* ద్వితీయోపదేశకాండము 4:2, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు.

ఇశ్రాయేలు తన మాటలకు దేనిని కలుపకూడదని లేదా దానిలో నుండి దేనిని తీసివేయకూడదని మోషే చెప్పిన మాటలు లేఖనాల అంతటా పునరావృతమవుతూ ఉన్నాయి. యాకె కుమారుడైన ఆగూరు, సామెతలు 30:5,6లో దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమియు చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు అని చెప్తూవున్నాడు. అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంధమును ముగిస్తూ, ప్రకటన 22:18,19లో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా –ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును అని వ్రాసియున్నాడు. పరిసయ్యులు లేఖనాలకు భారమైన నియమాలను మరియు నిబంధనలను జోడించినందుకు యేసు వారిని విమర్శిస్తూ : మత్తయి 15:6లో, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు అని వారితో చెప్పియున్నాడు.

మతోధ్ధారణ నుండి మనకు వారసత్వంగా లభించిన గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి, ఏది దేవుని వాక్యమో ఏవి మానవుని మాటలో గుర్తించగల సామర్థ్యం. ప్రతిఒక్క క్రైస్తవుడు తన స్వంత పవిత్రమైన భావాలను లేదా పెంపుడు సంప్రదాయాలను లేఖనాల స్థాయిలో ఉంచేలా శోధింపబడొచ్చు కాని “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” (యెషయా 43:1) అని మనం వివరించగలిగితే తప్ప మరొక వ్యక్తి హృదయాన్ని లేదా జీవితాన్ని నిర్మించలేం. పాత నిబంధన ప్రవక్తలు ప్రజల పాపపు లైంగిక అలవాట్లను గురించి, వారి నామకార్ధ ఆరాధన పద్ధతులను గురించి లేదా వారి అవినీతి వ్యాపార వ్యూహాల గురించి మాట్లాడినప్పుడు, ప్రజలు దేవుని వాక్యాన్ని విస్మరించియున్నందుకు వారి తరాన్ని ప్రవక్తలు ఖండించియున్నారు. హోషేయ ద్వారా యెహోవా మాట్లాడుతూ, హోషేయ 4:1,2,6లో, సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు (లేవు). అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. నీవు జ్ఞానమును విసర్జించు చున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును, అని సెలవిచ్చియున్నాడు.

మనకు అసౌకర్యాన్ని కలిగించే లేఖన భాగాలను కాని లేదా ప్రాముఖ్యము కాదు అని మనం అనుకొన్న లేఖన భాగాన్ని కాని (ఉదాహరణగా, ప్రభువు ప్రార్ధన, అనేకులు ఇది యేసు శిష్యులకు నేర్పిన ప్రార్ధన మనకు ప్రాముఖ్యము కాదు అని అనుకొంటున్నారు) లేదా జనాదరణ పొందని లేఖన భాగాలను కాని దేవుని వాక్యం నుండి తీసివేయడానికి మనం శోధింపబడొచ్చు.

దేవుడు ప్రజలకు తన వాక్యమును ఇచ్చి “మీరు జీవించుటకు” దానిని పాటించుమని ఆజ్ఞాపిస్తున్నాడని మోషే చెప్పాడు, వారు స్వాధీనపరచు కొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు ఆలాగు ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికేగాని యెడమకేగాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము లన్నిటిలో నడుచుకొనవలెను, ద్వితీయోపదేశకాండము 5:32,33; 4:40; 6:1,2; 12:28. జీవించడానికి విలువైన ఏకైక జీవితానికి మార్గం దేవుని యొద్దకు దారి తీస్తుంది. కాబట్టే, యేసు, “గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని” చెప్పాడు, యోహాను 10:10.

