1. దేవుడున్నాడని మనకు యెట్లు తెలియును?
హెబ్రీయులకు 3:3,4_ ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు (స్థాపించిన వాడు) దేవుడే.
ఈ సృష్టిలో ప్రతిది భౌతిక నియమాలకు కట్టుబడి లోబడి ఒక క్రమమైన పద్దతిలో విశిష్టమైనరీతిలో ఆశ్చర్యముగొల్పే విధానములో వ్యవస్థీకృతముగా ఉందనే విషయాన్నితెలియజేస్తూ ఉండటం గమనించారా? ఒకరి ప్రమేయము లేకుండగానే ఇదంతా ఆక్సిడెంటల్‌గా జరిగిందంటారా?
ఒకసారి ఆస్తికుడైన ఒక శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో సౌరమండలం యొక్క నమూనాను తాయారుచేసి Existence of electromagnetic radiation సిధ్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రయోగాలు చేస్తూవుండగా నాస్తికుడైన మరొక శాస్త్రవేత్త అక్కడికి రావడం జరిగింది. నాస్తికుడైన ఆ శాస్త్రవేత్త ఆ సౌర మండలము యొక్క నమూనాను చూసి ఇది అద్భుతం దీనిని ఎవరు చేసారని అడిగాడు. దానికి ఆస్తికుడైన శాస్త్రవేత్త నేను ఈ ప్రయోగశాలలో మరొక రూంలో ఉండగా ఒక పెద్ద శబ్దమును విన్నాను. అది ఏమిటో చూద్దామని ఈ రూంలోకి రాగా ఇది ఇక్కడ వుంది అని జవాబు చెప్పాడు. దానికి నాస్తికుడైన శాస్త్రవేత్త అదెలా సాధ్యము. దీనిని ఒకరు రూపించకపోతే ఇది సాధ్యము కాదు అని అన్నాడు. నిజమే, ఒకరు రూపించనిదే ఈ సృష్టి ఉనికిలోనికి రాలేదనే విషయాన్ని ఈ సృష్టి గుర్తుచేస్తు ఉందండి.
ఈ అనంత విశ్వము ఆక్సిడెంటల్‌గా జరుగలేదని, బైబులులో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3:3 లో స్పష్టముగా ప్రతి యిల్లును ఎవడైన ఒకని చేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే అని చెప్తూ ఉంది. ఈ మాటలకు అర్ధం ఈ సృష్టికి ఒక ఫౌండర్ ఎస్టాబ్లిషర్ బిల్డర్ మేకర్ ఉన్నాడని, ఈ సృష్టి తనకుతానుగా ఉనికిలోనికి రాలేదని “singularity” అనేదే లేదని దీని వెనుక ఒక సృష్ఠికర్త వున్నాడని, దీని devolopmentని దీని conditionsని నిర్ణయించినవాడు దేవుడేనని ఇందులో వాడినవన్నీ దేవునిచే సృజింపబడినవేనని ఆయన అన్నింటి సృష్టికర్త కాబట్టి ఆయన అన్నింటిపైగా ఉన్నవాడని ఆయనను గురించి ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి.
కీర్తన 19:1-4_ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతట వ్యాపించియున్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
ఆకాశములు దేవునిమహిమను వివరించుచున్నవి అంటే (ఆకాశములు స్పష్టంగా, దృఢంగా, బహిరంగంగా, అధికారికంగా అందరికి దేవుని మహిమను గురించి మరియు వాటి సృష్టికర్త యొక్క గొప్పతనమును గురించి వెల్లడిస్తు వున్నాయని అర్ధం). అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది అంటే ప్రతిరోజూ అంతరిక్షము తాను ఎలా అద్భుతఃకరమైన రీతిలో మరియు క్రమపద్ధతిలో వ్యవస్థికరించబడియున్నదో మరియు వాటి ప్రాపర్టీస్ ఫీచర్స్ అండ్ డ్యూటీ’sని మరియు నిత్యుడు జీవాధిపతి సర్వశక్తిమంతుడైన తన సృష్టికర్త యొక్క గుణలక్షణాలను గురించి తెలియజేస్తూ ప్రతిరోజు ఆ సృష్టికర్తయొక్క చేతిపనులను పబ్లిష్ చేస్తూ ఉన్నదని అర్ధం. పగటికి పగలు బోధచేయుచున్నది అంటే ఎన్నటికి ఆగిపోని ఒక స్థిరమైన ప్రవాహము వలె పగలు మనలను ఎడ్యుకేట్ చేస్తూ ఇంస్ట్రుక్షన్స్ ఇస్తూ ఇల్లుమినేట్ చేస్తూ దేవుని విషయములో పాఠాలు నేర్పిస్తు ఉన్నదని అర్ధం. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అను మాటలకు దేవుడు తనను గురించి తాను బయలుపరచిన విషయాలను మరియు ఇంతకు ముందు రహస్యముగా ఉన్న విషయాలను రాత్రి బహిర్గతము చేస్తూ ఉందని అర్ధం. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి అను మాటలకు, దేవునిచే సృష్టించబడి నిర్వహించబడుతున్న ఈ సృష్టి దాని సృష్టికర్త యొక్క శక్తి, జ్ఞానానికి నిశ్శబ్ద సాక్ష్యాన్ని ఇస్తూ ఉందని అర్ధం. నక్షత్రాల గంభీరత వాటి క్రమబద్ధత వాటి సృష్టికర్తయొక్క మహిమను తిరస్కరించేవారందరిని మరియు సృష్టికర్తకు బదులుగా సృష్టికి ప్రాధాన్యతనిచ్చే వారందరిని నిశ్శబ్దంగా మందలిస్తూ మౌనంగా ఖండిస్తు ఉండటమే కాకుండా ఏ ఒక్కరు దేవుని గురించి నాకేమి తెలియదు అని సాకులు చెప్పి తప్పించుకొనే అవకాశము ఎవ్వరికి ఇవ్వటం లేదు. ఆయన దైవికమైన ఉనికిని తిరస్కరించే వారికి ఎలాంటి కారణము లేదు అని తెలియజేస్తూవున్నాయి. భగవంతుని ఉనికికి విశ్వమే మొదటి రుజువు అని ఆయన సృజించిన వాటిని బట్టి దేవుడున్నాడని మనం ఒప్పుకొని తీరవలసి ఉన్నాం.
