ఈ సిద్ధాంతానికి బైబిలే ఆధారం. ఇది ఆదికాండము 3 వ అధ్యాయములో ఆదాము హవ్వలు  ఏదేను తోటనుండి నుండి బహిష్కరింపబడినప్పటి నుండి మొదలయ్యింది. ఆదాము హవ్వలు అనే మొదలు అపవిత్రమై శాపగ్రస్తమయినప్పుడు ఈ మొదలునుండి వచ్చే అన్ని కొమ్మలు అపవిత్రముగానే శాపగ్రస్తముగానే ఉంటాయి తప్ప పాపము చెయ్యక మునుపు ఆదాము హవ్వలు ఉన్నటువంటి దీవెనకరమైన స్థితిని పుణికి పుచ్చుకొనివుండవు.

ఆదాము హవ్వలు దేవుని ఆజ్జ్యను అతిక్రమించడం, ఆజ్ఞాతిక్రమమే పాపము అని రోమా 6:23 చెప్తూవుంది. వాళ్ళు దేవుని ఆజ్జ్యను ఉదేశ్యపూర్వకముగా మీరడమంటే చెడగొట్టుకోవడమే, వాళ్ళు తమ స్వీయ స్వయంకృత అపరాధ మూలముగా తమ స్వభావమునకు లోపములను కలుగచేసుకొనేటట్లు అదిచేసింది. ఉదాహరణకు, ఒక యంత్రములో ఉన్న మీటను ఎటు త్రిప్పకండి, యంత్రము చెడిపోతుంది అని మనకు చెప్పబడియున్నప్పటికి త్రిప్పామను కోండి. యంత్రము చెడిపోతుంది, చెడిపోయిన తరువాత మనం చేయగలిగినది ఏమి ఉండదు. దానిని తాయారు చేసిన వాడు మాత్రమే దానిని బాగుచేయ గలడు. అతడు రావలసిందే. మంచి చెడు ఫలమును కోరుకోవడమంటే, దేవుని ఆజ్జ్యను ధిక్కరించడమే దేవుని ఆజ్జ్యను ఉదేశ్యపూర్వకముగా అతిక్రమించడమే. వాళ్ళు ఫలమును తిన్న తరువాత, వాస్తవంలో వారి స్వభావము మునుపటికంటే భిన్నముగా మారిపోయింది తప్ప, వాళ్ళు ఆశించినట్లుగా వాళ్ళ స్థితి మారలేదు, వాస్తవ పరిస్థితులు మారలేదు. వాళ్ళు తమ్మును తాము చేజేతులా పాడుచేసుకొని యున్నారని శిక్షకు పాత్రులుగా శాపగ్రస్తులుగా చేసుకొన్నామనే విషయం వాళ్లకి అర్ధమయ్యి, ఆయన తీర్పు తీర్చునని యెరిగి ఆయన వచ్చినపుడు ఆయన యెదుటికి రాలేక దాక్కున్నారు. తమ్మును తాము బాగుచేసుకోలేని రీతిగా పాడుచేసుకొని యుండుటను బట్టి ఆదాము హవ్వలు భయపడ్డారు, క్రియల ద్వారా దేవుని ఆజ్జ్యలను నెరవేర్చుటకు కావలసిన సామర్ధ్యాన్ని పోగొట్టుకోవడమే కాకుండా నిర్దోషత్వమును నీతిని కోల్పోయారు. వాళ్లకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు, ఎలా బాగుచేసుకోవాలో అర్ధం కాలేదు, వాళ్ళు పాడుచేసుకొనినది దేవుడు వారి కిచ్చిన ధన్యకరమైన ఒరిజినల్ స్థితిని. ఆ కారణాన్ని బట్టే పరిశుద్ధ గ్రంధము జన్మ పాపాన్ని ఒక a) లోపంగా, నీతి లేకపోవడం అని; b) చెడుకోరికలు అని చెప్తూవుంది. పతనం తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరు పాపులుగా పాపమునుబట్టి కళంకితులుగా ఉన్నారు.

దావీదు కీర్తన 51:5లో దీనిని గురించే మాట్లాడుతూ, “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను“అని చెప్పియున్నాడు. అపొస్తులుడైన పౌలు కూడా రోమా పత్రిక 5:12లో, “ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని ఇతడు కూడా దావీదు చెప్పిన విషయాన్నే చెప్తూ ఉన్నాడు. దీని అర్ధం, ఆదాము హవ్వల నుండి ప్రతి ఒక్కరు, జన్మతః పాపులుగా అంటే లోపముతో వంశపారంపర్య వ్యాధితో జన్మిస్తున్న వారిగా ఉన్నారని, ఆదాము హవ్వల నుండి అందరికి వారసత్వం గా వచ్చిన చెడిపోయిన స్వభావంను బట్టి మానవాళి అంతా పూర్తిగా చెడిపోయి ఉన్నారని, మనం, మనం చేసే ప్రతిదీ పాపంతో కలుషితమై ఉందని, కాబట్టే ప్రతి ఒక్కరు మరణము యొక్క అధికారము క్రింద ఉన్నారని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. దీనినే జన్మతా వచ్చే పాపము అని అంటూ ఉన్నాం.

(కీర్తన 51:1-5 ఈ ఒప్పుకోలులో, దావీదు మొదటగా తాను చేసిన పాపాలను ఒప్పుకొంటున్నాడు, అవి ఈ సందర్భంలో హత్య మరియు వ్యభిచారం. తన పాపము బత్షెబాతో వ్యభిచరించుట మాత్రమే కాదని, అతడు ద్రోహపూరితముగా ఊరియాను హత్య చేయించటం మరియు తన పాపమును బట్టి అభ్యంతరపడిన వారు (బాధపడ్డ వారు) లేదా తన పాపముతో తప్పుదారి పట్టించిన వ్యక్తులకు వ్యతిరేకంగా చేసిన పాపాలను అతడు గుర్తించాడు. అతని పాపం అన్నింటికంటే పవిత్రమైన దేవునికి వ్యతిరేకంగా చేసిన నేరం. అతని పాపం దేవుడు అతనికి ఇచ్చిన అనేక ఆశీర్వాదాలు మరియు ఆధిక్యతలకు కృతఘ్నత చూపడం. అతడు దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన కపటత్వంతో అతని పాపం యొక్క నేరం మరింత పెరిగింది. అతని అవమానకరమైన రికార్డు నాతాను ద్వారా దేవుడు అతనికి ఇచ్చిన బలమైన తీర్పును మరియు ప్రభువు అతనిపై విధించిన శిక్షలను పూర్తిగా సమర్థించింది.

అట్లే ఈ ఒప్పుకోలులో దావీదు అసలు పాపాన్ని (జన్మ పాపాన్ని) కూడా ఒప్పుకొంటున్నాడు. చెడుపనులు చెడిపోయిన స్వభావం నుండి ప్రవహిస్తాయి. మనందరిలాగే, దావీదు కూడా ఆదాము నుండి సంక్రమించిన చెడిపోయిన స్వభావంతోనే గర్భమున ధరింపబడియున్నాడు. అతడు దేవునికి శత్రువుగా జన్మించాడు, అతని చిత్తం దేవునికి వ్యతిరేకం. అతడు ఖండించబడిన పాపిగా జన్మించాడు, శిక్షకు అర్హుడు. దావీదు తన పాపపు స్వభావం యొక్క పాలన నుండి విముక్తి పొందినప్పటికీ, అతడు అతనిపై నియంత్రణను అది తిరిగి పొందేందుకు దానిని అనుమతించాడు భయంకరమైన పాపంలో పడిపోయాడు.

దావీదు చేసిన పాపం అనుకోకుండా చేసినది కాదు, కాబట్టి ఆశ్చర్యపోనక్కరలేదు. ఇది లోపల దాగి ఉన్న చెడియున్న స్వభావం యొక్క వ్యక్తీకరణ. తన క్షమాపణ కొరకైన అవసరత అనేకమైన పాపాలకు మించియున్నదనే విషయాన్ని దావీదు  గ్రహించాడు, పూర్తి పునరుద్ధరణ అవసరమని అతడు గుర్తించాడు.

రోమా 5:12, ఒక మనుష్యుని (ఆదాము) ద్వారా పాపం లోకము లోనికి ప్రవేశించియున్నదని పౌలు వక్కాణిస్తూవున్నాడు. “మనుష్యులందరు పాపము చేసినందున” పాపం యొక్క జీతమైన మరణం దానిని అవశ్యముగా అనుసరించింది. జన్మ పాపమును గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ, కొందరికున్న అభ్యంతరాలను బట్టి ఈ వివరణ నుంచి ప్రక్కకి వెళ్ళాడు. ఆ అభ్యంతరాలు, నిజంగా ఆదాములాగా అందరూ పాపం చేశారా? “ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు” జీవించిన వారి విషయమేమిటి? ఆ సమయంలో సీనాయి పర్వతం నుండి ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్రం ఇంకా లేదు. దేవుని నుండి నిర్దిష్టమైన ఆజ్ఞను కలిగి ఉన్న ఆదాము మరియు తరువాత వచ్చిన వారి మధ్య తేడా లేదా? “అందరూ పాపం చేసారు” అని వారి గురించి ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించి ఉండొచ్చు. అందుకనే పౌలు నిష్కర్షగా: “ధర్మశాస్త్రము ఇవ్వబడక మునుపే పాపము లోకములో ఉండెను” అని జవాబిస్తూవున్నాడు.

అట్లే ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని రోమా 4:15లో ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేక పోవును అని చెప్తూవున్నాడు. ప్రజల అవిధేయతను కొలవడానికి నిర్దిష్ట చట్టాలు లేనప్పుడు రికార్డ్ కీపింగ్ భిన్నంగా ఉంటుంది. నిర్దిష్ట నియమాల వ్యక్తిగత ఉల్లంఘనలకు భిన్నంగా, పతనం తర్వాత పనిలో ఇంకేదో ఉంది. అదే వారసత్వంగా వచ్చిన పాపం లేదా జన్మ పాపం అని పిలువబడుతుంది. ఆదాము తన పాపంతో ప్రజలందరికీ పాపత్వమును ఇచ్చాడు, తద్వారా ప్రజలందరూ పాపాత్మకమైన స్థితిలో జన్మించారు. కాబట్టే రాజైన దావీదు, “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను” కీర్తన 51:5 అని చెప్పియున్నాడు.

నిజమే, మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు, వ్యక్తిగత పాపాల రికార్డు భిన్నంగా ఉండొచ్చు, అయినప్పటికీ, ప్రజలందరూ పాపులే. మనం దాని గురించి ఖచ్చితంగా చెప్పగలం, ఎందుకంటే అందరూ చనిపోయారు – పాపానికి శిక్షగా. “అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవు వానికి గురుతై యుండెను.” ఆదాము చేసినది ప్రజలందరిపై ప్రభావం చూపింది.)

లేఖనాలు జన్మతా వచ్చే పాపాన్ని గురించి తెలియజేస్తూ, దీనిని, a) రోమా 7:17లో, కావున ఇకను దానిచేయునది నాయందు నివసించు పాపమేగాని నేను కాదు, (indwelling sin) గా చెప్తూవున్నాయి. దురదృష్టవశాత్తు మాదకద్రవ్యాలకు బానిస అయిన వ్యక్తి జీవితాన్నే తీసుకోండి. అతని జీవితం గందరగోళంగా ఉంటుంది: అతడు నిరుద్యోగిగా మారాడు; అతను తన ఆస్తిపాస్తులను కోల్పోతూ ఉన్నాడు; అతని పిల్లలు బాధపడుతూ ఉండొచ్చు మరియు అతని భార్య అతన్ని విడిచి పెట్టేస్తానని చెప్తూ ఉండొచ్చు. అతని ఆరోగ్యం క్షిణిస్తూ ఉండొచ్చు. మానమర్యాదలను వదిలేసి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో, అతడు పశ్చాత్తాపంతో, తన పరిస్థితిని చూసి, “నేను ఇలా కొనసాగడం నాకు ఇష్టం లేదు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిషేధించడం అనే ఆజ్జ్య సరైనదే” అని అనుకుంటాడు. పౌలు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నాడు. దేవుడు నిషేధించిన చెడు పనులను అతను చేయకూడదనుకున్నప్పుడు, అతడు వాస్తవానికి దేవుని నియమాలు మరియు ఆజ్ఞలు మంచివని సరైయైనవని దేవునితో ఏకీభవిస్తూవున్నాడు. అయితే, దేవుడు పాపమును నిషేధిస్తున్నాడని మరియు దానిని నిషేధించడంలో దేవుడు కరెక్ట్ అని అతడు దేవునితో ఏకీభవిస్తూ, అయినను పాపంలో కొనసాగడాన్ని వివరిస్తూ, కావున ఇకను దానిచేయునది నాయందు నివసించు పాపమేగాని నేను కాదు, అని చెప్తూవున్నాడు.

ఈ భూసంబంధమైన జీవితమంతా క్రైస్తవుడు పాత పాపపు స్వభావాన్ని తనలో కలిగి ఉంటాడు అట్లే పరిశుధ్ధాత్ముడు ఒక వ్యక్తిని క్రీస్తులో విశ్వాసానికి తీసుకొని వచ్చినప్పుడు నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు. అతని కొత్త స్వభావం అప్పటికే అతనిలో ఉన్న పాత స్వభావంతో పాటు నివసిస్తుంది. ఈ కొత్త స్వభావం పూర్తిగా దేవుని చిత్తంతో సింక్ అవుతుంది. దేవుడు చేయాలనుకున్న పనులను అది చేయాలనుకుంటుంది. పౌలు దీనినే “అంతరంగ పురుషుడు” (రోమా 7:22) అని చెప్తూవున్నాడు. ఇతడు దేవుని ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తాడు. కాబట్టి సమస్య క్రైస్తవుని కొత్త స్వభావముతో గాని లేదా దేవుని ధర్మశాస్త్రముతో గాని కాదు. విలన్ యైన పాపం, ఇది పాత పాపపు స్వభావం ద్వారా పనిచేస్తుంది, ఇది ఇప్పటికీ ప్రతి క్రైస్తవునికి అతుక్కునే ఉంది.

b) రోమా 7:23లో, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొను చున్నది, (law in the members). గ్రీకు నామవాచకమైన నోమోస్ (నియమము) అనే మాట 21 నుండి 23 వచనాలలో ఐదుసార్లు ఉపయోగించబడియున్నది. పౌలు ఈ మాటను విభిన్నమైన రీతులలో వాడియున్నాడు. ఆ విభిన్నమైన రీతులను అర్ధం చేసుకోవడానికి మొదటిగా ప్రయత్నిధ్ధాం.

మొదటిగా, కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడు చున్నది Paul says, “I find this [nomos] at work” (21) అని చెప్తూవున్నాడు. అపొస్తలుడు మునుపటి వచనాలలో పాత ఆదాము (ప్రాచీన స్థితి) మరియు అతనిలోని కొత్త ఆత్మానుసారమైన నవీన స్థితి అతడు మార్చగలిగేది కాదని సూచించాడు. అందుకే పౌలు తన జీవితంలో మంచి చేయాలనుకున్నా, చెడు తనతోనే ఉంటుందనే నియమము నాకు కనబడుచున్నది అని చెప్తూవున్నాడు.

అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము [నోమోస్] నందు నేను ఆనందించుచున్నాను (22). ఇక్కడ ఈ మాట నిస్సందేహంగా ఆయన వాక్యంలో వెల్లడి చేయబడియున్న దేవుని పవిత్ర చిత్తాన్ని సూచిస్తూ ఉంది.

పౌలు జీవితంలో ఒక మార్గదర్శక నియమము ఉంది, అది అతడు దేవుని చిత్తాన్ని చేయాలని కోరుకొంది. అయితే అపొస్తలుడు, “వేరొక నియమము [నోమోస్] నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది” (23) అని అతడు చెప్తూవున్నాడు. దురదృష్టవశాత్తూ, ఇది ప్రతికూలమైనది.

ఈ ప్రతికూల నియమము “నా మనస్సు నందున్న [నోమోస్]కు వ్యతిరేకంగా ధర్మశాస్త్రముతో పోరాడుచు యుద్ధం చేస్తోంది.” ఈ వెర్షన్ న్ని పరిగణలోనికి తీసుకొనే ముందు, మరొక భావనను పరిగణనలోకి తీసుకోవలసి యున్నాము. విశ్వాసి యొక్క “ఆత్మానుసారమైన నవీనస్థితిని” పౌలు వివిధ రకాలుగా వ్యక్తపరిచాడు. మునుపటి వచనములో, అతను “అంతరంగ పురుషుడు” అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ వచనములో, అతడు తన కొత్త స్వభావాన్ని లేదా తన అంతరంగ పురుషున్ని తన “మనస్సు”గా సూచించాడు.

పౌలు ఇప్పుడు తనలో పనిచేస్తున్న ప్రతికూల నియమమును గురించి మాట్లాడుతున్నాడు, అది అతని కొత్త స్వభావానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇక్కడ పౌలు ఈ పదాన్ని మూడవ అర్థంలో ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ పౌలు యొక్క నూతన స్వభావము ప్రలోభాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాల్గొనడానికి చేసే ప్రయత్నాల శక్తిని లేదా నియంత్రణను సూచిస్తుంది. దురదృష్టవశాత్తూ, తరచుగా నూతన స్వభావము యొక్క ప్రయత్నాలు చాలా తగ్గుతాయి. అప్పుడు శరీర అవయవములలోనున్న పాపనియమమునకు లొంగిపోతాడు. అప్పుడు అతడు “అవయవములలో పని చేస్తున్న పాపపు నియమానికి [నోమోస్] ఖైదీ” అవుతాడు. అప్పుడు పౌలు ఇలా అంటున్నాడు, “కాబట్టి నేను ఈ పద్ధతిని పని చేస్తున్నాను: నేను మంచి చేయాలనుకున్నప్పుడు, చెడు నాతో ఉంటుంది. నా అంతరంగంలో నేను దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నాను; కానీ నా శరీరంలోని అవయవాలలో పని చేస్తున్న మరొక నియమమును నేను చూస్తున్నాను, అది నా కొత్త స్వభావమునకు వ్యతిరేకంగా యుద్ధం చేయడాన్ని మరియు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను ఖైదీగా మార్చడాన్ని నేను చూస్తున్నాను.

c) యాకోబు 1:14-15 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింప బడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును (lust గా) తెలియజేస్తూవున్నాయి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.