ప్రథమ భాగము
ప్రారంభ శుభాకాంక్షలు (1:1–4)

1దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును, 2-4నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలముల యందు బయలుపరచెను. తండ్రియైన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

సహజంగానే పౌలు ఈ లేఖను తీతు కోసం మాత్రమే వ్రాయలేదు, అతడు చదవడానికి మరియు అందరికొరకు భద్రము చేయడానికి వ్రాసియున్నాడు. ఇది తీతు కోసమే అయితే, తన గురించి మరియు తన పరిచర్య గురించి సుదీర్ఘమైన సంభాషణ అవసరం లేదు. అయితే, పౌలు కొద్దికాలం మాత్రమే ఉన్న క్రేతులో తీతు సేవ చేస్తున్న ప్రజలకు, రచయిత “దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడును” అని గుర్తుచేయడం ప్రాముఖ్యమైనది.

ఇక్కడ పౌలు తనను “దేవుని దాసుడును” అని పరిచయము చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. దాసుడు అనే మాట బానిసత్వం నుండి రక్షింపబడియుండటాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ చిత్రాన్ని మనకు వర్తింపజేసుకొంటే, దాసుడు అనే మాట దేవుని రక్షణ కృపకు కూడా వర్తిస్తుంది. దేవునికి దాసునిగా ఆయనకు లోబడి ఉండటం పౌలుకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. తాను దేవునికి దాసునిగా గుర్తించబడటంలో సంపూర్ణంగా సంతోషించుచున్నానని కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. దాసుడు అనే మాట వారి బాధ్యతలను నిర్దేశించుకోవడంలో వారికి సహాయపడుతూ ఇష్టపూర్వకంగా సేవ చేసేందుకు వారిని ప్రేరేపించింది. అట్లే “దేవుని దాసుడు”అంటే దేవుడు తప్ప మరెవ్వరి నుండి ఆజ్ఞలు తీసుకోనివాడు అని అర్ధం. పౌలు చిత్తము దేవుని చిత్తానికి లోబడి ఉంది. దేవుడు ఏమైతే భోదించమని చెప్పాడో, వ్రాయమని చెప్పాడో పౌలు వాటినే బోధించాడు మరియు వ్రాసాడు. పౌలు పత్రికలను చదివేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా, చాలా ముఖ్యం.

అదనంగా, పౌలు తనను తాను “యేసుక్రీస్తు అపొస్తలుడనని” పిలుచుకున్నాడు, అతడును స్వయంగా యేసు ద్వారా “పంపబడ్డాడు”. దమస్కుకు వెళ్లే మార్గంలో, యేసు అతనిని ఎదుర్కొని పట్టణంలోకి పంపాడు, అక్కడ, అననీయ అను ఒక శిష్యుడు అతన్ని కలుసుకున్నాడు, “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు” అని దేవుడు అననీయకు పౌలును గురించి వెల్లడించాడు, (అపొ. కార్య. 9:15). సంఘానికి శిరస్సైన యేసు, తన పన్నెండు మంది శిష్యులను పంపినట్లుగా పౌలును కూడా ఆయన నియమించియున్నాడు.

దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము, భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును పౌలు నియమింపబడియున్నాడు.దేవుడు ఏర్పరచుకున్నవారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని తెలుసుకోవడం నేర్పడానికి సహాయపడే విషయములో అతడు పంపబడ్డాడు. విశ్వాసం, సత్యమును గురించిన జ్ఞానం మరియు దైవభక్తి అనేవి ఒకదానికొకటి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాయి.