కీర్తన 14:1_ దేవుడులేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు. అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.
మనుష్యుని చుట్టూ ఆవరించివున్న ఈ సృష్టి తన సృష్టికర్తను గురించి స్పష్టముగా తెలియజేస్తూ ఉండగా దేవుడు లేడని చెప్పడం బుద్ధిహీనతే అవుతుంది. కొందరు ఈ సృష్టికి సృష్టికర్త ఎవరు లేరని ఈ అనంత విశ్వములో ప్రతిది మనతో సహా ఒకరి ప్రమేయము లేకుండగానే ఆక్సిడెంటల్‌గా ఉనికిలోనికి వచ్చిందేనని చెప్తూ వుంటారు. శాస్త్రవేత్తలేమో దేవుని ఉనికిని prove చెయ్యడానికిగాని disprove చెయ్యడానికిగాని ప్రయత్నించరు, ఎందుకంటే దేవుణ్ణి గుర్తించగల ప్రయోగం ఏదీలేదని వారికి తెలుసు, బైబులు కూడా “దేవుడులేడని బుద్ధిహీనుడు మాత్రమే తన హృదయములో అనుకొనును” అని కీర్తన 14:1 లో తెలియ జేస్తూవుంది.
దేవుడులేడని కొందరు ఎందుకని అనుకుంటారో తెలుసా? దేవుడు లేడని చెప్పేవాడు వక్రబుద్ధిని చూపిస్తూ తెలిసి తెలిసి దేవుని మోరల్ రూల్ ని తిరస్కరిస్తు ఉన్నాడు. అందుకు అతని అజ్ఞానం లేదా వీక్నెస్ అఫ్ రీజన్ కారణం కాదు. వాడు తన పాపస్వభావమునుబట్టి కఠినచిత్తుడై, తన అనైతిక జీవితాన్ని అతడు ఎంతో ఇష్టపడుచూ ఉండుటనుబట్టి ఆ విషయములో తనను ఎవ్వరు తీర్పుతీర్చకూడదని తాను ఎవ్వరికి లెక్క చెప్పాల్సిన పనిలేదని అనుకొంటూ తనపై న్యాయాధిపతిగాని అధికారిగాని ఎవడులేడని తన వ్యవహారాలపై తీర్పులేదని తననుతాను సంతోషపరచుకొనే క్రమములో సంతృప్తిపరచుకొనే క్రమములో దేవుడులేడని బుద్ధిహీనుడు చెప్తాడని బైబులు చెప్తూ ఉంది.
జవాబు: ఆయన సృజించిన వాటిని బట్టి దేవుడున్నాడని మనకు తెలియును.
2. ఆయన సృజించిన వాటిని బట్టి దేవునిని గూర్చి మనకేమి తెలియును?
అపొ. కార్య. 14:17_ అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు ఆహారము ననుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుట చేత తన్నుగూర్చి సాక్ష్యము లేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.
బైబిలులో దేవుడు వెల్లడించిన సత్యాలు అందరికి అందుబాటులో లేకపోయినను ప్రకృతిలో ఆయన మంచితనాన్ని గురించి ఆయన వెల్లడిచేసినది మాత్రం అందరికి అంతటను అందుబాటులో ఉంది. దేవుని మంచితనానికి నిదర్శనాలలో వర్షం ఒకటి. అది లేకపోతే మనుగడ కష్టం. అందుకోసం ఆయన ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసియున్నాడు. వర్షాలు లేకపోతే భూమి నిర్జన్యమైపోతుంది. సూర్యుడు నక్షత్రాలు స్థిరమైన భౌతిక సూత్రాల ద్వారా కదులుతాయి, వీటి ఆపరేషన్ని మనం చూడొచ్చు మరియు ఊహించొచ్చు. కాని వర్షం పడడం అనేది మనం గుర్తించలేని నియమాలచే నియంత్రించబడుతుంది, కీర్తన 147:8; యోబు 5:9,10.
