూపించి ఉంటే, అతడు మెచ్చుకొని యుండబడి ఉండేవాడు. అతని ముఖాన్ని ఎత్తగలిగి యుండేవాడు. మరోవైపు, అతడు సరైయైనది చేయకపోతే, అతని వాకిట వద్ద పొంచియున్న పాపము అతన్ని కలిగి ఉండాలని కోరుకుంటుంది, అవిశ్వాసం ఎల్లప్పుడూ మానవులపై నియంత్రణ కలిగియుండాలని కోరుకుంటుంది.

బదులుగా కయీను ఏమి చేసాడు? కయీను యెహోవా హెచ్చరికను ఉపయోగించు కొనియుండొచ్చు. కాని అతడు దేవుణ్ణి సంప్రదించలేదు. అతని అర్పణ ఆమోదయోగ్యంగా ఉండటానికి ఏమి చెయ్యాలి అని అడగలేదు. అతడు తన చర్యలకు బాధ్యత వహించే ఉత్తమ మార్గం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకొనలేదు. బదులుగా కయీను యెహోవా హెచ్చరికను తిరస్కరించాడు, దేవుని ఆత్మను ప్రతిఘటించాడు. తన హృదయములో రూపుదిద్దుకొంటున్న పాపపు కోరికను లొంగదీసుకోవడానికి కయీను ప్రయత్నించలేదు, కాని అతడు దానికి లొంగిపోయాడు. మన హృదయాలలో కూడా చెడు ఆలోచనలు లేవా? అసూయ, కోపము, ద్వేషము, హత్యలు, ( పది ఆజ్జ్యలలో ఐదవ ఆజ్జ్య, నరహత్య చెయ్యకూడదు. దీనికి అర్ధము, మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, మన పొరుగు వాని శరీరమునకు హానినైనను లేక ఆపదనైనను కలుగజేయక, ప్రతి శారీరక అవసరతయందు వానికి సహాయముగాను మరియు స్నేహితునిగాను ఉండవలెననునదియే).

కయీను తన తల్లిదండ్రుల అవిధేయత వారి పతనం మరియు దేవుని తీర్పు యొక్క కథను వారి ద్వారా ఎన్నో మారులు విని ఉండొచ్చు. నరహత్య చెయ్యడం తప్పు, పాపం అని కయీనుకు తెలియదు అని మీరనుకోవచ్చు. పాపం యొక్క శక్తి గురించి దానిని జయించాల్సిన అవసరం గురించి అట్లే పాపం అతడి వాకిట వద్ద పొంచి యున్నదని దేవుడు కయీను హెచ్చరించాడు. ఒకవేళ అతడు పాపము చేత పట్టబడితే దేవుడు అతన్ని కూడా శిక్షిస్తాడనే విషయము అతనికి స్పష్టముగా హెచ్చరిక ద్వారా తెలియజెయ్యబడింది.

బాధాకరమైన విషయమేమిటంటే, దేవుడు కయీనుతో మాట్లాడిన తరువాత, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు, అక్కడ ఎవరు సాక్షులు లేరు. కయీను హేబెలును హత్య చేశాడు. ఏ కారణం చేత కయీను హేబెలును చంపాడు? ఎందుకంటే తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే (1 యోహాను 3:12). మొదటి హంతకుడు అయిన కయీను తన దుష్కార్యానికి ప్రేరణను అపవాది నుండి పొందాడు, ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదని, యోహాను 8:44 చెప్తూవుంది. కయీను తన సోదరుడిని హత్య చేసి మొదటిగా రక్తాన్ని భూమిపై చిందించాడు. అతని పాడైన స్వభావం ద్వారా అసలు పాపాన్ని ప్రవేశపెట్టడానికి వేదికను ఏర్పాటు చేశాడు. హేబెలు కయీను కంటే మంచివాడు కాబట్టి. హేబెలును తొలగిస్తే తనను తక్కువ చేసేందుకు పోల్చేందుకు ఎవరు ఉండరని అతడు అనుకొన్నాడు. తన క్రియలకు బాధ్యత వహించడం ద్వారా అతడు సమస్యను పరిష్కరించాలని అనుకోలేదు బదులుగా దేవుని ఎదుట తన స్థాయిని తక్కువ చేసిన హేబెలును హత్యా చేసి అతన్ని శాశ్వతముగా తనకు అడ్డు తొలగించుకోవాలని అనుకొన్నాడు.