వినని వానిని ఎట్లు విశ్వసించుదురు?” రోమా 10:14. క్రీస్తులో దేవుని దయ యొక్క సందేశాన్ని వినకపోతే వారు ప్రభువును ఎలా విశ్వసించగలరు? క్రీస్తుని గురించి వింటే తప్ప ఎవరును క్రీస్తుని నమ్మలేరు. ఎవరైనా వారికి బోధించకుండా వారు క్రీస్తుని గురించి ఎలా వినగలరు? ప్రజలు ప్రభువును విశ్వసించకపోతే ఆయనను నమ్మకంగా ఎలా ప్రార్దించగలరు? బోధించేవారు పంపబడకపోతే ఆ వ్యక్తులు ఎలా బోధిస్తారు? క్రైస్తవులు సువార్తను పంచుకోవాలని దేవుడు సాధారణ నిర్దేశాన్ని ఇవ్వడమే కాకుండా, ఆయన ప్రత్యేకంగా బహిరంగ పరిచర్యను కూడా స్థాపించాడు, మత్తయి 28:19,20 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఆయన అపొస్తలులను వారి సహోద్యోగులను పంపాడు- నేటికీ క్రీస్తులో దేవుని ప్రేమ సందేశాన్ని బోధించడానికి ఆయన తాను పిలుచుకొనిన వారిని పంపుతూనే ఉన్నాడు. ఆ సందేశము ఆలకించబడుతూనే ఉంది. విన్న వాక్యం విశ్వాసులను ప్రభువు నామాన్ని పిలిచేలా చేసే విశ్వాసాన్ని వారికిస్తూ ఉంది కాబట్టి దీనిని వినిన వారి హృదయాలలో జీవితాలలో దాని జీవమిచ్చే శక్తి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

అట్లే అదే “విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును“, యాకోబు 2:17. దేవుని న్యాయస్థానంలో ఒకని పాపాలకు క్షమాపణను మరియు నిర్దోషి అని దేవుని చేత ప్రకటింపబడేందుకు వాని సత్క్రియలు, అందుకోసమైన వాని స్వంత ప్రయత్నాలు విలువలేనివి. యేసుక్రీస్తు యొక్క నీతివంతమైన జీవితం, మరణం మరియు పునరుత్థానం మాత్రమే అది చేయగలదు. ఒకడు రక్షకునిపై విశ్వాసానికి వచ్చినప్పుడు, వాడు నీతిమంతునిగా ప్రకటించబడియున్నాడు, వాడు మరలా జన్మించియున్నాడు, వాని పట్ల దేవుని కున్న చిత్తాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించియున్నాడు. దేవుని చిత్తాన్ని కోరుకోవడానికి ఆత్మ వానికి సహాయం చేస్తూ, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని వానికి ఇస్తూ ఉంది. నిజమైన విశ్వాసం అనివార్యంగా సత్క్రియలను ఇస్తుంది. సత్క్రియలు లేనట్లయితే, క్లెయిమ్ చేయబడిన విశ్వాసం మోసపూరితంగా ఉండాలి. అందుకనే పౌలు, “వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము” అని ఎఫెసీయులకు 2:10 చెప్తూ ఉంది. దైవభక్తి అనేది క్రియ ద్వారా చూపించే విశ్వాసం.

క్రైస్తవుల యొక్క మొత్తం విశ్వాసం మరియు భక్తి జీవితం, నిరీక్షణపై నిర్మించబడ్డాయి, ప్రత్యేకముగా, “నిత్యజీవమును గూర్చిన నిరీక్షణపై” నిర్మించబడ్డాయి. అవిశ్వాసి యొక్క ఆశలు ఈ జీవితకాలము మట్టుకు మాత్రమే సంబంధించినవిగా ఉంటాయి. అతడు సులభమైన జీవితం, సంపద, గౌరవం, ఆహ్లాదకరమైన పదవీ విరమణ, మొదలైన వాటి కోసం ఆశిస్తాడు. అయితే “ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము“, అని 1 కొరింథీయులకు 15:19 చెప్తూ ఉంది. పాపపు లోకంలో సుదీర్ఘమైన మరియు మెరుగైన జీవితం కోసం క్రీస్తు మనలను విమోచించలేదు. ఇక్కడ ఇప్పుడు మనం అనుభవించే దానికంటే జీవితంలో ఇంకా చాలా ఉంది: అక్కడ క్రైస్తవుని నిరీక్షణయైన నిత్య జీవముంది.