వర్షం_ దేవుడు చేసిన గొప్ప అద్భుతం. బావులు, నీటికుంటలు, చెరువులు, నదులు, కాలువలు మనుష్యులకు జంతువులకు నీటిని సరఫరా చేస్తాయి. కానీ పంటలు పండాలంటే, కుటుంబ పోషణ నెలనెలా ఉండాలంటే మరో వైపు నుంచి పొలాల్లోకి నీరు రావాలి. అందుకు ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటుచేశాడు. దాని పని సముద్రం నుండి అనేక వందల మైళ్లకు పైగా నీటిని ఆకాశంలోని మేఘాలలోనికి తీసుకువెళ్లి, ఆపై మేఘాల నుండి ఆ నీటిని పొలాల పైకి పోయటం. ఒక చదరపు మైలు వ్యవసాయ భూమిపై ఒక అంగుళం వర్షం పడితే, అది 27,878,400 ఘనపు అడుగుల నీరు, అంటే 206,300,160 గ్యాలన్లు. బరువైన నీరు బాష్పీభవనం ద్వారా పైకి లేస్తుంది. మేఘాలలోనికి చేరుతుంది. అక్కడ వాయురూపములో ఉన్న నీరు మళ్లీ ద్రవరూపమైన నీరుగా మారడం ప్రారంభమవుతుంది. బిలియన్ పౌండ్ల బరువున్న ఈ మైక్రోస్కోపిక్ నీటి చుక్కలన్నీ పడేంత బరువును మళ్ళి పొందుకుంటాయి. సముద్రములో ఉప్పు ఉంటుంది. ఉప్పు నీరు వర్షముగా కురిస్తే అది పంటలను చంపేస్తుంది. కాబట్టి వర్షము కొరకు ఏర్పాటు చెయ్యబడిన వ్యవస్థ తనకు అందుబాటులో ఉన్న సముద్రం నుండి బిలియన్ల కొద్ది నీటిని తీసుకొని ఉప్పును బయటకు తీసేసి స్వచ్ఛమైన నీటిని వందల మైళ్ల దూరం మోసుకెళ్లి భూమియంతటను ఉన్న పొలాల్లో పోస్తూవుంది. ఒక బిలియన్ పౌండ్ల నీటిని పొలంలో పోస్తే, పంటలు నలిగిపోతాయి. కాబట్టి మేఘాలు బిలియన్ పౌండ్ల నీటిని చిన్నచిన్న బిందువులుగా చిమ్ముతుంది. ప్రజలందరికీ జంతువులకు అన్నింటికీ పంటలను మరియు ఆహారాన్ని అందించుటకు దేవుడు వర్షం కురిపిస్తూవున్నాడు. వర్షం అనే అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు.
రుతువులు_ ఆది 8:22, భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ప్రసంగి 3:11, దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. భూమి యొక్క భ్రమణ అక్షం దాని కక్ష్య సమతలానికి సంబంధించి సుమారుగా 23.4 డిగ్రీల కోణంలో వంగి ఉండటం వల్ల రుతువులు ఏర్పడతాయి. ఈ వంపు గ్రహం యొక్క ఉపరితలం అంతటా సూర్యుని శక్తి పంపిణీని ప్రభావితం చేస్తుంది. భూమి ప్రతి 365 ¼ రోజులకు సూర్యుని చుట్టూ తిరుగుతున్నందున, అక్షం ఎల్లప్పుడూ అంతరిక్షంలో ఒకే దిశలో ఉంటుంది, ఉత్తర ధ్రువం ఉత్తర నక్షత్రం పొలారిస్ వైపు ఉంటుంది. జూన్ 22 నాటికి, ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు కోణంలో ఉంటుంది మరియు అత్యంత ప్రత్యక్ష రేడియేషన్ మరియు అత్యధిక శక్తిని పొందుతుంది. ఇది ఉత్తర అర్ధగోళంలో వేసవి ప్రారంభం మరియు దక్షిణ అర్ధగోళంలో శీతాకాలం. ఆరు నెలల తర్వాత, డిసెంబర్లో, భూమి సూర్యుని చుట్టూ సగం పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఉత్తర అర్ధగోళం ఇప్పుడు సూర్యుని నుండి కోణించబడి ఉంటుంది కాబట్టి దక్షిణ అర్ధగోళం కంటే తక్కువ శక్తిని పొందుతుంది. ఇది ఉత్తర అర్ధగోళంలో శీతాకాలం మరియు దక్షిణ అర్ధగోళంలో వేసవికాలం ప్రారంభం. ఉత్తరం నుండి దక్షిణానికి, సౌరశక్తి పంపిణీ యొక్క ఫలితాలు అనేకమైన వాటిని ప్రభావితము చేస్తాయి.
దేవుడు రుతువులను క్రమబద్ధీకరించడం ద్వారా జీవుల మనుగడకు సహాయం చేస్తూవున్నాడు. రుతువులలో మార్పులు ఉష్ణోగ్రతలో కూడా మార్పులు తెస్తాయి. ఇవ్వన్నీ నేల తేమ, బాష్పీభవన రేట్లు, నదీ ప్రవాహాలు, సరస్సు స్థాయిలు మరియు మంచు కవచాన్ని, వృక్షసంపదను, వాతావరణాన్ని, భూమి ఫలాన్ని ఇంకా అనేకమైన వాటినెన్నింటినో ప్రభావితం చేస్తాయి. వృక్షసంపదలో ఈ మార్పులు మానవులకు మరియు ఇతర జీవులకు అందుబాటులో ఉన్న ఆహార రకాల మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి అట్లే వారి/ వాటి జీవన శైలులను ప్రభావితము చేస్తాయి వారి మనుగడకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ విధముగా ఆయన అందరిని పోషించుచున్నాడు, కాపాడుతున్నాడు. రుతువులు ఆయన దయకు మరియు ఆయన శక్తికి నిదర్శనం. భూమి సమృద్ధిగా ఉత్పత్తి చేసేందుకు సీజన్లు చాల అవసరం. ఇవి విశేషమైనవి మరియు దైవిక మంచితనానికి అద్భుతమైన రుజువులు. సృష్టి యొక్క ఆశీర్వాదాలు (సంరక్షణ) మంచి విషయాలను దయతో ఇచ్చే సృష్టికర్తయైన దేవునిని గురించి శక్తివంతమైన సాక్ష్యాన్ని ఇస్తూవున్నాయి (కీర్తన 19:1-6; 145:15-16; మత్తయి 5:45; రోమా 1:19,20)
కీర్తన 104_ దేవుడు సృజించిన అద్భుతమైన వాటన్నిటిని గూర్చి కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ప్రత్యేకముగా 24వ వచనమును గమనించుము: యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞ్యానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది. 104వ కీర్తన సృష్టికర్త యొక్క జ్ఞానం మరియు ప్రేమను తెలియజేస్తూవుంది.
