వాళ్ళు దానిని ఎలా పోగొట్టుకొని యున్నారు?
ఆదికాండము 2:16,17 మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తిన వచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

ఆదికాండము 2:17 దేవుడు ఆదాముతో, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించాడు. ఈ వచనంలో దేవుడు పాలకునిగా మరియు శాసనకర్తగా (lawgiver) కనిపించుచున్నాడు. ఆదాము తన శక్తి మేరకు దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవను మాటలకు, వాటిని తిను దినమున ఆదాము తాను కలిగియున్న అన్ని ఆనందాలను కోల్పోతాడని మరియు అతని భౌతిక శరీరం యొక్క మరణానికి బాధ్యత వహించవల్సి ఉంటుందని, అమరత్వాన్ని కోల్పోయి మర్త్యుడు అవుతాడని అట్లే వాటితో పాటు వచ్చే అన్ని కష్టాలకు అతడు బాధ్యత వహించవలసి ఉంటుందని; మరియు అతడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతాడని, దేవునికి మరియు దైవిక విషయాలకు చచ్చిన వారివలె అయిపోతారని, దేవునితో ఐక్యతను మరియు నిత్య జీవితాన్ని రెండింటిని కోల్పోతాడని ఆ బెదిరింపు తెలియజేస్తూవుంది.

అయితే ఇక్కడ కొందరు, మరణం అంటే ఏమిటో ఆదాము ఎలా అర్థం చేసుకున్నాడు? పాపానికి ముందు ఏదెనులో మరణం ఉందా? ఆదాము మునుపెన్నడూ మరణాన్ని చూడకపోతే మరణం అంటే ఏమిటో ఆదాముకు ఎలా అర్ధం అయ్యింది? అని ప్రశ్నించొచ్చు. ఆదాముకు మరణం అంటే ఏమిటో తెలియకపోతే ఆదికాండము 2:17లోని దేవుని హెచ్చరిక ఆదాముకు అర్థంలేనిది.

దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెనని, ఆదికాండము 1:31 అట్లే దేవుని స్వరూపములో ఆదాము హవ్వలు సృజింపబడియున్నారని ఆదికాండము 1:27 ద్వారా ప్రకటించియున్నాడు. ఆదికాండము 2:19లో దేవుడైన యెహోవా జంతువులకు పేర్లు పెట్టమని ఆదాముని అడిగారని మనం చదువుతాము. ఆదాము ఈ పనిని ఇంతకు ముందెన్నడూ చేయలేదు, కాని అతడు ఆ ఆదేశాన్ని అర్థం చేసుకున్నాడు, సమస్యలు లేకుండా విజయం సాధించాడు. దేవుడు అతనిలో భాషను మాత్రమే కాకుండా, భాషను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా ఉంచియున్నాడు. అతడు దేవునిలా ఉన్నాడు, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. ఆదాము జంతువులకు పేరు పెట్టడం “మొదటిసారి”, కాని అతడు దానిని చేయగలిగాడు. ఆదాము కొత్త పదజాలాన్ని కూడా అర్థం చేసుకున్నాడు, దీనిని అతడు ఇంతకు ముందు చూడని విషయాలకు లేదా చేయని విషయాలకు వర్తింపజేసాడు.

ఆదికాండము 2:16లో, మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అని చెప్పాడు. అంటే ఆదాము “ప్రతి వృక్షమును గురించి” ప్రతి వృక్షము అంటే ఏమిటో తెలుసుకోవాలి (అలాగే “మొక్కలు” అంటే ఏమిటి; “జలచరములు” అంటే ఏమిటి; “ఉభయచరాలు” అంటే ఏమిటి; “భూ జంతువులు” అంటే ఏమిటి; “పక్షులు” అంటే ఏమిటి? మరియు “తినుట” అంటే ఏమిటి; మరియు ‘ఫలం’ అంటే ఏమిటి, అన్నింటిని గురించి.)

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.