* ప్రకటన 22:18, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా– ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. ప్రకటన గ్రంధము యొక్క హెచ్చరికలు మరియు వాగ్దానాలు ఆత్మల శాశ్వతమైన లక్ష్యానికి కీలకమైనవి. అందుకే ఒక్క మాట కూడా మార్చవద్దని యోహాను హెచ్చరిస్తూవున్నాడు. మోషే కూడా ఇశ్రాయేలీయులను అదే విధంగా దేవుని ధర్మశాస్త్రం గురించి హెచ్చరిస్తూ, “మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు“, అని ద్వితీయోపదేశకాండము 4:2లో చెప్పియున్నాడు. యోహాను యొక్క ఈ హెచ్చరిక, వాస్తవానికి, మనం లేఖనాల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తూవుంది. దేవుని హెచ్చరికలను మరియు వాగ్దానాలను పంచుకోవడానికి మనం “సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా“, (2 తిమోతి 2:15) ఉండవలసియున్నాము. దేవుని ధర్మశాస్త్రం యొక్క బెదిరింపులను మృదువుగా చేసే ఉపదేశకులు లేదా తాత్కాలిక సామాజిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన మోక్షానికి సంబంధించిన దేవుని వాగ్దానాలను వర్తకం చేసేవారు ఈ హెచ్చరిక యొక్క శాపానికి గురవుతారు.

* యిర్మీయా 14:14, యెహోవా నాతో ఇట్లనెను–ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అబద్ధ ప్రవక్తలపై నిందను నెట్టివేయడానికి యిర్మీయా చేసిన ప్రయత్నాన్ని యెహోవా తిరస్కరించాడు. తన ప్రజల అవిశ్వాసానికి అబద్ధ ప్రవక్తలు సాకు కాదు. ప్రజలు మోసపోవడాన్ని కోరుకొంటున్నారు కాబట్టే వాళ్ళు మోసపోతున్నారు. అబద్ధ ప్రవక్తల మోసానికి స్వీయ మూలం స్పష్టంగా ఉంది- వారి స్వంత మనస్సు యొక్క భ్రమలు. అబద్ధ ప్రవక్తలు పలుకవచ్చు కాని ఎవరూ వారి మాట వినకూడదు లేదా వారి మాటలను అనుసరించకూడదు.

అబద్ధ ప్రవక్తల విషయములో యెహోవా చెప్పిన మాటలను ప్రతి ఒక్కరు తమకు అన్వయించుకోవలసియున్నారు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో, అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తించవచ్చొ యెహోవా తన ప్రజలకు తెలియజేసి యున్నాడు. వారు ఈ సూచనలను ఉపయోగించడం అవసరం. యెహోవా యెషయా ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని పునరుద్ఘాటించాడు, ఆయన తన ప్రజలను ప్రోత్సహిస్తూ, “ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్య ప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు”, యెషయా 8:20 అని చెప్పియున్నాడు. కాబట్టి ప్రతి తరములోని ప్రతి విశ్వాసి అబద్దపు ప్రవక్తలను – అన్ని కొత్త బోధలను – యెహోవా స్వయంగా అందించిన ప్రమాణ వాక్యము ద్వారా తీర్పు తీర్చవలసియున్నాడు. ఆయన వాక్యమే ప్రమాణము దాని ద్వారానే ఏ మత గురువు ఏది చెప్పినా తీర్పు తీర్చాలని ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు.

తన ప్రజల మనస్సుల నుండి అన్ని సందేహాలను తొలగించడానికి, యెహోవా వారితో “నేను వారిని [ఈ ప్రవక్తలను] పంపలేదు” అని నిర్మొహమాటంగా చెప్తున్నాడు. వారే స్వయంగా వచ్చారు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గుర్తించే మరొక గుర్తు కూడా ఉంది. లేఖనాల యొక్క స్పష్టమైన సాక్ష్యాన్ని ప్రక్కన పెట్టి వారు తమ స్వంత అధికారంతో మాట్లాడతారు. వారు పంపబడలేదు, పిలవబడలేదు లేదా నియమించబడలేదు. వారు తమ స్వంత అధికారంతో మరియు వారి స్వంత పేరుతో వస్తారు తప్ప వారిలో శక్తి లేదు. వారి అంతం, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు, 2పేతురు 2:3. అబద్ధ ప్రవక్తలు నాశనం చేయబడతారు. వారి బోధలను వినే వారందరూ ఒకే బహుమతిని పంచుకుంటారు.