ఈ కీర్తన సృష్టికర్త మరియు సృష్టిని సంరక్షించే దేవునిని గురించి తెలియజేస్తూవుంది. దీని నేపథ్యం, ఆదికాండము 1. కాని ఆదికాండములోని సృష్టి యొక్క క్రమబద్ధమైన వర్ణన, దేవుని సృష్టి యొక్క అద్భుతాలను మరింత సహజముగా ఈ కీర్తన ప్రదర్శిస్తూ ఉంది. కీర్తన 104:24 సృష్టి యాదృచ్ఛికంగా లేదా అనూహ్యంగా ఉనికిలోనికి రాలేదని దేవుని జ్ఞానం సంక్లిష్టమైన సృష్టిని జీవముతో నింపిందని చెప్తూవుంది. దేవుడే ప్రాణదాత, దేవుడే జీవ-పోషకుడు-ఇది 104వ కీర్తనలోని ముఖ్యాంశం. సృష్టించినవన్ని జీవిత అవసరాలకు మరియు ఉపయోగాలకు వాడుకునేందుకు ఆయన కారణమవుతూ ఉన్నాడు.
రోమీయులకు 1:20_ ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
దేవుడు ప్రత్యక్షంగా లేడు, కాని విశ్వం ఆయన ఉనికిని మరియు స్వభావాన్ని చూపుతూ ఉంది. ప్రకృతి కూడా దేవుని ఉనికిని మరియు స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. ఆయన “వేలి ముద్రలు” ప్రతిచోటా ఉన్నాయి. సృష్టి తన సృష్టికర్తను గురించి స్పష్టంగా వెల్లడిస్తూవుంది, కీర్తన 19 :1-4; యెషయా 40 :21,26 ; అపొ. కార్య. 14:15-17 చూడండి.
జవాబు: దేవుడు సృజించిన వాటిని బట్టి ఆయన దయగలవాడు, జ్ఞ్యాని, నిత్యుడు, సర్వశక్తిమంతుడు మరియు దైవత్వముగలవాడునై యున్నాడని మనకు తెలియును. అట్లే మనం ఏమిటి అనే ప్రశ్నకు మన చుట్టూ ఉన్న పకృతి జవాబునిస్తూ ఉంది.
దేవుని గూర్చిన జ్ఞానము విషయములో మనం ప్రకృతినుండి ఏయే విషయాలు తెలుసుకోగలం?
జవాబు: దేవుని గూర్చిన జ్ఞానము శాశ్వతమైనది, సర్వశక్తివంతమైనది, జ్జ్యానవంతమైనది, దైవికమైనది.
3. మన మనస్సాక్షిని బట్టి దేవునిని గురించి మనకేమి తెలియును?
రోమీయులకు 2:14,15_ ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చు చుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
అన్యజనులకు ధర్మశాస్త్రం యొక్క మార్గదర్శకత్వం లేకుంటే దేవుడు వారిని శిక్షించడం న్యాయమెలా అవుతుంది? పౌలు ఈ ప్రశ్నకు జవాబునిస్తూ, అన్యజనులకు మోషే ఆజ్జ్యలు లేకపోయినా, వారు “ధర్మశాస్త్రం” లేకుండా లేరని (దేవుని పవిత్రమైన మరియు మార్పులేని చిత్తమును గూర్చిన సమాచారాన్ని లేకుండా లేరని) పౌలు చెప్తూవున్నాడు. దేవుడు సృష్టించిన క్రమం కారణంగా, దేవుడు వెల్లడించిన వాక్యము యొక్క సహాయం లేకుండానే అన్యజనులకు ఏది కరెక్ట్ ఏది తప్పో తెలుసు. “స్వభావరీత్యా” అన్యులు వారి హృదయాలలో వ్రాయబడిన దేవుని సహజ జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడి, దేవుని ఆజ్జ్యలను మీరడం తప్పు అని వారు తెలుసుకుంటారు మరియు నిర్ణయించుకుంటారు. దీనర్థం వారికి దేవుని చిత్తమంతా తెలుసని కాదు. పాపం వారి అవగాహనను పాడు చేసింది. నైతికంగా దేవుని ధర్మశాస్త్రం ప్రకారం చేయవలసిన పనులను చేయడానికి వారు “తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు” సహజమైన ప్రేరణను కలిగి ఉంటారు. మనస్సాక్షి వారి పాపాన్ని మరియు రక్షకుని అవసరాన్ని చూపుతుంది.