మరల యెహోవా కయీనుతో ఎందుకని మాట్లాడాడు? కయీను పశ్చాత్తాప పడాలనే ఉద్దేశ్యములో యెహోవా రెండవసారి కయీనుతో మాట్లాడాడు. ఆ హత్య బయటపడదని కయీను అనుకొనివుండొచ్చు. కాని యెహోవా హంతకుడిని ప్రత్యక్ష ప్రశ్నతో ఎదుర్కొని : కయీను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? అని అడిగాడు. అందుకు కయీను నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అని బదులిచ్చాడు. కయీను కరడుగట్టిన పాపిగా, తన సోదరుడి పట్ల తనకున్న బాధ్యతలను ఖండించటం విచారించదగిన విషయము. అతడు ధైర్యంగా దేవునితో అబద్దం చెప్పాడు. అతని పాపం అతని హృదయాన్ని కఠినతరం చేసింది, అతనిలో పశ్చాత్తాపం లేదు దుఃఖం లేదు. అప్పుడు యెహోవా హంతకుడిని తన నేరానికి సంబంధించిన సాక్ష్యాలతో ఎదుర్కొని : “నీవు చేసిన పని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టు చున్నది అని బయలుపరచాడు. ఎవరూ చూడకుండా సాక్ష్యము లేకుండా కయీను తన సోదరుడిని తొలగించానని అనుకున్నాడు, కాని హేబెలు యొక్క చిందిన రక్తం నిరంతరం ప్రతీకారం కోసం దేవుని ఎదుట ఏడుస్తుందని అతనికి తెలియదు. కయీను ఏమి మాట్లాడలేక పోయాడు, తన నేరానికి దేవుడు సమర్పించిన రుజువును ఖండించలేక పోయాడు.

కయీను నేరానికి జీవితకాల రిమైండర్‌గా, దేవుడు కయీను పై శాపం ప్రకటించాడు: కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడిన వాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అతడు తన జీవితాన్ని ఇక చంచలమైన సంచారిగా గడపవలసి ఉంది, ఇక మీదట చాలా కష్టంతో మాత్రమే జీవనం కొనసాగించాల్సి ఉంది.

అందుకు కయీను –నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడోవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. శాపాన్ని వినిన తర్వాత కయీను నిజమైన పశ్చాత్తాపంతో యెహోవా వైపు తిరగడానికి బదులుగా, తన పాపం యొక్క అపరాధం చాలా గొప్పదని, అతని శిక్ష అతనికి భరించటానికి చాలా భారీగా ఉందని చెప్పాడే తప్ప కనికరించమని అతడు యెహోవాను ప్రాధేయపడలేదు. అతని మాటలు న్యాయమూర్తిపై ఆరోపణను సూచిస్తున్నాయి, అతను అలాంటి భరించలేని భారాన్ని అతనిపై వేశాడు. కయీన్ భయపడ్డాడు. అతను తన సొంత జీవితానికి భయపడ్డాడు. తన ఇతర సోదరులు లేదా సోదరీమణులు ప్రతీకారంగా అతన్ని చంపవచ్చని అతను భావించాడు. ఈ సమయంలో ఆడమ్ వారసులు భూమిపై మూడు లేదా నాలుగు తరాలు ఉండవచ్చు. అతని మాటలు న్యాయమూర్తిపై ఆరోపణను సూచిస్తున్నాయి. అతనిపై వేయబడిన భరించలేని శిక్షను బట్టి కయీను భయపడ్డాడు. అతడు తన జీవితాన్ని బట్టి భయపడ్డాడు. తన ఇతర సోదరులు లేదా సోదరీమణులు ప్రతీకారంగా అతన్ని చంపవచ్చని అతను భావించాడు. ఈ సమయంలో ఆడమ్ వారసులు భూమిపై మూడు లేదా నాలుగు తరాలు ఉండొచ్చు.

అందుకు యెహోవా అతనితో–కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతి దండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. ఇది జరగదని కయీన్‌కు భరోసా ఇవ్వడానికి, కనికరముగల యెహోవా కయీనుకు ఒక గురుతు ఇచ్చాడు. ఈ గుర్తుతో కయీనును ప్రతీకారం నుండి దాచాడు. కయీను భద్రతకు ఈ గుర్తు ద్వారా హామీ ఇవ్వబడింది. దేవుడు కయీను పట్ల దయ చూపించాడు. కయీనును చంపడానికి బదులుగా, దేవుడు అతన్ని మరణం నుండి రక్షించాడు. అట్లే అతడు తన దైవిక తల్లిదండ్రుల నుండి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి వేరుచెయ్యబడ్డాడు. అతడు సంఘము నుండి బహిష్కరించబడ్డాడు. అయినను, అతడు పశ్చాత్తాపపడలేదు, క్షమాపణ కోసం విజ్ఞప్తి చేయలేదు. కయీను దేవుని శిక్ష క్రింద అతని మరణ పర్యంతము ఉండవలసి యున్నాడు. దీనిని దేవుడు అతని జీవితాంతం నిర్వహిస్తాడు. అతడు తప్పించుకోలేడు.

అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన సోదరీమణులలో భార్యగా తీసుకొన్న తనతో కలసి ఏదేనుకు తూర్పు వైపు ప్రయాణించారు. కయీనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది? అనే ప్రశ్నకు, ఆదిమ రోజుల్లో, సోదరులు తమ సోదరీమణులను భార్యలుగా తీసుకున్నారు.

సమస్య పరిష్కరించబడిందా? దేవుడు సమస్యను పరిష్కరించాడు.

దైవభక్తి లేని కయీను వారసులు మానవ జాతిని నాశనం చేసిన గొప్ప వరదకు నేరుగా బాధ్యత వహించారు.

నేర్చుకొందాం

  1. ఈ పాఠం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? కయీను మరియు హేబెలు. అసూయ మరియు పోటీ. కయీను మరియు హేబెలు యొక్క ఈ కథ యొక్క ప్రధాన ఆలోచన ఏమిటంటే, ప్రభువు సమక్షంలో ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి. విశ్వాసం నిండిన హృదయం దేవునికి అందించే గొప్ప బహుమతి అని తెలుసుకొందాం. దేవుని పట్ల విశ్వాసం, గౌరవంతో నిండిన హృదయం నుండి మన సమర్పణలు రావాలి. ఈ కథ మనకు సహనం మరియు వినయం కలిగియుండాలని బోధిస్తుంది. ఒకవేళ కయీను తన సోదరుడితో సమర్పణ విషయములో సంప్రదించి ఉంటే, అప్పుడు అతడు హత్యకు దారితీసే అసూయ భావనను నివారించి ఉండేవాడు.
  2. పాఠం ఏ పాపం ఒప్పుకోవటానికి మనకు నేర్పుతుంది? యూదా 1:11 లో, “కయీను నడిచిన మార్గమున” నడవకుండా ఉండమని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అసూయ, కోపం, ద్వేషం, అపవిత్రమైన ఉద్దేశాలు, తప్పుడు ఆరాధన, తిరుగుబాటు, అబద్ధాలు, పాపమును బట్టి కఠినము చెయ్యబడిన హృదయము, హత్య, శిక్ష, కుటుంబం నుండి వేరుచేయబడడం, దేవుని నుండి దూరముగా వెళ్లిపోవడం, హత్య చేసి ప్రతిదీ కోల్పోవడం, ఆదాము హవ్వలు తమ ఇద్దరు కుమారులను కోల్పోవడం, కయీను వారసులు అతని పాపత్వాన్ని పెంచడం.
  3. ఈ పాఠంలో దేవుని ప్రేమను మనం ఎక్కడ చూస్తాము? దేవుడు హేబెలును ప్రేమించినట్లే కయీనును కూడా ప్రేమించాడు. దేవుడు తన ప్రేమలో కయీనును హెచ్చరించాడు. మంచిగా పనులు ఎలా చేయాలో నేర్చుకోవడానికి కయీనుకు దేవుడు సహాయం చేయాలనుకున్నాడు, కాని కయీను దానిని గమనించలేదు. ఆ విధంగా యెహోవా ఎల్లప్పుడూ తన పరిశుద్దులను చూసుకుంటాడు మరియు వారి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆయనపై నమ్మకం ఉన్న వారు సిగ్గుపడరు.
  4. ఈ కథలో దేవుడు మనకు ఏమి భోదిస్తున్నాడు? చిత్తశుద్ధితో జీవించమని చెప్తూవున్నాడు. దేవుడు మన వైఖరితో పాటు మన చర్యలను కూడా పట్టించుకుంటాడు. మా చర్యలకు మనం బాధ్యత వహించవలసియున్నాము. మనం పశ్చాత్తాపపడి దేవునికి దగ్గరగా ఉండాలి. తన నిబంధనలపై దేవుణ్ణి ఆరాదించవలసియున్నాము. దేవుడు మన నిబంధనల ప్రకారం పూజించబడడు. శోధనకు చోటివ్వకూడదు. పాపం మనలను నియంత్రించనివ్వకూడదు.

మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రపంచంలో జన్మించిన మొట్టమొదటి మానవుడు కయీను, హేబెలు చనిపోయిన వారిలో మొదటి మానవుడు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.