ఈ నిరీక్షణ ఒక కల కాదు. అది “అబద్ధమాడనేరని దేవుడు” ద్వారా వాగ్దానం చేయబడింది. సాతాను అబద్ధమునకు జనకుడునై యున్నాడు (యోహాను 8:44), వాడు అబద్ధపు వాగ్దానాలు చేస్తాడు. దేవుని వాగ్దానాలు నిజమైనవి, నిశ్చయమైనవి మరియు ఖచ్చితమైనవి. కాలక్రమేణా, అవి రద్దు చేయబడవు కాని నెరవేరుతాయి. రక్షకునిగా తన ప్రియమైన కుమారుని ద్వారా తాను ఎన్నుకున్న వారిని ఆశీర్వదించబడిన నిత్యత్వానికి తీసుకురావాలని దేవుడు తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడే, “అనాదికాలమందే” వాటిని వాగ్దానము చేసాడు.

తన వాగ్దానాలను నెరవేర్చడంలో, దేవుడు తన స్వంత సమయ షెడ్యూల్‌ను ఉపయోగిస్తాడు. “అయితే కాలము పరిపూర్ణమై నప్పుడు దేవుడు తన కుమారుని పంపెను“, గలతీయులకు 4:4. తన కుమారుని సందేశం ఎవరి ద్వారా బోధించబడాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు. “యిప్పుడు (తన నిర్ణీత కాలంలో) మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన ద్వారా ఆయన తన వాక్యమును యుక్తకాలముల యందు బయలుపరచాడు“. పౌలు దేవునిచే ఎంపిక చేయబడిన దాసుడు మరియు అపొస్తలుడు, అతడు ఒక దైవిక ఆజ్ఞ క్రింద పనిచేస్తూ ప్రకటించడానికి అతనికొక సందేశం అప్పగింపబడింది. అపొస్తలుడైన పౌలు కంటే ఎవ్వరూ దేవుని వాక్యాన్ని విస్తృతంగా మరియు స్పష్టంగా బోధించలేదు. క్రేతు ప్రజలు పౌలు వారి మధ్య ఏమి బోధించాడో, విశ్వాస విషయములో అతని నిజమైన కుమారుడైన తీతు ఏమి బోధిస్తున్నాడో మరియు వారు ఈ లేఖలో చదివినది నిజంగా దేవుని వాక్యమని, క్రీస్తులో దేవుని వాగ్దానాలు మరియు నెరవేర్పు యొక్క ప్రత్యక్షత అని, దేవుని సాధికార దూత ద్వారా ప్రకటించబడుతూ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాల్సి యున్నారు.

పౌలుకు దేవుడు ఆజ్ఞాపించిన బోధలను మనం ఇప్పటికీ ఇష్టపడతాము. వాటి ద్వారా దేవుడు తన వాక్యమైన క్రీస్తు సువార్తను వెలుగులోకి తెస్తూనే ఉన్నాడు. దేవుడు ఆ విధంగా ప్లాన్ చేశాడు. ఈ ప్రేరేపిత అపొస్తలుడి బోధల ద్వారా దేవుడు అనుమతించిన ప్రత్యక్షత ఫలితం గ్రంథం మొత్తం స్పష్టమవుతూ ఉంది. రోమన్లకు, గలతీయులకు వ్రాసిన పత్రికలు మరియు పౌలు వ్రాసిన పత్రికలన్నీ లూథర్‌కు ఇష్టమైనవి కావడంలో ఆశ్చర్యం లేదు. అపొస్తలుడైన పౌలు యొక్క వ్రాతలను అధ్యయనం చేయని వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా, కృప ద్వారా రక్షణ అనే లేఖనాలలో ఉన్న స్పష్టమైన ప్రత్యక్షతను ఉపయోగించుకోకుండా తనను తాను వంచించుకొంటున్నాడు.

తనకు దైవికంగా ఇవ్వబడిన ఆదేశాన్ని స్థాపించే దీర్ఘ సంభాషణ తర్వాత, పౌలు ఈ లేఖ గ్రహీత అయిన తీతును ఉద్దేశించి ప్రసంగించాడు. “విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు” అను మాటలు అతడు తిమోతిని సంబోధించిన విధానాన్ని మనకు గుర్తుచేస్తూ ఉంది, (1 తిమోతి 1:2). తిమోతిలాగే, పౌలు కన్వర్ట్ చేసిన వారిలో తీతు కూడా ఒకడు. యూదు తల్లిని కలిగి ఉన్న తిమోతికి భిన్నంగా, తీతు అన్యజనుడు.