దేవుడు ప్రకృతిలో పాక్షికంగా తనను తాను బహిర్గతం చేసుకొనియున్నాడు (రోమా 1:19). ఆయన తన ధర్మశాస్త్రం గురించి ప్రజలందరికీ కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. పది ఆజ్ఞలు ప్రజలందరి హృదయాలలో వ్రాయబడ్డాయి. దానికి సంబంధిత విధముగా అన్యులు “ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు” చూపిస్తున్నారు, ఇది మనస్సాక్షి యొక్క చర్య. మనస్సాక్షి అనేది కొన్ని సహజ ప్రవర్తనా నియమాలను అనుసరిస్తూ, వీటిని చెయ్యాలి వీటిని చెయ్యకూడదు అనే సహజమైన భావనపై పనిచేస్తుంది. ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి అతని చర్యలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించినప్పుడు, అతడు తనను తాను సమర్దించుకోవడానికి మొగ్గు చూపుతాడు. అట్లే, ఒక వ్యక్తి తన హృదయంలో వ్రాయబడియున్న దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లు తెలిసిన సందర్భాలు కూడా ఉంటాయి. అతడు చేస్తున్న పని చేయకూడని పనియని అతనికి తెలుసు. అప్పుడు అతని లోపల నుండి ఒక స్వరం అతనిని సరిగ్గా నిందిస్తుంది మరియు అతని పాపాన్ని బట్టి అతడు నేరస్థుడని చెప్తుంది. అలాంటి వ్యక్తి “[దేవుని వ్రాతపూర్వక, బయలుపరచబడిన] ధర్మశాస్త్రానికి వేరుగా” పాపం చేసి ఉండొచ్చు. కాని అతడు దేవుని ముందు దోషిగానే ఉంటాడు, ఎందుకంటే అతడు ఉద్దేశపూర్వకంగా దేవున్ని ధిక్కరిస్తూ మరియు మనస్సాక్షి ద్వారా బలపరచబడిన దేవుని ధర్మశాస్త్రం యొక్క సహజ జ్ఞానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అతడు “ధర్మశాస్త్రానికి వేరుగా” పాపం చేసినట్లే, కాబట్టి అతడు “ధర్మశాస్త్రానికి దూరంగా” నశిస్తాడు. రోమా 8:3,4 శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
దేవుడు తన చిత్తం నెరవేర్చబడే విషయములో మరియు ఆయన ధర్మశాస్త్రం అనుసరించబడే విషయములో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ విభాగం నైతికవాదిని ఉద్దేశించి చెప్పబడిందని గుర్తుంచుకోండి, అతడు నేను పాపుల వలె చెడ్డవాన్ని కాదు అని భావిస్తూ నేను దేవునికి ఆమోదయోగ్యుడను అని అనుకొంటాడు. అటువంటి నైతికవాది యూదుడు కానివ్వండి లేదా అన్యజనుడు కానివ్వండి ఎవరైనను, దేవునికి అవిధేయత చూపాడని మరియు శాశ్వతమైన శిక్షకు అర్హుడని పౌలు నిస్సందేహంగా స్పష్టం చేశాడు. నైతికవాదికి దేవుని ముందు నిలబడగల నీతి లేదు కాబట్టి అతడు హీనంగా చూసే పాపివలె అతడు కూడా చెడ్డవాడే (పాపే).
రోమీయులకు 1:32_ ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు (మంచి చెడుల గురించి వారికీ కొంత తెలిసియున్నప్పటికిని, రోమా 2:15), పాపానికి శిక్షగా దేవుడు మరణాన్ని నియమించాడని తెలిసినప్పటికిని (రోమా 5:12; 6:23; ఆది 2:17; నిర్గమ 21:36; హెబ్రీ 2:13) ఇది వారిని పాపం చెయ్యకుండా ఆపదు. తమ పాపాల్లోనే కొనసాగడంతో బాటు ఇతరుల భ్రష్టత్వాన్ని చూచి ఆనందిస్తారు.
జవాబు: మన మనసాక్షిని బట్టి దేవుడు మన పాపములను బట్టి మనలను శిక్షించునని మనకు తెలియును.
దేవుని గూర్చిన జ్ఞానము విషయములో మనం మనస్సాక్షిని బట్టి ఏయే విషయాలు తెలుసుకోగలం?
జవాబు: దేవుడు శిక్షించునని మనకు తెలియును.
4. ఆయన సృష్టి లేక మనఃసాక్షిని బట్టి దేవునిని గూర్చి దేనిని మనమెన్నటికిని తెలుసుకోలేము?
అపొస్తులుల కార్యములు 16:29,30_ అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.
మానవుడు అడగగలిగే అతి ముఖ్యమైన ప్రశ్నను ఇక్కడ జైలర్ అడిగాడు. రక్షణ కొరకైన తన అవసరతను గురించి అతడు అడిగాడు. తన ఖైదీల గురించి అతనికి ఏమి తెలుసు అనేది (పౌలు సీలయు దేవుని సేవకులై పాప విముక్తి మార్గాన్ని నేర్పుతున్నవారని అపొ. కార్య. 16:17), వారి కీర్తనలు వారి స్తుతుల నుండి అతడు నేర్చుకున్నది (పరిశుధ్ధాత్ముడు అతని ఆధ్యాత్మిక అవసరాన్ని గురించి అతన్ని ఒప్పించాడు), భూకంపం (దైవత్వం యొక్క ఉనికిగా, తన సేవకుల ఖైదును బట్టి ఆయన అసంతృప్తికి లోనయ్యివుండొచ్చని అతడు భావించివుండొచ్చు) దాని ఫలితాలతో అతడు చూసినవి అతడి మనస్సాక్షిని కదిలించాయి. వారి ఖైదు యొక్క అపరాధం అతని మనస్సును నొప్పించి ఉండొచ్చు. ఇక్కడ దేవుని జోక్యం చూసిన అతడు రక్షింపబడుటకు కోరుకొంటున్నాడు. నిజ విశ్వాసం పశ్చాత్తాపముతో ఆరంభమవుతుంది. పౌలు ఇక్కడ పశ్చాత్తాపాన్ని గురించి జైలర్ తో ఏమి చెప్పలేదు. ఎందుకంటే ఆ మనిషి పశ్చాత్తాపపడుతున్నాడనే విషయం స్పష్టమే.
రక్షణ కోసం వారి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడానికి దేవుడు సాధారణంగా భూకంపాన్ని ఉపయోగించడు. కొన్నిసార్లు ఇది తేలికపాటి గుండెపోటు, స్వల్ప స్ట్రోక్, చిన్న కణితి, మైక్రోస్కోపిక్ వైరస్ లేదా చిన్న ప్రమాదం కావొచ్చు. ఆరోగ్యం, లేదా ఆస్తి లేదా స్నేహితుడి నష్టం, కష్టము, తెగులు యొక్క విధ్వంసం, లేదా ఏదైనా భయంకరమైన తీర్పు మన ఆత్మను అప్రమత్తం చేస్తూ ఉండొచ్చు. మీ ఆత్మ ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తూ ఉండొచ్చు. అయితే ఆధ్యాత్మిక విషయాల గురించి అజాగ్రత్తగా ఉన్న వ్యక్తులు తమ సృష్టికర్తను కలుసుకొంటామని తీర్పు తీర్చబడతామని తెలుసుకున్నప్పుడు, వారు తరచూ జైలర్లానే అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెను అని అడుగుతుంటారు. అట్లే ఈ ప్రశ్నను అడిగే కొందరు తరచుగా స్వనీతిపరులై, నేనేమి చేయాలి అనే దానిపై దృష్టి పెడతారు, లూకా 10:25; 18:18. ఇక్కడ జైలర్ రక్షింపబడటం యొక్క అవసరాన్ని వక్కాణిస్తూ ప్రశ్నించియున్నాడు. అపొస్తలులు అతడు శాశ్వతమైన రక్షణను గురించి అడుగుతున్నట్లు స్పష్టంగా అర్థం చేసుకున్నారు, ఎందుకంటే వారి సమాధానం ద్వారా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
జవాబుగా, క్రైస్తవ విశ్వాసం యొక్క సంక్షిప్త సారాంశంలో (అపొ. కార్య. 16:14; అపొ. కార్య. 15:11; రోమా 10:9) “విశ్వాసముంచుము” అని చెప్పారు. జైలర్‌కి, అతని ఇంటిలోని ప్రతి వ్యక్తికి మరియు ప్రతి మనిషికి జవాబు ఒకటే. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఆయన రక్షిస్తాడు తప్ప “మీరు ఈ విధంగా వ్యవహరించాలి లేదా ఆలోచించాలి లేదా అనుభూతి చెందాలి,” అని చెప్పలేదు. “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు” అని చెప్పారు. ఈ సందేశం అతని ఇంటివారందరికీ వ్యాపించింది. వారందరు జైలర్ విశ్వాసం ద్వారా కాకుండా వారి స్వంత వినికిడి మరియు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు.
1 కొరింధీయులకు 2:9_ ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.
తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచి యుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు, యెషయా 64:4 లో ఇలాంటి మాటలే వున్నాయి. పాత నిబంధనలో రక్షణకు సంబంధించిన అద్భుత చర్యలు, ఇప్పుడు యేసు యొక్క రహస్యం మరియు అద్భుతాల ద్వారా అధిగమించబడ్డాయి. దేవుడు ఇప్పటికే ఈ గొప్ప విషయాలను అందించాడు. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండిన యెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు. పౌలు ఇక్కడ అన్నా, కైఫా, యూదుల సన్హెడ్రిన్, పిలాతు, హేరోదు, యూదుల గురించి, వారిలాగే, దేవుని కుమారుని సిలువ వేసిన వారందరినీ సూచిస్తూ, యేసు దేవుని కుమారుడనే విషయం వారికి నిజంగా తెలిసి ఉంటే ఆయనను సిలువ వేసియుండే వారు కాదు. యేసును తమ దేవుడని మరియు మహిమాన్విత ప్రభువైన మెస్సీయ అని తెలిసి ఉంటే ఆయనను సాధారణ నేరస్థునిగా చంపి ఉండేవారు కాదు. వారు అసహ్యించుకుంటున్న అందరిని రక్షించుటకై ఆయన ప్రాణాన్ని పెడుతూవున్నాడని తెలిసుంటే వారు ఆయనను సిలువ వేయమని కేకలు వేసేవారు కాదు. లోకాధికారులు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు అనే దానికి ఇదే సంపూర్ణమైన రుజువు. పాపులను రక్షించుటకు దేవుడు ఏమిచేసి యున్నాడనే దాన్ని అర్థం చేసుకునే విషయానికి వస్తే, ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరు మూర్ఖులే. దేవుడు ఆ విధంగా పనులు చేస్తాడని, తనను ప్రేమించేవారి కోసం ఇలాంటి అద్భుతాలు చేస్తాడని మనిషి మనసుకి ఎప్పుడూ తట్టనేలేదు.
ఈ ప్రపంచంలోని ఘనులు కూడా ఈ జ్ఞానాన్ని కనుగొనలేకపోయారు. మరి మీరు నేను దీనిని ఎలా కనుగొన్నాము? అనే ప్రశ్నకు జవాబు: “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు“. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మరియు సమస్త మానవాళికి రక్షకుడని పరిశుధ్ధాత్ముడు మాత్రమే వెల్లడించగలడు. పరిశుధ్ధాత్ముడు మాత్రమే ఈ రహస్యాన్ని మరియు దాగివున్న జ్ఞానాన్ని బయలుపరచగలడు ఎందుకంటే “ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు“.
దేవుడు ఎవరో, దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏమి ప్లాన్ చేస్తాడో, మనుషుల వ్యవహారాలను ఎలా పరిపాలిస్తాడో సర్వజ్ఞుడైన పరిశుధ్ధాత్ముడు మాత్రమే తెలుసుకోగలడు. లేఖనాల్లో మనం కలిగియున్న ప్రతిదీ పరిశుధ్ధాత్ముడు మన కొరకు కనుక్కొన్న తెలివి మరియు జ్ఞానమే. మన అపరాధం మరియు మన రక్షణ గురించి మనకు తెలిసిన ప్రతిదీ ఆయన ద్వారా శోధించ బడింది మరియు ఆయన పవిత్ర రచయితల ద్వారా మన కోసం రికార్డ్ చేయబడింది. మన జ్ఞానం ఆత్మ ప్రసాదించినదే.
జవాబు: దేవుని సృష్టి లేక మన మనసాక్షిని బట్టి మనలను రక్షించుటకు దేవుడు ఏమి చేసియున్నాడను దానిని మనము ఎన్నటికిని తెలుసుకోలేము.
5. అప్పుడు బైబులు ఎందుకు అవసరము?
2 కొరింథీయులకు 4:5,6_ అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని, క్రీస్తుయేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
4వచనములో, సత్యాన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, అందరూ విశ్వసించరు అనే వాస్తవాన్ని పౌలు పేర్కొంటూ, దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము ప్రజలకు ప్రకాశింపకుండు నిమిత్తము (ప్రజలు ఆ కాంతిని చూడకుండా ఉంచడానికి), ఈ యుగ సంబంధమైన దేవత చాలా కష్టపడుతూ ఉందని చెప్తూవున్నాడు.
ఇప్పుడు 5వ వచనంలో పౌలు “సత్యమును ప్రత్యక్షపరచుట” అంటే ఏమిటో వివరిస్తూ, ఇది కేవలం “క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువని” ప్రకటించటమే అని చెప్తూవున్నాడు. పౌలు ఈ వ్యక్తీకరణను తన ఇతర పత్రికల్లో, “పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని“, 1 కొరింథీ 12:3లో, చివరి రోజున “ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను“, ఫిలిప్పీ 2:11లో కూడా ఉపయోగించి యున్నాడు. ఇది విశ్వాసం యొక్క ప్రాథమిక క్రైస్తవ ఒప్పుకోలు. అపొస్తలుల విశ్వాస ప్రమాణము యొక్క రెండవ ఆర్టికల్‌కు తన వివరణలో, మార్టిన్ లూథర్ ఈ వ్యక్తీకరణనే “యేసుక్రీస్తు నా ప్రభువై యున్నాడని నేను నమ్ముచున్నాను” అను మాటల్లో పేర్కొన్నాడు.
“మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదని” పౌలు చెప్తున్నాడు. ఇది అతని ప్రత్యర్థులు పనిచేస్తున్న విధానానికి స్పష్టమైన సూచన. రహస్యమైన, అవమానకరమైన మార్గాలను ఉపయోగించి, మోసం వక్రీకరణ ద్వారా వాళ్ళు నిజముగా తమ కోసం పనిచేస్తూ ఉన్నారు. దీనికి విరుద్ధంగా, పౌలు తానును మరియు అతని సహోద్యోగులును తమ కొరకు తాము సేవ చేయడం లేదని చెప్తూ, బదులుగా, వారు “యేసు కొరకు,” అక్షరార్థంగా, “యేసు కారణంగా” కొరింథీయులకు సేవకులమని చెప్తూవున్నాడు. యేసు వారి కోసం చేసిన వాటన్నిటి దృష్ట్యా, వారు ఇతరులకు యేసును ప్రకటించడానికి అంతర్గతంగా బలవంతము చేయబడ్డారు.
“అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక” అని దేవుడు పలుకగా ఆయన మాట అక్షరార్థంగా వెలుగును (దాని లక్షణాలతో పాటు) తెచ్చింది. పౌలు ఆది 1:3వ వచనాన్ని (సృష్టి క్రమములోని దేవుని శక్తిని గుర్తుచెయ్యడానికి) ఇక్కడ ఉపయోగించియున్నాడు. సృష్టిని ఉనికిలోనికి తెచ్చిన దేవుని అద్భుతమైన మాట నేడు అదే దేవుని మాటల (సువార్త) ద్వారా పనిచేస్తువుందని ఇది పాపంతో చీకటిగా ఉన్న హృదయాలను ప్రకాశవంతం చేస్తువుందనే విషయాన్ని తెలియజేస్తూ అదే దేవుడు తన హృదయం నుండి అంధకారమును/తెరను తొలగించి దానికి వెలుగుని తెచ్చాడని పౌలు చెప్తూవున్నాడు. యోహాను 1:4,5 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు చున్నది. యోహాను 3:19 గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
పౌలు ఆ వెలుగును “యేసుక్రీస్తులో ఆయన మహిమను గూర్చిన జ్ఞానము” అని అనుభవపూర్వకంగా నిర్వచించాడు (సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెనని, అపొ. కార్య. 9:1-9 చెప్తూవుంది). ఆ రోజు పరలోకము నుండి ఒక కాంతి అతని హృదయంలోని చీకటిలోకి చొచ్చుకుపోయింది. ఆ రోజున అతడు దేవుని గొప్ప మహిమతో ముఖాముఖిగా వచ్చాడు. అతడు యేసును చూశాడు. యేసును చూస్తూ దేవుని ప్రేమను, మహిమను కూడా చూశాడు. ఆ కాంతి గ్రాహకునిగా, పౌలుకు ఆ రోజున ఇవ్వబడిన ధన్యతను బట్టి, ఆ కాంతిని ప్రతిఫలింపజేయు వానిగా (రిఫ్లెక్టర్‌గా) అనుభవపూర్వకంగా ఈ మాటలను చెప్తూవున్నాడు, (2 కొరింథీ 3:18, మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము).
2 తిమోతికి 3:14,15_ క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము_ తిమోతికి నమ్మకమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకటి, పౌలు (స్వయముగా) అట్లే నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులు, 2 తిమోతి 2:2; అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును, అంతియొకయ ఈకొనియ, లుస్త అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి, 2 తిమోతి 3:10,11. రెండవది, తిమోతి అవ్వయైన లోయి, తిమోతి తల్లియైన యునీకే. పౌలు వారి “నిష్కపటమైన విశ్వాసము” గురించి గొప్పగా మాట్లాడాడు, 2 తిమోతి 1:5. నిస్సందేహంగా, వారి ఉపదేశాన్ని బట్టి పౌలు తిమోతికి “పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు” అని గుర్తుచేయ గలిగాడు.
బాల్యమునుండి అంటే బహుశా దీని అర్ధం ఇది. వారు క్రైస్తవులు కాకముందే తిమోతి తల్లి అమ్మమ్మ తిమోతికి పాత నిబంధన గ్రంధాన్ని నేర్పారు, ద్వితీయోప 6:6, నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అను దేవుని ఆజ్జ్యను వాళ్ళు శిరసావహించారు. అయితే పవిత్ర గ్రంథాలను నేర్చుకోవడం కేవలం సంప్రదాయానికి సంబంధించిన విషయం కాదు. మనకు నేర్పించిన వారిని మనం గుడ్డిగా అనుసరించకూడదు. అయితే తనకు బోధించిన వారిని అనుసరించమని తిమోతిని ప్రోత్సహించడానికి పౌలుకు ఒక కారణం, నమ్మకమైన ఉపాధ్యాయులు. దేవుని వాక్యాన్ని బోధించే వారిలో నిష్కపటమైన విశ్వాసము గలవారు అనుకరణకు అర్హులు. మీకు అలాంటి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఉంటే దేవునికి ధన్యవాదాలు. వారు మీకు బోధించిన దానిలో కొనసాగండి, ఎందుకంటే మీరు ఎవరి నుండి నేర్చుకున్నారో మీకు తెలుసు. చర్చికి నమ్మకమైన పాస్టర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు క్రైస్తవులు అవసరం, వారు తరువాతి తరాలకు నమూనాలుగా ఉంటారు.
పాత నిబంధనను సరిగ్గా అర్ధం చేసుకున్నప్పుడు అది మనుష్యులకు, “రక్షణార్థమైన జ్ఞానమును” కలిగిస్తుంది, లూకా 24: 25-27; 24: 45-47. కాని పాత నిబంధనలో దేవుని సంపూర్ణ సత్యము పూర్తిగా వెల్లడి కాలేదు, అది క్రీస్తు వైపుకు (క్రొత్తనిబంధనను) చూపిస్తూ, “క్రీస్తులో నమ్మకముంచాలి” అని ప్రజలకు ప్రకటిస్తూవుంది. కాబట్టి “క్రీస్తుయేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును కలుగచేయగల” పరిశుద్ధ లేఖనములను (పాత క్రొత్త నిబంధనను) తెలుసుకోవలసి యున్నాము.
తిమోతికి బాల్యం నుండి తెలిసిన గ్రంథాలు పాత నిబంధన వ్రాతలే. వాటిని బట్టి అతడు వాగ్దానం చేయబడిన మెస్సీయ అయిన క్రీస్తుపై ఇప్పటికే విశ్వాసం ఉంచాడు. అవి “నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి” అని యేసు కూడా వాటిని గురించి చెప్పాడు, యోహాను 5:39. పౌలు లుస్త్రకు వచ్చి, మెస్సీయకు సంబంధించిన వాగ్దానాలన్నీ యేసు నెరవేర్చాడని చూపించి నప్పుడు, లోయి, యూనికే, తిమోతి యేసును విశ్వసించారు. ఇది కొత్తది మరియు భిన్నమైన విశ్వాసం కాదు, కాని పాత నిబంధన వాగ్దానాల ఆధారంగా వారు ఇప్పటికే విశ్వసించిన వ్యక్తి యొక్క గుర్తింపు ఇప్పుడు వారికి స్పష్టమయ్యింది.
పవిత్ర లేఖనాలను చాలా ముఖ్యమైనదిగా చేసేది ఏమిటంటే, అవి మాత్రమే రక్షణ మార్గాన్ని బహిర్గతం చేస్తాయి, ఇది క్రీస్తు యేసుపై విశ్వాసం ద్వారా. “ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు”, 1 కొరింథీ 2:9,10. కాబట్టి వాటియందు నిలుకడగా ఉండుమని పౌలు తిమోతికి చెప్తూవున్నాడు.
అపొస్తులుల కార్యములు 16:30-32_ వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.
జవాబు: మనలను రక్షించుటకు దేవుడు ఏమి చేసియున్నాడను దానిని మనకు బయలుపరచుటకు వెలుగుగా బైబులు మనకు అవసరము.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాల నే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.