* మత్తయి 15:9, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు. మన పాఠములో యేసు మాట్లాడుతున్నది పరిసయ్యులు, శాస్త్రులతో. యేసు వారిని సరిగ్గానే విమర్శించాడు. వారు విమర్శకు అర్హులైనను యేసు వారిని విమర్శించినపుడు వాళ్ళు ఆ విమర్శలను అంగీకరించడానికి ఇష్టపడలేదు. పైగా యేసును వారు మతపరమైన విషయాలలో తమ అధికారానికి ముప్పుగా భావించడమే కాకుండా ఆయన నోరు ప్రజల ముందు ఎలాగైనా మూయించాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అందులో భాగముగా, వారు యేసును కుయుక్తిగా ప్రశ్నలు అడగడం ద్వారా లేదా ఆయన శిష్యులు తమ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని నిందించడం ద్వారా ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించారు. వారు ఇక్కడ చేస్తున్నది అదే. వారు యేసును, “నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని” ప్రశ్నించారు. వాళ్ళు ఇలా ప్రశ్నించింది జవాబును తెలుసుకోవాలని కాదు. వారు నిందారోపణ చేశారు.

భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం అనేది ఖచ్చితంగా శుద్ధికారణాచారానికి సంబంధించిన ఒక ఆచార విషయం. అసలు మురికిని తొలగించడానికి దీనికి సంబంధం లేదు. వారి ఆలోచనా విధానం ప్రకారం, వారి చేతులు “అపవిత్రమైన” వ్యక్తి లేదా వస్తువుతో సంబంధంలోకి రావడం ద్వారా “అపవిత్రం” అయి ఉండవచ్చు, కాబట్టి తినే ముందు క్లుప్తంగా చేతులు కడగడం వల్ల వారు తమ ఆహారాన్ని కలుషితం చేయలేదని నిర్ధారించుకోవచ్చు. మోషే ధర్మశాస్త్రంలో ఆచార సంబంధమైన పరిశుభ్రత మరియు అపవిత్రత గురించి అనేక నిబంధనలు ఉన్నాయి, అయితే ఇది ఖచ్చితంగా మానవ నిర్మిత నియమం. పెద్దల సంప్రదాయాలు, దేవుని ఆజ్జ్యలు కావు, కొన్ని సందర్భాల్లో అవి దేవుని ఆజ్జ్యలకు కూడా విరుద్ధంగా ఉన్నాయి.

యేసు వారి ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా ప్రతిస్పందిస్తూ, బదులుగా, ఆయన వారిని “మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?” అని అడిగాడు. దేవుడు తన ప్రజలకు “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” అనే ఆజ్జ్యను ఇచ్చాడు, నిర్గమ 20:12. మన తల్లిదండ్రులను గౌరవించమని కోరే నాల్గవ ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది. కాని దీనిని వాస్తవికతలో పరిసయ్యులు శాస్త్రులు వారి స్వప్రయోజనాల కోసం మార్చుకొన్నారు. మార్కు 7:11-13, కాబట్టే మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పిన యెడల, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. వృద్ధాప్య తల్లి తండ్రులు వారి అవసరతలలో పిల్లలను డబ్బులు లేదా వేటినైనను అడిగినప్పుడు పిల్లలు తల్లితండ్రులకు డబ్బు/ వాటిని ఇవ్వకుండా వాటిని ఆలయ ఖజానాకు అంకితం చేయవచ్చని బోధించడం ద్వారా పరిసయ్యులు ఆ ఆజ్ఞకు మినహాయింపును ఇచ్చారు, అది దేవుని ఆజ్జ్యను తిరస్కరించడమే.

ఇది కొర్బాను (దేవార్పితమని) చెప్పడం ఒక వ్యక్తిని అతని తల్లిదండ్రుల పట్ల అతని బాధ్యత నుండి మినహాయించటం కరెక్ట్ కాదు. ఒకడు వాని తల్లితండ్రులను నిర్లక్ష్యము చేసి బాధ్యతల నుండి తప్పించుకొనేందుకు, వాడు ఈ తప్పునుండి విడిపించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా కొర్బానును మందిరానికి ఇవ్వొచ్చని చెప్పడం ధర్మము క్రిందికి రాదు. మరో మాటలో చెప్పాలంటే, వారి తల్లిదండ్రులను మోసగించడానికి (మరియు తమను తాము సంపన్నం చేసుకోవడానికి) చట్టవిరుద్ధమైన మరియు మోసపూరితమైన మార్గంలో మందిరానికి అంకితం ఇవ్వబడిన డబ్బును పరిసయ్యులు (చట్టబద్ధమైన కొర్బాను అర్పణను) తీసుకున్నారు, ఉపయోగించు కొన్నారు. ఆ విధంగా, దేవుని వాక్యము నిరర్థకము చేయబడింది. ప్రతి ఒక్కరు వారి తలితండ్రుల పట్ల వారి ధర్మాన్ని నిర్వర్తించమని దేవుడు ఆజ్జ్యను ఇచ్చినప్పుడు, ఒకరి ధర్మాన్ని ఒకరు నిర్వర్తించకుండా చెయ్యడం దేవుని వాక్యమును  నిరర్థకము  చెయ్యడం కాదా అని యేసు పరిసయ్యులును ప్రశ్నించాడు.