దేవుడు మాత్రమే ఇవ్వగల కృప సమాధానము తీతుకు కలగాలని పౌలు కోరుకుంటున్నాడు. అతడు సాధారణంగా క్రీస్తు యేసును మన ప్రభువుగా సూచిస్తుండగా, ఇక్కడ అతడు ఆయనను “మన రక్షకుడు” అని పిలుస్తున్నాడు. మునుపటి వచనంలో కూడా అతడు దేవుణ్ణి “మన రక్షకుడు” అని పేర్కొన్నాడు. అవును, మొత్తం త్రిత్వమే “మన రక్షకుడు.” దేవుడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నిజంగానే ఉన్నారని వారిని “మన రక్షకుడు” అని పిలవవచ్చని తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది!

రెండవ భాగం
క్రేతులో తీతు అసైన్‌మెంట్ (1:5–16)

ఇంకా పూర్తి చేయాల్సినవి పూర్తి చేయండి
5నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.

ఖైదీ అయిన పౌలును రోమ్‌కు తీసుకెళ్లిన ఓడ గ్రీస్‌కు దక్షిణంగా మధ్యధరా సముద్రంలో ఉన్న క్రేతు ద్వీపంలో కొంతకాలం ఆగింది (అపొస్తలుల కార్యములు 27:7,8). విడుదలైన తర్వాత, పౌలు ఎఫెసుకు వెళ్లే మార్గంలో అక్కడ ఆగి తీతుతో కలిసి కొంత మిషన్ వర్క్ చేసినట్లుగా కనిపిస్తుంది. మొదటి పెంతెకొస్తులో (అపొస్తలుల కార్యములు 2:11) యెరూషలేములో ఉన్నవారిలో క్రేతీయులు ఇప్పటికే ప్రస్తావించబడ్డారు. పౌలు ఎఫెసుకు, ఫిలిప్పీకు వెళ్ళడానికి క్రేతు నుండి బయలుదేరే సమయానికి, ఈ ద్వీపంలోని ప్రతి పట్టణంలో క్రైస్తవుల సమూహాలను కనుగొనవచ్చు.

“అసంపూర్తి” పని పూర్తి కావడానికి వేచి ఉంది, ముఖ్యంగా వివిధ పట్టణాలలో పెద్దలను నియమించడం. పౌలు వెళ్లేముందు, ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోమని తీతుకు చెప్పాడు. ఇప్పుడు అతడు తీతుకు వ్రాతపూర్వకంగా సూచనలను కూడా ఇచ్చాడు. తీతు శీతాకాలానికి ముందు నికొపొలిలో పౌలుతో చేరడానికిగాను తీతు స్థానంలో మరొక వ్యక్తిని అర్తెమానైనను లేదా తుకికునైనను (3:12) పంపాలని పౌలు ఆశించాడు.

చర్చిలు ఎలా నిర్వహించబడాలనే దానిపై పౌలు వివరణాత్మక సూచనలేమి ఇవ్వలేదు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి అర్హత కలిగిన పెద్దలు లేదా పాస్టర్లు ఉన్నారు. వీరిని ఎలా నియమించారో మనకు చెప్పబడలేదు. సంఘాలను సంప్రదించకుండా తీతు ఈ నియామకాలు చేశాడని అనుకోవడం తప్పు. యెరూషలేములోని సంఘానికి డీకన్‌లు అవసరమైనప్పుడు (అపొస్తలుల కార్యములు 6:2-6) వారు చేసినట్లుగా ఎన్నిక ద్వారా అతడు కూడా అలాగే చేసినట్లు తెలుస్తోంది. మన సంఘాలు తమ పాస్టర్లను మరియు ఉపాధ్యాయులను ఎలా పిలవాలో చెప్పేందుకు దేవుడు ఎక్కడా నిర్దిష్టమైన ఆదేశాలను ఇవ్వలేదు. ప్రక్రియ పట్ల శ్రద్ధ చూపే బదులుగా, పౌలు నియమించబడిన వారి అర్హతలను నొక్కి చెప్పాడు.

పెద్దల అర్హతలు
6ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగల వాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. 7ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛా పరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక, 8అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై యుండి, 9తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.

ప్రతి పట్టణంలో పెద్దలను నియమించడంలో, తీతు మరియు సంఘాలు సరైన అర్హతలు ఉన్న పురుషుల కోసం చూడాలి. ఈ అర్హతలు ఏమిటి? అతడు వాటిని తిమోతికి కూడా వ్రాసాడు, అక్కడ అతను డీకన్లు మరియు వారి భార్యల అర్హతలను చేర్చాడు (1 తిమోతి 3:2-12). అతడు తీతుకు వ్రాస్తున్నప్పుడు, అతడు పెద్దలను లేదా గృహనిర్వాహకులను (Overseers) గూర్చి మాత్రమే పేర్కొన్నాడు. పాత ఎఫెసు సంఘంలో ఇప్పటికే ఉన్న ఆఫీసెస్ అన్ని ఈ కొత్త సంఘాలకు అవసరం లేదు. అయినప్పటికీ, రెండు జాబితాలు చాలా పోలి ఉన్నాయి. పెద్దలకు లేదా పాస్టర్లకు అర్హతలు ఒక ప్రాంతములో ఒకలా మరొక ప్రాంతములో ఒకలా లేదా కాలానుగుణంగా మారవు. అవి నేటికీ వర్తిస్తాయి. ప్రభువా, నీ మహిమకు అనుగుణంగా జీవించడానికి నాకు సహాయం చేయుము అనే పాస్టర్ గారి ప్రార్థన ఎల్లప్పుడూ ఒకలానే ఉంటుంది.

పౌలు “నిందారహితతో” ప్రారంభించాడు, విస్తృత, సాధారణ అర్హత (1 తిమోతి 3:2,10 చూడండి). “అతడు బాహాటంగా, బహిరంగంగా నిందించలేని వ్యక్తిగా ఉండాలి.” అతని వైవాహిక జీవితం నిందలకు అతీతంగా “ఏకపత్నీపురుషుడుగా” ఉండాలి, (1 తిమోతి 3:2,12 చూడండి). అతని పిల్లలు “దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన” వారిగా ఉండాలి (వచనాలు 4, 5 చూడండి). ఇక్కడ పౌలు పెద్దల పిల్లలు కూడా “విశ్వాసులు”గా ఉండాలని తిమోతికి వ్రాతపూర్వకంగా చెప్పలేదు. ఇది క్రేతులో నిర్వహించబడుతున్న యువ చర్చిలలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఇంకను అన్యమతస్థులుగా ఉన్న కుటుంబాలలోని పురుషులను, ఇంట్లో క్రైస్తవ క్రమశిక్షణను సరిగ్గా పాటించలేని పురుషులను సంఘానికి నాయకత్వం వహించడానికి పెద్దలుగా ఎన్నుకోకూడదు.

7వ వచనంలో పౌలు అర్హతల జాబితాను కొనసాగిస్తూ, అతడు “అధ్యక్షుడు” అనే పదాన్ని ఉపయోగించాడు, దీనిని “బిషప్” (KJV) అని కూడా అనువదించొచ్చు. “పెద్ద” క్రైస్తవ పరిపక్వతను వక్కాణిస్తున్నాడు, “గృహనిర్వాహకుడు” “దేవుని పని అప్పగింపబడిన” వ్యక్తి యొక్క పాలనను, నాయకత్వ పనితీరును పర్యవేక్షించుటను వక్కాణిస్తున్నాడు. ఈ పదాన్ని “మేనేజర్” లేదా “స్టీవార్డ్” అని అనువదించవచ్చు. దేవుని పనిని నిర్వహించడానికి తనకు అప్పగింపబడిందని పాస్టర్ ఎప్పటికీ మరచిపోకూడదు. అందుకే అతడు “నిందారహితునిగా” ఉండాలి. అతడు చేసే ప్రతిదీ మన దయగల దేవునిపై ప్రతిబింబిస్తుంది మరియు దేవుని పనిని ప్రభావితం చేస్తుంది.

ఈ సాధారణ అర్హతను మళ్లీ ప్రస్తావించిన తర్వాత, పౌలు ఐదు ప్రతికూలతలతో మరింత విశదీకరించాడు: “స్వేచ్ఛాపరుడును,” ముక్కోపియుకాక.”

10అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు. 11వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు. 12వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను–క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు. 13-14ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. 15పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి. 16దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయు లును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.  

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.