క్రైస్తవులుగా దేవుని రాజ్యమే మన ప్రాథమిక ఆందోళన అని మనకు తెలుసు. కానీ మనం ఆ పదాన్ని చాలా సంకుచితంగా నిర్వచించకూడదు. దేవుని ఆజ్ఞలకు లోబడి మనం చేసే ప్రతి పని దేవునికి చేసే సేవ అని గుర్తుంచుకోవాలి. మన తల్లిదండ్రుల కోసం లేదా మన పిల్లలకు లేదా అవసరంలో ఉన్న ఎవరికైనా మనం ఏమి చేసినా, యేసు తనకు వ్యక్తిగతంగా చేసిన సేవగా భావిస్తాడు. మన పొరుగువారిని ప్రేమించకుండా మనం దేవుణ్ణి ప్రేమించలేము. దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం మరియు ఇతర వ్యక్తులపై ప్రేమను చూపించడానికి నిరాకరించడం ఒక వైరుధ్యం.

బేతనియకు చెందిన మరియ యేసు పాదాలపై ఖరీదైన లేపనాన్ని పోయడాన్ని యూదా ఇస్కరియోతు ఖండించినప్పుడు, అతడు ఈ వైరుధ్యాన్ని చూపించాడు. యేసు చెప్తున్నట్లుగా, పరిసయ్యులు శాస్త్రులు మరియు యూదా ఇస్కరియోతు అందరూ వేషధారులే. అలాంటి వ్యక్తులు ఉంటారని యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. యేసు యెషయా 29:13ని, “ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు –ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచు చున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి“, ఉటంకించాడు.

అటువంటి వేషధారులు భక్తితో కూడిన మాటలు పలుకుతారు మరియు దైవభక్తి యొక్క విధానాలను ప్రభావితం చేస్తారు, వారి మాటలు క్రియలు హృదయంలో నుండి రావు. వారి ఆరాధన శూన్యమైనది, దేవుని దృష్టిలో అసహ్యమైనది, ఎందుకంటే వారు మానవ నిర్మిత నియమాల గురించి ఆందోళన చెందుతారు తప్ప దేవుని ఆజ్ఞలు గురించి దేవుని సత్యం గురించి ఆందోళన చెందరు. ఈ రోజుకి ఈ ప్రపంచం తమ స్వంత నియమాలను రూపొందించే మతాలతో నిండి ఉంది. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. కాని వాళ్ళు ఆ మతాలలో మేము ఆధ్యాత్మికతంగా ఉన్నత స్థాయికి చేరుకున్నామని చెప్పుకొంటున్నారు. కొంతమంది బైబిల్‌తో పాటు దేవుని నుండి ప్రత్యక్షతలను ప్రత్యేకముగా అందుకున్నామని చెప్తూ ఉంటారు, (ఉదాహరణకు, మార్మన్ చర్చ్ వ్యవస్థాపకుడు జోసెఫ్ స్మిత్). మరికొందరు మంచి మరియు చెడు, ఒప్పు మరియు తప్పుల గురించి వారి స్వంత ఆలోచనలే, వారు నమ్మే మరియు బోధించే వాటికి ఆధారం. క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది, దురదృష్టవశాత్తూ, దేవుని ప్రేరేపిత వాక్యం కంటే తమ స్వంత మనస్సులను ఉన్నతమైన అధికారంగా చేసుకుంటారు. వారు తమ స్వంత నియమాలను రూపొందించుకుంటారు.

* 2 పేతురు 2:3, వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు.